Tricks and Tips

Friday, August 30, 2013

నమ్మకం

.
నమ్మకం
జయ తన స్నేహితురాలు రమణ తో కలసి ఒక స్వీట్ షాప్ కు వెళ్ళింది. స్వీట్ షాప్ యజమాని చిరునవ్వుతో "రండమ్మ రండి, ఏం తీసుకుంటారు?అన్నీ తాజావే! ఇదిగో ఈ ముక్క తిని చూడండి" అంటూ చెరొక ముక్క ఇచ్చి, "ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తారమ్మా. అంత నాణ్యమైన సరుకులతో తయారు చేస్తాం" అంటూ ఎంతో "నమ్మకం" గా చెప్తూనే ఉన్నాడు. స్వీట్ బాగుంది. స్వీట్ హాట్ కొని బయటకు వస్తూ, అందుకేనా ఈ చుట్టుప్రక్కల ఎవరిని అడిగినా "నమ్మకం"గా ఈ షాపులోనే కొనమన్నారు అనుకున్నారిద్దరూ. ఆ రోజు శ్రావణ శుక్రవారం అవటంతో అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. భక్తులంతా లలిత సహస్రనామాలు చదువుతున్నారు. ఆలయం అంతా అందంగా అలంకరింపబడి ఉంది. "ఇంకా చాలావరకు మన సాంప్రదాయాలను "నమ్మకం"తో ఆచరిస్తూ శ్రావణమాస శోభ కనబరచడం ఎంతో సంతోషంగా ఉంది కదూ" అని రమణ అంటే జయ తలూపింది అవునన్నట్లు. ఇంతలో ప్రక్కన ఎవరో "అవునమ్మా! ఈ అమ్మవారిని  "నమ్ముకున్నాకే" మాకు బాగా కలిసివచ్చింది" అని ఒకావిడ తనతో వచ్చిన ఆమెతో ఎంతో  "నమ్మకం"తో చెబుతోంది. అంతే అది విన్న జయ, రమణ మరింత భక్తిత్,  "నమ్మకం"తో అమ్మవారికి (నమస్కరించారు) దణ్ణం పెట్టుకున్నారు. 
                       ఒక్కసారి తమ చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నారు ఇద్దరూ. "అవసరంలో ఉన్నవారికి మనం చేయగలిగినంత మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు" అనే "నమ్మకమైన" అమ్మ మాటను పాటించడం వల్లనేమో మనలో స్వార్ధచింతన తగ్గి పరోపకారం, నైతిక విలువలు పెంపొందాయి అనుకుంటా కదా! అంటూ తాము పెరిగిన విధానం పైని  "నమ్మకం"తో జ్ఞాపకాలను తవ్వుకున్నారు. 
                                  పునాది శక్తిని బట్టే ఒక కట్టడం యొక్క జీవితకాలం ఆధారపడి ఉంటుంది. "నమ్మకం" అనే పునాది పైనే సమాజం నిర్మించబడింది. కుటుంబాల సమాహారమే సమాజం. కుటుంబం అనే కట్టడానికి "నమ్మకమే" పునాది. వివాహం అనే బంధానికి పునాది పెద్దల మాటలపై పిల్లలు ఉంచిన "నమ్మకమే".  వయసొచ్చిన ఆడపిల్లను ఇతర ప్రాంతాలలో చదివించడానికి/ ఉద్యోగం చేసుకునే స్వేచ్చనివ్వడానికి పునాది వేసినది, తల్లిదండ్రులకు వారి పెంపకం మీద ఉన్న "నమ్మకమే". అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకరినొకరు సహకరించుకోవడానికి పునాది వారి రక్తసంబంధం పైని "నమ్మకమే". పిల్లలు తమ భవిష్యత్తు గూర్చిన విషయాలను తల్లిదండ్రులపై వదిలేది "తల్లిదండ్రులను మించి బిడ్డల బాగోగులు చూసివారు ఎవ్వరూ ఉండరనే"  "నమ్మకం". కుటుంబం తర్వాత అంతటి  "నమ్మకానికి" స్థానం ఇచ్చేది స్నేహం అనడంలో అతిశయోక్తి లేదు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గూర్చి ఉపాధ్యాయుల పై ఆధారపడడానికి పునాది తమ పిల్లల జీవితాలు వారు తీర్చిదిద్దగలరనే "నమ్మకమే". భార్యాభర్తలు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారి బంధం లోని బలానికి పునాది ప్రేమానురాగాల మీద వారికున్న "నమ్మకమే"
                               ఇలా ఒక్కటేమిమిటి ..... ఒక్కచోటేమిటి ...... "నమ్మకం" అనేది మనం చేసే ప్రతిపనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తుంది. నిత్యావసర వస్తువుల నుండి బంగారం కొనుగోలు వరకూ "నమ్మకమైన"చోటుకే వెళ్తాం. దేవుడు, దేవతలు,పూజలు,నోములు,వ్రతాలు, మ్రొక్కులు, భజనలు ..... ఇవన్నీ కూడా  "నమ్మకం"తోనే చేస్తాం. 
                                 ప్రతి వ్యక్తికి తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగలననే "నమ్మకం". తమ పిల్లలను బాగా చదివించగలమనే  "నమ్మకం. వారి ఆర్ధిక స్థితిగతుల కన్నా పిల్లల ఆర్ధిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయనే  "నమ్మకం"తో జీవిస్తూంటాడు. 
                                       ఆసుపత్రిలో చేరిన రోగికి డాక్టరు గారిచ్చిన మందుల కంటే ఆయన హస్తవాసి మీద "నమ్మకం"తోనే సగం రోగం తగ్గిపోతుంది. ఆ "నమ్మకమే" ఎన్నోసార్లు అతన్ని ఇంటికి నడిపిస్తుంది కూడా. ఇలా ..... ఎన్నో..... ఎన్నెన్నో. 
                                     మొత్తానికి జీవితం అంటేనే "నమ్మకం.  "నమ్మకం" అనే చుక్కాని తోడు తోనే జీవితం అనే నావ నిరంతరం అల్లకల్లోలాలు సృష్టించే మానవ సమాజంలో తొణకకుండా సాగిపోతూ..... ఉంటుంది. 
                                   "నమ్మకం" అనేది ఊహవచ్చినప్పటి నుండి ఊపిరి ఆగిపోయే వరకూ మనతో ఉండే ఓ అద్భుత అదృశ్య శక్తి.  "నమ్మకం" గూర్చి ఎంత చెప్పినా తక్కువే. బంగారం, వెండి, వజ్రవైడూర్యాల కు విలువ కట్టగలం కానీ, విలువ కట్టలేని వాటిలో ముఖ్యమైనది  "నమ్మకం." వజ్రవైడూర్యాలు, బంగారం, వెండి అందాన్ని పెంచుతాయని చెప్పినంత  "నమ్మకం"గా బంధాన్ని నిలుపుతాయని చెప్పలేము. 
                                    "నమ్మకాన్ని" నీడలా అనుసరించేదే అనుమానం.  "నమ్మకం" ఏ మాత్రం తొట్రు పడినా, తొణికినా అనుమానం  "నమ్మకం"స్థానాన్ని ఆక్రమించేస్తుందని  "నమ్మకం"గా చెప్పవచ్చు. ఆక్రమించడమే కాక అక్కడి పరిస్థితులను సాధ్యమైనంత నాశనం చేయడానికి నాలుకలు జాపిన అగ్నిహోత్రుడిలా నలువైపులనున్న సత్సంబంధాలను అవలీలగా నాశనం చేస్తుంది. వివేకంతో మేల్కొనే సరికి జీవితకాలం ఉండవలసిన బంధాలు నిర్జీవమై అనాధలుగా మిగిలిపోవటానికి కారణం  "నమ్మక" లోపమే. 
                                     ఈనాడు చెదిరిపోయిన ఎన్నో కుటుంబాలకు కారణం కేవలం "నమ్మకం" లోపమే, అనుమానమే. ఇంకా చెప్పాలంటే ఆత్మ పరిశీలన చేసుకునే ధైర్యం లేకనే. నిజంగా తప్పు చేసి విడిపోయిన వారి కన్నా,  "నమ్మకం" లేక విడిపోయిన వారే ఎక్కువ. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఇంతకంటే విషాదకరమైన విషయం విడిపోకుండా ఉండి "నమ్మకం" నశించినందున నిత్యం ఒకరినొకరు మాటలతో, చేతలతో హింసించుకోవడం. అంతకన్నా దౌర్భాగ్యమైనది "నన్ను నమ్మండి / నన్ను నమ్ము "  అంటూ భార్యాభర్తలిరువురూ తమ నిజాయితీని ప్రతిక్షణం ఋజువు చేసికోవడానికి ప్రయత్నిస్తూ, ఓడిపోతూ చిన్న జీవితాన్ని చేజార్చుకోవడం. 
                                        "నమ్మకం" ఒకరు కలిగిస్తే కలిగేది కాదు. ఎవరి వల్లో కలిగిన  "నమ్మకం" శాశ్వతమైనదీ కాదు. ఏ బంధంలోనైనా ఒకరిమీద ఒకరికి ప్రేమతో ఏర్పడేది  "నమ్మకం". ముందుగా మనపై మనం  "నమ్మకం" పెంపొందించుకోవాల అప్పుడు ఏర్పడే బంధాలే  "నమ్మకం"తో మరింత బలంగా ఉంటాయి. ఇలా .... జ్ఞాపకాల పొరల్లోంచి బయటకొచ్చిన మిత్రురాళ్ళు సమాజంతో 
ఏమంటారు ...... మరి?
రండి ..... చేయి, చేయి కలుపుదాం,
"నమ్మకం"  తో కదులుదాం, బంధాలను బలపరుచుదాం. 
అంటూ సాగిపోయారు. 
**********

