Tricks and Tips

Friday, February 14, 2014

దొరుకుతుందేమో అన్న ఆశతో....

అనుభవించని క్షోభ లేదు ,
అమ్మనాన్నలెవరో తెలియనందుకు...
 
ఆక్రోశించని క్షణంలేదు ,
మానసిక వేదన పంచుకోను మా కెవ్వరూ లేనందుకు ...


 బాధ పడలేదు మేమెన్నడూ ,
ఏడంతస్తుల మేడ మాకివ్వనందుకు...
 
చింతించలేదు మేమెన్నడూ ,
పంచభక్ష్యాలు మాకు అందనందుకు...

కలత చెందలేదు  మేమెన్నడూ ,
కంచి వస్త్రాలు కట్టుకోలేనందుకు...
 
ఆవేదన చెందలేదు మేమెన్నడూ ,
ఓ తరువు నీడయినా మాకు దక్కనందుకు...
 
నిరాశ చెందలేదు మేమెన్నడూ ,
అక్షరాస్యతను మాకు పంచనందుకు...

గుండె గూడు వేదనతో నిండగా ,
కన్నులు కడివెడు నీటితో నిండగా ,
చావని ఆశలు మనసులో నిండగా ,
 

కనులకు , మనసుకు పనులను చెబుతూ ...
కాళ్ళు , చేతులతో అసంకల్పితంగా...
 

వేదనతోటి వేసారిపోక వెదుకుతూనే ఉన్నాం...
నిర్జన , నిర్జీవ ప్రాంతంలో .....
 

మాకై పంపినదేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో....

****************

Thursday, February 13, 2014

చిలిపి చేష్టలింక మాను ......

చిలిపి చేష్టలింక మాను చిన్ని కృష్ణయ్య
అల్లరింక కట్టిపెట్టు అలకలేలయా.......

వెన్నముంత దొంగిలించి - వెన్ననంత తోడి తిని
చల్లముంత దాచిదాచి - చల్లనంత తాగి తాగి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

కొమ్మ పైన ఎక్కి నక్కి - పైటలన్ని దోచి దాచి
గోపికలు అడిగినంత - చిలిపిగాను నవ్వు రువ్వి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

 
యసోదమ్మ చాటు నక్కి - పైట కొంగులోన దాగి
అమ్మ నిన్నుఅడిగినంత -  బుంగమూతి పెట్టి చూసి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

చిలిపి చేష్టలింక మాను చిన్ని కృష్ణయ్య
అల్లరింక కట్టిపెట్టు అలకలేలయా.......

*******

Tuesday, February 11, 2014

నా మనసు విపంచిలా....


నీ ఆగమనంతో.....
నా ఒంటరితనమే విరిసిన పూల వనమయ్యింది ,
నా కనులు విప్పారి తారకల్లా మెరిశాయి ,
నా పెదవులు సుడివిడి అలల్లా సాగాయి ,
నా భావాలు కూనిరాగాలై పరవశించాయి ,
నా మనసు విపంచిలా విను వీధుల్లో విహరించ సాగింది .

*******


Monday, February 10, 2014

అమ్మ


అమ్మ ముక్కోటి దేవతల ఏక స్వరూపం
"అమ్మా"అనే పిలుపే సకల పుణ్యతీర్ధం
అమ్మను సేవించుటయే సకల దేవతార్చనం

అమ్మ చూపులు అనురాగపు జల్లులు
అమ్మ పిలుపులు తేనెల చినుకులు
అమ్మ పనులు అలయని అలలు

అమ్మ కరుణ అనంత సాగరం
అమ్మ దీవెన అఖండ దీపం
అమ్మ హృదయం అమృత భాండం

అమ్మ జోల సుమధుర నాదం
అమ్మ ప్రేమ మాయని మమత
అమ్మ ఓదార్పు తరగని గని  

అమ్మ మాట పెట్టని కోట
అమ్మ బాట పువ్వుల తోట 
అమ్మ మనసు కట్టని కోవెల

*******

Sunday, February 9, 2014

ఊహల్లో పులకింతలు.....


ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

కునుకుల్లో కలవరింతలు ,
ఊహల్లో పులకింతలు ,
ఊసుల్లో కవ్వింతలు ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

ఏకాంతమే ఏకాంతమై ,
ఆనందమే అనంతమై ,
ఊపిరి నిండా ఊరింతలు ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

చెలికాడే చేరువై ,
చిత్తంతో మాలిమై ,
మనసున నిండే గిలిగింతలే ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

ఆలోచనలే సాగెలే ,
ఆలాపనలే అల్లెలే ,
చేతల నిండా అల్లరులే ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?


******

Saturday, February 8, 2014

అమ్మ కంట్లో కన్నీరే.....


నాకు ఊహ తెలిసిన వయసు నుండి
అమ్మ కంట్లో కన్నీరే
నాన్న దుర్వ్యసనాలకు సాక్షిగా....

నే బడికి వెళ్ళే వయసులోనూ
అమ్మ కంట్లో కన్నీరే
నా ఆకలి బాధకు సాక్షిగా...

నే కాలేజికి వెళ్ళే వయసులోనూ
అమ్మ కంట్లో కన్నీరే
పరీక్ష ఫీజు లేనందుకు సాక్షిగా...

నా చదువు ఆగిపోయిన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే 
        వివాహ వయసు దాటిపోతున్నందుకు సాక్షిగా ......

నా వివాహమైన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే
    దుర్వ్యసనాల అల్లుడికి సాక్షిగా....

నే తల్లినయిన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే
నా ఆడపిల్ల సాక్షిగా....

ఇప్పటికీ మౌనంగానైనా
అమ్మ కంట్లో కన్నీరే
     నా కన్నీరు తుడవలేననే బాధకు సాక్షిగా....

అప్పటికి , ఇప్పటికి , మరెప్పటికీ
అమ్మ కంట్లో కన్నీరే
   ఓ తల్లి బాధ కనలేని సమాజానికి సాక్షిగా .....


********

Friday, February 7, 2014

అల్లరి పనుల కృష్ణయ్యా ......

 అల్లరి పనుల కృష్ణయ్యా , నన్నలరించగ ఇటు రావయ్యా ,
చిలిపినగవుల చూపులతో నా చెంత చేరవయా ....

కోరి నిన్ను తలచేను , చెంత చేరి మొక్కేను ,
చిలిపిగ నన్ను  చేరరావయ్యా....చేరరావయ్యా
నన్ను  చేరరావయ్యా ...

వెన్నముద్దలు తెచ్చేను , గోరుముద్దలు పెట్టేను ,
మరువక నన్ను  చేరరావయ్యా...చేరరావయ్యా
నన్ను  చేరరావయ్యా.....

వలచి నిన్ను పిలిచేను , తలపులన్నీ నీకేను ,
విడువక నాతో ఉండి పోవయ్యా.... ఉండి పోవయ్యా
 నాతో ఉండి పోవయ్యా.... 

 అల్లరి పనుల కృష్ణయ్యా , నన్నలరించగ ఇటు రావయ్యా ,
చిలిపినగవుల చూపులతో నా చెంత చేరవయా .... 

***********