ఆచార్యదేవోభవ!
గురుపూజోత్సవమును పురస్కరించుకుని ఈ సంవత్సరం పదవీ విరమణ చేయుచున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు నా ఈ చిరు అభినందనమాలిక.
ఉద్యోగ అధ్యాయాన్ని పూర్తి చేయబోవుచున్న
ఉపాధ్యాయులకు నా నమస్సుమాంజలి.
అధ్యాయాలెన్నో అధ్యయనం చేసి
అధ్యాపకులుగా చేరారు.
ఎందరెందరికో విద్యను నేర్పి
ఎంతో ఆదర్శం అయ్యారు.
అందరికీ చూపారు
అందమైన విద్యావనం.
అందులోనికి బాటలు వేసి
చూపించారు నందనవనం.
నాటినారు విద్యార్ధులలో
ఓనమాల విత్తనాలు,
పూయించారు వారిలో
విద్యాసుగంధ సుమాలు.
ఆ విద్యను అందుకున్న వారు నేడు
అందనంత ఎత్తుకు ఎదిగి,
అధికారులై నిలబడగా
అంతకన్నా టీచరుకు ఆనందం ఏముంది?
అనుకోనిది ఊహించి
అనుకున్నది సాధించి
అందరి మంచి కోరుకునే
ఆదర్శమూర్తులే ఈ ఉపాధ్యాయులు.
ఉద్యోగాలలో చేరిన నాడు
ఊరి నుండి పొందిన మన్నన,
నేడు చూడ మచ్చుకైన
లేనేలేదు ఏ కోశానా.
అయినా వారు నిలిచారు
స్థితప్రజ్ఞతను చూపారు.
మొక్కవోని విశ్వాసంతో
విద్యావృక్షం పెంచారు.
అలసి సొలసి నిలిచారు
మన అందరి వంక చూశారు.
పువ్వుల గుత్తులు తీసుకుని
చిరునవ్వులు మనకు రువ్వారు.
ఆఖరుగా
దేవుడు వారిని దీవించి,
ఆరోగ్యాన్ని అందించి,
సుఖశాంతులను చేకూర్చి,
చింతలు లేక చిరకాలం
జీవించాలని ఆశిద్దాం.
వారులేని కొరత మనకు
లేనేలేదు అనుకునేట్లు
అన్ని వేళలా వారు మనకు
అందుబాటులోనే ఉండాలి.
వారి ఆశీస్సులు మన వెంటే అచిరకాలం ఉండాలి.
*******
CHALA,CHALA BAGUNDI .
ReplyDeletereally superb.....
ReplyDeleteThank you Kavyasree.
Delete