Tricks and Tips

Thursday, February 27, 2014

నాసిక ధగధగ మెరిసింది......


తారలనన్నీ తెద్దామని,
ఆకాశతీరం చేరాను.
ఆశగ అన్నీ కోద్దామని,
తారాతీరం చేరాను.

 మబ్బుల మాటున తారలు నాతో ,
దాగుడుమూతలు ఆడాయి.
ఆటలో నేనే గెలిచాను,
 ఓ తారను చేతిలో బంధించాను.

అత్యాశకు జరిగా దూరంగా,
దొరికిన దానిని దగ్గరగా......
పొదుపుకుని ఆశలతీరం చేరాను,
అవని పథం పట్టాను.

అందాల మరదలి కన్నులు మూశా,
ఆ తారను ఆమె చేతిలో ఉంచా...
కన్నులు తెరిచి చూసింది,
నాసిక మీద ఉంచింది.

 నాసిక ధగధగ మెరిసింది,
మరదలు సిగ్గుతో కళ్ళు మూసింది.
నిశిరాతిరిలో మెరిసే తార,
నిరతము నాతో నిలిచే సితారతో. 

*******

Wednesday, February 26, 2014

జామురాతిరిలోనా........


తలగడ మీద తలవాల్చగనే ,
తలపుల తలపులు విచ్చుకుని ,
వలపుల విరులు విరిసినవి ,
నా తనువున విరుపులు తెచ్చినవి ,
చింత తీర్చగ రావా నా మామా....

కన్నుల మెరుపుల లోన ,
కురిసిన వెన్నెలలోనా ,
గాజుల గలగలలోనా ,
చిరుగాలి సవ్వడిలోనా ,
దోబూచులాడక రావా నా మామా ...

జామురాతిరిలోనా ,
జారిన మల్లెలలోనా ,
ఎదలో రొదలలోనా ,
వేగే విరహంలోనా ,
జాగు చేయక రావా నా మామా...

కలత నిద్దుర లోనా ,
కలవరింతలలోనా ,
మధురభావనలోనా ,
నా గుండె గూటిలోనా ,
ఉండిపోక రావా నా మామా...

రావా రావా నా మామా ,
చెంత చేరగ రా మామా ,
చిలిపి నవ్వుల నా మామా ,
చల్లగ మెల్లగ రా మామా ,
అందాల నా చందమామా... 
*******

Tuesday, February 25, 2014

అహ్హహ్హ.......నా భావం నా ఇష్టం....


నేను రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు
సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
నడచి వెళ్ళొచ్చు కదా, కొంచెం ఒళ్ళయినా తగ్గుతుంది......

నేను  సైకిల్ పై వెళ్ళేటప్పుడు
బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
పనీపాటా లేని వాడల్లా బైక్ విన్యాసాలు
చేయడమే ఏం బాగుపడతారో, ఏమిటో....  

నేను బైక్ పై వెళ్ళేటప్పుడు
కారులో వెళ్ళే వాళ్ళను చూసి ,
ఒక్కడు ఓడంత కారులో లింగులింగుమంటూ వెళుతూ
ట్రాఫిక్ , కాలుష్యం పెంచడం ఎంత బాధ్యతా రాహిత్యం....

నేను కారులో వెళ్ళేటప్పుడు
విమానంలో  వెళ్ళే వాళ్ళను చూసి ,
అమ్మబాబులు సంపాదించి పడేస్తే
విమానమెక్కి ఒక్కొక్కడూ తైతక్కలాడుతున్నాడు.....

నేను విమానంలో వెళ్ళేటప్పుడు
కారులో వెళ్ళే వాళ్ళను చూసి ,
ఏమిటో వీళ్ళింకేం ఎదుగుతారు.......

నేను కారులో వెళ్ళేటప్పుడు
బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
ఏమిటో వీళ్ళసలు ఎదుగుతారా.......

నేను బైక్ పై వెళ్ళేటప్పుడు
సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
వీళ్ళెప్పు
డు ఎదుగుతారో , ఏమిటో......

