Tricks and Tips

Tuesday, December 31, 2013

" నూతన సంవత్సర శుభాకాంక్షలు . "


ఈ 2014 లో అందరూ సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో , అష్టైస్వర్యాలతో ,మానసిక ప్రశాంతతలతో , సకల సౌభాగ్యాలతో కళకళలాడుతూ ఆనందమయ జీవితంతో విలసిల్లాలని కోరుకుంటూ .... ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్నంతవరకూ ....అవసరంలో ఉన్నవారికి తమవంతు కర్తవ్యంగా సాధ్యమైనంత చేయూతనివ్వడానికి ప్రయత్నించాలని ఆశిస్తూ      "    నూతన సంవత్సర శుభాకాంక్షలు . " 



***********

నాగరికత మాటున నక్కలా.........

వాస్తవాలు తలుపు చాటుగా 
కొంగు కప్పుకొని నిలుచుంటే ,
అవాస్తవాలు వగలుపోతూ
 వాకిలి వెలుపలకొచ్చాయి .
ఆచారాలు పెరటిలో అణగిపోతూంటే ,
అనాచారాలు పెచ్చరిల్లుతూ 
వీధిలో విలయతాండవం చేస్తున్నాయి .
అత్యాచారాలు విజృంభించి ,
ఆక్రందనలు మిన్నంటించి ,
సున్నిత భావాలను మొగ్గలోనే  చిదిమేసి ,
శారీరక ,మానసిక హింసల పాల్జేసి ,
జీవించాలనే ఆశతో ప్రాకులాడినా .....
మరణశయ్యే శరణమయితే ?
ఆ ఆడపిల్లల తల్లిదండ్రుల
హృదయఘోషకు కారణమైన .........

ఆడవాసన వస్తే చాలు ,
వయసుతో పనిలేదు  ,
6 నెలల నుండీ నడుము ఒంగిన వారి వరకూ .....
వావివరుసలూ ........ తాళిబొట్టు  ...అయితే  ఏంటీ ?
విలువల్ని పాడెకెత్తి వల్లకాడు పంపించిన ..........

రోడ్డు , షాపు , సినిమాహాలు
ఇల్లు ,ఆఫీసు ,దేవాలయము
బస్సు ,రైలూ ,ఏ.టి.ఎం సెంటర్ ......
ప్రాంతమేదైనా అత్యాచారానికి అనువేనంటూ
జటలు విప్పి నడివీధుల్లో నర్తిస్తున్న కామాంధులు ...... 

 ఒక్కడిని చూడండి ...ఎలా ఉన్నాడో ........!

ట్రిమ్మ్ గా షేవ్ చేసుకుని
స్టైల్ గా క్రాఫ్ దువ్వుకుని
నీట్ గా టక్ చేసుకుని
పెర్ఫ్యూం వేసుకుని  
చెరగని చిరునవ్వు పులుముకుని
 


2014 శుభాకాంక్షలు చెప్పే సాకుతో
 నాగరికత మాటున నక్కలా ఉండి
ఏ ఇంటను అడుగు పెడతాడో ........!

ఆడపిల్లలూ  ! జాగ్రత్త
ఆత్మస్తైర్యంతో ఉండండి
తల్లిదండ్రుల్ని మించి మీ బాగు
కోరే వారు లేరని తెలుసుకోండి
మీ విలువైన జీవితాన్ని
వెలుగుతో నింపుకోండి . 
 
అత్యాచారాలకు బలైపోయిన ఆడపిల్లలందరికీ నా  నివాళులు . 

******************

Sunday, December 29, 2013

చందమామయ్యా ... నా దరికిరావయ్యా !



నిండు పున్నమి రేయిలో , నీవు చెంతను చేరగా 
వెండి వెన్నెల సాక్షిగా , వలపులన్నీ పండగా
వేల తారల కాంతులే  , వేదమంత్రం చదవగా 
వేయి కనులు కావలెలే , వేడుకంత చూడగా 

అందమైన పందిరేసి , అడుగడుగున పూలువేసి 
ఆశలన్ని ఏరి గుచ్చి , అందమైన మాలచేసి 
నీ కంఠసీమ నందుంచనా  చందమామయ్యా
చందమామయ్యా ...... చందమామయ్యా 

వెన్నెలంత పోగుచేసి  , వేగిరమే పానుపేసి
తారలన్ని దూసి దూసి , మాలలల్లి మనసు దోచి 
చల్లగాలితో కబురంపన   చందమామయ్యా 
చందమామయ్యా..... ... చందమామయ్యా 

అంతులేని రంగులన్ని రంగరించిన ఆకశాన
అందమైన నీవు నాకు అందనంత ఎత్తుకెళ్ళి 
అల్లరిటుల చేయతగునా  చందమామయ్యా 
చందమామయ్యా........ చందమామయ్యా 

చందమామయ్యా .... నా దరికిరావయ్యా
చందమామయ్యా ....  నా దరికిరావయ్యా
 నా దరికిరావయ్యా ....  నా దరికిరావయ్యా

*********

Friday, December 27, 2013

మధుర భావ వీచికలే.........


పలికెను నాకు స్వాగతము ,
నే పరవశమైతి క్షణక్షణమూ ,

ఆశలే మల్లెలై విరియగా ,
హృదయమే  కోకిలై పాడగా ,
 
సింధూరమే నేనవ్వనా - అందాల నీ నుదిటిపై ,
సిరిమల్లెనె నేనవ్వనా - నీ నీలిముంగురులలో,
 
అంతరంగం అల్లేనే ,
ఆలోచనలా పొదరిల్లు . 
 
