Tricks and Tips

Wednesday, October 30, 2013

ఆమె సుకుమారమైనది

నిన్న కూడా నాతో తిరిగిన నా స్నేహితురాలు చనిపోయిందనే వార్తతో కుప్పకూలిపోయాను . ఆమె గూర్చిన ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి . ఆమె ఎంతో  సుకుమారమైనది . కొంచెం చలికి ,చిన్న ఎండకి, చిరు జల్లులకు కూడా తట్టుకోలేక పోయేది . పొయ్యి సెగను భరించలేదు ,చాపపై పడుకోలేదు ,నేలపై పడుకోలేదు ,బురద అంటే చిరాకు ,మురికి అంటే అసహ్యం . రకరకాలుగా  అలంకరించుకోవడమంటే ఇష్టం ,రంగురంగుల దుస్తులు, చెరగని చిరునవ్వులుతో కళకళలాడే ముఖం గుర్తొచ్చి ఒక్క ఉదుటున లేచి వాళ్ళింటికి వెళ్ళాను . ఆమెను ఫ్రీజర్ బాక్స్ లో పెట్టారు . గంట తర్వాత బయటకు తీసి రోడ్డు మీద మురికికాల్వ ప్రక్కన ఎర్రటి ఎండలో పెట్టి చన్నీటితో స్నానం చేయించారు . అంతా బురద , అక్కడే కర్రలతో కట్టిన పాడె పైన చాప పరిచి దానిపై ఆమెను పడుకోపెట్టి చాపను చుట్టారు . తెల్లని గుడ్డను కప్పి తీసుకువెళ్ళారు . చితికి నిప్పంటించారు . ఇంత జరుగుతున్నా ఆ ముఖంలో ప్రశాంతత ఏమాత్రం చెక్కు చెదరలేదు . జీవం ఉన్నప్పుడు అన్నీ తనకి ఇష్టమయిన పనులే చేసుకున్నప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా లేదు . నిన్నటికి ఈ రోజుకి ఉన్న చిన్న తేడా ,అప్పుడు జీవుడు లోపల ... ఇప్పుడు బయట....  అంతే కదా జీవితం అనుకుంటూ ఇంటికి బయలుదేరాను బరువెక్కిన గుండెతో .

********

Monday, October 28, 2013

చిన్న పిల్లలకు అంకెలతో కధ

అది ఒక పల్లె . ఆ పల్లెలో బడి ఒకటి ఉంది . ఆ బడికి రెండు గదులు ఉన్నాయి . ఆ బడిలో మూడు కుర్చీలు ,నాలుగు బోర్డులు ఉన్నాయి . బడిలోని ఉపాధ్యాయుల సంఖ్య ఐదు . వీరంతా సోమవారం నుండి శనివారం వరకు ఆరు రోజుల పాటు పిల్లలకు పాఠాలు ,ఆటపాటలు చెప్తారు . వేసవికాలం మొదలవగానే ఒంటిపూట బడిని ఏడు గంటలకు తీస్తారు . ఒకటవ తరగతి పిల్లలు ఏడుస్తూ, ఎనిమిది గంటలకు వస్తారు . బడిలో తొమ్మిది రకాల కూరగాయముక్కలతో  సాంబారు కాస్తారు . పిల్లలు జట్టుకు పది మంది చొప్పున కూర్చొని భోజనం చేస్తారు .

*******

Friday, October 25, 2013

ఎందుకో .....! (1)


చిల్లరదొంగలను అల్లరి చేస్తూ 
ఫోటోలు ఉంచుతారు కూడళ్ళలో ,
కరడుగట్టిన నేరస్తులను చిల్లుల కవరుతో 
కవరు చేస్తారు ఎందుకో .......!

******


 పట్టెడన్నం తినే తీరిక లేనప్పుడు 
కోట్లు కూడబెట్టడం ఎందుకో .......!


******


ఊబకాయం వస్తుందని తెలిసికూడా 
ఊసుపోక బర్గర్లు తినడం ఎందుకో .....!


