Tricks and Tips

Saturday, September 13, 2014

మసిబారిన మానవత్వం .........


  ఓ తల్లి వద్దకు దేవుడు వచ్చాడు..... వచ్చి ఆమెతో

" నీకు నీ కొడుకు ఆరోగ్యం కావాలా "......."నీ ఆరోగ్యం కావాలా " అన్నాడు
వెంటనే ఆమె నా ఆరోగ్యమే కావాలి అంది !!!!!

" నీకు నీ కొడుకు ఆరోగ్యం కావాలా "......."నీ వ్యాపారం కావాలా " అన్నాడు
వెంటనే ఆమె నాకు వ్యాపారమే కావాలి అంది !!!!!

" నీకు నీ కొడుకు మేలు కావాలా "....." నీ కూతురి మేలు కావాలా " అన్నాడు
వెంటనే ఆమె నాకు నా కూతురి మేలే కావాలి అంది !!!!!

" నీకు కోడలి సౌభాగ్యం కావాలా "....." నీ కూతురి  సౌభాగ్యం కావాలా "  అన్నాడు
వెంటనే ఆమె నాకు నా కూతురి సౌభాగ్యమే కావాలి అంది !!!!!

చిట్టచివరకు దేవుడు

ఒక చేతిలో డబ్బు , మరో చేతిలో కొడుకు ప్రాణం ఉంచి
నీకేది కావాలో అది తీసుకో అన్నాడు......
రూపాయే లోకం...రూపాయే సర్వం
రూపాయే దైవం అనుకున్న ఆ తల్లి
ఆత్రంగా రూపాయలు ఎంచుకున్నది.........
దేవుడు ఆమెకు ఆ రూపాయలే మిగిల్చి
ఆమె కొడుకును తనతో తీసుకెళ్ళిపోయాడు......

తనను , తన కూతురిని సర్వకాల సర్వావస్థలలో
గొడుగై కాచిన కొడుకు విలువ తెలుసుకోలేదు !!!!!
తన జీవిత చరమాంకం కొడుకు నీడలో
సేద తీరాలని అనుకోలేదు !!!!!!

ఆస్తంతా తన పేరనే ఉందని విర్ర వీగుతూ
తన కొడుకుకు భవిష్యత్తు లేకుండా చేసి
పూడ్చిన మన్నైనా గట్టి పడలేదు...
గుండె , గూడు చెదిరిన కోడలిని , మనవడిని మరచి
తన భవిష్యత్తుకు ఎన్ని లక్షలు ఉన్నాయా
అని ఆమె లెక్కలేసుకుంటుంటే.......

మసిబారిన మానవత్వాన్ని బంధువులందరూ చూస్తూ
ముక్కున వేలేసుకుని అసహాయంగా వెనుతిరిగారు..............
 
 (దయచేసి ఎవరూ విమర్శించవద్దు , ఇది వాస్తవం )
 
***********

Sunday, August 24, 2014

వాడిపోయిన రైతన్న వదనం......

నోళ్ళు తెరచిన బీళ్ళు చూసి
ఆశచావక మబ్బు కోసం నింగికేసి
చూస్తున్న వాడిపోయిన రైతన్న వదనం

చినుకు రాలక వడలి , వాడి
వాలిపోయిన వరినాట్లను చూసి
వేదనతో వాడిపోయిన రైతన్న వదనం

అప్పు ఇచ్చిన ఆసామికి
ఎదురుపడలేక , ఎదురుపడక తప్పక
తలదించిన వాడిపోయిన రైతన్న వదనం
 

ఈ ఏటి పంటతో తన పెళ్ళి
జరిగిపోతుందనుకునే కూతురి
సంతోషాన్ని చంపలేక వాడిపోయిన రైతన్న వదనం

తనతో ఏడడుగులు వేసిన భార్య
పుస్తెలతాడును తాకట్టు నుండి
విడిపించి తేలేక వాడిపోయిన రైతన్న వదనం