మెరుపును నేనవ్వనా - నల్లని నీ కళ్ళలో ,
చిరునవ్వు నేనవ్వనా - పూలేత నీ మోవిపై ,
 
కొంటె తుమ్మెదలా కనులు ,
మన్మధ చాపాలా నొసలు . 
 
తారక నేనవ్వనా - నీ చిన్ని నాసికపై ,
భావాన్ని నేనవ్వనా - తీయని నీ మాటలో ,

భావమెంతొ మధురములే ,
కోటి వీణల సరిగమలే .

పయ్యెద నేనవ్వనా - వయ్యారి నీ మేనిపై ,
గీతను నేనవ్వనా - పిడికిటి నీ నడుముపై ,

మదిని నిండే కోరికలే ,
మధుర భావ వీచికలే . 

గాజులు నేనవ్వనా - నీ కరకమలాలపై ,
అందెలు నేనవ్వనా - నీ పాదపద్మాలపై ,

నిండు పున్నమి రాతిరులు ,
నిదురను దోచే స్వప్నాలు . 

*******
 
 
 



నాదన్నది నీదేనులే...........


నీదేలే , నీదేలే ,
నాదన్నది నీదేనులే ,
నీదేనులే ,
మనసు నీది ,
మమత నీది ,
వలపు నీది ,
తలపు నీది ,
భావం నీది ,
మాట నీది ,
పాట  నీది ,
బ్రతుకు నీది ,
బంధం నీది ,
నా జీవితాన వెలుగు నీది ,
నాదన్నది నీదేనులే ,
నీదేలే , నీదేలే ,
నాదన్నది నీదేనులే .

********

నీ తలపులు ...........


                                    
                 నీ తలపులు                   
     నా కన్నుల్లో కాంతి పుంజాలై  
వెలుగుతూ,
     నా లేబుగ్గల్లో గులాబీలై           
విరబూస్తూ ,
                    నా అరుణాధరాలపై   ముసిముసి                                      నవ్వులు చిందిస్తూ,                               
                  నా హృదయంలో వలపులై                                                     స్పందిస్తూ,                            
                         నను  కలవరపరస్తున్నాయి                                               సఖుడా ....... !                                
నా ఈ అనంతాన  రాగాన్ని
                  ఆస్వాదిస్తూ ,                        
 నా మనసు ఆలపించే       
                         మౌనరాగాన్ని ఆలకిస్తూ ,               
నా మనస్సుమాలను        
          వికసింపజేస్తూ ,               
          నా తలపుల తలుపులు              
    మూసివేస్తూ ,             
                     నా వలపు వాకిట్లో                                 
     విరివానను                   
              ఎప్పుడు కురిపిస్తావు ?                     

********          
                   

                         

                           
                 

           

Thursday, December 26, 2013

మనువాడ వచ్చినానే ఓ పిల్లా !



మనువాడ వచ్చినానే ఓ పిల్లా !
నిను మనువాడ వచ్చినానే ఓ పిల్లా !
మనువాడ వచ్చినానే ఓ పిల్లా !
నిను మనువాడ వచ్చినానే ఓ పిల్లా ! 

ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా !  

మాగాణి సేనుంది ,గాదెలన్ని నింపుతాది  
ఎకరాల తోటుంది ,బంగారం దింపుతాది 
ఆ.....ఆ ...... ఆగాగు ...... 
వాన ,వరద వస్తాది ,సేనంతా మునుగుతాది 
పేనుబంక సోకుతాది ,తోటంతా సివుకుతాది 
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా !  

ఒంటి నిండ సత్తువుంది ,కట్టపడే ఓపికుంది 
ఆలి ,బిడ్డల సూసుకునే అండ దండ నాకుంది 
ఆ .... ఆ .... ఆగాగు 
పొలం పనుల కాలమెంత ,ఆరు నెలలు ఉంటాది 
ఆపైని కాలమంత సిల్లరగా తిరుగు తుంటవు 
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 

ఆరడుగుల ఎత్తు సూడు ,బిరుసైన కండ సూడు 
సక్కనైన మొహం సూడు ,కోరమీసకట్టు సూడు 
నన్నుమించినోడు ఈ ఊరివాడలోన లేడు సూడు  
మూడుముల్లు ఎసేత్తానే ఓ పిల్లా !

ఎందుకంత మీసకట్టు ,పౌరుషాలు కట్టిపెట్టు 
ఊరెలదమంటే నేను, బస్సు పేరు సదవలేవు 
ఉత్తరంముక్కసూసి బిక్కమొగం ఏస్తావు 
సంతకం సేయమంటే బొటనేలు సూపుతావ్
ఏమి సూసి సేసుకోనురో ఓ బావా ! 
నిను ఏమి సూసి సేసుకోనురో ఓ బావా !  

సదువుకోని వాడెవడూ, సక్కగాను బతకలేడా 
ఈ వయసులోనా సదువుతోటి పని ఏంటి ?
మాటలింక కట్టిపెట్టవే ఓ పిల్లా !
మంకుతనం ఇడిసిపెట్టవే ఓ పిల్లా !
 
సదువుకోని నీకు సిల్లుకాని ఇలువ లేదు 
సదువురానోల్ల బతుకు, ముల్ల మీద సీర కాదా 
పేకముక్క ఇడిసిపెట్టు ,పలకబలపం సేతపట్టు 
ఊరు,వాడ గొప్పతనం సదువుతోటే పెరుగుతాది
 సదువు విలువ తెలుసుకుంటే ఓ బావా !
మనువాడ నే సిద్ధము ఓ బావా !

   సదువు విలువ తెలుసుకుంటనే ఓపిల్లా !
 మనువాడ నే సిద్ధము ఓ బావా !
సదువు విలువ తెలుసుకుంటనే ఓపిల్లా !
 మనువాడ నే సిద్ధము ఓ బావా !

***********