Tricks and Tips

Thursday, June 16, 2022

ఓర్పు.... నేర్పు

 









చీడపీడల సమాజాన్ని 

చిత్తరువోలే చూడొద్దు..


వెదుకకు ఏ భుజముల కొరకు

తాత్కాలికమేగా ఓదార్పు...


కడ ఊపిరి నీవు విడిచే వరకూ 

విడువకుమా నిట్టూర్పు...


రేపటి తరాల తలరాతల కొరకు 

వదలకుమా నీ ఓర్పు...


నీ తొలి అడుగును వేసే వరకూ

జరుగదుగా ఏ మార్పు...


కూకటి వేళ్ళతో కుళ్ళు పెకలించే వరకూ

సడలించకుమా నీ నేర్పు...  


ఓర్పు నేర్పుల కలయిక మార్పు

శాశ్వతమవదా ఈ తీర్పు...  


                  *********

 

Sunday, December 5, 2021

ప్రకృతి - మనిషి

 ప్రకృతి మనిషిలోకి ప్రవేశించిన 

మార్పు మల్లెల పరిమళమే 


మనిషి ప్రకృతిలోకి ప్రవేశించిన 

మార్పు మారణహోమమే....

మారును తప్పక లోకం తీరు.....

 ఆత్మసాక్షిని మించినదెవ్వరు 

తప్పు, ఒప్పు తెలుసుకు తీరు 


తప్పును తప్పక ఒప్పుకు తీరు 

క్షమాపణలు చెప్పుకు తీరు 


మనోవేదన తప్పక తీరు 

మారును తప్పక లోకం తీరు.....

బమ్మెర పోతన

 కలముతొ, హలముతొ

సమముగ నడిచి 


పండిత, పామరుల 

తగు మెప్పించి 


భాగవతమును మనకందించిన

బమ్మెర పోతన చిరస్మరణీయుడు....

కలాలు - హలాలు

 కలాలనే హలాలు చేసి

కాగితాలపై సేద్యం చేసి 


అక్షరాలనే విత్తులు చల్లి

ఆశయాలనే మొలకలు పెంచి


చైతన్యమనే ఎరువును వేసి

విలువలు విరివిగ పెంచే కవులకు


సిరా ఇంకని కలాలనివ్వాలని 

చిరకాలంగా నే కన్న కలలు 


అచిరకాలం నిలిచి ఉండాలని

కల్లలుగాక నిజమవ్వాలని.....



అక్షర సైన్యం

 అక్షర సైనికులొకటై కదిలి

పదాలు రక్షక దళాలుగా

వాక్యాలన్నీ సైన్యంగా 

సిరా శరాఘాతాలతో 

కాగిత రణరంగంలో

కలం కదనం చేసింది

కవితకు ప్రాణం పోసింది.....

నమ్మకం

 నమ్మకాల నడక

జీవితాన్ని నందనవనం 

చేస్తుందనే ఆశిద్దాం.....