Tricks and Tips

Saturday, September 28, 2013

చిలకా.....చిలకా.....

                                                                                           చిలకా.....చిలకా.....



చిలకా.....చిలకా.....చిలకా.....చిలకా.....
చిలిపి చిలుక పిలిచింది
                చిక్కులెన్నో తెచ్చింది
చెక్కిలి నొక్కి పోయింది
               చక్కిలిగింతలు పెట్టింది
చక్కనిదానా చిక్కనిదానా
ఒంపుల సొంపుల ఓ చిన్నదానా
నా దరికి వస్తావా - నన్నల్లుకు పోతావా
చాటుంది రావేమే - ముద్దులన్నీ తీర్చేనే
                                                  ll చి ll
ఒట్టుపెట్టి చెప్పింది
                    ఒక్కమాట రమ్మంది
ఉక్కిరిబిక్కిరి చేసింది
                       ఊపిరి తీసుకుపోయింది
టక్కరిదానా టెక్కులదానా
అందాలెన్నో ఉన్నదానా
మనసు నీదే వస్తావా - మాయచేసి పోతావా
తాపం తీర్చి పోరాదా - కాలమంతా నీకేగా
                                     ll చి ll
టక్కున కన్ను కొట్టింది
                       పెదవిని పంటితో నొక్కింది
హావభావాలిచ్చింది
              ఐసులాగా చేసింది
అల్లరిదానా కొంటెదానా
బంగారులేడి వన్నెదానా
అందాలన్నీ యిస్తావా - అలరించి పోతావా
ఆశలన్నీ తీర్చేవా -ఆదమరచి పోయేలా
                                    ll చి ll
అల్లరిచూపు చూసింది
                   అల్లుకుపోతా రమ్మంది
 మల్లెలు కొలిచి తెచ్చింది
                మనసునిట్టే దోచింది
చెక్కిట నొక్కులు ఉన్నదానా
వన్నెల చిన్నెల ఓ చిలిపిదానా
ఆ దరినే నిలిచేవా - నా దరికి రారాదా
నావన్నీ నీవేలే - నన్నల్లుకు పోవేమే
                                           ll చి ll
*********

Friday, September 27, 2013

కమనీయం 'క' గుణింతం

 కమనీయం 'క' గుణింతం
లం చేత పట్టుకుంటే
కాలమన్నది తెలియదంతే
కిలకిలకిల పక్షులరాగాలు
కీచురాళ్ళ వాద్యాలు
కుసుమములపై భ్రమరనాదాలు
కూనలమ్మ పదాలు
కృషీవలుని  స్వేదబిందువులు
కౄరమృగదర్పాలూ
కెంపు వన్నెతో సూరీడు
కేరింతల పసిబిడ్డలు
కైమోడ్చిన గోపికలు
కొంటె కృష్ణుని లీలలు
కోయిలమ్మ కుహుకుహులు
కౌలు రైతు కడగండ్లు
కంద పద్యములో కూర్చి కొంత
కఃనీగా రాసి మిగతా, చూసే సరికి తెల్లవారె.
             **************

Thursday, September 19, 2013

ప్రేమారాధన



ప్రేమారాధన 
ఓ నల్లనివాడా!
నా పవిత్ర  నయనధారలతో -అత్యంత  ప్రియమార 
నీ కభిషేక మొనర్చనా!
నా హృదయాంతరాలలోని భక్తి భావ గంధాన్ని -నీ మైపూత చేసి 
నిను స్వాంతన పరచనా !
నా భావకుసుమాలు మాలికలల్లి -ప్రేమమీర 
నీ కంఠసీమను అలంకరించనా!
నాకనుదోయి కాంతులనే -నీ ఆరాధనా 
జ్యోతులుగా వెలిగించనా !
నా మధుర గానామృతాన్ని - నివేదనగా చేసి 
ముద్దారా నీ నోటికందించనా!
నీ నామస్మరణలో నే లీనమై - తనివితీరా 
నీ వీనులనలరించనా!
నీ మ్రోల కైమోడ్చి నా నమస్సుమాలను - 
నీ పాదపద్మముల కర్పించి నిను అర్చించనా!
నీ కరుణా కటాక్ష వీక్షణాల - నిరీక్షణలోనే 
నిరంతరం నే తరించనా!
*******

Monday, September 16, 2013



ఓం నమః శివాయ 

ఓం నమః శివాయ-------        ll 5 ll
పరమేశ్వరా పార్వతీ పరమేశ్వరా 
ప్రణమిల్లి మ్రొక్కెద ప్రమధ గణనాధా 
ప్రణామములివె నీకు భక్త సులభంకరా     ll ll

భువనములోని అందములన్నీ 
కాంచగ మాకీ నయనము లొసగిన 
జ్యోతిర్లింగా ....... జ్యోతిర్లింగా నీకిదె 
        దీపం సమర్పయామి               ll 3  ll 

భువిలో విరిసిన సుగంధములన్నీ 
ఆఘ్రాణించగ మాకు నాసిక నొసగిన
ఫణిభూషితలింగా ........ ఫణిభూషితలింగా నీకిదె   
      ధూపం సమర్పయామి      ll 3  ll

పుణ్యక్షేత్ర జేగంటా నాదముల 
శ్రవణము సేయగా మాకు కర్ణము లొసగిన
కరుణాకరలింగా....... కరుణాకరలింగా నీకిదె 
   పుష్పం సమర్పయామి                 ll 3  ll 

ప్రకృతిలోని భావములన్నీ 
వ్యక్తము సేయగా మాకు స్పర్శను ఒసగిన 
బిల్వార్చితలింగా......... బిల్వార్చితలింగా నీకిదె 
     చందనం సమర్పయామి              ll 3  ll

నలభీమాదుల షడ్రసోపేతముల 
ఆస్వాదించగ మాకు జిహ్వను ఒసగిన 
పరమాత్మకలింగా........ పరమాత్మకలింగా నీకిదె  
  నైవేద్యం సమర్పయామి          ll 3  ll 

పంచాక్షరీ నామ మహిమాన్వితముచే 
పంచక్రియా జ్ఞానేంద్రియముల మాకొసగిన 
మహాప్రాణలింగా....... మహాప్రాణలింగా..... నీకివె 
మా ప్రణామములు 

ఓం నమః శివాయ-------        ll 5 ll
********


Thursday, September 12, 2013

ఓ సమైక్యాంధ్రుడి తెరాస గీతం

తెలంగాణ రాయలసీమమైక్యాంధ్ర గీతం 

(భారతమాతకు జేజేలు పాట వింటుంటే రాయాలనిపించి రాసిన గీతం)

పల్లవి:     ఆంధ్రమాతకు జేజేలు - అమరజీవికి జేజేలు 
              ఆ తెలంగాణ రాయలసీమ 
              మైక్యాంధ్రకు జేజేలు                   ll ఆంధ్ర ll

చరణం:    సమైక్యాంద్రే    సమర్ధభూమి 
               సంపూర్ణతకది సార్ధకభూమి 
               తెలుగుభాషకై వెలసిన భూమి 
                తెలుగు తేజము పంచిన భూమి      ll ఆంధ్ర ll

చరణం:      మన జీవములో  మన భావములో 
                 సమైక్యవాదమె నినాదముగా
                 సమర శంఖారావము సేయుచు 
                 ఐక్యత రాగము నాలాపించెను       ll ఆంధ్ర ll 
చరణం: శాతవాహనుల శాసనాలు - రెడ్డిరాజుల కట్టడాలు 
            కాకతి రాజులు - కృష్ణరాయలు 
          తెలుగు బిడ్డలై - తరియించిన భూమి    ll ఆంధ్ర ll 
                               
                                  ******* 
                 

Wednesday, September 4, 2013

ఆచార్యదేవోభవ!

ఆచార్యదేవోభవ!

గురుపూజోత్సవమును పురస్కరించుకుని ఈ సంవత్సరం పదవీ విరమణ చేయుచున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు నా ఈ చిరు అభినందనమాలిక. 
 
ఉద్యోగ అధ్యాయాన్ని పూర్తి చేయబోవుచున్న 
ఉపాధ్యాయులకు నా నమస్సుమాంజలి. 
 
అధ్యాయాలెన్నో అధ్యయనం చేసి 
అధ్యాపకులుగా చేరారు. 
ఎందరెందరికో విద్యను నేర్పి 
ఎంతో ఆదర్శం అయ్యారు.
 
అందరికీ చూపారు 
అందమైన విద్యావనం. 
అందులోనికి బాటలు వేసి 
చూపించారు నందనవనం.
 
నాటినారు విద్యార్ధులలో 
ఓనమాల విత్తనాలు,
పూయించారు వారిలో 
విద్యాసుగంధ సుమాలు. 
 
ఆ విద్యను అందుకున్న వారు నేడు 
అందనంత ఎత్తుకు ఎదిగి,
అధికారులై నిలబడగా 
అంతకన్నా టీచరుకు ఆనందం ఏముంది?
 
అనుకోనిది ఊహించి 
అనుకున్నది సాధించి 
అందరి మంచి కోరుకునే 
ఆదర్శమూర్తులే ఈ ఉపాధ్యాయులు. 
 
ఉద్యోగాలలో చేరిన నాడు 
ఊరి నుండి పొందిన మన్నన,
నేడు చూడ మచ్చుకైన 
లేనేలేదు ఏ కోశానా. 
 
అయినా వారు నిలిచారు
స్థితప్రజ్ఞతను చూపారు. 
మొక్కవోని విశ్వాసంతో 
విద్యావృక్షం పెంచారు. 
 
అలసి సొలసి నిలిచారు 
మన అందరి వంక చూశారు. 
పువ్వుల గుత్తులు తీసుకుని 
చిరునవ్వులు మనకు రువ్వారు. 
 
ఆఖరుగా

దేవుడు వారిని దీవించి,
ఆరోగ్యాన్ని అందించి,
సుఖశాంతులను చేకూర్చి,
చింతలు లేక చిరకాలం 
జీవించాలని ఆశిద్దాం. 
వారులేని కొరత మనకు 
లేనేలేదు అనుకునేట్లు 
అన్ని వేళలా వారు మనకు 
అందుబాటులోనే ఉండాలి. 
వారి ఆశీస్సులు మన వెంటే అచిరకాలం ఉండాలి.
*******