Tricks and Tips

Sunday, August 24, 2014

వాడిపోయిన రైతన్న వదనం......

నోళ్ళు తెరచిన బీళ్ళు చూసి
ఆశచావక మబ్బు కోసం నింగికేసి
చూస్తున్న వాడిపోయిన రైతన్న వదనం

చినుకు రాలక వడలి , వాడి
వాలిపోయిన వరినాట్లను చూసి
వేదనతో వాడిపోయిన రైతన్న వదనం

అప్పు ఇచ్చిన ఆసామికి
ఎదురుపడలేక , ఎదురుపడక తప్పక
తలదించిన వాడిపోయిన రైతన్న వదనం
 

ఈ ఏటి పంటతో తన పెళ్ళి
జరిగిపోతుందనుకునే కూతురి
సంతోషాన్ని చంపలేక వాడిపోయిన రైతన్న వదనం

తనతో ఏడడుగులు వేసిన భార్య
పుస్తెలతాడును తాకట్టు నుండి
విడిపించి తేలేక వాడిపోయిన రైతన్న వదనం

మూసిన కన్ను తెరవక ముసలి తల్లి
మూల్గుతుంటే మందుబిళ్ళ కొనే
స్థితిలేక వాడిపోయిన రైతన్న వదనం

తనను నమ్మిన కుటుంబానికి
పట్టెడన్నం పెట్టలేకపోయానే అనే
ఆవేదనతో వాడిపోయిన రైతన్న వదనం

పొలం అమ్మిపారేద్దాం అనే
కొడుకు మాటకు జవాబీయలేక
భూమాతకేసి చూస్తున్న వాడిపోయిన రైతన్న వదనం

ఋణమాఫీ ఆశతో మారు ఆలోచనకు
తావీయక ఓట్లు వేసి వారిని గెలిపించి
తానోడిపోయి ,
వాడిపోయిన వదనంతో రైతన్న....  

********

Friday, August 8, 2014

ఏమైనా మాట్లాడుతారు రాజకీయ నాయకులు....!

 అవునవును , సమాజం లోని అకృత్యాలన్ని ఆడవారి వస్త్రధారణ వల్లే జరుగుతున్నాయి..... ఓ పెద్ద మనిషిగారు ఇటీవలే సెలవిచ్చారు. కె.జి క్లాసులు....... చదివే పిల్లలు రెచ్చగొట్టే వస్త్రధారణ చేసుకుంటే జరిగిందా అమానుషం ? పాఠశాలలో పదవ తరగతి వరకు చదివే పిల్లలు ధరించే యూనిఫాం రెచ్చగొట్టే వస్త్రధారణా ? అకృత్యాలకు బలైపోయిన ఆడపిల్లలందరూ రెచ్చగొట్టే వస్త్రధారణలోనే ఉన్నారా , వారితో పాటు వెంట వున్న తల్లిని కూడా వదలని సమయాల్లో ఆ తల్లి కూడా రెచ్చగొట్టే వస్త్రధారణలో వుందా, ముప్ఫై , నలభై , యాభై , అరవై యేళ్ళ స్త్రీలు కూడా కామాంధులకు బలైపోతున్నారు కదా , మరి వారందరూ కూడా రెచ్చగొట్టే వస్త్రధారణలో వున్నారా...... ఏం మాట్లాడుతారు రాజకీయ నాయకులు....! ఏమైనా మాట్లాడుతారు రాజకీయ నాయకులు....!  సమాజంలో నానాటికీ స్త్రీల పట్ల పెరుగుతున్న అమానుషాల్ని ఎలా అరికట్టాలి అని ఆలోచించవలసినది పోయి , వారి దుస్తులను గూర్చి మాట్లాడడం ఎంత వరకు సమంజసం. అటువంటి అకృత్యాలకు పాల్పడేవారికి ఏ విధమైన శిక్షలు విధించాలి /ఏవిధమైన చర్యలు తీసుకోవాలి.... వంటి విషయాలను చర్చించ వలసినది పోయి ఇలా మాట్లాడతారా...... యువత పై ఎంతో ప్రభావం చూపుతున్న నేటి సినిమాలలోని అశ్లీలతను గూర్చి ఆలోచించవలసిన ఒకనాటి హీరోగారు....నేటి సమాజంలోని విలన్లను గూర్చి మాట్లాడక....... ఆడవారి వస్త్రధారణ గూర్చిమాట్లాడుతారా !!!!
 ఏవిషయమైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతో అవసరం .

********

Tuesday, August 5, 2014

అనగనగా కథలు పోయే ...........

 అనగనగా , కథలు పోయే ,
చందమామ కథలు పోయే ,
బాలమిత్ర కథలు పోయే ,
బొమ్మరిల్లు కథలు పోయే ,

నీతికథలను నీరుగార్చి ,
జానపద కథల జాడే మరచి ,
చారిత్రక కథలను చెరిపివేసి ,
ఇతిహాస కథలను ఇగిరించేసి ,
పురాణాలను పొలిమేరలు దాటించి ,

బామ్మల నుండి అమ్మల వరకు
బొమ్మలపెట్టెకు అతుక్కుపోయి ,
బాలల బంగరు బాల్యాన్ని
బొమ్మలపెట్టెకు బలిచేస్తుంటే ,

బాలనేరస్తులకు కొదవా లేదు....
అమ్మ బాధ్యతకు అర్ధం లేదు....

*****