******


Wednesday, October 23, 2013

అన్నీ...... అవే..... కానీ.......వేరు


            స్టేట్స్ లో స్థిరపడిన నేను ఇండియా వచ్చాను. సుమారుగా రెండున్నర దశాబ్దాల తర్వాత అనుకోకుండా నే చదివిన కాలేజీ ముందు నుండి వెళ్తుండగా ఎన్నో జ్ఞాపకాలు..... నన్ను కారుని ముందుకు పోనీయలేదు. నిదానంగా కారు దిగాను. కాలేజీలోకి అడుగుపెట్టాను. అంతే ఓ రకమైన మధురానుభూతితో మనస్సు, శరీరం పులకరించాయి. నిదానంగా చూస్తూ నడుస్తున్నా అటూ, ఇటూ. నా గుండె స్పందన నాకు వినిపిస్తోంది. అదే కాలేజి కానీ బిల్డింగులను ఆధునీకరించారు. అవే తరగతులు కానీ విద్యార్ధులు వేరు. అవే సబ్జెక్ట్స్ కానీ లెక్చరర్లు వేరు. అదే తోట కానీ మొక్కలు వేరు. అదే గ్రౌండ్ కానీ ఆటగాళ్ళు వేరు. అవే గట్లు కానీ కూర్చున్న వాళ్ళు వేరు. అదే క్యాంటీన్ కానీ ఐటమ్స్ వేరు. అవే కబుర్లు కానీ ఫ్రెండ్స్ వేరు. అవే అల్లర్లు కానీ చేసేవారు వేరు. అవే ఎదురుచూపులు కానీ ఆ అమ్మాయి వేరు. అదే లైబ్రరీ కానీ చదువుకుంటున్న వాళ్ళు వేరు. అదే బస్టాప్ కానీ నిలబడిన వారు వేరు. జ్ఞాపకాల్లో కూరుకుపోయిన నేను  ఫోన్ మోగేసరికి ఇలలోకి వచ్చాను. చూస్తే బాబాయి.  వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టి వెనక్కి వెనక్కి చూస్తూ వదల్లేక, తప్పక కన్నీటి పొరతో కారెక్కి ఇంటికెళ్ళాను.
           బాబాయితో మాట్లాడి భోజనం ఐన తర్వాత బీరువా తీసి ఫోటో ఆల్బం తీసాను. నా కాలేజి రోజుల్లో దిగినవి. అవును నావే ఫోటోలు కానీ వేరుగా ఉన్నాయి. అప్పుడు సన్నగా, చలాకీగా,గలగల నవ్వుతో, ఒత్తైన జుట్టుతో అవును.....  చిన్నగా నవ్వుకుంటూ అద్దంలో చూసుకున్నా
అన్నీ......  అవే.......  కానీ.......  వేరు.
                                     **********

Monday, October 21, 2013

ఆహా! ఆ "హ" ఆహా!

రిచందన పరిమళము 
హాయిని గొలుపుచుండగా 
హిమబిందువులు దర్భలపై
హీరముల వలె ప్రకాశించుచుండగా
హుకుం జారీ చేస్తూ సూర్యుడు
హుందాగా పయనిస్తూండగా  
హృద్యంగా వీణానాదం
హెచ్చు స్థాయిలో వినిపిస్తూండగా  
హేమాహేమీలు రణరంగంలో
హైరానాగా యుద్ధం చేయగా
హొయలొలికిస్తూ హయముల జంటలు
హోరుగా డెక్కల శబ్దం చేయుచుండగా
హౌదా లో గెలిచిన రాజు 
హంగులతో ఊరేగుతూ వచ్చెను చూడు. 
                      *******    

Saturday, October 19, 2013

పవిత్రం "ప" గుణింతం



రమ పవిత్రమైన శ్రీరామ 
పాదుకల మహిమను 
పిన్నవాడైన భరతుడెరిగి 
పీఠం పై వాటినుంచి 
పువ్వులతో అలంకరించి 
పూజ్యభావముతో పులకరించి 
పృథ్విలో నెల్లరికి ఆదర్శమయ్యె 
పెను సంకటముల గెల్వ అన్నగారి 
పేరు హృదయాన ఆసాంతముంచి 
పైడి మనస్సుకు ప్రతీకగా 
ప్రొద్దు పొడిచినప్పటి నుండి కృంగె వరకు దాసుని పాత్ర 
పోషించిన ఉత్తమోత్తమమైన 
పౌరునిగా భరత ఖండంలో కెల్ల 
పంకం లోని తామరలా స్వచ్ఛమైన వాడయ్యె
                     *******

