Tricks and Tips

Saturday, May 31, 2014

"అమ్మా"......ఆచంద్రతారార్కం _/\_

(మా అమ్మ )
అవనిలో నాకై వెలసిన అలుపెరగని "అమ్మా".....
నీ అనుపమానమైన రూపం ఆద్యంతమూ నా మనసున నిండగ ,
నీ అవిరామ ఆదరణ నాకు జీవముకాగ ,
నీ అమూల్యమైన సేవలు నాకు ఎన్నటికీ ఆచరణీయము కదా ,
నీ అనురాగ లాలిజోలలు నాకు ఆహ్లాదములుకాగ ,
 

నీ అహోరాత్రులు నా ఆశల ఆలోచనలకేగదా ,
నీ అమృతతుల్యమైన గోరుముద్దలే నా ఆస్వాదనలో ఆదిపర్వంగా ,
నీ అంతరాళలోని ఆర్తి నాకు అపారముకాగ ,
నీ అసాధారణ బంధమే నీ బిడ్డల ఆశాబంధంకాగ ,
నీ అనిర్వచనీయమైన ఆలింగనం నా ఆవేదనను తీర్చగ ,
 

నీ అద్వితీయమైన అనురాగం నాకు ఆరాధ్యంకాగ ,
నీ అచంచలమైన విశ్వాసం నా ఆశయాలకు ఊపిరికాగా,
నీ అక్కున చేర్చుకునే బాంధవ్యమే నా అస్వస్థతను దూరం చేయగా,
నీ అపురూపమైన వాక్కులు నాకు ఆత్మీయతను నేర్పగా,
నీ అనుభవాల అంతర్వాహిని ఆసాంతం నాతో వెంటరాగా ,
 

నీ అరమరికలులేని ఆప్యాయతలు ఆ దేవుని ప్రతిరూపం చూపగా,
నీ అమితమైన కరుణాహృదయం నా ఆరాధనకు బీజమవ్వగా ,
నీ అనంతమైన జీవన లీలలు నా జీవిత ఆదర్శగ్రంధంకాదా ,
నీ అంబరమంత ప్రేమకు నా అంతరాత్మ సాక్షికాగా ,
నీ అజేయమైన మాట నాకు ఆశీర్వచన బలముకాగా ,
 

"అమ్మా" అన్న పిలుపే అజరామరంకాదా ఆచంద్రతారార్కం ,
నా 
యువుకు నీ ఆయువును అడ్డం వేసే అమ్మవుకదా ,

"అమ్మా" ఏడేడు జన్మలకు నాకు
నీవే అమ్మవు కావాలి ,
నా అమ్మవు నీవే కావాలి ...
వద్దమ్మా ! వద్దు , నా స్వార్ధం తెలుసుకున్నాను ,
నీ త్యాగం మరువకున్నాను .

"అమ్మ"ఓ అనన్య సామాన్య సృష్టి ,
"అమ్మ"ఓ మధురమైన భావన ,
"అమ్మ"ఓ అంతులేని దేవుని దీవెన ,
"అమ్మ"ఓ అక్షయ అనుభూతి ,

అమ్మా ! నీ ఋణం తీర్చుకొనగ ఒక అవకాశం కొరకు
ముకుళిత హస్తములతో ఆ దేవుని నేను వేడెదనమ్మా ,
మరుజన్మకు నీకు అమ్మగా , భువిపై నేను వెలిసెదనమ్మా ,
"అమ్మా" అన్న పిలుపుకు నే ఊపిరిపోసి ,
నీ సేవలో నేను తరియించెదనమ్మా    _/\_ 

****************

Thursday, May 29, 2014

నీవు , రామ్మా చిలకమ్మా...............

పచ్చని చిలకమ్మా ,
నా నేస్తం నీవమ్మా ,
నీ పచ్చని రంగు కొంచెం తీసి ,
ప్రకృతికివ్వమ్మా ..........

కిలకిల చిలకమ్మా ,
నా దరికి రావమ్మా ,
చిన్ని చిన్ని మాటలు నీకు ,
నేర్పిస్తానమ్మా .........

చిట్టి చిలకమ్మా ,
నాకిష్టం నీవమ్మా ,
చెట్టు మీది పండ్లన్నీ ,
నీవే తినకమ్మా .........

రామచిలకమ్మా ,
నీవు , రామ్మా చిలకమ్మా ,
తియ్యని పండు తీసుకొచ్చి ,
సాహిల్ కివ్వమ్మా ..........

చక్కని చిలకమ్మా ,
నువ్వు హాయిగ ఎగురమ్మా ,
ఆకాశంలో ఎగురుతు నీవు ,
హాయిగ ఉండమ్మా............
 
******

సాంప్రదాయం.....ఓ జీవనది

                                                     (ఈ చిత్రం జానీపాషాగారిది)
                                                            ఇది నా 200వ రచన

సాంప్రదాయం.....ఓ  జీవనది
        
              నాగరాజు,మల్లీశ్వరి భార్యాభర్తలు.వారికి జయ,విజయలు కవల పిల్లలు.పిల్లలిద్దరి అభిప్రాయాలు,అభిరుచులు ఒక్కలానే ఉండేసరికి తల్లిదండ్రులు వారికి అదే భావాలు కలిగిన కవల సోదరులైన ఆదికేశవరావు, ఆదినారాయణలకిచ్చి వివాహం జరిపించారు.అది మొదలు వారి రెండు కుటుంబాలు ఒకే ఇంటిలో జీవించసాగారు. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లులా ఉండేది వారి కుటుంబం.
       
           జయమ్మకు ఇద్దరు మగపిల్లలు,ఒక ఆడపిల్ల సంతానం కాగా విజయమ్మకు ఇద్దరు ఆడపిల్లలు,ఒక మగపిల్లాడు సంతానంగా కలిగారు. వారిలానే వారి పిల్లలు కూడా ఆచారవ్యవహారాలను పాటించడం , కలసిమెలసి జీవించడం ఎందరికో మింగుడు పడేది కాదు.పిల్లలంతా బాగా చదువుకున్నారు.ఒకరి వెంట ఒకరు అందరికి వివాహమై అమెరికాలో స్థిరపడిపోయారు అందరూ.తల్లిదండ్రులను తమతో రమ్మని వారంతా బ్రతిమాలినా సున్నితంగా తిరస్కరించేవారు.
       
                 అమెరికాలో కూడా వారంతా కలసిమెలసి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడంతో వారి గూర్చి తల్లిదండ్రులకు ఏమాత్రం బాధ ఉండేది కాదు.కొడుకులకు,కూతుళ్ళకు మొత్తం మీద పధ్నాలుగు మంది సంతానం.వారి ఆలనాపాలనా కూడా అమెరికాలోనే జరిగిపోయింది. అయినప్పటికీ పిల్లలు అమ్మమ్మా,నానమ్మా అంటూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు.
       
       ఆరోజు జయమ్మవిజయమ్మగారింట్లో సందడి సందడిగా ఉంది.కారణం జయమ్మగారి పెద్ద మనవడి పెళ్ళి.అందరూ అమెరికా వెళ్ళిపోయాక , ఒకేసారి అందరూ ఇండియా రావడం అరుదై పోయింది.ఏదేమైనా అందరికి సెలవు కుదిరే విధంగా చూసుకుని ఈ పెళ్ళికి అందరూ హాజరవ్వాలని చేసిన ప్రయత్నం సఫలమవ్వడం ఓ గొప్ప విశేషం.
      
            జయమ్మగారి పెద్ద మనవడు అమెరికాలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు.అతనికి ఆ అమ్మాయితో నిశ్చితార్ధం అమెరికాలోనే జరిపించేసారు ఆర్భాటం లేకుండా.కాలానుగుణమైన మార్పులను స్వాగతించారే కానీ వారి తల్లిదండ్రులు ఏనాడు వారి నిరాశను వ్యక్తం చేయలేదు.అందుకే ఆ తల్లిదండ్రులంటే ఆపిల్లలకు అంత ప్రేమ. ఏదేమైనా వివాహం మాత్రం ఇండియాలోనే తల్లిదండ్రుల చేతులమీదగా జరిపించాలనుకోవడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అందుకే అంత హడావుడి .
     
      పెళ్ళి పది రోజులు ఉందనగా ఆడపిల్లలు అల్లుళ్ళు,కొడుకులు కోడళ్ళు వచ్చేశారు.అంతే జయవిజయమ్మలు పురమాయించిన పనులన్నీ అక్షరాలా సత్సాంప్రదాయంగా,కన్నులపండుగగా జరిగిపోతున్నాయి.ఇల్లంతా రంగవల్లులతో,గడపలు పసుపుకుంకుమలతో,గుమ్మాలు
మామిడితోరణాలతో, ఇంటి స్తంభాలు అరటిచెట్లతో, ఇంటిముందు తాటాకు పందిళ్ళతో,ఇల్లంతా పూలమాలలతో సహజ సుందరంగాను,సువాసనలతోను నిండిపోతే తల్లిదండ్రుల మనసు సంతోషంతో నిండిపోయింది.పిల్లలింకా రాలేదేమర్రా?వాళ్ళు కొత్తబట్టలు కొనుక్కోవాలిగదా అంటే,అమ్మా! వాళ్ళకు కావలసినవి వాళ్ళు కొనుక్కుంటారులే ,అని కొడుకులుకూతుళ్ళు అనేసరికి జయవిజయమ్మలు సరే అని ఊరుకున్నారు.
     
        కొడుకులుకోడళ్ళు,కూతుళ్ళూ అల్లుళ్ళు మాత్రం సూర్యనమస్కారాల నుండి సంధ్యావందనం వరకు ప్రతి విషయంలోనూ ఆచారాలను పాటించడం, చూసేవారికి అందరికీ వాళ్ళసలు రెండు దశాబ్ధాలపాటు అమెరికాలో ఉండి వచ్చినవారేనా అన్నంత దిగ్భ్రమ కలిగిస్తోంటే, జయవిజయమ్మలకు మాత్రం వారి పెంపకం పట్ల వారికి అంతకంతకు విశ్వాసం రెట్టింపయ్యింది.
     
           రెండురోజుల్లో పెళ్ళి ఉందనగా మొత్తం మనవళ్ళు,మనవరాళ్ళు ఒక్కసారిగా అమ్మమ్మా,నానమ్మా అంటూ వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టేసరికి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు.వారి సరదా కబుర్లతో  ఇల్లంతా సందడితో నిండిపోయింది.అంతే జయమ్మగారు పిల్లలందరిని కూర్చోపెట్టి దిష్ఠి తీస్తుంటే పిల్లలంతా నవ్వుకున్నారు ముసిముసిగా.అర్ధ రాత్రి వరకు కబుర్లాడుకుని అందరూ పడుకున్నారు.
    
      జయమ్మ ఆదికేశవరావుతోను,విజయమ్మ ఆదినారాయణతోనూ తమ మనవరాళ్ళ వేషధారణ గూర్చి వేదనగా చెప్పుకున్నారు కానీ, పిల్లల సంస్కారానికి సంతోషపడిపోయి వారి ఇష్టాలను పెద్ద మనసుతో సరిపెట్టుకున్నారు.
    
     తెల్లవారింది.పెళ్ళికొడుకును చేసే తంతు ప్రారంభమైంది.ఆధునిక బ్యాండు కాక సన్నాయిమేళం వాళ్ళు వచ్చేసరికి జయవిజయమ్మలు ఆనందంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వచ్చే వారికి  సాంప్రదాయాలతో స్వాగతం పలికారు.పిల్లలు వారి భావాల్లో సాంప్రదాయాల్ని,దుస్తుల్లో ఒకింత ఆధునికతను నింపుకున్నారు.ఆడపిల్లలు ధరించింది కంచిపట్టు వస్త్రాలే అయినప్పటికీ అత్యాధునికతకు అద్దం పట్టాయి.ఇల్లంతా మంగళవాద్యాలతో మారుమ్రోగిపోతోంది. భోజనాల్లో చక్కెరపొంగలి,ముద్దపప్పు,నెయ్యి,
పులిహోర,ఆవకాయ వంటి పదార్ధాలతో కొసరికొసరి వడ్డిస్తూ ఆప్యాయంగా పలుకరిస్తూ భోజనాల తంతు ముగించారు సంతృప్తిగా.  
    
      ముహూర్తం సమీపించింది.జయవిజయమ్మదంపతులు హడావుడి పడుతుంటే, కొడుకులుకోడళ్ళు , కూతుళ్ళూ అల్లుళ్ళు ఇదిగో వచ్చేస్తాం, ముందు మీరు పదండంటూ పెద్దవాళ్ళను,ముత్తైదులను మండపానికి పంపించివేసారు.
    
      మండపంలోని అలంకరణలను ఆసక్తిగా చూస్తూ,ఏమైనా మీ అక్కచెల్లెళ్ళు పిల్లలను చాలా సాంప్రదాయంగా పెంచారు.ఆచారాలు పాటించడంలో మీ తర్వాతే ఎవరైనా అని అందరూ అంటుంటే మనసు ఆనందంతో పొంగిపోతోంది. ఆ ఏమైనా మీ మనవళ్ళకు,మనవరాళ్ళకు మాత్రం సాంప్రదాయం అంతగా తెలిసినట్లులేదు, ఎంతైనా అమెరికాలో పుట్టి పెరిగారు కదా! అనేసరికి మనసు ఒకింత చివుక్కుమన్నా, అక్కచెల్లెళ్ళు చిరునవ్వే సమాధానం అన్నట్లు చూసి నవ్వారు చిన్నగా.
    
          ఇంతలో కారులొచ్చి లైనులో ఆగాయి. అందరి కళ్ళు ఆ వైపు తిరిగాయి.డోర్లు తీసుకుని దిగినవారిని చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు.కొడుకులు అల్లుళ్ళు పట్టు పంచెలు, కండువాలతో హూందాగా దిగారు.కూతుళ్ళుకోడళ్ళు సాంప్రదాయకట్టుతో పట్టుచీరల్లో,తల్లో పూలతో,చేతులనిండుగా మలారం గాజులతోను,పాపిట సింధూరంతోను, కుంకుమబొట్టుతోను ఆ భర్తలకు తగ్గ భార్యలుగా వారిననుసరించారు. వెనుకనున్న కారుల్లో నుండి మనుమరాళ్ళు పట్టులంగా ఓణీల్లోను, జడకుప్పుల జడనిండా పువ్వులతోను,చేతులనిండా గాజులతోను, సర్వాభరణాలను అలంకరించుకుని అందాలబొమ్మల్లా దిగుతుంటే రెండు కళ్ళు చాలవేమో అనిపించింది.మండపంలోని వాళ్ళంతా కళ్ళప్పగించి చూస్తున్నారు రెప్పవేయడం మరచిపోయి.మనవళ్ళను మనవరాళ్ళను చూసి జయవిజయమ్మలకు మాటలు రాలేదు.వారికిప్పుడు అర్ధమయింది ముందుగా తమని ఎందుకు పంపించారో.అంతే వారి మనసులో ఆనందంతోపాటు ముఖంలో రవ్వంత గర్వం తొణికిసలాడింది.పెళ్ళికి వచ్చిన వాళ్ళకు కన్నులపండుగ అయింది. ప్రధానం నుండి అప్పగింతల వరకు అనుకున్నదానికంటే వివాహం ఘనంగా,సాంప్రదాయబద్దంగా జరిగింది.
    
     పెళ్ళికి వచ్చిన వారందరి కళ్ళల్లో,నోట్లో,మనసుల్లో సాంప్రదాయం ఆసాంతం నిండిపోయింది.అమెరికాలో పుట్టి పెరిగినపిల్లలు సాంప్రదాయానికి ప్రాణం పోస్తుంటే ఆ ఊరిలో పుట్టి పెరిగిన పిల్లలు అనవసరమైన  ఆధునికతను ప్రదర్శించినందుకు వారు కించిత్తు సిగ్గుపడ్డారు.
    
      ఫొటోగ్రాఫర్లు,వీడియోగ్రాఫర్లకు కంటి నిండా,ఫిలిం నిండా సాంప్రదాయం చిక్కిపోతున్న రోజుల్లో బాగా చిక్కింది.అంతే కెమేరాలో బంధించి అందమైన "సాంప్రదాయం"తో కళకళలాడిపోతున్న ఒక కుటుంబం ఫోటోను జయవిజయమ్మల చేతిలో ఉంచారు.వారి కళ్ళు ఆనందంతో వర్షించాయి.ఆ ఆనందభాష్పాలే అక్షింతలై పిల్లలందరిని దీవించాయి.ఆ ఫోటోని పట్టుకుని ఒక జీవిత కాలానికి సరిపడినంత సంతోషాన్నిచ్చిన తమ బిడ్డలను చూసి మురిసిపోయారు.
            
           తమ బిడ్డలు కూడా తమలానే వారి బిడ్డలను పెంచడంలో కృతకృత్యులైనందుకు జన్మతరించిపోయినంత సంతోషంతో ఆ ఫోటోను చూస్తుండిపోయారు చమర్చిన కళ్ళతో.
         
       సాంప్రదాయం అనేది జీవనదిలాంటిది.అది ఒక తరం నుండి మరొక తరానికి ప్రవహిస్తుంటుంది.ఆ ప్రవాహం నిరర్ధకమైనా,సార్ధకమైనా మన బాధ్యత కూడా ఉంటుంది.ఈ విషయంలో జయవిజయమ్మల పెంపకం సార్ధకమయింది.అందుకే వారికి ఈ సంతోషం దక్కింది.

                                                                                                         *****************  

Wednesday, May 28, 2014

నా తల్లీ....లాలీ....లాలీ....

(ఇది జానీపాషాగారి చిత్రం )

జోజో....లాలీ....లాలీ....లాలీ....లాలీ....
నా తల్లీ....లాలీ....లాలీ....లాలీ....లాలీ....

ఆకశాన
అందాలమామ
              నీకై వేచి ఉన్నాడమ్మా       ll జోజో ll
 
వెన్నెలలోన
జాబిలి మామ
     చిరునవ్వులు నీకై రువ్వెనమ్మా       ll జోజో ll

నవ్వుల అలలే
ఆ చందమామ 
             చిరుగాలిగ నీకై పంపెనమ్మా      ll జోజో ll
 
జిలిబిలి తారలు
ఆ జాబిలినొదిలి
                  నీకై చేతులు జాచెనమ్మా        ll జోజో ll


నా చేతులనే
నీ ఊయల చేసి
                   తారా , జాబిలి ఊపిరమ్మా        ll జోజో ll

చల్లని మామా
వెలుగుల తారలు
                          నీకై జోల పాడెనమ్మా          ll జోజో  ll


హాయిగ బజ్జో
ఊగుతు బజ్జో
                    జాబిలి నీ జత ఉన్నాడమ్మా     ll జోజో ll
 
*****

Tuesday, May 27, 2014

నాకై విచ్చేసిన సఖీ !

సఖీ !
అరవిచ్చిన నీ పెదవుల చిరుదరహాసం చూసి
వికసించిన సుమములు వెలవెలబోగా ,

సంతోషంతో విప్పారిన నీ మోమును కని
పున్నమి చంద్రుడు వెలిసిపోగా ,

అనురాగంతో కూడిన నీ వాక్కుల వింటే ,
అన్ని రాగములు అల్పమేగా ,

మధురమైన నీ స్వరమును విన్న
కోకిల కంఠం మూగపోగా ,

సున్నితమైన నీ ఆదరణ ముందు
మల్లెల సునిశితత్వం తరిగిపోగా ,

ప్రేమను వర్షించే నీ కనులను చూసి
నీలిమేఘాలు అలిసిపోగా ,

నీ ఆత్మీయ సాహచర్యంలో
ఒంటరితనము నను వీడిపోగా ,

నా సువిశాల హృదయసామ్రాజ్యం నీ రాకతో
చిన్న కుటీరమై స్వాగతించగా ,

నాకై దిగివచ్చిన నా ప్రకృతి
నీ రూపంలో విచ్చేసిన సఖీ ,

నీ దారులలో పూలుపరిచా
నీకిదే నా స్వాగతం........

******

Sunday, May 25, 2014

నీ సొంపుల మేని ఒంపులలో............

నీ చిరునవ్వుల వెన్నెలలో
సిరిమల్లెలు కొల్లలు ఏరుకోనా.....

నీ కమ్మని కోకిల మాటలలో
కుహు కుహు రాగాలు ఏరుకోనా.....

నీ సొంపుల మేని ఒంపులలో
నెలవంకల నెన్నో దాచుకోనా.....

నీ చిలిపి చూపుల కన్నులలో
నా రూపము పదిలముగ దాచుకోనా.....

నీ గలగల గాజుల సవ్వడిలో
శుభ"కరకమలములు" అందుకోనా.....

నీ ఘల్లనే అందెల రవళులలో
పాద పద్మములు అందుకోనా.....

నీ హృదయ స్పందనల అలజడిని
శృతి , లయ నేనై సవరించనా.....

నీ భావరాగాల సంధిగ్ధతని
పల్లవి నేనై సవరించనా......

నీవూ నేనూ వేరు కాదని
నేనే నీవని వివరించనా.....

నా వలపుల శరములు సంధించనా
నా బాహువులలో నిను బంధించనా......

********

Saturday, May 24, 2014

నా బంగరు భవితను చేరుకుంటా..............

 నా చిలిపి చేష్టలతో దాక్కొని
నిను ఆశ్చర్య పరచాలనుకున్న నేను ,
నీ "లోపలి" మనిషిని చూసి నివ్వెరపోయాను.....

నీ మాటలు బూటకమని ,
నీ ప్రమాణాలు నాటకమని ,
నీవు ధనదాహానికి బానిసవని ,
నీవు కర్కోటక కామపిశాచివని......
తెలిసి విస్తుపోయాను.......


నా చిలిపిచేష్టలే నాకు మేలు చేశాయి ,
నా చిన్నతనపు ఆలోచనలే నన్ను మేల్కొలిపాయి....

నా మదిలో ఆశలు ఆవిరి అయినా ,
నా ప్రేమలో నిజాయితి నీరై పోయినా , 
బలిగాబోతున్న నా భవిష్యత్తును ,
భద్రంగా కాపాడుకున్నా.........

నా తల్లిదండ్రుల ఆశయాలకు వారధినవుతా ,
నా బంగరు భవితను చేరుకుంటా..............

********

Thursday, May 22, 2014

రైతన్న ప్రసాదించిన అన్నప్రసాదమేగా.......

ప్రణతి ప్రణతి అంటూ
ప్రకృతినే నమ్ముకున్న రైతన్న ,

ప్రతిక్షణం ప్రతికూలించకు అంటూ
ప్రణమిల్లే రైతన్న ,

ప్రతి రైతు ప్రతినిధి నీవే అంటూ
ప్రతిపాదన చేసే  రైతన్న ,

ప్రతిఘటించు శక్తి లేక
ప్రదక్షిణ చేసే  రైతన్న ,

ప్రళయకాల వేళలందు
ప్రత్యామ్నాయాన్నాశ్రయించే  రైతన్న ,

ప్రజల కొరకు అహర్నిశలు
ప్రయాసపడే  రైతన్న ,

ప్రసవించిన తల్లి పాల అనంతరం , రైతన్న
ప్రసాదించిన అన్నప్రసాదమేగా మన జీవనాధారం ,


ప్రతిభావంతులమైనా ,
ప్రజ్ఞావంతులమైనా ,
ప్రయోజకులమైనా ,
ప్రతిసృష్టి చేసినా ,


ప్రస్తుతించాలి మనం  రైతన్నను ,
ప్రణుతించాలి మనం  రైతన్నను .

******

Wednesday, May 21, 2014

తొలివలపులు..........


చిరు చిరు తలపులు
తొలివలపులనే సుతిమెత్తగ తట్టి లేపగా ,
 

వలపుల తలపులు
హృదయాంతరాలను సుతారముగ తాకగా ,
 

హృదయం తలుపులు తెరచి
స్పందనలను తనలో పొదవుకొనగా ,
 

తలుపులు దాటి ఆ స్పందనలు.....
 

కన్నులలో తారకలై ,
చేతులలో రాతలై ,
చేతలలో ఆశలై ,

బుగ్గలలో నునుసిగ్గులై ,
 
ఊహలలో ఉలికిపాటులై ,
 పలుకులలో పరవశమై ,
 మేనిలో పులకరింతలై ,
ఒంటరితనంలో పలవరింతలై ,
నిద్దురలో కలవరింతలై ,
 

మనసులో మధుర భావాలై ,
నిలువరించనీకున్నాయి ,
ఓపలేకున్నాయి ,
దాచలేమన్నాయి.......

****

Tuesday, May 20, 2014

అ...ఆ ల కుటుంబముమ్మ దరణలో ఇంతింతైన 
ఈ ఉగ్గుపాల సుల ణం 
లా? విధంగా?
కమత్యంతో కింత రిమితో ను!
అందరితో  అఃరహముండుటయే. 
********


Sunday, May 18, 2014

నే తోడుంటానమ్మా......


 ఎందుకమ్మా ! నను వద్దనుకుంటున్నారు ?

అమ్మా ! నను చంపొద్దమ్మా ......
మీ ప్రేమకు నను దూరం చేయొద్దమ్మా ,

అమ్మా ! నీ మాటే నే వింటానమ్మా ,
నాన్నా ! నీ తల్లిని నే వస్తున్నా నాన్నా ,

నీ ఒడిలో నేను ఆడుకుంటానమ్మా , 
నీ గుండెల్లో నేను పడుకుంటా నాన్నా ,

నా రెండు కళ్ళుగ మిము ప్రేమిస్తానమ్మా ,
నను చిరుదశలో చిదిమేయొద్దమ్మా ,

మీ చివరంటూనే తోడుంటానమ్మా ,
అమ్మా ! నను చంపొద్దమ్మా ......


********

Saturday, May 17, 2014

రాజకీయ దూ(దు)రాలోచన.........!!!!

అన్నదొక పార్టీ ,
తమ్మునిదొక పార్టీ ,

అక్కదొక పార్టీ ,
బావదొక పార్టీ ,

తండ్రిదొక పార్టీ ,
తల్లిదొక పార్టీ ,

పెదతండ్రిదొక పార్టీ ,
మేనమామదొక పార్టీ ,

ఏదేమైనా అధికారం మన చేతిలో ఉండాలంటే 
రాజకీయ దూ(దు)రాలోచన తప్పదు........మరి .
 

**********

Friday, May 16, 2014

అజ్ఞానం ఎందుకో ?

అమ్మ గుప్పెడు గుండెను
అర్ధం చేసుకోని మనసెందుకో ?

అమ్మకు పిడికెడు అన్నం పెట్టని
సిరిసంపదలు ఎందుకో ?

అమ్మను కనులారా చూడని
కంటి దృష్టి ఎందుకో ?

అమ్మా అని నోరారా పిలవని
స్వరం ఎందుకో ?

 అమ్మను నిర్లక్ష్యం చేసి
ఆ పరమాత్ముని కొరకు పరుగులెందుకో ?

అమ్మను మించిన దైవం
ఉందనే అజ్ఞానం ఎందుకో ?

******

Wednesday, May 14, 2014

పసితనం మరణిస్తే .................

ఏం పాపం చేశానో అమ్మా ?
నీ చేతులారా నీవు నన్ను
పురిటిగుడ్డుగా పొదల్లోకి విసిరేసి
నా పసితనాన్ని చంపేస్తే ,

నా బాల్యం అంతా
మురికివీధుల్లో మరణించింది ,
 
నా యవ్వనమంతా
చీకటి గదుల్లో చనిపోయింది ,
 
నా నడివయసంతా రోగాలతో
నడివీధుల్లో అసువులు బాసింది ,
 
నా వృద్ధాప్యమంతా నరకయాతన నుండి
విముక్తి కొరకు క్షణమొక యుగముగ
మరణం కొరకు ప్రార్ధిస్తూ ఉన్నా.........

అల్లరుముద్దుగా పెంచుకునే బిడ్డలను
అర్ధాంతరంగా కబళించే మృత్యువు
నా అచేతనావస్థను చూసికూడా
నా దరిచేర రాదెందుకో............

"కన్నతల్లిచే వదిలివేయబడిన బిడ్డనని
నాపై చులకన భావం కావచ్చు"

 
******

Tuesday, May 13, 2014

ఒక్కసారి ఆలోచించండి...........


అవును , ఓ విత్తు నాటడం కష్టం , అదే పీకడం చాలా సులువు .
ఎందుకంటే నాటడానికి ఓ పద్ధతి ఉంటుంది , అదే పీకడానికి
ఉండదుగా . అలానే ఇంటిని నిర్మించుకోవడం చాలా కష్టం ,
అదే కూలగొట్టడమైతే ఎంతో తేలిక .ఇంకా చెప్పాలంటే ప్రాణం 
పోయడం చాలా కష్టం , అదే తీసుకోవడం/తీయడం చాలా  
సులభం .తల్లి నవమాసాల కాలంలో ఒక్కొక్క రోజు ఒక్కొ
క్క 
అనుభూతిని పోగుచేసుకుంటూ , ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని 
ఇష్టంగా స్వీకరిస్తూ , రేపటి రోజును గూర్చి కలలుకంటూ,
బిడ్డకు అవసరమైన పోషకాలను తన శక్తి కొలది తింటూ , 
ఆప్యాయంగా తన కడుపును నిమురుకుంటూ ,అమ్మతో 
తన ఇబ్బందులను చర్చిస్తూ , తీసుకోవలసిన జాగ్రత్తలను 
తెలుసుకుంటూ , ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ ,
తనకు సంబందించిన చిన్న వార్తనైనా చదివేస్తూ , టీ.వీ లో
గర్భిణీల గూర్చి చెబుతుంటే వినేస్తూ , డాక్టరుగారితో తన 
ఆరోగ్యం గూర్చి తెలుసుకుంటూ ,రోజులను లెక్కించుకుంటూ , 
భర్త ఆసరాతో భారంగా అడుగులేస్తూ ,జాగ్రత్తగా కూర్చుంటూ , 
నిదానంగా లేస్తూ , అమ్మ వద్దకొచ్చి తొమ్మిది నెలలు పూర్తి 
చేసుకుని నిండు గర్భిణి ఆస్పత్రిలో పండంటి బిడ్డను ప్రసవించి ,
పరిపూర్ణ మాతృత్వం ముఖం లో తొణికిసలాడగా , బిడ్డ ఏడ్పుతో 
గుండెల్లోస్పందనలు రెట్టింపవ్వగా , తన ఆశాజ్యోతిగా ,కనులపంటగా 
పెంచుకున్నతల్లి , పొత్తిళ్ళల్లో , పారాడేటప్పుడు , బుడిబుడి నడకలు 
నడిచే వయసులో నీ నీడలా నడయాడిన తల్లి , గోరుముద్దలు తినిపిస్తూ , 
జోలపాటలు పాడేస్తూ , నీ ఆలనాపాలనలో తనను తాను మరచి పెంచిన 
తల్లి , నిను పాఠశాలకు పంపిస్తూ , నీతి కథలు చెప్పేస్తూ  నీ బాల్యాన్ని 
కంటికి రెప్పలా కాచిన తల్లి...........
 

యుక్తవయసుకు వచ్చిన నీకు విద్య విలువను వివరిస్తూ , పోటీప్రపంచంలో 
అలక్ష్యం తగదని నీ భవిష్యత్తుకై నీతో పలికిన ఆ నాలుగు మాటలు
పట్టుకుని విద్య పట్ల అసహ్యం పెంచుకుని , తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ
ఇల్లొదిలి , ఊరొదిలి , రాష్ట్రాలను దాటి పోయేవాళ్ళు , పురుగుమందు తాగేవాళ్ళు ,
 నిద్రమాత్రలు మింగేవాళ్ళు , రైలు కింద పడే వాళ్ళు , ఉరేసుకునేవాళ్ళు ,
నీళ్ళలో దూకేవాళ్ళు , కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేవాళ్ళు............

 

ఇందుకోసమా ! అమ్మ అన్ని బాధలను ఓర్చుకుని జన్మనిచ్చింది ?
తను తిన్నా తినకపోయినా బిడ్డల కడుపు చూస్తూ ,వారి చదువు కోసం
పడవలసిన కష్టాలన్నింటిని ఇష్టంగా భరిస్తూ , వారు భవిష్యత్తులో
ఉన్నతస్థితికి చేరుకోవటాన్ని చూసి మురిసిపోవాలనే ఆరాటంలో అన్న  
ఆ నాలుగు మాటలు పట్టుకుని పిల్లలు ఇలా మూర్ఖంగా ప్రవర్తించి , మిమ్మల్ని 
వరాల్లా భావించిన  ఆ తల్లిదండ్రులకు శాపాన్నిస్తారా ? ఆ నాలుగు మాటలు 
వెనుక ఉన్న ఆరాటాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరా ? 
అమ్మానాన్నల వద్ద ఇగో ఫీలింగా ?


మాతృత్వం వరంలా భావించి ఆ తల్లి జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తుంటే ,
 పెరిగిన పిల్లలు ఆ తల్లిదండ్రులకు ఇచ్చే శాపాలు....చూపే నరకాలు ఇవా ?
మీ బాధ్యతారాహిత్య ప్రవర్తనకు వారిని ఆ వయసులో బలి చేయడం ఎంత
 వరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి...........


************

Monday, May 12, 2014

జీవితం విలువ తెలిసుకోలేక........


