Tricks and Tips

Sunday, November 10, 2013

కన్నతల్లి మనసు



నేనొక మహా నగరంలో పుట్టి పెరిగాను .అక్కడే చదువుకున్నాను . 
మాకుటుంబమే నా ప్రపంచం.అందువల్ల ఇతర ప్రాంతాలను నేను 
చూడ్డం కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు . అటువంటి నాకు 
ఒక కుగ్రామంలో టీచర్ జాబ్ వచ్చింది .జాయిన్ అయ్యాను .
అంతా కొత్తగా,వింతగా ఉంది .ఒక రకంగా బాగుంది ,మరో
 రకంగా బాలేదు. నేనో ఇల్లు అద్దెకు తీసుకున్నాను .దాని 
చుట్టుప్రక్కల అంతా ఖాళీ .మా ప్రక్క వీధిలో పందులను పెంచే 
వాళ్ళున్నారు .అవి మా వీధిలోకి తరచుగా  వస్తుండేవి .నాకు
 పందులంటే పరమ అసహ్యం . కానీ ఏం చేస్తాం ?ఆ ఇల్లు
 సౌకర్యంగా అన్ని విధాలా చాలా బాగుంది . అందుకే అక్కడే 
ఉన్నాను . 

వేసవి మొదలై ఒంటిపూట బడికి వెళ్లి వస్తున్నా. ఓ రోజున 
నిప్పులు చెరిగే ఎండలో మధ్యాహ్నం ఇంటికి వచ్చాను . మొహం 
కడుక్కుని తుడుచుకుంటుంటే ,మా గోడవతల బుసలు కొడుతున్న 
శబ్ధం వచ్చేసరికి మెల్లగా చిన్న స్టూల్ ఎక్కి గోడవతల చూస్తే ఒక 
పెద్ద పంది .గోడ ప్రక్కనున్న పిచ్చిమొక్కల్ని పీకేస్తోంది గబగబా .  
నే ఎండను మరచి అలానే చూస్తున్నాను .లేత మొక్కల్ని ఏరిమరీ
వేళ్ళతో పీకి ,మట్టి రాల్చి ఒత్తుగా పక్కలాగా ఒక వరుస క్రమంలో 
సర్దుతూ మెత్తని పరుపులాగా చేసేసి ,నొక్కి చూసి మరలా కొన్ని 
మొక్కలు తెచ్చి ఇంకా ఒత్తుగా పేర్చింది . ఈ పనంతా ఎంతో 
వేగంగా ,అలుపులేకుండా బుసలు కొడుతూ చేసుకు పోతోంది . 
అప్పుడు నాకనుమానం వచ్చింది . అది పిల్లల్ని కనబోతుందేమో
అని . పంది వంక చూశాను .అది చాలా భారంగా ఉంది . అయినా 
ఎంతో వేగంగా పనులు చేస్తోంది .మొత్తానికి గోడ వైపు వదిలి 
అర్ధచంద్రాకారంలో చుట్టూ పెద్ద మొక్కలు ఉంచి లోపల స్థావరం
సౌకర్యంగా ఏర్పాటు చేసుకుంది .కేవలం ఒక పంది అంత ఆరాటంగా
ఆ ప్రాంతం అంతా మనుషులు శుభ్రం చేసినట్లు శుభ్రం చేయడం ,
మొక్కలు పీకేటప్పుడు కూడా లేతవి ఎంచుకోవడం, పరుపులా 
చేయడం నన్ను ఎంతో సంభ్రమాశ్చర్యాలకులోను చేసింది . తాను 
చేసింది బాగుందా ,లేదా ..అన్నట్లు కొంచెం అటూ ,ఇటూ ఇంకా 
సర్దుతోంది .మామూలుగా అయితే దాన్ని నేను తోలేసేదాన్ని.కానీ 
ఇప్పుడు అది చేసే పనిని కన్నార్పకుండా చూస్తున్నాను . 
అసహ్యం మరచి పోయాను . ఎండ బాగా మండడమే కాక ,ఆకలి
 కూడా మండే సరికి నిదానంగా స్టూలు దిగి లోనికెళ్ళి భోంచేసి, 
ఆలోచిస్తూ నిద్ర పోయాను .

సాయంత్రం లేచిన తర్వాత గబగబా వెళ్లి గోడెక్కి చూశాను.పంది 
ఇంకా అలా ఆరాటపడుతూనే ఉంది .రాత్రి పడుకునే ముందు 
కూడా చూశాను .ఆ మెత్తటి పక్కపై పడుకుని తెగ బాధ 
పడుతోంది.తీవ్రంగా బుసలు కొడుతోంది . దానికి నొప్పులు వస్తున్నాయనుకుంట ,అంతే నా మనసంతా ఎంతో బాధగా 
అనిపించింది .ఇటువంటి దృశ్యం నేను ఎన్నడూ చూడనందున
 నా కళ్ళల్లోఅదే దృశ్యం,అదే ఆలోచన .అది జంతువైనా దానికి 
పిల్లలు కలిగే సమయం ఆసన్నమైందని తెలిసి ,పుట్టబోయే తన 
పిల్లలకు ఒంటరిగా ఎంత సౌకర్యం కలుగచేసింది .దానికి ఎంత 
జ్ఞానం ఉందీ ... అనిపించింది . 

ఒక్కసారిగా నాకు అమ్మ గుర్తొచ్చి ఫోన్ చేసి అంతా చెబితే
ఆడ జన్మ అంటే అంతేనమ్మా !అంది .అమ్మ ప్రేమ కళ్ల ముందు
 కనిపించింది .అంతే కదా ! ఏ జీవిలో అయినా ఒక తల్లి 
మనసు ఉంటుంది కదా !అనిపించింది . కన్నతల్లి మనసును 
 మించినది ఏముంది ....అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను . 

తెల్లవారింది .తలుపు తీయగానే ఒక రకమైన వాసన . గోడెక్కి 
చూశా,పంది అలసిపోయి పడుకుని ఉంది .దాని ప్రక్కన                              
 ఎనిమిది ఎర్రని చిన్నపిల్ల లున్నాయి . అవన్నీ పాలు                                  
తాగుతుంటే అది నెమ్మదిగా కదులుతోంది .                                              
అంతే నాకు పందంటే అసహ్యం పోయింది .అది కూడా మన            
వలే ఒక జీవి అనిపించి ముఖం చిట్లించకుండామామూలుగా                        
  చూస్తున్నా .మరో పదిరోజుల పాటు దాని పిల్లల్ని ఇతర                              
 జంతువుల బారి నుండి ఎలా రక్షిస్తుందో చూడడం, అవన్నీ                         ఆటలాడుకోవడం, తల్లిమీదకెక్కి ఆడడం ,చూస్తూ ఉంటే                                                                                                                                            
      ప్రకృతిలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నప్పటికీ  
         " కన్న తల్లి  మనసు " మించి ఏదీ గొప్పది 
కాదనిపించింది . మరి మీరేమంటారు  . ........
 
*********


2 comments: