రంగులరాట్నం
[ఆశాజ్యోతి అనే అందమైన, పేదింటి బాలిక. తల్లి వెంట పనికి వెళుతూ ఆ యజమాని పిల్లల్లా తాను బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశగా ఉండేది. కానీ వారి ఆర్ధిక పరిస్థితి అందుకు ఏ మాత్రం సహకరించలేదు ..... అయినా పరిస్థితులను బాగు చేసుకుంటూ తన కుటుంబాన్నైనా అందంగా మలచుకోవాలనే ఆశను మనసంతా నింపుకుంది.]
తల్లి వెంట ఇంటింటికి వెళుతూ
పనులలో తల్లికి సాయం చేస్తుంది.
పనిమనిషి కూతురు ఆ అమ్మాయి
పేరు ఆమెది ఆశాజ్యోతి.
పేరుకు తగిన ప్రేరణ కలది.
కోటి ఆశలతో కొత్తకోడలై
అత్తింట్లో జ్యోతిని వెలిగించింది.
ఎదురింటిలో ఉన్న నన్ను చూసి
చెరగని చిరుదరహాసం చేసింది.
అత్త వెంట ఇంటింటికి వెళుతూ
పనులలో అత్తకు సాయం చేస్తోంది.
పనిమనిషి కోడలు ఆ అమ్మాయి
పేరు ఆమెది ఆశాజ్యోతి.
భర్త వ్యసనాలు సహనంతో సహిస్తూ
ఆడ,మగ కవలలకు జన్మను ఆమె ఇచ్చింది.
చూడడానికి వెళ్ళిన నన్ను చూసి
చెదరని చిరుదరహాసం చేసింది
మూడు పదుల దినములు గడిచె
ఒక బిడ్డను ఇంట విడిచింది.
మరొక బిడ్డను నడుముకు కట్టుకుని
ఇంటింటికి పనులకు వెళ్ళింది
చెదరని ఆత్మ విశ్వాసంతో.
ఏళ్ళు ఐదు గడిచాయి
ఎయిడ్స్ వ్యాధి ముదిరిన భర్త
కాలధర్మం చేశాడు.
కట్టలు తగిన దుఃఖంలో
ఆశలు కన్నీరయ్యాయి.
దుఃఖాన్నంతా దిగమింగింది
అత్తను ఊరడించింది.
పలుకరించగా పోయిన నన్ను చూసి
నిరాశా నిట్టూర్పులు విడిచింది.
ఆగక, అలయక కాలచక్రం
తిరుగుతూ సాగిపోతోంది.
మంచం పట్టిన అత్తకు మందులు ఇస్తూ
ఇంటింటికి పనులకు వెళ్ళింది.
బడి నుండి వచ్చిన కూతురికి
చేతిలో తాయిలం పెట్టింది.
దొరవారింటికి పోయి బిడ్డను
కూలి డబ్బులు తెమ్మంది.
గంటలు గంటలు గడిచాయి
కూతురి కోసం తోటకు వెళితే
శవమై కూతురు దొరికింది చేతిలో మిగిలిన తాయిలంతో.
గుండెలవిసిపోయాయి
దిక్కులు పిక్కటిల్లాయి.
ఆశలు ఆవిరయ్యాయి
కన్నీరు ఏరులై పారాయి.
మంచం మీది అత్త బాధతో
మనుమరాలికి తోడు తానూ వెళ్ళిపోయింది.
రోజులు దొర్లిపోయాయి
కొడుకును బడికి పంపింది
ఇంటింటికి పనులకు వెళ్ళింది.
ఆ రోజు ఆదివారం
మొక్కజొన్న చేలో పనికి వెళుతూ
కొడుకును తీసుకువెళ్ళింది.
బిడ్డను ఆడుకొమ్మంటూ
పనిలో మునిగిపోయింది.
భోజన సమయం బిడ్డను పిలువగా
ఎంతకూ పలుకరాలేదు.
చేను అంతటా తిరిగింది
పాము కాటుకు బలైన కొడుకును చూసి
మొదలు నరికిన మానులా
నిలువునా కుప్పకూలింది.
తల్లిని పట్టుకు ఏడ్చింది
తలరాతను తెగ ప్రశ్నించింది.
ఒదార్చగ పోయిన నావంక
చెరిగిన నవ్వుతో చూసింది.
ఆవిరైన ఆశలతో కొడిగట్టిన జ్యోతి
జీవం లేని కట్టెలా తప్పక ముందుకు కదిలింది.
మంచం లోని తల్లికి చెప్పి
ఇంటింటికి పనులకు వెళ్ళింది.
[ఆశాజ్యోతి నిరాశగా, నిర్వేదంగా ఆలోచిస్తోంది. అంతే కదా ధనవంతుల పిల్లలు ధనవంతులవుతారు, డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవుతున్నారు. సమాజం ఎంత మారినా పేదవారు పేదవారుగానే మిగిలిపోతున్నారు. వారి ఆశలు నిరాశలే అవుతున్నాయి అనుకుంటూ ఉండగా దూరం నుండి "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నము" అని వినిపించింది ......... అంతే ఆశాజ్యోతి మరింకేం ఆలోచించలేక పోయింది. మానసికంగా మూగదయింది. ]
**********
దేవీ, చాలా బాగుందమ్మా. కానీ ఆశ ని ఆశాజనకంగా ఆలోచింపజేద్దాం. మంచి రచన.
ReplyDeletemeraj fathima garu welcome to my blog and than you very much for your suggestion.
Delete