Wednesday, August 28, 2013

తెలుగమ్మాయి


తెలుగమ్మాయి 
క్కనైన అమ్మాయి మన తెలుగమ్మాయి,
చామంతి పూలను జడలో తురిమి,
చిక్కిన నడుముకు,
చీరను కట్టి,
చుక్కల రవికను సింగారించి,
చూడముచ్చటగా వచ్చింది తెలుగమ్మాయి,
 చృ రేఖా చిత్రంలా. 
చెంపల విరిసిన సిగ్గుల కెంపులు 
చేతిలో పూసిన గోరింటాకుతో
చైత్రమాస సుందరిలా వచ్చింది తెలుగమ్మాయి 
చొరవగ ఓరగ చూసింది 
చోళుల నాటి శిల్పంలా 
చౌడు బీడుల మనసున మరులు గొలిపే 
చందన పరిమళ భావనయే మన తెలుగమ్మాయి. 
***********
 
( చృ - రాజస్థాన్ రాష్ట్రంలో ఒక జిల్లా పేరు, థార్ ఎడారికి స్వాగత ద్వారంలా ఉన్న ఈ జిల్లా అందమైన రేఖా చిత్రాలు చిత్రించడంలో ప్రసిద్ధి చెందినది.)
*******
 

Friday, August 23, 2013

నవతరమా మేలుకో !

నవతరమా మేలుకో!
తల్లిపాలు తాగి ఎదిగి,
                                             తండ్రి సొమ్ము తినమరిగి,
విద్య వినయముల విలువ మరిచి,
                                          లక్ష్యమన్నది విస్మరించి,
నైతికతకు నీళ్ళు వదలి,
                                            చీకటి పథాన చిందులేసి,
స్నేహితులతో చెడతిరిగి,
                                        మోహాల మొలకల పిలకలేసి,
విశృంఖలమైన స్వేచ్ఛా విలాసాలకు,
                                        సుఖభోగాలకు చిరునామావై,
క్లబ్బులోన, పబ్బులోన,
                                 బైక్ రేస్ లోన, యాసిడ్ దాడుల్లోన  
 కడకు చెరసాలలోన నీవే.
                              నిన్ను చూసి తల్లి గుండె చెరువాయె,
తండ్రి పరువు కరువాయె.
నవతరమా! మేలుకో!
           నీ జీవితాన్ని ఒక్కరోజు ప్రకృతికిచ్చి చూడు. 
                           ఉల్లిపొరల రెక్కలతో,
ఊపిరి సలపని వేగంతో,
                     శ్రమను మరచి తిరిగి, తిరిగి తేనెలు కూర్చే 
చిన్ని తుమ్మెదలు చూడు .... చూడు..... 
                                      తల్లి రెక్కల మాటు దాగుంటూ,
కాలిగోళ్ళతో గీకిగీకి ఆహారం వెదుక్కునే 
                      చిన్ని కోడిపిల్లలను చూడు .... చూడు..... 
పుట్టిన మరుక్షణమే కాళ్ళను కూడగట్టి పడుతూ, లేస్తూ 
                           నిలబడడానికి పూనుకునే 
చిన్ని మేకపిల్లలను చూడు .... చూడు..... 
                      తల్లిపాలు తాగి, తాగి 
చెంగుచెంగున ఎగిరిదూకే,
                                     రేపటి కాడిని మోయబోయే 
చిన్ని లేగదూడను చూడు .... చూడు..... 
                           మోయలేని భారాన్నెత్తి,
 క్రమశిక్షణతో సాగిపోయే,
                            రేపటి పనిని నేడు చేసే 
చిన్ని చీమలు చూడు .... చూడు..... 
                            గమ్యమెరిగిన జీవుల 
జీవన సౌగంధికా పరిమళం  ఆస్వాదించి చూడు. 
                        ఇంతవరకు జీవితాన 
నీవు పొందినదేమిటో, పోగొట్టుకున్నదేమిటో
తెలుసుకున్నావనుకుంటా ...... ధన్యుడవు. 
తెలుసుకోలేదా? ఇంతకన్నా నిదర్శనం ఏముంది?
నిన్ను నీవు కోల్పోయావనుకోడానికి. 
ఇప్పటికైనా సమయం మించిపోలేదు. 
మేలుకో నవతరమా! మేలుకో!
*********

Tuesday, August 20, 2013

రంగులరాట్నం

రంగులరాట్నం
[ఆశాజ్యోతి అనే అందమైన, పేదింటి బాలిక. తల్లి వెంట పనికి వెళుతూ ఆ యజమాని పిల్లల్లా తాను బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశగా ఉండేది. కానీ వారి ఆర్ధిక పరిస్థితి అందుకు ఏ మాత్రం సహకరించలేదు ..... అయినా పరిస్థితులను బాగు చేసుకుంటూ తన కుటుంబాన్నైనా అందంగా మలచుకోవాలనే ఆశను మనసంతా నింపుకుంది.]

                                        తల్లి వెంట ఇంటింటికి వెళుతూ 
                                                           పనులలో తల్లికి సాయం చేస్తుంది. 
                                        పనిమనిషి కూతురు ఆ అమ్మాయి 
                                                              పేరు ఆమెది ఆశాజ్యోతి. 
                                        పేరుకు తగిన ప్రేరణ కలది. 
                                       
                                         కోటి ఆశలతో కొత్తకోడలై
                                                      అత్తింట్లో జ్యోతిని వెలిగించింది. 
                                         ఎదురింటిలో ఉన్న నన్ను చూసి 
                                                     చెరగని చిరుదరహాసం చేసింది. 

                                          అత్త వెంట ఇంటింటికి వెళుతూ 
                                                    పనులలో అత్తకు సాయం చేస్తోంది. 
                                          పనిమనిషి కోడలు ఆ అమ్మాయి 
                                                    పేరు ఆమెది ఆశాజ్యోతి. 

                                            
                                      భర్త వ్యసనాలు సహనంతో సహిస్తూ 
                                            ఆడ,మగ కవలలకు జన్మను ఆమె ఇచ్చింది. 
                                       చూడడానికి వెళ్ళిన నన్ను చూసి 
                                                         చెదరని చిరుదరహాసం చేసింది 
                                             
మూడు పదుల దినములు గడిచె
                                               ఒక బిడ్డను ఇంట విడిచింది. 
                                                        మరొక బిడ్డను నడుముకు కట్టుకుని 
                                              ఇంటింటికి పనులకు వెళ్ళింది
                                                         చెదరని ఆత్మ విశ్వాసంతో. 
ఏళ్ళు ఐదు గడిచాయి
                                             ఎయిడ్స్ వ్యాధి ముదిరిన భర్త 
                                                                      కాలధర్మం చేశాడు. 
                                             కట్టలు తగిన దుఃఖంలో 
                                                                     ఆశలు కన్నీరయ్యాయి. 
                                           దుఃఖాన్నంతా దిగమింగింది 
                                                                   అత్తను ఊరడించింది. 
                                           పలుకరించగా పోయిన నన్ను చూసి 
                                                                నిరాశా నిట్టూర్పులు విడిచింది. 

                                         ఆగక, అలయక కాలచక్రం 
                                                                 తిరుగుతూ సాగిపోతోంది.  
                                        మంచం పట్టిన అత్తకు మందులు ఇస్తూ 
                                                                ఇంటింటికి పనులకు వెళ్ళింది. 

                                        బడి నుండి వచ్చిన కూతురికి 
                                                                    చేతిలో తాయిలం పెట్టింది. 
                                        దొరవారింటికి పోయి బిడ్డను 
                                                                    కూలి డబ్బులు తెమ్మంది. 

గంటలు గంటలు గడిచాయి
                                       కూతురి కోసం తోటకు వెళితే 
                            శవమై కూతురు దొరికింది చేతిలో మిగిలిన తాయిలంతో. 
                                      గుండెలవిసిపోయాయి
                                                                   దిక్కులు పిక్కటిల్లాయి. 
                                     ఆశలు ఆవిరయ్యాయి 
                                                                   కన్నీరు ఏరులై పారాయి. 
                                     మంచం మీది అత్త బాధతో 
                                             మనుమరాలికి తోడు తానూ వెళ్ళిపోయింది. 
రోజులు దొర్లిపోయాయి  
                                     కొడుకును బడికి పంపింది 
                                                           ఇంటింటికి పనులకు వెళ్ళింది. 


ఆ రోజు ఆదివారం 
                                    మొక్కజొన్న చేలో పనికి వెళుతూ 
                                                                కొడుకును తీసుకువెళ్ళింది. 
                                   బిడ్డను ఆడుకొమ్మంటూ 
                                                                పనిలో మునిగిపోయింది.   
                                 భోజన సమయం బిడ్డను పిలువగా 
                                                               ఎంతకూ పలుకరాలేదు. 
                                 చేను అంతటా తిరిగింది 
                                                    పాము కాటుకు బలైన కొడుకును చూసి 
                                మొదలు నరికిన మానులా 
                                                     నిలువునా కుప్పకూలింది. 
                                తల్లిని పట్టుకు ఏడ్చింది 
                                                             తలరాతను తెగ ప్రశ్నించింది. 
                                 ఒదార్చగ పోయిన నావంక 
                                                             చెరిగిన నవ్వుతో చూసింది. 
                                 ఆవిరైన ఆశలతో కొడిగట్టిన జ్యోతి 
                                          జీవం లేని కట్టెలా తప్పక ముందుకు కదిలింది. 
                                 మంచం లోని తల్లికి చెప్పి 
                                             ఇంటింటికి పనులకు వెళ్ళింది. 
[ఆశాజ్యోతి నిరాశగా, నిర్వేదంగా ఆలోచిస్తోంది. అంతే కదా ధనవంతుల పిల్లలు ధనవంతులవుతారు, డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవుతున్నారు. సమాజం ఎంత మారినా పేదవారు పేదవారుగానే మిగిలిపోతున్నారు. వారి ఆశలు నిరాశలే అవుతున్నాయి అనుకుంటూ ఉండగా దూరం నుండి "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నము" అని వినిపించింది ......... అంతే ఆశాజ్యోతి మరింకేం ఆలోచించలేక పోయింది. మానసికంగా మూగదయింది. ]
**********                      

Saturday, August 17, 2013

స్పర్శ


స్పర్శ
                        విరాజి వంటింట్లో పని చేసుకుంటోంది. ఆమె ఆరేళ్ళ కొడుకు విహారి రెండవ తరగతి తెలుగు పుస్తకంలో సంయుక్త అక్షర పదాలు చదువుతూ "అమ్మా ఇది ఒకసారి చెప్పవా" అంటూ పుస్తకంతో వచ్చాడు. 
                             విరాజి ఆ పదం చూసి "స" కింద "ప" ఒత్తు ఇస్తే "స్ప", "ర" కింద "శ" ఒత్తు ఇస్తే "ర్శ", " స్పర్శ " అంటూ వివరించింది. విహారి ఆ పదం చదివి "అమ్మా! స్పర్శ  అంటే ఏమిటి?" అని అడిగాడు. విరాజి నవ్వుతూ విహారి చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని, ఇదీ స్పర్శంటే అంది. బుగ్గపై ముద్దు పెట్టుకుని ఇదీ స్పర్శే అంది. "ఓహో! స్పర్శ అంటే నాకు తెలిసిందిలే!" అంటూ ఎంతో అర్ధమైనట్లు పరుగున వెళ్ళిపోయాడు. చదువుకుంటూనే నిద్ర పోయిన విహారిని సరిగా పడుకోబెట్టి జో.... కొడుతూ ఆలోచనల్లోకి జారిపోయింది విరాజి. 
                               " స్పర్శ"  కేవలం రెండక్షరాల పదం. కానీ అది ఎంత శక్తివంతమైనది, అమోఘమైనది, ఎంత అర్ధవంతమైనది. ఎన్నో భావాల్ని మాటలతో పనిలేకుండా వ్యక్తం చేస్తుంది. నిజంగా మన చేతిలో ఉన్న దివ్యమైన అస్త్రం "స్పర్శ". ఇంద్రుని వజ్రాయుధం, అర్జునుడి పాశుపతాస్త్రం ఎంత వరకు పనిచేస్తాయో తెలియదు కానీ "స్పర్శ" అనే మన దివ్యాస్త్రం ఏ పనినైనా చేయించగలదు అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. 
                                    విరాజి ప్రకృతిలోకి తొంగి చూసింది. చల్లని గాలి, ఆ గాలి స్పర్శ కి తలలు ఊపుతూ పరవశిస్తున్న లతలు, మొక్కలు, పురివిప్పి ఆడుతున్న నెమళ్ళు, తొలకరి చినుకుల స్పర్శతో పరవశిస్తున్న భూమి, మొక్కలు, చెట్లు, రైతులు, ప్రజలు. ఎండకు ఎండి బీటలు వారి తొలకరి వానతో నాగలి స్పర్శకు పులకరించిన భూమిలో విత్తనాలు చల్లాడు రైతు. ఎండి,ఎండి  ఉన్న విత్తనాలు నీటి స్పర్శతో పులకించి మొలకెత్తాయి. నానాటికి ఎదుగుతున్న పైరును చూస్తూ దాన్ని స్పర్శిస్తూ పరవశించిపోతున్నాడు రైతు. చల్లని సాయంత్రం సన్నజాజులు కోస్తుంటే ఆ స్పర్శకి జాజులు విరబూసేస్తున్నాయి. మంచు స్పర్శతో మల్లెమొగ్గలు విరబూసి సుగంధాన్ని గాలికి అందిస్తున్నాయి. ప్రతి పూవునూ తుమ్మెద సునిశితంగా స్పర్శిస్తుంటే పూవులు పులకరిస్తూ తమ మకరందాన్ని తుమ్మెదలకు అందిస్తున్నాయి. ఆ మకరందాన్ని ఆస్వాదించేవారు మరల మరల తమ నాలుకతో పెదవులను స్పర్శించుకుంటూనే ఉంటారు. 
                                              లేగదూడను విడువగానే చెంగుచెంగున తల్లి చెంతకు వెళ్ళిందే తడవుగా ఆవు తన దూడను ప్రేమగా తన నాలుకతో స్పర్శిస్తుంటే, ఆ స్పర్శ లోని మాధుర్యాన్ని చవి చూడడానికి తోక ఎత్తి సవారీ చేస్తూ తిరిగి తిరిగి తల్లి వద్దకు వస్తోంది. ఆవుకి మేత వేసి యజమాని దాని మెడను ప్రేమతో స్పర్శించాడు. అంతే! ఆవు గారంగా మారం చేస్తూ మెడను మరింత ముందుకు జాపుతూ యజమాని స్పర్శ కోసం ఆరాటపడిపోతోంది. ఇంటి గుమ్మంలోని కుక్కపిల్లను దగ్గరకు తీసుకుని తన చేత్తో దాని శరీరాన్ని నిమిరాడు. అంతే! అది తోక ఊపుతూ యజమాని స్పర్శ ను తిరిగి పొందడానికి అతని కాళ్ళల్లో, కాళ్ళల్లో తిరుగుతూ ఒడిలో చేరే ప్రయత్నం చేస్తోంది. 
                                               ఇలా ప్రకృతిలోకి తొంగి చూస్తున్న విరాజికి విహారి కదిలేసరికి ఇలలోకి వచ్చింది. విహారిని దగ్గరకు తీసుకుని జోకొట్టసాగింది. అలజడిగా కదిలిన విహారి, తల్లి చేతి స్పర్శతో ఆత్మస్థైర్యంతో పడుకున్నాడు. విహారిని చూస్తూ చిన్నగా నవ్వుకుంది విరాజి. 
                                               మరల ఆలోచిస్తూ మానవ సంబంధాలలోకి తొంగి చూడడం ప్రారంభించింది. పిల్లలు నిద్రించేటప్పుడు జోకొట్టే స్పర్శ, అన్నం తినిపించేటపుడు అనునయిస్తూండే స్పర్శ, ఒడిలో కూర్చోపెట్టుకుని కథలు చెప్పేటపుడు పెద్దవారి స్పర్శతో పిల్లలలోని సంతోషం, కేరింతలు, మారం రూపంలో బయటకు వస్తుంది. 
                                                     పిల్లలు చదువుకునేటపుడు, వారు అలసిపోయినపుడు వారి వద్ద కూర్చుని వారి తల మీద, వీపు మీద చేతితో నిమిరితే ఆ స్పర్శతో వారికెంతో మనోనిబ్బరం చేకూరినట్లుంటుంది. వారు చేసే పనిని ప్రోత్సహించడానికి, పందెంలో గెలవడానికి "స్పర్శ" (తల్లిదండ్రులు/స్నేహితులు/పెద్దలు ఎవరైనా కావచ్చు) ఎంతో అవసరం. ఆ స్పర్శ  వారిలోని ఉత్సాహాన్ని, శక్తిని, రెట్టింపు చేస్తుంది. అంతే కాక ఏదైనా నిరుత్సాహం, నిరాశ చెందినా వారికి అదే స్పర్శ  ఆశను, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. 
                                                         విరాజికి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. తన స్నేహితురాలి భర్త చనిపోతే వెళ్ళింది. అక్కడ అందరూ ఆమెకు ఆమడ దూరంలో నిలబడి"అసలేం జరిగింది? ఎలా జరిగింది?" అంటూ ప్రశ్నించే వారే కానీ ఓదార్చే వారు కనబడలేదు. అంతే తాను ఒక్క ఉదుటున స్నేహితురాలి వద్దకెళ్ళి ఆమెను తన రెండు చేతులతో దగ్గరకు తీసుకుని తలను, వీపును నిమిరింది. ఆ స్పర్శ ఆమెకు ఎంతో ఓదార్పు నిచ్చినట్లయి అలానే కదలకుండా, కదిలితే ఆ స్పర్శ, ఆ ఓదార్పు పోతుందేమోనన్నంత భయంతో అలానే ఉండిపోయింది ఎంతోసేపు. 
                                                         గుండెపోటుతో హాస్పిటల్లో జాయినయ్యాడు సుబ్బారావు. అతనికి సంబంధించిన వారిని ఎవ్వరినీ లోనికి రానీయడం లేదు సిబ్బంది. సుబ్బారావుకు భయం, ఆందోళన అధికం అయ్యాయి. ఇంతలో అతని కోసం నియమించబడిన నర్సు లోనికి వచ్చింది. సుబ్బారావు ఆమె వంక బేలగా చూశాడు. నర్సు సుబ్బారావు చేతిని తన చేతిలోకి తీసుకుని "మీకు ఏం ఫర్వాలేదు, తగ్గిపోతుంది. నే జాగ్రత్తగా చూసుకుంటానుగా" అంది చిరునవ్వుతో. అంతే ఆ స్పర్శతో, ఆ మాటతో సుబ్బారావుకి సగం అనారోగ్యం తగ్గిపోయిందా! అనిపించింది. 
                                                           వానలో తడిసి జలుబు, జ్వరం తెచ్చుకుంది దేదీప్య. తల్లి కోప్పడి మందు వేసింది. ప్రక్కనే కూర్చుని బిడ్డను చేత్తో నిమురుతూ, జుట్టు సవరిస్తూ రాత్రంతా మరో రెండు మార్లు మందు వేసింది. ఆ మందు ప్రభావం కంటే ఆ స్పర్శలోని ఆత్మీయభావం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి జ్వరం తగ్గింది దేదీప్యకు. 
                                                         స్పర్శ  ఎంత గొప్పది. "భాషలేనిది భావమున్నది" భాషతో పనిలేదు. భావాన్ని స్పర్శ  ద్వారా తెలియచేయగలం. సంతోషం, విషాదం, ఓదార్పు...... ఇలా దేన్నయినా మనం కంటి చూపుతో పలుకరిస్తూ చేతి స్పర్శతో ఏ భావాన్నైనా వ్యక్తం చేయగల శక్తి ఉంది మనవద్ద. అందుకే స్పర్శను ఒక దివ్యాస్త్రం అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. 
                                                          కారు హారన్ విన్పించేసరికి విరాజి ఆలోచన స్పర్శకు ఆనకట్ట వేసి టైము చూసింది. రాత్రి గం 11.30 ని. అయింది. అమ్మయ్య! విజయ్ వచ్చాడనుకుంటూ లేచి తలుపుతీసింది. ఎంతో అలసి వచ్చిన విజయ్ ని చూసి చిరునవ్వుతో చేయి పట్టుకుంది. అంతే! ఆమె చేతి స్పర్శతో విజయ్ లోని నీరసం అంతాపోయింది. విరాజిని చూసి ఆమె బుగ్గపై చిటికె వేశాడు. ఆ స్పర్శతో ఆలోచనలతో వేడెక్కిన విరాజి బుర్ర చల్లబడింది. 
                                              స్పర్శకు ఇంతటి మహిమ, శక్తీ ఉన్నాయని ఇప్పటికైనా గ్రహిస్తే వైకుంటం మన చేతిలోనే ఉంటుంది. అవునా? ఏమంటారు మరి మీరంతా?
***********
                                                     

Wednesday, August 14, 2013

స్వాతంత్ర్యదినోత్సవం - భరతమాత అంతర్మధనం

 స్వాతంత్ర్యదినోత్సవం - భరతమాత అంతర్మధనం 
                  నాలుగు శతాబ్దాల పాటు దాస్య శృంఖలాలతో బంధీకృతులైన భారతీయులకు సంపూర్ణమైన స్వేచ్ఛ, పరిపూర్ణమైన పాలనావ్యవస్థకు నాంది పలికిన రోజు ఆగష్టు 15, 1947 వ సంవత్సరం. సంకెళ్ళు విడిపోయి, స్వేచ్ఛా విహంగాల్లా  సంపూర్ణంగా గుండెల నిండా స్వతంత్ర భారతావనిలోని స్వచ్ఛమైన గాలిని ప్రశాంతంగా పీల్చుకున్న రోజు  1947 ఆగష్టు 15. ఆవేదనలు, ఆందోళనలు, రోదనలు, హింసాకాండలు, మారణకాండలు, ,దురాగతాలు, బానిస బ్రతుకులు, అల్లకల్లోలమైన కుటుంబాలు, విడతీసి పాలించే రోజులకు స్వస్తి పలుకుతూ భ్రుకుటి ముడులు విడివడిన రోజు 1947 ఆగష్టు 15. 
                   స్వాతంత్ర్య పోరాట పటిమను పటిష్ట పరుస్తూ ఉద్యమానికి ఊపిరై, ఉద్యమకారుల లక్ష్యానికి దిశానిర్దేశమై, భారత జాతిని జాగృత పరచి, నిద్రాణమైన శక్తులను వెలికితీసి స్వతంత్ర్యం విలువను భారతావని అణువణువుకూ విశదీకరించి నిరంతరం వెన్నెముకలా వెన్నంటి నిలిచి స్వాతంత్ర్యాన్ని సాధించిన ఘనత పూజ్య బాపూజీకే దక్కింది. 
                               మహాత్మా గాంధీజీ నాడు ధరించిన శక్తివంతమైన ఆయుధం అహింస. సహనంతో ఏదైనా సాధించగలమని ఋజువు చేసిన వ్యక్తి గాంధీజీ. గాంధీజీ తాను ప్రజలకు చెప్పినదే చేసి వాగ్ధానాన్ని  అనుసరించే వారు. కనుకనే గాంధీజీ గారి నాయకత్వం ఆనాడు సఫలమైంది. 
                                  భారతావనిలో ఒక నాయకుడే. ఉద్యమ కారులంతా వారి బాటలోనే నడిచారు. లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, బాబూ రాజేంద్ర ప్రసాద్, గోపాల కృష్ణ గోఖలే, అబ్దుల్ కలాం ఆజాద్, దాదాబాయి నౌరోజీ, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్, ........ ఇలా ఎంతో మంది ప్రత్యక్షంగా,   పరోక్షంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని భారత మాతను దాస్య విముక్తురాలిని చేయుటలో సఫలీకృతులై మనకు స్వతంత్ర భారతాన్ని అందించారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఎందఱో కార్యకర్తలు భారతమాత మెడలోని దండలో పూవులై మెరిసి త్యాగమూర్తులైనారు. 
                                          అంతటి మహామహులు అందించిన ఈ స్వతంత్ర వృక్ష మధుర ఫలాలను నేడు మనం ఆస్వాదిస్తూ మన భావి తరాలకు కూడా స్వాతంత్ర్యం మనం జరుపుకోవడం లోని గర్వ కారణాన్ని వివరించడం మన బాధ్యత. 
                                              నేటి 67 వ జన్మదినాన్ని భరతమాత ఆవేదనగా చూస్తోంది. ప్రకృతిమాత విలపిస్తోంది. భరతమాత తన బిడ్డైన ఆంధ్రరాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని గాంధీ లాంటి నాయకుడు రాకపోతాడా! అలాంటి ధృఢ సంకల్పంతో మొక్కవోని విశ్వాసంతో ప్రజల ముందుకెళ్ళి తన బిడ్డ గాయాన్ని మాన్పక పోతారా! అని చూస్తుంటే, ఆంధ్రమాత పొట్టి శ్రీరాములు వంటి బిడ్డ రాకపోతాడా! అని ఆవేదన పూరితమైన అశ్రునయనాలతో తల్లి చేతిని ఆసరాగా చేసుకుని ఆంధ్రరాష్ట్ర ప్రజల వంక ఆశగా చూస్తోంది. బాధ్యత కలిగిన పౌరులుగా మన కర్తవ్యాన్ని గుర్తెరిగి, మన సమైక్యతా రాగాలాపనతో సమగ్ర సమైక్యాంధ్రతో కూడి 68 వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోగలమనే ధృఢసంకల్పంతో సాగుదాం....... ముందుకు సాగుదాం. 
     ********** జైహింద్**********

అమ్మభాష


అమ్మభాష
అమ్మ జోల పాడినంత -వీణతీగ మీటినంత 
                           శ్రావ్యమైనది మన తెలుగు భాష 
కన్నతల్లి పాలలా -రాయప్రోలు రాతలా 
                      కమ్మనైనది మన తెలుగుభాష 
అమ్మ  కథలు చెప్పినంత - ఆత్రేయ వారి భావమంత 
                            కమనీయమైనది మన తెలుగుభాష 
కన్నతల్లి మనసులా - జాషువా పలుకులా 
                        స్వచ్ఛమైనది మన తెలుగుభాష 
అమ్మ ఇచ్చిన బొమ్మలంత - నండూరి వారి ఎంకి అంత 
                        అందమైనది మన తెలుగుభాష 
అమ్మా అని పిలిచినంత -వేటూరి వారి గీతమంత 
                             మధురమైనది మన తెలుగుభాష 
అమ్మ నేర్పిన భాషలా - కృష్ణశాస్త్రి కవితలా 
                                 మరపు రానిది మన తెలుగుభాష 
కన్నతల్లి ప్రేమలా - కరుణశ్రీ పాటలా 
                                          అనిర్వచనీయమైనది మన తెలుగుభాష 
అమ్మలోని సుగుణంలా - గురజాడ దేశభక్తిలా
                                 ఆదర్శమైనది మన తెలుగుభాష 
కన్నతల్లి కరుణలా - శ్రీశ్రీ వారి రచనలా 
                                           అద్వితీయమైనది మన తెలుగుభాష 
అమ్మ చేతి దీవెనలా - రాయల వారి మాటలా 
                                         అజేయమైనది మన తెలుగుభాష 
ఇంత ఇంత ఇంతంటూ తెలుగు వైభవాన్ని 
ఎంతైనా చెప్పగలను అనుకున్నా నేను అజ్ఞానంతో.
చెప్పి చెప్పి అలసి సొలసి వెనుతిరిగి చూసుకున్నా 
నే చెప్పినదెంతా అని,
మహాసింధువులో బిందువంతే.
 జ్ఞానంతో కనులు తెరిచి
తెలుసుకున్నాను కొంత. 
ఇంత ఇంత ఇంతంటూ తెలుగుభాష ఔన్నత్యాన్ని చెప్పడంలోనే 
రాజులెందరో మునిగిపొయె 
కవులు పైకి తేలరాయె అని. 
ఆ మహామహులకు వారి పితామహులకు 
నా నమస్సుమాంజలులు. 
చెప్పలేను, చెప్పలేను ఇంతకంటే,
ఈ సాగరాన్ని ఈదలేను ఏనాటికి వీరికంటె. 
********

Monday, August 12, 2013

అమ్మభాష


అమ్మ జోల పాడినంత -వీణతీగ మీటినంత 
                           శ్రావ్యమైనది మన తెలుగు భాష 
కన్నతల్లి పాలలా -రాయప్రోలు రాతలా 
                      కమ్మనైనది మన తెలుగుభాష 
అమ్మ  కథలు చెప్పినంత - ఆత్రేయ వారి భావమంత 
                            కమనీయమైనది మన తెలుగుభాష 
కన్నతల్లి మనసులా - జాషువా పలుకులా 
                        స్వచ్ఛమైనది మన తెలుగుభాష 
అమ్మ ఇచ్చిన బొమ్మలంత - నండూరి వారి ఎంకి అంత 
                        అందమైనది మన తెలుగుభాష 
అమ్మా అని పిలిచినంత -వేటూరి వారి గీతమంత 
                             మధురమైనది మన తెలుగుభాష 
అమ్మ నేర్పిన భాషలా - కృష్ణశాస్త్రి కవితలా 
                                 మరపురానిది మన తెలుగుభాష 
కన్నతల్లి ప్రేమలా - కరుణశ్రీ పాటలా 
                                          అనిర్వచనీయమైనది మన తెలుగుభాష 
అమ్మలోని సుగుణంలా - గురజాడ దేశభక్తిలా
                                 ఆదర్శమైనది మన తెలుగుభాష 
కన్నతల్లి కరుణలా - శ్రీశ్రీ వారి రచనలా 
                                           అద్వితీయమైనది మన తెలుగుభాష 
అమ్మ చేతి దీవెనలా - రాయల వారి మాటలా 
                                         అజేయమైనది మన తెలుగుభాష 
ఇంత ఇంత ఇంతంటూ తెలుగు వైభవాన్ని 
ఎంతైనా చెప్పగలను అనుకున్నా నేను అజ్ఞానంతో.
చెప్పి చెప్పి అలసి సొలసి వెనుతిరిగి చూసుకున్నా 
నే చెప్పినదెంతా అని,
మహాసింధువులో బిందువంతే.
 జ్ఞానంతో కనులు తెరిచి
తెలుసుకున్నాను కొంత. 
ఇంత ఇంత ఇంతంటూ తెలుగుభాష ఔన్నత్యాన్ని చెప్పడంలోనే 
రాజులెందరో మునిగిపొయె 
కవులు పైకి తేలరాయె అని. 
ఆ మహామహులకు వారి పితామహులకు 
నా నమస్సుమాంజలులు. 
చెప్పలేను, చెప్పలేను ఇంతకంటే,
ఈ సాగరాన్ని ఈదలేను ఏనాటికి వీరికంటె. 
********