Tricks and Tips

Friday, February 7, 2014

ఆ కళ్ళే .....నా ఆశల పొదరిళ్ళు ...

కళ్ళను కళ్ళు చూసాయి ,
కళ్ళలో కళ్ళు కలిసాయి ,
కళ్ళ
తో కళ్ళు నవ్వాయి ,
కళ్ళతో కళ్ళను వెదికాయి ,
కళ్ళతో కళ్ళను పిలిచాయి ,
కళ్ళను కళ్ళు ప్రశ్నించాయి .
కళ్ళతో కళ్ళు అలిగాయి ,
కళ్ళతో కళ్ళు చెలిగాయి ,

 
నాలుగు కళ్ళు రెండయ్యాయి .....

ఆ కళ్ళే  నాకిళ్ళు ,
ఆ కళ్ళే నా ఆశల పందిళ్ళు ,
ఆ కళ్ళే నా తలపుల చప్పుళ్ళు ,
ఆ కళ్ళే నా కలల పరవళ్ళు ,
ఆ కళ్ళే నా ఆలోచనల పొదరిళ్ళు ,
ఆ కళ్ళే నా భావాల లోగిళ్ళు ,
ఆ కళ్ళే నా ఆనందాల ముంగిళ్ళు ,
ఆ కళ్ళే నా హృదయపు చప్పుళ్ళు ,

ఆ కళ్ళే నిర్లక్ష్యానికి నిచ్చెన వేస్తే....

ఆ కళ్ళే నా గుండెను గుచ్చే ముళ్ళు ,
ఆ కళ్ళే నా కళ్ళలో నిండిన కన్నీళ్ళు ,
ఆ కళ్ళే నా గొంతులో వచ్చే వెక్కిళ్ళు ,
ఆ కళ్ళే నా మదిలో బాధల సుళ్ళు ,
ఆ కళ్ళే నా సంతోషానికి సంకెళ్ళు .

*******

ఓ మంచి పని చేయరా...


 చేయరా ! నీ చేతితో - ఓ మంచి  పని చేయరా...
చిన్నదైన , పెద్దదైన -  మంచిదైతే చాలురా.........
నిలుచురా నీ పేరు - ఓ మంచి పని చేయగా.......
నిలుపురా నీ కీర్తి - నీవున్నను , లేకున్నను ....

నాటరా ! నీ చేతితో - ఓ మంచి విత్తు నాటరా.....
చూడరా ! ఆ చెట్టు - నింగికేసి పెరిగెరా..............
నీడనిచ్చు ఆ చెట్టు - శ్రామికుల సేదతీర్చు .......
పూవులిచ్చు ఆ చెట్టు - పూజలే ప్రోత్సహించు ..
ఫలములిచ్చు ఆ చెట్టు - అన్నార్తులనాదరించు ..
 గింజలిచ్చి ఆ చెట్టు - తన సంతతిని విస్తరించు ..
పచ్చదనాల ఆ చెట్టు - ప్రాణి కోటి కాపాడు ........
అణువణువు ఆ చెట్టు - ఔషధాలు అందించు.....
కడకు కట్టెగాను - తన దేహమందించు ...........
మన కట్టె కాల్చుటకును - తన కట్టెలందించు ...
 మన చితిలో తోడై - కడవరకు నిలుస్తూ .........
మన కట్టెతో పాటుగా - సహగమనమే చేయు తుదకు 

చిన్న విత్తును చూడరా - ఓ మంచి మని చేయరా... 
చిన్నదైన , పెద్దదైన -  మంచిదైతే చాలురా.........
నిలుచురా నీ పేరు - ఓ మంచి పని చేయగా.......
నిలుపురా నీ కీర్తి - నీవున్నను , లేకున్నను ... 

*******

Thursday, February 6, 2014

అమ్మా ! ఆకలి అమ్మా...... !

అమ్మా ! ఆకలి అమ్మా !
అమ్మా ! ఆకలి అమ్మా ! 
నీవెక్కడున్నావు అమ్మా ?
నన్నెందుకు వీధిలోనికి విసిరేశావమ్మా ?
నీవెక్కడున్నావు నాన్నా ?
నన్నెందుకు వదిలేశావు నాన్నా ?