మొన్నా మధ్యన నేను ఐ.సి.యు లో ఉన్న పేషంట్ కోసం ఒక 
హాస్పిటల్లో పది రోజుల పాటు ఉండవలసి వచ్చింది. అదే 
సమయంలో మా పేషెంట్ బెడ్ ప్రక్కన పదహారు సంవత్సరాల
అమ్మాయి మొత్తం శరీరమంతా కట్లు కట్టేసి ఉన్నాయి. ఆ 

అమ్మాయికి ఏమయింది ? అని ఒక నర్సును అడిగాను. 
దానికి సమాధానంగా ఆమె చెప్పిన విషయం విని నాకు 
నోట మాట రాలేదు.ఇంతకీ విషయమేమంటే "ఆ అమ్మాయి 
వేరే ఊరిలో కాలేజీ హాస్టల్లో ఉండి చదవుకోవాలని వాళ్ళ 
అమ్మానాన్న ఆమెకు నచ్చచెప్పి,భవిష్యత్తు బాగుంటుందని 
వివరించి ఆ కాలేజీలో చేర్పించారని కోపంతో,పంతంతో ఆ కాలేజీ 
పైకెక్కి అయిదంతస్థుల పై నుండి దూకేసిందట,వెన్నెముక 
రెండు చోట్ల  విరిగిపోయిందట,కాళ్ళుచేతులు విరిగిపోయాయి,
తల పగిలింది,జీవితాంతం మంచం మీదే ఉండవలసిన పరిస్థితి 
వాళ్ళ అమ్మానాన్నకు ఆ అమ్మాయి లేకలేక కలిగిన ఏకైక 
సంతానమంట"..........అప్పుడు నేను ఆ అమ్మాయిని తేరిపారా 
చూశాను,చాలా బాగుంది , కొంచమైనా తను చేసిన పనికి 
బాధపడడం లేదు సరికదా ,అమ్మానాన్నతో తనను ఏ.సి 
రూంలోకి షిఫ్ట్ చేస్తేనే వస్తానని లేకుంటే ఐ.సి.యు నుండి రానని 
మంకు పట్టు పడుతోంది. ఏ.సి రూములు ఖాళీలేవని ఎంత  
చెప్పినా మొండిగా మూర్ఖంగా వాదించి రెండురోజుల తర్వాత ఏ.సి
రూం ఖాళీ అయిన తర్వాతే తను రూం మారింది.రూంలో టీ.వి 

ఉండాలట,తనకు  నచ్చిన సినిమాల సీ.డీలు తేవాలట , ఆహారం 
తనకు నచ్చిందే తింటుందట , ఇలా ఆ అమ్మాయి చెప్పిందే 
తడవుగా తల్లిదండ్రులిద్దరూ తలూపేస్తూ పరుగులు తీస్తున్నారు 
పిచ్చెక్కినట్లు....ఒక్కగానొక్క పిల్ల లేకలేక కలిగింది కదా అని 
విపరీతంగా వారు చేసిన గారభం ఫలితమని చూసినవారెవ్వరికైనా 
ఇట్టే తెలుస్తుంది ,"చిన్నప్పటి నుండీ అంతేనండి చిలిపితనం 
ఎక్కువండి" అంటూ ప్రక్కనున్న వారితో మురిపెంగా తమ బిడ్డను 
చూస్తూ  అంటుంటే , చిలిపితనమంటే ఇదా అనిపించింది నాకు ,
అంతే కాదు ఆ తల్లిదండ్రుల మీద చాలా జాలేసింది కూడా . ఆ 
అమ్మాయి జీవితాంతం మంచంలో ఉండి వీళ్ళకు క్షణానికొక 
నరకం చూపిస్తుంది ,తల్లిదండ్రుల ప్రేమను అర్ధం చేసుకోక  
భవిష్యత్తును శూన్యం చేసుకుని ,పశ్చాత్తాపమన్నది లేకుండా
అజ్ఞానంలో కొట్టుకుపోతూ అదేదో ఘనకార్యమని ఫీలవుతూ,
తామేమి కోల్పోయామో తెలుసుకోలేక జీవితం విలువ 
తెలిసుకోలేక పోతుంటారు కొందరు ఇలా.  నేను హాస్పిటల్ 
నుండి వచ్చేసాను , తర్వాత ఏం జరిగిందో మరి.................
*************

Sunday, May 11, 2014

మాతృత్వం...............

(చిత్రకారునికి నా ధన్యవాదములు )

మాధుర్యం కాదా మాతృత్వం ,
మాతృత్వం  కాదా అమృతత్వం ,
అమృతత్వం కాదా అమ్మతనం ,
అమ్మతనం కాదా అమరత్వం ,
అమరత్వం కాదా దైవత్వం ,
దైవత్వం కాదా ఆడతనం ,

ఆడతనంతోనే కదా జన్మసార్ధకం . 

*****

Saturday, May 10, 2014

అమ్మా.......నీ ప్రేమ.........

(ఇది జానీపాషాగారి చిత్రం )
అమ్మా , నీ మనసులో అమృతం ,
నీ ప్రేమలో నిష్కల్మషం ,
 
నీ ఆదరణలో ఆదర్శం ,
నీ ఆచరణలో త్యాగం ,
 
నీ పిలుపులో అమరత్వం ,
నీ రూపంలో దైవత్వం ,

 
అమ్మా ! నీ ఋణము తీర్చుకొనగ
నాకో సదవకాశమిచ్చావా ?
 
నా ఒడిలో పరుండగ ,
నా బిడ్డ కడుపునుదయించావా ?
 
నా ఇంట నడయాడగ ,
నా చిట్టితల్లిగ వేంచేసినావా ?
 
నా మాతౄణమీరూపేణ ,
కొంత అయిన మాపనెంచావా...._/\_ 
********

Friday, May 9, 2014

మనం తవ్వుకున్న గోతిలో మనం ............ఈ మధ్య కాలంలో ఎలక్షన్ డ్యూటీలు వెంటవెంటనే చేసేసరికి నాకు ఆ వాతావరణం పై ఎంతో అసహ్యం వేసింది.

(1) "ఓటు" హక్కు వచ్చిన ప్రతివాడూ హీరోలా ఫీలవ్వడమే.

(2) ఎలక్షన్ డ్యూటీ చేసేవారికి ఏమీ తెలియదు అని ,ఆ జ్ఞానులంతా పెదవి విరవడం...అన్నీ వారికే తెలుసనే గొప్ప నమ్మకం.

(3) ఓటు ఎలా వేయాలో తెలియదు....

(4) ఎలా వేయాలో వివరిస్తే (దూరం నుండే సుమా) ఆ పార్టీవాడికి మీరు మేలు చేయడానికి వచ్చారా?అనే గొడవలు ,రాధ్దాంతాలు . 

(5) ఓటు వేయడం ఎలా అనే విషయం పట్ల  కనీస అవగాహన కలుగచేసే బాధ్యత ఊరిలో ఒక్క రాజకీయనాయకుడూ తీసుకోడు,

(6) పీకలమొయ్య తాగి వచ్చినవాడు నడవలేక తూలిపోతుంటే,వాడిని లేడీ P.O గారు తీసుకెళ్ళి ఓటు వేయించాలట...!!!

7) ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కడిని గుర్తుంచుకోవాలంట, వాడు మరల వస్తే వాడిని మరల ఎందుకు రానిచ్చారు ? అంటూ ఏజెంట్లు వారి పనిని కూడా ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారిదే అని మూర్ఖవాదన.....!!!!

(8) ఈ మాత్రం దానికి ఏజెంట్లు ఎందుకో.......వారి విధులేమిటో ............... ?????

(9) చదువురాదు , చెబితే వినరు , మనకు సహకరించరు , తమలో తాము సర్దుకోరు , అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించరు , ఇప్పటికైనా నేర్చుకోరు , ఇ.వి.ఎం ను సహనంతో చూడలేరు , సీల్ వేసేవరకు ఆగలేరు , క్లోజ్ చేసేవరకు నిలవలేరు , ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా స్పందించడం , విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ అదేదో వీరోచితమనుకోవడం...........వీరు ఏజెంట్లు .
 

(10) ఇ.వి.ఎం మెషీన్లో వారి పార్టీకి సంబంధించిన గుర్తు ఎన్నో నంబరులో ఉంటుందో కూడా చెప్పే బాధ్యత తీసికోరు....

(11) ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారు భోజనం చేస్తే వారికి సమయం వృధా అవుతుందట....!!!

(12) పోస్టల్ బాలెట్ ఉపయోగించుకున్న ఒక అమ్మాయి , తాను వినియోగించుకోలేదు అని చాలెంజ్ ఓటు వేస్తుందట...!!! ఇదో రాధ్దాంతం..........

(13) ఓటు వేయడానికి కంపార్ట్మెంటు లోనికి వెళ్ళిన ఓ వృద్ధురాలు  ఇ.వి.ఎం షాక్ కొట్టినట్టు గట్టిగా అరిచేసరికి నేను గాభరా పడిపోయి ఏమిటని అడిగితే ,అన్ని బొమ్మల్ని ఒక్కసారిగా చూసేసరికి తన గుర్తు కనిపించలేదట.......... అందుకే అలా అరిచిందట...???

(14) మరొక ఆమె  కంపార్ట్మెంటు లోనికి వెళ్ళి మూర్చ వచ్చినట్లు వణికి పోతోంది నిలువునా ,గబుక్కున పట్టుకుని అడిగితే, తమ పార్టీ గుర్తు చూసేసరికి ఆనందంతో అలా వణికి పోయిందట !!!!!
 

(15) ఓ యాభై ఏళ్ళ వ్యక్తి తెగతాగి వచ్చి ఓటు వేసి , అక్కడ ఉన్న ఇరవై ఏళ్ళవాడికి తనకు మందు పోయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరిస్తూ వెళ్ళిపోతుంటే ఆ ఓటు విలువ ఒక మందుసీసా అని తెలపకనే తెలుస్తోంది.

(16) భారతదేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలని , వాటి అభివృధ్దిపైనే దేశాభివృధ్ది ఆధారపడి ఉందని మనం విశ్వసించక తప్పదు , కానీ ఇటువంటి ఊళ్ళలో 90%
ట్లు పోలవుతుంటే, చదువుకుని జ్ఞానమున్న ప్రజలు నగరాల్లో 70% ఓట్లు పోలవడం నిజంగా హేయకరమైనది .

(17) ఎటువంటి ఓట్ల మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడుతోందో , నాయకులు చక్రం తిప్పడానికి ఎవరు అవకాశం ఇస్తున్నారో తెలుస్తూనే ఉంది.....

(18) ముందే విద్యావంతులు మేల్కొని ఉంటే అసలు ఈ విపరీత పరిణామాలకు అవకాశం ఉండదుకదా , మన అభివృధ్దికి పాటుపడే వారిని ఎన్నుకోవడానికి మనకు ఇంత స్వేచ్ఛ  ఉన్నా మన చేతులారా మనం దుర్వినియోగం చేసుకోవడం ఎంతవరకు సమంజసం ? అరాచక శక్తులు విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణం మనమే కదా.....

(19) చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి అలవాటు పడి , ఓటు వేయని వాడు అప్పుడు మేల్కొని సాధించేది ఏమిటి ?

(20) మరో అయిదేళ్ళు మనం తవ్వుకున్న గోతిలో మనం పడడానికి సంసిద్దులం అయిపోయామనడానికి నిదర్శనం కాదా , అధికారికంగా ఓ  అరాచకానికి పట్టం కట్టడడం.....  ************** 

Monday, May 5, 2014

అమ్మ హృదయం .......

గుండెల లోతును కొలిచి ,
గుండెల తడిని తుడిచి ,
గుండెలో భావం తడిమిన నీవు ,
నేడు నీరెండి , బీడై మిగిలావా .... అమ్మా !
 
********

Thursday, May 1, 2014

ప్రకృతి రమణికి అర్పితమా............

కమలకాంతలకు స్వాగతమా ,
ఆ చల్లని వేకువఝాములు.......

అరవిరిసిన మల్లెల కైవశమా ,
ఆ చల్లని సాయంసంధ్యలు.....

కలువభామలకు అంకితమా ,
ఆ చల్లని వెన్నెల రాతిరులు......

ఆ ప్రకృతి రమణికి అర్పితమా ,
అణువణువున విరిసే అందాలు .

******