Tricks and Tips

Sunday, August 24, 2014

వాడిపోయిన రైతన్న వదనం......

నోళ్ళు తెరచిన బీళ్ళు చూసి
ఆశచావక మబ్బు కోసం నింగికేసి
చూస్తున్న వాడిపోయిన రైతన్న వదనం

చినుకు రాలక వడలి , వాడి
వాలిపోయిన వరినాట్లను చూసి
వేదనతో వాడిపోయిన రైతన్న వదనం

అప్పు ఇచ్చిన ఆసామికి
ఎదురుపడలేక , ఎదురుపడక తప్పక
తలదించిన వాడిపోయిన రైతన్న వదనం
 

ఈ ఏటి పంటతో తన పెళ్ళి
జరిగిపోతుందనుకునే కూతురి
సంతోషాన్ని చంపలేక వాడిపోయిన రైతన్న వదనం

తనతో ఏడడుగులు వేసిన భార్య
పుస్తెలతాడును తాకట్టు నుండి
విడిపించి తేలేక వాడిపోయిన రైతన్న వదనం

మూసిన కన్ను తెరవక ముసలి తల్లి
మూల్గుతుంటే మందుబిళ్ళ కొనే
స్థితిలేక వాడిపోయిన రైతన్న వదనం

తనను నమ్మిన కుటుంబానికి
పట్టెడన్నం పెట్టలేకపోయానే అనే
ఆవేదనతో వాడిపోయిన రైతన్న వదనం

పొలం అమ్మిపారేద్దాం అనే
కొడుకు మాటకు జవాబీయలేక
భూమాతకేసి చూస్తున్న వాడిపోయిన రైతన్న వదనం

ఋణమాఫీ ఆశతో మారు ఆలోచనకు
తావీయక ఓట్లు వేసి వారిని గెలిపించి
తానోడిపోయి ,
వాడిపోయిన వదనంతో రైతన్న....  

********

2 comments:

  1. ఒక్క రైతన్నలోని అంతర్గత భావాలనన్నింటిని వెలికి తీయటంలో విజయవంతమైనావు .
    ఆ రైతన్నే ఓడిపోయాడు .

    కొస్ మెఱుపు చాలా వాడిగా వున్నది ఆ వాడి పోయిన రైతన్న వదనంలో .

    ReplyDelete
    Replies
    1. శర్మగారు మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete