Tricks and Tips

Thursday, June 16, 2022

ఓర్పు.... నేర్పు

 









చీడపీడల సమాజాన్ని 

చిత్తరువోలే చూడొద్దు..


వెదుకకు ఏ భుజముల కొరకు

తాత్కాలికమేగా ఓదార్పు...


కడ ఊపిరి నీవు విడిచే వరకూ 

విడువకుమా నిట్టూర్పు...


రేపటి తరాల తలరాతల కొరకు 

వదలకుమా నీ ఓర్పు...


నీ తొలి అడుగును వేసే వరకూ

జరుగదుగా ఏ మార్పు...


కూకటి వేళ్ళతో కుళ్ళు పెకలించే వరకూ

సడలించకుమా నీ నేర్పు...  


ఓర్పు నేర్పుల కలయిక మార్పు

శాశ్వతమవదా ఈ తీర్పు...  


                  *********

 

Sunday, December 5, 2021

ప్రకృతి - మనిషి

 ప్రకృతి మనిషిలోకి ప్రవేశించిన 

మార్పు మల్లెల పరిమళమే 


మనిషి ప్రకృతిలోకి ప్రవేశించిన 

మార్పు మారణహోమమే....

మారును తప్పక లోకం తీరు.....

 ఆత్మసాక్షిని మించినదెవ్వరు 

తప్పు, ఒప్పు తెలుసుకు తీరు 


తప్పును తప్పక ఒప్పుకు తీరు 

క్షమాపణలు చెప్పుకు తీరు 


మనోవేదన తప్పక తీరు 

మారును తప్పక లోకం తీరు.....

బమ్మెర పోతన

 కలముతొ, హలముతొ

సమముగ నడిచి 


పండిత, పామరుల 

తగు మెప్పించి 


భాగవతమును మనకందించిన

బమ్మెర పోతన చిరస్మరణీయుడు....

కలాలు - హలాలు

 కలాలనే హలాలు చేసి

కాగితాలపై సేద్యం చేసి 


అక్షరాలనే విత్తులు చల్లి

ఆశయాలనే మొలకలు పెంచి


చైతన్యమనే ఎరువును వేసి

విలువలు విరివిగ పెంచే కవులకు


సిరా ఇంకని కలాలనివ్వాలని 

చిరకాలంగా నే కన్న కలలు 


అచిరకాలం నిలిచి ఉండాలని

కల్లలుగాక నిజమవ్వాలని.....



అక్షర సైన్యం

 అక్షర సైనికులొకటై కదిలి

పదాలు రక్షక దళాలుగా

వాక్యాలన్నీ సైన్యంగా 

సిరా శరాఘాతాలతో 

కాగిత రణరంగంలో

కలం కదనం చేసింది

కవితకు ప్రాణం పోసింది.....

నమ్మకం

 నమ్మకాల నడక

జీవితాన్ని నందనవనం 

చేస్తుందనే ఆశిద్దాం.....

స్నేహం

 నాడు " కలం స్నేహం"

నేడు "ఫేస్ బుక్ స్నేహం"

ఏదేమైనా స్నేహం - ఓ సున్నిత బంధం......

నాయకుడు

 నాయకుడిగా ఎదగాలంటే 

నాణేనికి ఇరు వైపులా 

చూడాలోయ్.....

పలకరింపు

 రోగి ముఖంలో ఆశలను,

అనాథలలో స్థైర్యాన్ని

పల్లకి ఎక్కించేది - పలకరింపు....

మార్గదర్శి

 మార్గదర్శివి కావాలంటే 

మాటలు, చేతలు 

ఒకటిగ చేసెయ్.....

మానవ సృజనాత్మకత

 అబద్ధాలు,  అనర్థాలు, 

అపోహలు, అవాస్తవాలు 

మానవ సృజనాత్మక ఉత్పత్తులు.....

వ్యక్తిత్వం

 బాధ్యత, విధేయత 

ఆత్మీయత, ఆచరణ 

వ్యక్తిత్వానికి మూలస్తంభాలు....

అంతరాత్మ సాక్షిగా....

 అధోగతి పాలవడం ఎందుకు ?

చేసిన తప్పు ఒప్పుకు తీరు

అంతరాత్మ సాక్షిగా....

మేలు కలయిక

 సహనం, సహకారం

నిర్మలత్వం, నిస్వార్థముల

మేలు కలయిక స్నేహం....

చొరవకు భూషణాలు

 సంభాషణ చాతుర్యం ,

మృదు భాషణం

చొరవకు భూషణాలు....

నిరంతర సాధన

 పరాజయంతో పట్టువిడువక

నిరంతర సాధన ధ్యేయం ఐతే

విజయ సోపానం మన చెంతే...

సద్గతి వరకే ఆ హద్దు

 అనుసరణీయమె అనుకరణ

సద్గతి వరకే ఆ హద్దు 

నక్క వాతలా వద్దే వద్దు....

మూర్ఖత్వం

 అనాలోచిత మూర్ఖత్వం 

జ్ఞానదీపాన్ని చూడలేని

అంధత్వం....

విజయ ఫలాలు

 శక్తి సామర్ధ్యాల్ని నాటేసి 

శ్రమ, శ్రద్ధతో కృషి చేస్తే

విజయ ఫలాలు మనవేగా.....