అమ్మా , అమ్మా.....అని ఎవరు
వాళ్ళమ్మని పిలిచినా.....
నా మనసు మూగగా రోదిస్తూ
మౌనంగానే ఎలుగెత్తి అరుస్తోంది అమ్మా అని ,
ఎప్పటికైనా నా మూగ పిలుపు
నీ మనసును చేరుతుందేమో అనే ఆశతో
నీ కోసం ఎదురు చూస్తున్నానమ్మా ....

నాన్నా , నాన్నా అని ఏ పిల్లలు
వాళ్ళ నాన్నని పిలిచినా.....
నా గొంతు బాధతో మూసుకుపోతోంది మూగగా ,
నాలోని వేదనా కంపనాలు
నీ హృదయాన్ని చేరి స్పందింప చేయక పోతాయా అనే ఆశతో
నీ కోసం ఎదురు చూస్తున్నానాన్నా ....

హృదయానికి హత్తుకుని నను ముద్దాడేవారే లేరే ,
నను ఒడి చేర్చుకుని నా బుగ్గలు నిమిరేవారే లేరే ,
నా వేదనలు , రోదనలూ విని సముదాయించేవారే లేరే ,
కొంగును చుట్టూ కప్పి నను నిదురపుచ్చే వారెవరమ్మా ?
నా చేయి పుచ్చుకు నడిపిస్తూ బొమ్మలు కొనేదెవరమ్మా ?

ఆకలిగొన్న నా జానెడు పొట్టకు పిడికెడు అన్నం పెట్టేవారే లేరే ....
నా ఆకలి ఆర్తనాదాలు , నా నిస్సహాయ దీన ముఖమూ
కాంచిన వారెవ్వరికీ జాలి కలగదే .......

నా ముందునుండి రకరకాల
తినుబండారాలు తీసుకుపోయేవారే కానీ ,
తీసి చిన్ని నాచేతిలో పెట్టేవారే లేరే ,
అసలు నేనున్నానని గుర్తించేవారే లేరే ...

అవునవును , అమ్మా నాన్నా నా పై మీకే లేని ప్రేమానురాగం
వేరెవ్వరిలోనో నే వెదకుట నేరం .
నే చేసిన తప్పు ఏమిటి అమ్మా ?
నే చేసిన నేరం ఏమిటి నాన్నా ?


దేవుడా ! భూమిపై నా వంటి వారిని
పొరపాటుగనైనా పుట్టించకు ......
అన్నపూర్ణ దేశంలో నా ఆకలి చావుకు
నీవు కారణమెప్పుడు అవ్వద్దు .
******





Tuesday, February 4, 2014

ప్రేమవు నీవైతే ......

మేఘం నీవైతే - వర్షం నేనవుతా
చంద్రుడు నీవైతే - వెన్నెల నేనవుతా

సుమము నీవైతే - సువాసన నేనవుతా
ఫలము నీవైతే - మాధుర్యం నేనవుతా

వేణువు నీవైతే - నాదం నేనవుతా
వీణవు నీవైతే - తీగను నేనవుతా

గాయని నీవైతే - గానం నేనవుతా
కవివి నీవైతే - కలమును నేనవుతా

నర్తకి నీవైతే - నాట్యం నేనవుతా
అందెలు నీవైతే - మువ్వను నేనవుతా

శిల్పివి నీవైతే - ఉలిని నేనవుతా
శిల్పం నీవైతే - జీవకళను నేనవుతా

శ్వాసవు నీవైతే - ప్రాణం నేనవుతా
వక్తవు నీవైతే - శ్రోతను నేనవుతా

మాటవు నీవైతే - భావం నేనవుతా
పాటవు నీవైతే - పల్లవి నేనవుతా

ప్రేమవు నీవైతే - పెళ్ళిని నేనవుతా
పెళ్ళికూతురు నీవైతే - పెళ్ళికొడుకును నేనవుతా


********


Monday, February 3, 2014

అందరూ చదవాలి .....

టీచరు జాబ్ వచ్చిందని
సంతసిస్తే సరిపోదు ,
పట్టుబట్టి టీచర్లంత
చదువు విలువ తెలపుదాం .

బడి ఈడు పిల్లల్ని
బడికి తీసుకొద్దాము ,
తీసుకొస్తే సరికాదు
నిలుపుదల చేద్దాము .

చిన్ని చిన్ని పిల్లల్లో
అంతులేని సామర్ధ్యం ,
సద్దు చేయకుంటుంది
తట్టి మనం లేపుదాం .

చేత బెత్తం పట్టవద్దు
విసుగుదల చూపవద్దు .
ఆటపాటలతోటి మనం
చదువు సంధ్య నేర్పిద్దాం .

మారుమూల పల్లె సైతం
చదువులోన ముందంజ ,
వేసేలా మనమంతా
చేయాలి శ్రమ ఎంతో .

వయసుతోటి పనిలేదు
మీరు కూడ చదువుకోండి ,
అంటు ఊరివారి కందరికి
అక్షరాలు నేర్పుదాము .

పేదలంటు,ధనికులంటు
భేదాలు విడిచి మనం ,
చదువులోన అందరిని
ధనికుల్ని చేద్దాము .

ఆ పిల్లలు వేరు కాదు
మన పిల్లలు వేరు కాదు ,
అందరూ మనవాళ్ళే
అనుకుంటే నేర్పగలం .

అందరికి చదువొస్తే
అనుకున్నది సాధిస్తాం ,
ప్రగతి బాటలోన మనం
పయనమే చేస్తాము .

ఏ ఒక్కరిదో కాదు ఇది
అందరిదీ బాధ్యతే ,
అందరూ చదవాలి
అందరూ ఎదగాలి .

******

Sunday, February 2, 2014

అల్లరి పిల్ల......!


గెంతుతు నా చెంతకు వచ్చిన అల్లరి పిల్లను చూచితిరా
మీరల్లరి పిల్లను చూచితిరా
నాపై అలకను పూని ఏ వల్లరి మాటున దాగున్నదో....

తెల్లని బొండు మల్లెలతో - విరిసీ విరియని జాజులతో
ఎర్రని ముద్ద మందారంతో - ఝుము ఝుమ్మనె తుమ్మెద నాదంతో
పచ్చని పావడ రెపరెపతో - పల్లెకు తెచ్చే అందాలే

బంగరు రంగు పైరులతో - జలజల పారే ఏరులతో
చల్లని పిల్ల తెమ్మెరతో - కుహుకుహు కోకిల గానంతో
ఘలుఘల్లనె కాలి అందెలతో -పల్లెకు తెచ్చే కళకళలే

భానుని లేత కిరణంతో -
నులివెచ్చని సాయం సంధ్యతో
 పున్నమి వెన్నెల రాతిరితో  - మిలమిలలాడే మిణుగురుతో
గలగల చేతి గాజులతో - పల్లెకు తెచ్చే మిలమిలలే

అల్లన మెల్లన వస్తోంది - నవవధువల్లే నడిచింది
అందాన్నెంతో తెచ్చింది - ఆనందాన్ని ఇస్తోంది
విరితావులనే తాకింది - విరిసీ విరియక  నవ్వింది
ఆ కోల కన్నుల భావాలు -  కొలవగ నెవరికి సాధ్యము .

***********

Saturday, February 1, 2014

శుభముహూర్తమే ......


  శుభముహూర్తమే చేరువ కాగా ,
మంగళవాద్యం వినబడినంతనే మదిలో
అలల అలజడి మొదలవగా ....


నిన్నటి దినమున మీరు రెండుగా ,
నేటి బంధం చేయును ఒకటిగా .

ఆద్యంతము శ్రద్ధను వీడక ,
ఆరంభానికి పునాది వేయిక .

కలలను ఇలలో చూపే వేదిక ,
ఆశల సౌధం కాదా మీదిక .

కళకళలాడే పచ్చని పందిట ,
కల్యాణఘడియలు ఎంతో వేడుక .

హద్దుల కంచెను వేసుకుని ,
మీ చిగురాకు బంధాలకు 
అచిరకాలం కావలిగా ,
జీవితవనమున మాలిలుగా ,

చల్లని సాయంసంధ్యలలో ,
పూయించాలి సుమములు కోకొల్లలు .

సుగంధ పరిమళ పవనాలు ,
మీ భావాలతో బందీలయితే ,

సంతసమన్నది మీ దోసిట ఉన్నది ,
ఆస్వాదించుటే ఆలస్యమన్నది ,

నిత్య వసంతంతో మీ జీవితవనము ,
కావాలి ఆనంద నందన వనము .

*******