Tuesday, October 15, 2013

English Alphabets తో కథ


                       Aలూరు లో నేను Bరువా కొన్నాను. దానికి Coగిల్  డోరు మాత్రమే ఉంది. దానిలో నా Dగ్రీ పట్టాలు మా Eద్దరి బట్టలు సర్దాము. మా ప్రక్కనున్న Fబ్లాకు లోనికి మారాం.నా పేరు Gడ్డు రామ్ముర్తి. నాకు HMT షోరూం ఉంది. నేను చాలా ఆస్తిపరుడిని. Iనా సోమరిగా ఉండక రోజూ ఉదయాన్నే లేచి గుళ్ళో Jగంట మ్రోగేసరికి లేచి స్విమ్మింగ్ పూల్ లో Kరింతలు కొడుతూ Lకిలా Mత సేపైనా ఈత కొడుతుంటాను. Nడ వచ్చాక ఈత ఆపి Oకసారి సూర్యనమస్కారం చేసి పనులు ప్రారంబిస్తాను. నా Pల్లలతో కలిసి పూరీ తిని ఆఫీసుకు వెళ్లాను. నిన్న సాయంత్రం ఖాళీగా ఉన్న ట్రే ఉదయానికల్లా కొన్ని ఫైల్సు తో ఆQపై చేయబడి ఉంది. అందులో పై దానిలో వర్కర్ల సొంత Rజితమైన ఆస్తిని గూర్చిన సమాచారం సేకరించాలి. వెంటనే బెల్లు నొక్కాను. అటెండరు SR అంటూ వచ్చాడు. ముందుగా నాకో T తెచ్చిచ్చి ఆపై సమాచారం సేకరించమన్నాను. అంతే అటెండరు ఒక్కసారిగా రయ్యిమంటూ Uద్దానికి వెళ్ళే Vరుడిలా వెళ్ళాడు. అక్కడ స్టాఫంతా కూర్చొని  W.W.F చూస్తున్నారు Xరే కళ్ళతో. అటెండరు ప్రశ్నలకు ఒకరూ సమాధానం ఇవ్వకపోయేసరికి అతనికి ఒళ్ళు మండి టి.వి. Yరు పీకేసి సమాధానాలు వారినుండి రాబట్టి Z మ్యూజిక్ చానల్ పెట్టి సమాచారంతో నా వద్దకు వచ్చాడు. 
*************

Saturday, October 12, 2013

శ్రీ జగన్మాతా నమోస్తుతే


స్వర్ణకవచాలంకృతే - అసుర సంహారిణి
శ్రీ కనకదుర్గాంబికా మాతా నమోస్తుతే


మహిమాన్వితం - శ్రీ బాలామంత్రం
శ్రీ బాలాత్రిపురసుందరీ మాతా నమోస్తుతే 


వాక్బుధ్ధి ప్రదాతా - వేదమాత
శ్రీ గాయత్రీ మాతా నమోస్తుతే


నిత్యాన్నదానేశ్వరీ - నిటాలాక్ష ప్రాణేశ్వరి 
శ్రీ అన్నపూర్ణా మాతా నమోస్తుతే



అష్టైశ్వర్యా ప్రదాతా - ఆది పరాశక్తి
శ్రీ మహాలక్ష్మీ మాతా నమోస్తుతే


సకలవిద్యా ప్రదాతా - సర్వ జ్ఞానేశ్వరి
శ్రీ సరస్వతీ మాతా నమోస్తుతే



శ్రీచక్ర అధిష్టాన శక్తి - పరమ శాంత స్వరూపిణి
శ్రీ లలితా త్రిపురసుందరీ మాతా నమోస్తుతే


అనంత శక్తి దాయిని - నిరంతర ఉగ్రరూపిణి
శ్రీ దుర్గామాతా నమోస్తుతే


దివ్యతేజోమయి - త్రిశూల ధారిణి
శ్రీ మహిషాసుర మర్ధినీమాతా నమోస్తుతే



శ్రీ అపరాజితాదేవి - అభయప్రదాయిని
శ్రీ రాజరాజేశ్వరీమాతా నమోస్తుతే
ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని
మోహనాశిని, మోక్షప్రదాయిని శ్రీ జగన్మాతా నమోస్తుతే.
*********
బ్లాగ్మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు 

Saturday, October 5, 2013

గమకముల " గ "

మకములతో సుస్వరాలు
గానం చేయగా
గిరులు సైతం కరిగిపోగా లేనిది
గీతాలాపనలో లీనమైతే
గుప్పెడంత గుండెలోన
గూడు కట్టిన వ్యథలు కరిగి
గృహము స్వర్గధామమవదా
గెలుపు నీదే కావాలంటే
గేయాలనే, గాయాలకు మైపూతగ
గైకొనగా జీవితమే అమృతమవదా
గొల్లభామ పాటల్లో 
గోవింద నామాల్లో
గౌరీశంకర స్తోత్రముతో
గంగ అంత పవిత్రమవదా జీవనయానం.
                **********

Thursday, October 3, 2013

భాషా ప్రయుక్త రాష్ట్రం (గాంధీ పుట్టిన దేశం)

భాషా ప్రయుక్త రాష్ట్రం
బహుయాసల ఊసుల తోరం
ఇది ఎల్లలు ఎరుగని ఆదర్శం
అందరమొకటిగ కలిసుందాం ,అంతరాలను తరిమేద్దాం
అపోహలన్నీ తొలగిద్దాం ,అందరి సమ్మతితో ఉందాం. 
సమ్మెలనన్ని విడచి ,సమభావనతో నడచి
తెలుగువారిగా మెలగాలి ,ఏనాడు జాతిని నిలపాలి !
తల్లీ !ఈ సద్భావననే మాకివ్వు
సహృదయత  చాటే వరమివ్వు
               సహృదయత  చాటే వరమివ్వు    ll భాషా ll
                                                   ll అందరు ll
ప్రజలలొ ఐక్యతభావం ,కలిగించే మాటలె వేదం
 విభజన
భావం విడనాడి, ఏ రోజు వచ్చునో అది మనది
తల్లీ ! ఈ ఆశయసాధన మాకివ్వు
                     ఆ లక్ష్యం చేరే వరమివ్వు     ll భాషా ll      
                                                 ll అందరు ll
*********

Tuesday, October 1, 2013

సాగవోయి సమైక్యాంధ్రుడా!

సాగవోయి సమైక్యాంధ్రుడా! కదలి సాగవోయి పోరుబాటలో......
నేడే శుభోదయం ఆంధ్రుల మనోబలం -నేడే మహోద్యమం నేడే గళోద్యమం
సమైక్యాంధ్ర కోసమని శిబిరాలేసి- నిరాహారదీక్షలోనె
 ఓ .. ఉపాధ్యాయుడొరిగిపోయే
ఉద్యమాలకు ఊపిరిపోసి -ఒకేమాట ఒకేబాట సాగాలోయీ
ఆగకోయి సమైక్యాంధ్రుడా !కదలిసాగవోయి
సమరపోరులో    ll సా ll
ఆగ్రహాలు మిన్నంటే R.T.Cఒకవైపు -అలుపెరగని సమ్మెతో N.G.O లింకొకవైపు
ప్రతిక్షణం పోరాటం కొనసాగుతూనే ఉంది -తుదివిజయం మనవిజయం ఘనవిజయమెలె
కదంత్రొక్కు సమైక్యాంధ్రుడా !ప్రగతిపధం వైపు ఉద్యమాంధ్రుడా !    ll సా ll
పనులు ,ఉద్యోగాలు మానేసినజనాల -భావావేశాలు రోడ్డెక్కె నేడు
పరిపాలన ఎటు చూసిన స్తంభించెను చూడు -ఆంధ్రమాత కంటివెంట రక్తకన్నీరు
ఆగదోయి సమైక్యుద్యమం -చెలరేగునోయి
ఆద్యంతమూ...  ll సా ll
సమైక్యాంధ్ర సాధించుటె మన ధ్యేయం -అమరజీవి ఆశయాలే మన లక్ష్యం
ఏకతాటిపై ఆంధ్రులు నడచిననాడే -అమరజీవికి మన ఆంధ్రదేశం
వినిపించునులే ఐక్యతరాగం -సాగవోయి సమైక్యాంధ్రుడా!!
********