Tricks and Tips

Friday, August 23, 2013

నవతరమా మేలుకో !

నవతరమా మేలుకో!
తల్లిపాలు తాగి ఎదిగి,
                                             తండ్రి సొమ్ము తినమరిగి,
విద్య వినయముల విలువ మరిచి,
                                          లక్ష్యమన్నది విస్మరించి,
నైతికతకు నీళ్ళు వదలి,
                                            చీకటి పథాన చిందులేసి,
స్నేహితులతో చెడతిరిగి,
                                        మోహాల మొలకల పిలకలేసి,
విశృంఖలమైన స్వేచ్ఛా విలాసాలకు,
                                        సుఖభోగాలకు చిరునామావై,
క్లబ్బులోన, పబ్బులోన,
                                 బైక్ రేస్ లోన, యాసిడ్ దాడుల్లోన  
 కడకు చెరసాలలోన నీవే.
                              నిన్ను చూసి తల్లి గుండె చెరువాయె,
తండ్రి పరువు కరువాయె.
నవతరమా! మేలుకో!
           నీ జీవితాన్ని ఒక్కరోజు ప్రకృతికిచ్చి చూడు. 
                           ఉల్లిపొరల రెక్కలతో,
ఊపిరి సలపని వేగంతో,
                     శ్రమను మరచి తిరిగి, తిరిగి తేనెలు కూర్చే 
చిన్ని తుమ్మెదలు చూడు .... చూడు..... 
                                      తల్లి రెక్కల మాటు దాగుంటూ,
కాలిగోళ్ళతో గీకిగీకి ఆహారం వెదుక్కునే 
                      చిన్ని కోడిపిల్లలను చూడు .... చూడు..... 
పుట్టిన మరుక్షణమే కాళ్ళను కూడగట్టి పడుతూ, లేస్తూ 
                           నిలబడడానికి పూనుకునే 
చిన్ని మేకపిల్లలను చూడు .... చూడు..... 
                      తల్లిపాలు తాగి, తాగి 
చెంగుచెంగున ఎగిరిదూకే,
                                     రేపటి కాడిని మోయబోయే 
చిన్ని లేగదూడను చూడు .... చూడు..... 
                           మోయలేని భారాన్నెత్తి,
 క్రమశిక్షణతో సాగిపోయే,
                            రేపటి పనిని నేడు చేసే 
చిన్ని చీమలు చూడు .... చూడు..... 
                            గమ్యమెరిగిన జీవుల 
జీవన సౌగంధికా పరిమళం  ఆస్వాదించి చూడు. 
                        ఇంతవరకు జీవితాన 
నీవు పొందినదేమిటో, పోగొట్టుకున్నదేమిటో
తెలుసుకున్నావనుకుంటా ...... ధన్యుడవు. 
తెలుసుకోలేదా? ఇంతకన్నా నిదర్శనం ఏముంది?
నిన్ను నీవు కోల్పోయావనుకోడానికి. 
ఇప్పటికైనా సమయం మించిపోలేదు. 
మేలుకో నవతరమా! మేలుకో!
*********

4 comments:

  1. నవతరానికి మీరు చెప్పిన హితవు బాగుంది శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. హిమజ మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete
  2. Chala bagundi...really inspiring

    ReplyDelete
  3. Srinidhi,Welcome to my blog and thank you for your comment.

    ReplyDelete