మంచి గంధం - మరు మల్లెలు
సన్న జాజులు - విర జాజులు
ముద్ద బంతులు - చేమంతులు
గులాబీలు - పారిజాతాలు
తొలకరి జల్లుల తరుణాన - భూమాత పులకరింతలతో
విరిసే మృత్తికా పరిమళాల గుబాళింపులు
ఆప మనతరమా ? ఆపతరమా ?
రవిరాజు తీక్షణ కిరణాలు
రేరాజు చల్లని కిరణాలు
వానజల్లుల వాలుతనము
వెండిమబ్బుల తెల్లదనము
సెలయేరుల గలగలలు
ఆప మనతరమా ? ఆపతరమా ?
చిరుతలోని చురుకుదనము
లేడికూన బేలతనము
చిన్ని కుందేలు చిలిపిదనము
మృగరాజు గాంభీర్యము
హయములోని సామర్ధ్యము
ఆప మనతరమా ? ఆపతరమా ?
చిలుకమ్మల ముద్దు పలుకులు
కోయిలమ్మల కుహుకుహులు
నెమలి నాట్య భంగిమలు
పరిగి పిట్ట పరుగులు
పిచుకమ్మల కిచకిచలు
ఆప మనతరమా ? ఆపతరమా ?
వర్ష ఋతువున కురియు వానలు
గ్రీష్మాన మండుటెండలు
శీతలాన చలి గాలులు
శిశిరాన ఆకు రాలుట
వసంతాన చిగురులేయుట
ఆప మనతరమా ? ఆపతరమా ?
చింతలోని పులుపు
వేపలోని చేదు
మిరపలోని ఘాటు
పుచ్చకాయలోని తీయదనం
మకరందంలోని మాధుర్యం
ఆప మనతరమా ? ఆపతరమా ?
ప్రకృతి తల్లి పిల్లలు పల్లెలు
పల్లెపడచుల వన్నెల చిన్నెలు
పంటచేనుల వయ్యారాలు
తాతామనుమల అనురాగాలు
బామ్మ మాటలో మమకారాలు
ఆప మనతరమా ? ఆపతరమా ?
ప్రకృతి ఇచ్చిన సహజ శక్తిని అనుసరించినవి
అట్లే
ప్రకృతి వ్యక్తికిచ్చిన సహజ శక్తిని అనుసరించిన
వారి జన్మ చరితార్ధం కాదా ?
నేడు భారతీయులందరి మనసులో
సుస్థిర స్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి
" సచిన్ " ప్రకృతి ఇచ్చిన సహజ శక్తిని
అనుసరించినాడు కనుకనే అతనిలోని ప్రతిభ
ఆప మనతరమా ? ఆపతరమా ?
ఎంత ప్రయత్నించినా సుమసుగంధాల
పరిమళాల వలే దాగనిది ,దాచలేనిది .
ఎందువల్లనంటే అది ప్రకృతి సిద్ధమైనది .
ప్రకృతి వరం ,అతనో ప్రకృతి వర రత్నం .
మన భారత రత్నం !
" సచిన్ " ఆలోచనలు సుమసుగంధాలు
ఆశయాలు తొలకరి జల్లులు
లక్ష్య సాధన సాగరమధనం
పలుకులు తేనె చినుకులు
ఆచరణలో చురుకుదనం
వల్ల కదా ! " సచిన్ "
జన్మ చరితార్ధం ,
భారతరత్నంలోని ప్రతిభకు శిరస్సు వంచి
నమస్కరిస్తూ ,నా ఈ చిరుకవితకు
ప్రేరణ అతనిలోని ప్రతిభే అని
నిర్ధ్వందంగా తెలియపరచుకుంటూ .....
జైహోసచిన్
********
puvvu puttagaane parimalistumdi kadaa .....so nice.
ReplyDelete100% right. Thank you.
Delete