Tricks and Tips

Sunday, February 23, 2014

ఆహుతైపోతున్న మన విద్యార్ధులు........

ఒకరితో ఒకరు రాజీ చేసుకునే రాజకీయ నాయకుల
కోసం చచ్చిపోతున్నారు మన విద్యార్ధులు .

చదువు సంధ్యలు విడచిపెట్టి రాజకీయ పోరాటంలో
కీలు బొమ్మలవుతున్నారు మన విద్యార్ధులు .

కుటుంబ బాధ్యత,అమ్మనాన్నల్ని వదిలిపెట్టి నాయకుల చేతిలో 
సమిధలవుతున్నారు మన విద్యార్ధులు .

పోరాటం ఏదైనా కావచ్చు రాజకీయ రణరంగంలో
పావులవుతున్నారు మన విద్యార్ధులు .

తల్లిదండ్రుల ఆశలు నీరుకార్చి వ్యర్ధ నేతల
పిలుపులతో బలైపోతున్నారు మన విద్యార్ధులు .

నవచైతన్యం పేరు మాటున ఉద్యమాల
నయవంచనకు గురవుతున్నారు మన విద్యార్ధులు .

వయసు మీరిన రాజకీయ జంబుకాల
మోచేతి నీరు తాగుతున్నారు మన విద్యార్ధులు .

విద్యలలో ఆరితేరి విజ్ఞానజ్యోతులు వెలిగించక
అజ్ఞానంలో మిగిలిపోతున్నారు మన విద్యార్ధులు .



సామాజిక బాధ్యత అర్ధాన్ని తెలుసుకోకనే అర్ధాంతరంగా
అసువులు బాస్తున్నారు మన విద్యార్ధులు .
 

భావిభారత ఆశావా నిర్మాతలు క్షణికావేశంలో భవిష్యత్తే లేకుండా
అగ్నికీలలకు ఆహుతైపోతున్న మన విద్యార్ధులు .
 

నాయకుల బిడ్డలు పాశ్చాత్య దేశంలో చదువుకుంటుంటే కనిపెంచిన 
తల్లిదండ్రుల కన్నీరుకు కారణమవుతున్నారు మన విద్యార్ధులు .
 
 ఓటు విలువ , జీవితపు విలువను గుర్తెరిగి ...నవసమాజ నిర్మాణ
బాధ్యతలందుకోను సిద్ధమవ్వాలి మన విద్యార్ధులు .

********

4 comments:

  1. నవచైతన్యం, సామాజిక విప్లవం, రాజకీయ అవసరం పేరు మాటున .... ఉద్యమాల నయవంచనకు గురవుతు .... వయసు మీరిన రాజకీయ జంబుకాల మోచేతి నీరు తాగుతు....
    నేటి యువత
    ప్రజస్వామ్యం పునాదులు తామే అని మరిచిపోతున్నారు
    అభినందనలు శ్రీదేవీ! ఆలోచింప చేసే కవిత

    ReplyDelete
    Replies
    1. ప్రజస్వామ్యం పునాదులు తామే అని మరిచిపోవడమే కాదు
      తమ పునాదులు సమాధులకు తరలించడమే
      దురదృష్టకరం చంద్రగారు .

      Delete
  2. విప్లవాల ఉన్మాదం విద్యార్ధులను ఊపేస్తుంది అనాదిగా,
    వారు బంకమన్ను లాంటివారు వారిని మలుచుకొనే విదానం లో తప్పుజరుగుతుంది,
    మీరన్నట్లు తమబిడ్డలని విదేశాలలో చదివించుకొనే పెద్దలు ఈ బీద బిడ్డలను సమిదలు చేయటం గమనార్హం, వ్యవస్తకు మత్తుమందిచ్చి నిద్రపుచ్చే ప్రబుద్దులున్నంతవరకూ చైతన్యం రాదు.
    ఆకలి కేకలు అందరి చెవిన ఇంకా పడటం లేదు.

    ReplyDelete
    Replies
    1. ఆకలి మంటలు ఆరనంత వరకు,
      ఆ"కలి" కేకలు వినక తప్పదు మీరజ్

      Delete