Tricks and Tips

Saturday, February 8, 2014

అమ్మ కంట్లో కన్నీరే.....


నాకు ఊహ తెలిసిన వయసు నుండి
అమ్మ కంట్లో కన్నీరే
నాన్న దుర్వ్యసనాలకు సాక్షిగా....

నే బడికి వెళ్ళే వయసులోనూ
అమ్మ కంట్లో కన్నీరే
నా ఆకలి బాధకు సాక్షిగా...

నే కాలేజికి వెళ్ళే వయసులోనూ
అమ్మ కంట్లో కన్నీరే
పరీక్ష ఫీజు లేనందుకు సాక్షిగా...

నా చదువు ఆగిపోయిన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే 
        వివాహ వయసు దాటిపోతున్నందుకు సాక్షిగా ......

నా వివాహమైన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే
    దుర్వ్యసనాల అల్లుడికి సాక్షిగా....

నే తల్లినయిన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే
నా ఆడపిల్ల సాక్షిగా....

ఇప్పటికీ మౌనంగానైనా
అమ్మ కంట్లో కన్నీరే
     నా కన్నీరు తుడవలేననే బాధకు సాక్షిగా....

అప్పటికి , ఇప్పటికి , మరెప్పటికీ
అమ్మ కంట్లో కన్నీరే
   ఓ తల్లి బాధ కనలేని సమాజానికి సాక్షిగా .....


********

8 comments:

  1. అమ్మ కంట్లో కన్నీరు మనసును కుదిపేస్తొంది శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. ఈ సమాజంలో అమ్మకు అంతకంటే ఏమి మిగిలింది హిమజగారు.

      Delete
  2. సంద్రానికీ నీటికీ ఉన్న సంబంధమే
    కన్నీటికీ కన్న తల్లికీ ఉందేమో అనిపిస్తుంది శ్రీదేవి గారు జీవితపు ప్రతి దశలోని
    ఆటు పోట్లకు అలుపెరుగక
    అలలను అక్కున చేర్చుకుని
    తీరాన్ని చేర్చే సంద్రమంటి అమ్మ ప్రేమని కొలువగలమా..

    ReplyDelete
    Replies
    1. అనంతమైన,అలుపెరగని,అసామాన్యమైన సంద్రంతో అమ్మను పోల్చడం చాలా బాగుంది జానీగారు.అలల్లా మీ స్పందనలు నా బ్లాగును చేరుకున్నాయి.

      Delete
  3. నాన్న దుర్వ్యసనాలు ....
    నా ఆకలి బాధ ....
    అమ్మ కంట్లో కన్నీరై
    చాలా చక్కగా మాతృత్వం రాగబంధాన్ని నిర్వచించావు
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. అమ్మ గూర్చి ఎంత చెప్పినా అసంపూర్ణమే చంద్రగారు...మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  4. ఒక స్త్రీ మనసులో ఇంత బాధను దాచుకునే సామర్ధ్యం ఆ భగవంతుడు ఎందుకిచ్చాడు. పాపం.. ఎలా తట్టుకోగలదు.. ఈ కష్టనష్టాలను. చెప్పుకునే అవకాశం, వినే నాధుడు లేని కుటుంబాలు చాలానే ఉన్నాయి. మీరన్నట్టు. అవును.. ఆడపిల్లను కన్న తల్లి తన జీవితాంత కంటతడి పరిస్థితులే ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. ఇటువంటి వాటికన్నిటికి ప్రత్యక్ష సాక్షి మీరే ...సతీష్
      గారు ,అందుకే సామాజిక సమస్యలు రాసినప్పుడు
      ఎప్పుడూ మీరు ఇలా తీవ్రంగా బాధను వ్యక్తం చేస్తారు,కన్నీరు తుడవలేక....

      Delete