Tricks and Tips

Wednesday, August 14, 2013

స్వాతంత్ర్యదినోత్సవం - భరతమాత అంతర్మధనం

 స్వాతంత్ర్యదినోత్సవం - భరతమాత అంతర్మధనం 
                  నాలుగు శతాబ్దాల పాటు దాస్య శృంఖలాలతో బంధీకృతులైన భారతీయులకు సంపూర్ణమైన స్వేచ్ఛ, పరిపూర్ణమైన పాలనావ్యవస్థకు నాంది పలికిన రోజు ఆగష్టు 15, 1947 వ సంవత్సరం. సంకెళ్ళు విడిపోయి, స్వేచ్ఛా విహంగాల్లా  సంపూర్ణంగా గుండెల నిండా స్వతంత్ర భారతావనిలోని స్వచ్ఛమైన గాలిని ప్రశాంతంగా పీల్చుకున్న రోజు  1947 ఆగష్టు 15. ఆవేదనలు, ఆందోళనలు, రోదనలు, హింసాకాండలు, మారణకాండలు, ,దురాగతాలు, బానిస బ్రతుకులు, అల్లకల్లోలమైన కుటుంబాలు, విడతీసి పాలించే రోజులకు స్వస్తి పలుకుతూ భ్రుకుటి ముడులు విడివడిన రోజు 1947 ఆగష్టు 15. 
                   స్వాతంత్ర్య పోరాట పటిమను పటిష్ట పరుస్తూ ఉద్యమానికి ఊపిరై, ఉద్యమకారుల లక్ష్యానికి దిశానిర్దేశమై, భారత జాతిని జాగృత పరచి, నిద్రాణమైన శక్తులను వెలికితీసి స్వతంత్ర్యం విలువను భారతావని అణువణువుకూ విశదీకరించి నిరంతరం వెన్నెముకలా వెన్నంటి నిలిచి స్వాతంత్ర్యాన్ని సాధించిన ఘనత పూజ్య బాపూజీకే దక్కింది. 
                               మహాత్మా గాంధీజీ నాడు ధరించిన శక్తివంతమైన ఆయుధం అహింస. సహనంతో ఏదైనా సాధించగలమని ఋజువు చేసిన వ్యక్తి గాంధీజీ. గాంధీజీ తాను ప్రజలకు చెప్పినదే చేసి వాగ్ధానాన్ని  అనుసరించే వారు. కనుకనే గాంధీజీ గారి నాయకత్వం ఆనాడు సఫలమైంది. 
                                  భారతావనిలో ఒక నాయకుడే. ఉద్యమ కారులంతా వారి బాటలోనే నడిచారు. లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, బాబూ రాజేంద్ర ప్రసాద్, గోపాల కృష్ణ గోఖలే, అబ్దుల్ కలాం ఆజాద్, దాదాబాయి నౌరోజీ, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్, ........ ఇలా ఎంతో మంది ప్రత్యక్షంగా,   పరోక్షంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని భారత మాతను దాస్య విముక్తురాలిని చేయుటలో సఫలీకృతులై మనకు స్వతంత్ర భారతాన్ని అందించారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఎందఱో కార్యకర్తలు భారతమాత మెడలోని దండలో పూవులై మెరిసి త్యాగమూర్తులైనారు. 
                                          అంతటి మహామహులు అందించిన ఈ స్వతంత్ర వృక్ష మధుర ఫలాలను నేడు మనం ఆస్వాదిస్తూ మన భావి తరాలకు కూడా స్వాతంత్ర్యం మనం జరుపుకోవడం లోని గర్వ కారణాన్ని వివరించడం మన బాధ్యత. 
                                              నేటి 67 వ జన్మదినాన్ని భరతమాత ఆవేదనగా చూస్తోంది. ప్రకృతిమాత విలపిస్తోంది. భరతమాత తన బిడ్డైన ఆంధ్రరాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని గాంధీ లాంటి నాయకుడు రాకపోతాడా! అలాంటి ధృఢ సంకల్పంతో మొక్కవోని విశ్వాసంతో ప్రజల ముందుకెళ్ళి తన బిడ్డ గాయాన్ని మాన్పక పోతారా! అని చూస్తుంటే, ఆంధ్రమాత పొట్టి శ్రీరాములు వంటి బిడ్డ రాకపోతాడా! అని ఆవేదన పూరితమైన అశ్రునయనాలతో తల్లి చేతిని ఆసరాగా చేసుకుని ఆంధ్రరాష్ట్ర ప్రజల వంక ఆశగా చూస్తోంది. బాధ్యత కలిగిన పౌరులుగా మన కర్తవ్యాన్ని గుర్తెరిగి, మన సమైక్యతా రాగాలాపనతో సమగ్ర సమైక్యాంధ్రతో కూడి 68 వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోగలమనే ధృఢసంకల్పంతో సాగుదాం....... ముందుకు సాగుదాం. 
     ********** జైహింద్**********

No comments:

Post a Comment