మూసిన కన్ను తెరవక ముసలి తల్లి
మూల్గుతుంటే మందుబిళ్ళ కొనే
స్థితిలేక వాడిపోయిన రైతన్న వదనం

తనను నమ్మిన కుటుంబానికి
పట్టెడన్నం పెట్టలేకపోయానే అనే
ఆవేదనతో వాడిపోయిన రైతన్న వదనం

పొలం అమ్మిపారేద్దాం అనే
కొడుకు మాటకు జవాబీయలేక
భూమాతకేసి చూస్తున్న వాడిపోయిన రైతన్న వదనం

ఋణమాఫీ ఆశతో మారు ఆలోచనకు
తావీయక ఓట్లు వేసి వారిని గెలిపించి
తానోడిపోయి ,
వాడిపోయిన వదనంతో రైతన్న....  

********

Friday, August 8, 2014

ఏమైనా మాట్లాడుతారు రాజకీయ నాయకులు....!

 అవునవును , సమాజం లోని అకృత్యాలన్ని ఆడవారి వస్త్రధారణ వల్లే జరుగుతున్నాయి..... ఓ పెద్ద మనిషిగారు ఇటీవలే సెలవిచ్చారు. కె.జి క్లాసులు....... చదివే పిల్లలు రెచ్చగొట్టే వస్త్రధారణ చేసుకుంటే జరిగిందా అమానుషం ? పాఠశాలలో పదవ తరగతి వరకు చదివే పిల్లలు ధరించే యూనిఫాం రెచ్చగొట్టే వస్త్రధారణా ? అకృత్యాలకు బలైపోయిన ఆడపిల్లలందరూ రెచ్చగొట్టే వస్త్రధారణలోనే ఉన్నారా , వారితో పాటు వెంట వున్న తల్లిని కూడా వదలని సమయాల్లో ఆ తల్లి కూడా రెచ్చగొట్టే వస్త్రధారణలో వుందా, ముప్ఫై , నలభై , యాభై , అరవై యేళ్ళ స్త్రీలు కూడా కామాంధులకు బలైపోతున్నారు కదా , మరి వారందరూ కూడా రెచ్చగొట్టే వస్త్రధారణలో వున్నారా...... ఏం మాట్లాడుతారు రాజకీయ నాయకులు....! ఏమైనా మాట్లాడుతారు రాజకీయ నాయకులు....!  సమాజంలో నానాటికీ స్త్రీల పట్ల పెరుగుతున్న అమానుషాల్ని ఎలా అరికట్టాలి అని ఆలోచించవలసినది పోయి , వారి దుస్తులను గూర్చి మాట్లాడడం ఎంత వరకు సమంజసం. అటువంటి అకృత్యాలకు పాల్పడేవారికి ఏ విధమైన శిక్షలు విధించాలి /ఏవిధమైన చర్యలు తీసుకోవాలి.... వంటి విషయాలను చర్చించ వలసినది పోయి ఇలా మాట్లాడతారా...... యువత పై ఎంతో ప్రభావం చూపుతున్న నేటి సినిమాలలోని అశ్లీలతను గూర్చి ఆలోచించవలసిన ఒకనాటి హీరోగారు....నేటి సమాజంలోని విలన్లను గూర్చి మాట్లాడక....... ఆడవారి వస్త్రధారణ గూర్చిమాట్లాడుతారా !!!!
 ఏవిషయమైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతో అవసరం .

********

Tuesday, August 5, 2014

అనగనగా కథలు పోయే ...........

 అనగనగా , కథలు పోయే ,
చందమామ కథలు పోయే ,
బాలమిత్ర కథలు పోయే ,
బొమ్మరిల్లు కథలు పోయే ,

నీతికథలను నీరుగార్చి ,
జానపద కథల జాడే మరచి ,
చారిత్రక కథలను చెరిపివేసి ,
ఇతిహాస కథలను ఇగిరించేసి ,
పురాణాలను పొలిమేరలు దాటించి ,

బామ్మల నుండి అమ్మల వరకు
బొమ్మలపెట్టెకు అతుక్కుపోయి ,
బాలల బంగరు బాల్యాన్ని
బొమ్మలపెట్టెకు బలిచేస్తుంటే ,

బాలనేరస్తులకు కొదవా లేదు....
అమ్మ బాధ్యతకు అర్ధం లేదు....

*****

Sunday, July 13, 2014

ఆహా ! ఎంత నిశ్శబ్ధం ....

శారీరక బాధలకు సెలవిచ్చేశా ,
మనోవ్యధలను విడచిపెట్టేశా ,
బంధాలన్నీ తెంచేశా ,
బరువు బాధ్యతలను వదిలేశా ,
కోరికలన్నీ కొండెక్కించేశా ,
కలత నిద్దురకు స్వస్తి పలికేశా ,
ప్రశాంత నిదురను ఆహ్వానించా.........

అనంతమైన శబ్ధాలకు దూరంగా ,
సుదూరంగా పయనించి....
నే చేరుకున్న నిర్మల ప్రదేశం.........

ఆహా ! ఎంత నిశ్శబ్ధం ,
ప్రశాంతమైన వాతావరణం ,

నే కదిలితేనే శబ్ధం ,
అందుకే నే అణువంతైనా కదలను ,

నే శ్వాసిస్తేనే శబ్ధం ,
అందుకే నా శ్వాసను సైతం బంధించేశా ,

నే రెప్పలార్పితేనే శబ్ధం ,
అందుకే నా రెప్పలు మూసే ఉంచాను ,

నే మాట్లాడితేనే శబ్ధం ,
అందుకే నా పెదవులు ముడుచుకున్నాను ,

నే కదిలితేనే శబ్ధం ,
అందుకే నే కదలక పడుకున్నాను ,
నా ఈ ఆరడుగుల ఆస్థానంలో............

 
*******

Monday, July 7, 2014

తొలకరి వాన......


 తొలి తొలి చినుకు
తొలకరి చినుకు
టపటప కురిసే
జనులే మురిసే...

చల చల్లని చినుకు
చిరుజల్లుగ చినుకు
వరములా కురిసే
వనములే మురిసే...

మెల మెల్లగ చినుకు
మెరుపుల చినుకు
జడివానలా కురిసే
జగమే మురిసే...
( నూజివీడులో ఇంతకు మునుపే ఈ సీజనులో తొలిసారిగా వాన కురిసింది )

****

Monday, June 30, 2014

నా ఇంటి దారిలోన............


నా వంక సూడరాదటే ఓ పిల్లా
నా తోటీ పలకరాదటే ఓ పిల్లా
సేయి సేయి కలపరాదటే ఓ పిల్లా
               నా జీవితాన తోడు రావదే ఓ పిల్లా      ll నా వంక ll         

ఆ సూరీణ్ణి తెచ్చినానే ఓ పిల్లా
నీ సింధూరం
చేసినానే ఓ పిల్లా
ఆ కరిమబ్బుల్ని  తెచ్చినానే ఓ పిల్లా
               నీ  కాటుక చేసినానే   ఓ పిల్లా     ll నా వంక ll   

ఆ నెలవంకనీ  తెచ్చినానే ఓ పిల్లా
నీ నవ్వుకు అద్దినానే ఓ పిల్లా
ఆ తారల్ని  తెచ్చినానే ఓ పిల్లా
               నీ కొప్పులో తురిమినానే ఓ పిల్లా     ll నా వంక ll                         

ఆ ఇంద్రధనస్సు  తెచ్చినానే ఓ పిల్లా
నీ చీరగా మలచినానే ఓ పిల్లా
ఆ మెరుపుతీగల్ని  తెచ్చినానే ఓ పిల్లా
            నీ మేని వంపుల్లో ఉంచినానే ఓ పిల్లా      ll నా వంక ll        

నా మనసు  తెచ్చినానే ఓ పిల్లా
నీ మనసుకిచ్చినానే ఓ పిల్లా
నా ఇంటి దారిలోన ఓ పిల్లా
               నీకై మల్లెల్ని పరచినానే ఓ పిల్లా      ll నా వంక ll      
 
           ***********