Tricks and Tips

Thursday, February 6, 2014

అమ్మా ! ఆకలి అమ్మా...... !

అమ్మా ! ఆకలి అమ్మా !
అమ్మా ! ఆకలి అమ్మా ! 
నీవెక్కడున్నావు అమ్మా ?
నన్నెందుకు వీధిలోనికి విసిరేశావమ్మా ?
నీవెక్కడున్నావు నాన్నా ?
నన్నెందుకు వదిలేశావు నాన్నా ?

అమ్మా , అమ్మా.....అని ఎవరు
వాళ్ళమ్మని పిలిచినా.....
నా మనసు మూగగా రోదిస్తూ
మౌనంగానే ఎలుగెత్తి అరుస్తోంది అమ్మా అని ,
ఎప్పటికైనా నా మూగ పిలుపు
నీ మనసును చేరుతుందేమో అనే ఆశతో
నీ కోసం ఎదురు చూస్తున్నానమ్మా ....

నాన్నా , నాన్నా అని ఏ పిల్లలు
వాళ్ళ నాన్నని పిలిచినా.....
నా గొంతు బాధతో మూసుకుపోతోంది మూగగా ,
నాలోని వేదనా కంపనాలు
నీ హృదయాన్ని చేరి స్పందింప చేయక పోతాయా అనే ఆశతో
నీ కోసం ఎదురు చూస్తున్నానాన్నా ....

హృదయానికి హత్తుకుని నను ముద్దాడేవారే లేరే ,
నను ఒడి చేర్చుకుని నా బుగ్గలు నిమిరేవారే లేరే ,
నా వేదనలు , రోదనలూ విని సముదాయించేవారే లేరే ,
కొంగును చుట్టూ కప్పి నను నిదురపుచ్చే వారెవరమ్మా ?
నా చేయి పుచ్చుకు నడిపిస్తూ బొమ్మలు కొనేదెవరమ్మా ?

ఆకలిగొన్న నా జానెడు పొట్టకు పిడికెడు అన్నం పెట్టేవారే లేరే ....
నా ఆకలి ఆర్తనాదాలు , నా నిస్సహాయ దీన ముఖమూ
కాంచిన వారెవ్వరికీ జాలి కలగదే .......

నా ముందునుండి రకరకాల
తినుబండారాలు తీసుకుపోయేవారే కానీ ,
తీసి చిన్ని నాచేతిలో పెట్టేవారే లేరే ,
అసలు నేనున్నానని గుర్తించేవారే లేరే ...

అవునవును , అమ్మా నాన్నా నా పై మీకే లేని ప్రేమానురాగం
వేరెవ్వరిలోనో నే వెదకుట నేరం .
నే చేసిన తప్పు ఏమిటి అమ్మా ?
నే చేసిన నేరం ఏమిటి నాన్నా ?


దేవుడా ! భూమిపై నా వంటి వారిని
పొరపాటుగనైనా పుట్టించకు ......
అన్నపూర్ణ దేశంలో నా ఆకలి చావుకు
నీవు కారణమెప్పుడు అవ్వద్దు .
******





12 comments:

  1. మీ కవిత నా మనసుని కదిలించింది! Touching!

    ReplyDelete
    Replies
    1. కదిలించటమే కాదు కలచివేస్తాయి కూడా వల్లీగారు.

      Delete
  2. నా ఆకలి చావుకి నువ్వు కారణం కావొద్దూ అని దేవుణ్ణి హెచ్చరిస్తున్నట్లు ఓదారుస్తున్నట్లు
    పెగలని గొంతులోంచి పెల్లుబికే పసి మాటలు
    ఆకలి కేకల దాటుకుంటూ
    హృదయాల్ని ప్రశ్నిస్తున్నాయి శ్రీదేవి గారు...

    ReplyDelete
    Replies
    1. పాపం ఈ చిన్ని పిల్లలు అమాయకపు పసికూనలు...తల్లిదండ్రుల తప్పులకు వారు శిక్ష అనుభవిస్తున్నారు....మీ వేదనాభరితమైన స్పందనకు నిర్వేదమే సమాధానం జానీగారు.

      Delete
  3. ఎవరైనా నన్ను హృదయానికి హత్తుకుని ముద్దాడరా అని, ఒడి చేర్చుకుని బుగ్గలు నిమరరా అని, నా వేదన, రోదన విని సముదాయించరారా అని, కొంగును చుట్టూ కప్పి నిదురపుచ్చరా అని .... ఎన్నో వరాలు కావాలనున్నా ఆకలి శాపగ్రస్తుడ్నై ఆలమటిస్తున్నా ....
    అమ్మా నా ఆకలి తీర్చరా ఎవరైనా అన్నట్లు .... ఒక చక్కని భావన
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. ఆకలి నిజంగా శాపం చంద్రగారు. వంద వరాల సంతోషం ఒక్క శాపంతో తుడిచిపెట్టుకు పోతుంది.

      Delete
  4. అమ్మ దేవుడిచ్చిన వరం, అదే దేవుడు ఆకలి అనే శాపం లాంటి వరాన్నీ ఇచ్చాడు. అమ్మ లేకపోతే ఆకలి శాపం, అమ్మ ఉంటే ఆకలి వరం. ఆకలితో మలమలమాడే ఆ చిన్నారులు శాపగ్రస్థులు. ఇలాంటి వారిని చేరదీసే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని షెల్టర్లున్నాయి. కానీ.. వ్యవస్థీకృతం కాదు. ఎవరైనా చేరదీసి తీసుకెళ్లాలి. 108 లాగా ఇలాంటి పిల్లల కోసం ఇంకేదైనా వ్యవస్థ ఉండి.. వారికో నీడ, విద్య కల్పించే విధానం ఉంటే బాగుండును. ఎలాగూ విద్యాహక్కు ఉంది కాబట్టి, అంగన్వాడీలు, ఇతర వసతులు కల్పించి వీరి ఆకలి తీర్చడం ప్రభుత్వం తలచుకుంటే కష్టం కాదు. భారత దేశంలో ఇలాంటి సన్నీవేశాలు వీధివీధిలో కనిపిస్తున్నాయి. ఇలా పసిపిల్లలు దయనీయమైన పరిస్థితుల్లో కనిపించని రోజునే నా దేశం సౌభాగ్యంతో ఉన్నట్టు... కదిలించారు.. శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. అటువంటి రోజు రావాలని,మన దేశం సౌభాగ్యంతో కళకళలాడాలని ఆశిద్దాం సతీష్ గారు....ధన్యవాదములు.

      Delete
  5. ముందు ఆ బుడ్డోడి కాలే కడుపుకి గంజి కావాలి,
    ప్రభుత్వానికి సాద్యం కాని ,పరిష్కారం కానివి కావీ సమస్యలు.(సతీష్ గారి,సూచన బాగుంది )
    వల్లీ,చంద్రా,జానీ గార్ల వ్యాఖ్యలు అర్దవంతంగా ఉన్నాయి.
    దేవీ కవిత బాగుంది, ఆకలి జీవుల కేకలే గుచ్చుకుంటున్నాయి.

    ReplyDelete
    Replies
    1. వాడి కాలే కడుపు గూర్చి ప్రభుత్వానికి ఎందుకూ ,వాడికి ఓటు లేదుగా..ఏమి ఉపయోగం వుంది ? వాడి గూర్చి ఆలోచించడానికి ? అదే వీధికో బారు,బ్రాంది షాపు ( దేవుడు మేలు చేసి బడికి దగ్గరగా కూడా పెడుతున్నారు కదా .....) పెడితే ప్రభుత్వానికి ఉపయోగముంటుంది , ఆదాయము ఉంటుంది....ఏమంటారు మీరజ్ ? ఓటరుకైతే సారా ఏరులై పారుతుంది , వీడికి మాత్రం గంజి కూడా కరువే , ఆకలి చావుదే అంతిమ విజయం.

      Delete
  6. ఎలక్షన్‌ సమయం లో బడులను ఎన్నో అసాంఘిక చర్యలకు వాడుకొనే ప్రబుద్దులు మన నాయకులు,
    నిజమే ఓటు లేని బడుగు పసి వాడితో పనిలేదుగా...మీ అక్షరాలకు మరో మారు సలాం చేస్తున్నా డియర్.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదములు మీరజ్.

      Delete