Tricks and Tips

Thursday, November 28, 2013

నాకై పాడిన నీ పాటలో ( నీ నవ్వు చెప్పింది నాతో )


  ( కొన్ని  పాటలు వింటుంటే ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది . 
అలా అనిపించిన పాటల్లో  "  అంతం   "  సినిమాలోని 
"  నీ నవ్వు చెప్పింది నాతో  " ఒకటి . 
అందుకే మరికొన్ని చరణాలు . )

నాకై పాడిన నీ పాటలో -  చదివాను నీ మనసుని
నాతో పలికిన నీ మాటలో - విన్నాను నీ ప్రేమని 
పలికేందుకే ఒకరు లేని -బతుకెంత బరువోఅని
      పిలిచేందుకే వీలులేని - స్థితి ఎంత జాలో అని  ll నీ ll

   చల్లని నీ కరకమలాలలో - నా తనువు కరిగించనీ 
   వెన్నెల తోడై పులకించనీ - నడిరేయి పొడిగించనీ        నామనసులోని భావం - నీకర్ధమవుతుందనీ 
నీ ముద్దు నా జీవితాన - తొలి పొద్దు అవుతుందనీ  ll నీ  ll

 చల్లని గాలే నను తాకనీ - హృదయాన్ని కదిలించనీ 
నల్లని నీ కనుపాపలలో - నా నీడ కనుపించనీ 
ఏ నాటికీ మరువలేని - మమకారమౌతావనీ
   నీ భావ కుసుమాలతో - నను బందీని చేస్తావని   ll నీ  ll

నాలో నిండిన నీ తలపులే - గంధాలు వెదజల్లని 
మల్లెల వానే కురిపించని - ప్రణయాన్ని పండించని 
ఏ వేళకి మరచిపోని - అల్లర్లు చేస్తావని 
నీ అలక నా జీవితాన్ని - పులకింపచేస్తుందని  llనీ ll 

నన్నే పిలిచే అధరాలనే - ప్రియమార ముద్దాడనీ 
తీయని నీ తొలివలపులలో - నను మరచిపోవాలని 
గువ్వల్లె నీ గుండెలోన - నను చేరి నిదురించని   
నీ గుండె చప్పుళ్ళు వింటూ- ప్రతి రేయి గడపాలని  llనీ ll

నాలో నిండిన ఈ మౌనమే - ఎద వీడి పోవాలని 
నీతో గడిపిన ఆ రోజులే - కలకాలముండాలని 
ఏడేడు జన్మాలలోను - కలనైన విడిపోవని 
     నీ రాక నా జీవితాన - నవజీవ మిస్తుందని  ll నీ  ll

ఏనాడైతే ఈ జీవితం - నీ కొరకు తపియించెనో 
నీవు ,నేను చెరి సగమనే - బంధాన్ని ముడివేయునో 
చిరుగాలి సన్నాయి పాడి - శుభవేళ   సూచించని 
మనువే మన జీవితాన - మధుమాసమౌతుందనీ  ll నీ ll

 *********


2 comments: