Tricks and Tips

Saturday, May 31, 2014

"అమ్మా"......ఆచంద్రతారార్కం _/\_

(మా అమ్మ )
అవనిలో నాకై వెలసిన అలుపెరగని "అమ్మా".....
నీ అనుపమానమైన రూపం ఆద్యంతమూ నా మనసున నిండగ ,
నీ అవిరామ ఆదరణ నాకు జీవముకాగ ,
నీ అమూల్యమైన సేవలు నాకు ఎన్నటికీ ఆచరణీయము కదా ,
నీ అనురాగ లాలిజోలలు నాకు ఆహ్లాదములుకాగ ,
 

నీ అహోరాత్రులు నా ఆశల ఆలోచనలకేగదా ,
నీ అమృతతుల్యమైన గోరుముద్దలే నా ఆస్వాదనలో ఆదిపర్వంగా ,
నీ అంతరాళలోని ఆర్తి నాకు అపారముకాగ ,
నీ అసాధారణ బంధమే నీ బిడ్డల ఆశాబంధంకాగ ,
నీ అనిర్వచనీయమైన ఆలింగనం నా ఆవేదనను తీర్చగ ,
 

నీ అద్వితీయమైన అనురాగం నాకు ఆరాధ్యంకాగ ,
నీ అచంచలమైన విశ్వాసం నా ఆశయాలకు ఊపిరికాగా,
నీ అక్కున చేర్చుకునే బాంధవ్యమే నా అస్వస్థతను దూరం చేయగా,
నీ అపురూపమైన వాక్కులు నాకు ఆత్మీయతను నేర్పగా,
నీ అనుభవాల అంతర్వాహిని ఆసాంతం నాతో వెంటరాగా ,
 

నీ అరమరికలులేని ఆప్యాయతలు ఆ దేవుని ప్రతిరూపం చూపగా,
నీ అమితమైన కరుణాహృదయం నా ఆరాధనకు బీజమవ్వగా ,
నీ అనంతమైన జీవన లీలలు నా జీవిత ఆదర్శగ్రంధంకాదా ,
నీ అంబరమంత ప్రేమకు నా అంతరాత్మ సాక్షికాగా ,
నీ అజేయమైన మాట నాకు ఆశీర్వచన బలముకాగా ,
 

"అమ్మా" అన్న పిలుపే అజరామరంకాదా ఆచంద్రతారార్కం ,
నా 
ఆయువుకు నీ ఆయువును అడ్డం వేసే అమ్మవుకదా ,

"అమ్మా" ఏడేడు జన్మలకు నాకు
నీవే అమ్మవు కావాలి ,
నా అమ్మవు నీవే కావాలి ...
వద్దమ్మా ! వద్దు , నా స్వార్ధం తెలుసుకున్నాను ,
నీ త్యాగం మరువకున్నాను .

"అమ్మ"ఓ అనన్య సామాన్య సృష్టి ,
"అమ్మ"ఓ మధురమైన భావన ,
"అమ్మ"ఓ అంతులేని దేవుని దీవెన ,
"అమ్మ"ఓ అక్షయ అనుభూతి ,

అమ్మా ! నీ ఋణం తీర్చుకొనగ ఒక అవకాశం కొరకు
ముకుళిత హస్తములతో ఆ దేవుని నేను వేడెదనమ్మా ,
మరుజన్మకు నీకు అమ్మగా , భువిపై నేను వెలిసెదనమ్మా ,
"అమ్మా" అన్న పిలుపుకు నే ఊపిరిపోసి ,
నీ సేవలో నేను తరియించెదనమ్మా    _/\_ 

****************

Thursday, May 29, 2014

నీవు , రామ్మా చిలకమ్మా...............

పచ్చని చిలకమ్మా ,
నా నేస్తం నీవమ్మా ,
నీ పచ్చని రంగు కొంచెం తీసి ,
ప్రకృతికివ్వమ్మా ..........

కిలకిల చిలకమ్మా ,
నా దరికి రావమ్మా ,
చిన్ని చిన్ని మాటలు నీకు ,
నేర్పిస్తానమ్మా .........

చిట్టి చిలకమ్మా ,
నాకిష్టం నీవమ్మా ,
చెట్టు మీది పండ్లన్నీ ,
నీవే తినకమ్మా .........

రామచిలకమ్మా ,
నీవు , రామ్మా చిలకమ్మా ,
తియ్యని పండు తీసుకొచ్చి ,
సాహిల్ కివ్వమ్మా ..........

చక్కని చిలకమ్మా ,
నువ్వు హాయిగ ఎగురమ్మా ,
ఆకాశంలో ఎగురుతు నీవు ,
హాయిగ ఉండమ్మా............
 
******

సాంప్రదాయం.....ఓ జీవనది

                                                     (ఈ చిత్రం జానీపాషాగారిది)
                                                            ఇది నా 200వ రచన

సాంప్రదాయం.....ఓ  జీవనది
        
              నాగరాజు,మల్లీశ్వరి భార్యాభర్తలు.వారికి జయ,విజయలు కవల పిల్లలు.పిల్లలిద్దరి అభిప్రాయాలు,అభిరుచులు ఒక్కలానే ఉండేసరికి తల్లిదండ్రులు వారికి అదే భావాలు కలిగిన కవల సోదరులైన ఆదికేశవరావు, ఆదినారాయణలకిచ్చి వివాహం జరిపించారు.అది మొదలు వారి రెండు కుటుంబాలు ఒకే ఇంటిలో జీవించసాగారు. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లులా ఉండేది వారి కుటుంబం.
       
           జయమ్మకు ఇద్దరు మగపిల్లలు,ఒక ఆడపిల్ల సంతానం కాగా విజయమ్మకు ఇద్దరు ఆడపిల్లలు,ఒక మగపిల్లాడు సంతానంగా కలిగారు. వారిలానే వారి పిల్లలు కూడా ఆచారవ్యవహారాలను పాటించడం , కలసిమెలసి జీవించడం ఎందరికో మింగుడు పడేది కాదు.పిల్లలంతా బాగా చదువుకున్నారు.ఒకరి వెంట ఒకరు అందరికి వివాహమై అమెరికాలో స్థిరపడిపోయారు అందరూ.తల్లిదండ్రులను తమతో రమ్మని వారంతా బ్రతిమాలినా సున్నితంగా తిరస్కరించేవారు.
       
                 అమెరికాలో కూడా వారంతా కలసిమెలసి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడంతో వారి గూర్చి తల్లిదండ్రులకు ఏమాత్రం బాధ ఉండేది కాదు.కొడుకులకు,కూతుళ్ళకు మొత్తం మీద పధ్నాలుగు మంది సంతానం.వారి ఆలనాపాలనా కూడా అమెరికాలోనే జరిగిపోయింది. అయినప్పటికీ పిల్లలు అమ్మమ్మా,నానమ్మా అంటూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు.
       
       ఆరోజు జయమ్మవిజయమ్మగారింట్లో సందడి సందడిగా ఉంది.కారణం జయమ్మగారి పెద్ద మనవడి పెళ్ళి.అందరూ అమెరికా వెళ్ళిపోయాక , ఒకేసారి అందరూ ఇండియా రావడం అరుదై పోయింది.ఏదేమైనా అందరికి సెలవు కుదిరే విధంగా చూసుకుని ఈ పెళ్ళికి అందరూ హాజరవ్వాలని చేసిన ప్రయత్నం సఫలమవ్వడం ఓ గొప్ప విశేషం.
      
            జయమ్మగారి పెద్ద మనవడు అమెరికాలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు.అతనికి ఆ అమ్మాయితో నిశ్చితార్ధం అమెరికాలోనే జరిపించేసారు ఆర్భాటం లేకుండా.కాలానుగుణమైన మార్పులను స్వాగతించారే కానీ వారి తల్లిదండ్రులు ఏనాడు వారి నిరాశను వ్యక్తం చేయలేదు.అందుకే ఆ తల్లిదండ్రులంటే ఆపిల్లలకు అంత ప్రేమ. ఏదేమైనా వివాహం మాత్రం ఇండియాలోనే తల్లిదండ్రుల చేతులమీదగా జరిపించాలనుకోవడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అందుకే అంత హడావుడి .
     
      పెళ్ళి పది రోజులు ఉందనగా ఆడపిల్లలు అల్లుళ్ళు,కొడుకులు కోడళ్ళు వచ్చేశారు.అంతే జయవిజయమ్మలు పురమాయించిన పనులన్నీ అక్షరాలా సత్సాంప్రదాయంగా,కన్నులపండుగగా జరిగిపోతున్నాయి.ఇల్లంతా రంగవల్లులతో,గడపలు పసుపుకుంకుమలతో,గుమ్మాలు
మామిడితోరణాలతో, ఇంటి స్తంభాలు అరటిచెట్లతో, ఇంటిముందు తాటాకు పందిళ్ళతో,ఇల్లంతా పూలమాలలతో సహజ సుందరంగాను,సువాసనలతోను నిండిపోతే తల్లిదండ్రుల మనసు సంతోషంతో నిండిపోయింది.పిల్లలింకా రాలేదేమర్రా?వాళ్ళు కొత్తబట్టలు కొనుక్కోవాలిగదా అంటే,అమ్మా! వాళ్ళకు కావలసినవి వాళ్ళు కొనుక్కుంటారులే ,అని కొడుకులుకూతుళ్ళు అనేసరికి జయవిజయమ్మలు సరే అని ఊరుకున్నారు.
     
        కొడుకులుకోడళ్ళు,కూతుళ్ళూ అల్లుళ్ళు మాత్రం సూర్యనమస్కారాల నుండి సంధ్యావందనం వరకు ప్రతి విషయంలోనూ ఆచారాలను పాటించడం, చూసేవారికి అందరికీ వాళ్ళసలు రెండు దశాబ్ధాలపాటు అమెరికాలో ఉండి వచ్చినవారేనా అన్నంత దిగ్భ్రమ కలిగిస్తోంటే, జయవిజయమ్మలకు మాత్రం వారి పెంపకం పట్ల వారికి అంతకంతకు విశ్వాసం రెట్టింపయ్యింది.
     
           రెండురోజుల్లో పెళ్ళి ఉందనగా మొత్తం మనవళ్ళు,మనవరాళ్ళు ఒక్కసారిగా అమ్మమ్మా,నానమ్మా అంటూ వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టేసరికి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు.వారి సరదా కబుర్లతో  ఇల్లంతా సందడితో నిండిపోయింది.అంతే జయమ్మగారు పిల్లలందరిని కూర్చోపెట్టి దిష్ఠి తీస్తుంటే పిల్లలంతా నవ్వుకున్నారు ముసిముసిగా.అర్ధ రాత్రి వరకు కబుర్లాడుకుని అందరూ పడుకున్నారు.
    
      జయమ్మ ఆదికేశవరావుతోను,విజయమ్మ ఆదినారాయణతోనూ తమ మనవరాళ్ళ వేషధారణ గూర్చి వేదనగా చెప్పుకున్నారు కానీ, పిల్లల సంస్కారానికి సంతోషపడిపోయి వారి ఇష్టాలను పెద్ద మనసుతో సరిపెట్టుకున్నారు.
    
     తెల్లవారింది.పెళ్ళికొడుకును చేసే తంతు ప్రారంభమైంది.ఆధునిక బ్యాండు కాక సన్నాయిమేళం వాళ్ళు వచ్చేసరికి జయవిజయమ్మలు ఆనందంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వచ్చే వారికి  సాంప్రదాయాలతో స్వాగతం పలికారు.పిల్లలు వారి భావాల్లో సాంప్రదాయాల్ని,దుస్తుల్లో ఒకింత ఆధునికతను నింపుకున్నారు.ఆడపిల్లలు ధరించింది కంచిపట్టు వస్త్రాలే అయినప్పటికీ అత్యాధునికతకు అద్దం పట్టాయి.ఇల్లంతా మంగళవాద్యాలతో మారుమ్రోగిపోతోంది. భోజనాల్లో చక్కెరపొంగలి,ముద్దపప్పు,నెయ్యి,
పులిహోర,ఆవకాయ వంటి పదార్ధాలతో కొసరికొసరి వడ్డిస్తూ ఆప్యాయంగా పలుకరిస్తూ భోజనాల తంతు ముగించారు సంతృప్తిగా.  
    
      ముహూర్తం సమీపించింది.జయవిజయమ్మదంపతులు హడావుడి పడుతుంటే, కొడుకులుకోడళ్ళు , కూతుళ్ళూ అల్లుళ్ళు ఇదిగో వచ్చేస్తాం, ముందు మీరు పదండంటూ పెద్దవాళ్ళను,ముత్తైదులను మండపానికి పంపించివేసారు.
    
      మండపంలోని అలంకరణలను ఆసక్తిగా చూస్తూ,ఏమైనా మీ అక్కచెల్లెళ్ళు పిల్లలను చాలా సాంప్రదాయంగా పెంచారు.ఆచారాలు పాటించడంలో మీ తర్వాతే ఎవరైనా అని అందరూ అంటుంటే మనసు ఆనందంతో పొంగిపోతోంది. ఆ ఏమైనా మీ మనవళ్ళకు,మనవరాళ్ళకు మాత్రం సాంప్రదాయం అంతగా తెలిసినట్లులేదు, ఎంతైనా అమెరికాలో పుట్టి పెరిగారు కదా! అనేసరికి మనసు ఒకింత చివుక్కుమన్నా, అక్కచెల్లెళ్ళు చిరునవ్వే సమాధానం అన్నట్లు చూసి నవ్వారు చిన్నగా.
    
          ఇంతలో కారులొచ్చి లైనులో ఆగాయి. అందరి కళ్ళు ఆ వైపు తిరిగాయి.డోర్లు తీసుకుని దిగినవారిని చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు.కొడుకులు అల్లుళ్ళు పట్టు పంచెలు, కండువాలతో హూందాగా దిగారు.కూతుళ్ళుకోడళ్ళు సాంప్రదాయకట్టుతో పట్టుచీరల్లో,తల్లో పూలతో,చేతులనిండుగా మలారం గాజులతోను,పాపిట సింధూరంతోను, కుంకుమబొట్టుతోను ఆ భర్తలకు తగ్గ భార్యలుగా వారిననుసరించారు. వెనుకనున్న కారుల్లో నుండి మనుమరాళ్ళు పట్టులంగా ఓణీల్లోను, జడకుప్పుల జడనిండా పువ్వులతోను,చేతులనిండా గాజులతోను, సర్వాభరణాలను అలంకరించుకుని అందాలబొమ్మల్లా దిగుతుంటే రెండు కళ్ళు చాలవేమో అనిపించింది.మండపంలోని వాళ్ళంతా కళ్ళప్పగించి చూస్తున్నారు రెప్పవేయడం మరచిపోయి.మనవళ్ళను మనవరాళ్ళను చూసి జయవిజయమ్మలకు మాటలు రాలేదు.వారికిప్పుడు అర్ధమయింది ముందుగా తమని ఎందుకు పంపించారో.అంతే వారి మనసులో ఆనందంతోపాటు ముఖంలో రవ్వంత గర్వం తొణికిసలాడింది.పెళ్ళికి వచ్చిన వాళ్ళకు కన్నులపండుగ అయింది. ప్రధానం నుండి అప్పగింతల వరకు అనుకున్నదానికంటే వివాహం ఘనంగా,సాంప్రదాయబద్దంగా జరిగింది.
    
     పెళ్ళికి వచ్చిన వారందరి కళ్ళల్లో,నోట్లో,మనసుల్లో సాంప్రదాయం ఆసాంతం నిండిపోయింది.అమెరికాలో పుట్టి పెరిగినపిల్లలు సాంప్రదాయానికి ప్రాణం పోస్తుంటే ఆ ఊరిలో పుట్టి పెరిగిన పిల్లలు అనవసరమైన  ఆధునికతను ప్రదర్శించినందుకు వారు కించిత్తు సిగ్గుపడ్డారు.
    
      ఫొటోగ్రాఫర్లు,వీడియోగ్రాఫర్లకు కంటి నిండా,ఫిలిం నిండా సాంప్రదాయం చిక్కిపోతున్న రోజుల్లో బాగా చిక్కింది.అంతే కెమేరాలో బంధించి అందమైన "సాంప్రదాయం"తో కళకళలాడిపోతున్న ఒక కుటుంబం ఫోటోను జయవిజయమ్మల చేతిలో ఉంచారు.వారి కళ్ళు ఆనందంతో వర్షించాయి.ఆ ఆనందభాష్పాలే అక్షింతలై పిల్లలందరిని దీవించాయి.ఆ ఫోటోని పట్టుకుని ఒక జీవిత కాలానికి సరిపడినంత సంతోషాన్నిచ్చిన తమ బిడ్డలను చూసి మురిసిపోయారు.
            
           తమ బిడ్డలు కూడా తమలానే వారి బిడ్డలను పెంచడంలో కృతకృత్యులైనందుకు జన్మతరించిపోయినంత సంతోషంతో ఆ ఫోటోను చూస్తుండిపోయారు చమర్చిన కళ్ళతో.
         
       సాంప్రదాయం అనేది జీవనదిలాంటిది.అది ఒక తరం నుండి మరొక తరానికి ప్రవహిస్తుంటుంది.ఆ ప్రవాహం నిరర్ధకమైనా,సార్ధకమైనా మన బాధ్యత కూడా ఉంటుంది.ఈ విషయంలో జయవిజయమ్మల పెంపకం సార్ధకమయింది.అందుకే వారికి ఈ సంతోషం దక్కింది.

                                                                                                         *****************  

Wednesday, May 28, 2014

నా తల్లీ....లాలీ....లాలీ....

(ఇది జానీపాషాగారి చిత్రం )

జోజో....లాలీ....లాలీ....లాలీ....లాలీ....
నా తల్లీ....లాలీ....లాలీ....లాలీ....లాలీ....

ఆకశాన
అందాలమామ
              నీకై వేచి ఉన్నాడమ్మా       ll జోజో ll
 
వెన్నెలలోన
జాబిలి మామ
     చిరునవ్వులు నీకై రువ్వెనమ్మా       ll జోజో ll

నవ్వుల అలలే
ఆ చందమామ 
             చిరుగాలిగ నీకై పంపెనమ్మా      ll జోజో ll
 
జిలిబిలి తారలు
ఆ జాబిలినొదిలి
                  నీకై చేతులు జాచెనమ్మా        ll జోజో ll


నా చేతులనే
నీ ఊయల చేసి
                   తారా , జాబిలి ఊపిరమ్మా        ll జోజో ll

చల్లని మామా
వెలుగుల తారలు
                          నీకై జోల పాడెనమ్మా          ll జోజో  ll


హాయిగ బజ్జో
ఊగుతు బజ్జో
                    జాబిలి నీ జత ఉన్నాడమ్మా     ll జోజో ll
 
*****

Tuesday, May 27, 2014

నాకై విచ్చేసిన సఖీ !

సఖీ !
అరవిచ్చిన నీ పెదవుల చిరుదరహాసం చూసి
వికసించిన సుమములు వెలవెలబోగా ,

సంతోషంతో విప్పారిన నీ మోమును కని
పున్నమి చంద్రుడు వెలిసిపోగా ,

అనురాగంతో కూడిన నీ వాక్కుల వింటే ,
అన్ని రాగములు అల్పమేగా ,

మధురమైన నీ స్వరమును విన్న
కోకిల కంఠం మూగపోగా ,

సున్నితమైన నీ ఆదరణ ముందు
మల్లెల సునిశితత్వం తరిగిపోగా ,

ప్రేమను వర్షించే నీ కనులను చూసి
నీలిమేఘాలు అలిసిపోగా ,

నీ ఆత్మీయ సాహచర్యంలో
ఒంటరితనము నను వీడిపోగా ,

నా సువిశాల హృదయసామ్రాజ్యం నీ రాకతో
చిన్న కుటీరమై స్వాగతించగా ,

నాకై దిగివచ్చిన నా ప్రకృతి
నీ రూపంలో విచ్చేసిన సఖీ ,

నీ దారులలో పూలుపరిచా
నీకిదే నా స్వాగతం........

******

Sunday, May 25, 2014

నీ సొంపుల మేని ఒంపులలో............

నీ చిరునవ్వుల వెన్నెలలో
సిరిమల్లెలు కొల్లలు ఏరుకోనా.....

నీ కమ్మని కోకిల మాటలలో
కుహు కుహు రాగాలు ఏరుకోనా.....

నీ సొంపుల మేని ఒంపులలో
నెలవంకల నెన్నో దాచుకోనా.....

నీ చిలిపి చూపుల కన్నులలో
నా రూపము పదిలముగ దాచుకోనా.....

నీ గలగల గాజుల సవ్వడిలో
శుభ"కరకమలములు" అందుకోనా.....

నీ ఘల్లనే అందెల రవళులలో
పాద పద్మములు అందుకోనా.....

నీ హృదయ స్పందనల అలజడిని
శృతి , లయ నేనై సవరించనా.....

నీ భావరాగాల సంధిగ్ధతని
పల్లవి నేనై సవరించనా......

నీవూ నేనూ వేరు కాదని
నేనే నీవని వివరించనా.....

నా వలపుల శరములు సంధించనా
నా బాహువులలో నిను బంధించనా......

********

Saturday, May 24, 2014

నా బంగరు భవితను చేరుకుంటా..............

 నా చిలిపి చేష్టలతో దాక్కొని
నిను ఆశ్చర్య పరచాలనుకున్న నేను ,
నీ "లోపలి" మనిషిని చూసి నివ్వెరపోయాను.....

నీ మాటలు బూటకమని ,
నీ ప్రమాణాలు నాటకమని ,
నీవు ధనదాహానికి బానిసవని ,
నీవు కర్కోటక కామపిశాచివని......
తెలిసి విస్తుపోయాను.......


నా చిలిపిచేష్టలే నాకు మేలు చేశాయి ,
నా చిన్నతనపు ఆలోచనలే నన్ను మేల్కొలిపాయి....

నా మదిలో ఆశలు ఆవిరి అయినా ,
నా ప్రేమలో నిజాయితి నీరై పోయినా , 
బలిగాబోతున్న నా భవిష్యత్తును ,
భద్రంగా కాపాడుకున్నా.........

నా తల్లిదండ్రుల ఆశయాలకు వారధినవుతా ,
నా బంగరు భవితను చేరుకుంటా..............

********