నేను నడిచి వెళ్ళేటప్పుడు
నా వంక చూసిన వారితో అన్నాను ,
 "నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది" అని .



***********

Monday, February 24, 2014

మా కథ ఇలా ముగిసింది....

కలిసింది , కలిసింది నన్నే నన్నే కలిసింది....
తలచింది , తలచింది నన్నే నన్నే తలచింది....
వలచింది , వలచింది నన్నే నన్నే వలచింది....
పిలిచింది , పిలిచింది నన్నే నన్నే పిలిచింది....

నవ్వింది , నవ్వింది నన్నే చూసి నవ్వింది....
మురిసింది , మురిసింది నన్నే చూసి మురిసింది....

విరిసింది , విరిసింది  నాకై నాకై  విరిసింది....
అలిగింది , అలిగింది  నాకై నాకై  అలిగింది....
ఆగింది , ఆగింది  నాకై నాకై  ఆగింది....
నిలిచింది , నిలిచింది నాకై నాకై  నిలిచింది....

జరిగింది , జరిగింది నాతో వివాహం జరిగింది....
వచ్చింది , వచ్చింది  నాతో నడిచి వచ్చింది....

అలిసింది , అలిసింది నాకై వేచి అలిసింది....
విసిగింది , విసిగింది  నాకై వేచి  విసిగింది....
నసిగింది , నసిగింది  నాకై వేచి  నసిగింది....
అరి
చింది , అరిచింది నాకై వేచి అరిచింది....

ముగిసింది , ముగిసింది మా కథ ఇలా ముగిసింది....

***********

Sunday, February 23, 2014

ఆహుతైపోతున్న మన విద్యార్ధులు........

ఒకరితో ఒకరు రాజీ చేసుకునే రాజకీయ నాయకుల
కోసం చచ్చిపోతున్నారు మన విద్యార్ధులు .

చదువు సంధ్యలు విడచిపెట్టి రాజకీయ పోరాటంలో
కీలు బొమ్మలవుతున్నారు మన విద్యార్ధులు .

కుటుంబ బాధ్యత,అమ్మనాన్నల్ని వదిలిపెట్టి నాయకుల చేతిలో 
సమిధలవుతున్నారు మన విద్యార్ధులు .

పోరాటం ఏదైనా కావచ్చు రాజకీయ రణరంగంలో
పావులవుతున్నారు మన విద్యార్ధులు .

తల్లిదండ్రుల ఆశలు నీరుకార్చి వ్యర్ధ నేతల
పిలుపులతో బలైపోతున్నారు మన విద్యార్ధులు .

నవచైతన్యం పేరు మాటున ఉద్యమాల
నయవంచనకు గురవుతున్నారు మన విద్యార్ధులు .

వయసు మీరిన రాజకీయ జంబుకాల
మోచేతి నీరు తాగుతున్నారు మన విద్యార్ధులు .

విద్యలలో ఆరితేరి విజ్ఞానజ్యోతులు వెలిగించక
అజ్ఞానంలో మిగిలిపోతున్నారు మన విద్యార్ధులు .



సామాజిక బాధ్యత అర్ధాన్ని తెలుసుకోకనే అర్ధాంతరంగా
అసువులు బాస్తున్నారు మన విద్యార్ధులు .
 

భావిభారత ఆశావా నిర్మాతలు క్షణికావేశంలో భవిష్యత్తే లేకుండా
అగ్నికీలలకు ఆహుతైపోతున్న మన విద్యార్ధులు .
 

నాయకుల బిడ్డలు పాశ్చాత్య దేశంలో చదువుకుంటుంటే కనిపెంచిన 
తల్లిదండ్రుల కన్నీరుకు కారణమవుతున్నారు మన విద్యార్ధులు .
 
 ఓటు విలువ , జీవితపు విలువను గుర్తెరిగి ...నవసమాజ నిర్మాణ
బాధ్యతలందుకోను సిద్ధమవ్వాలి మన విద్యార్ధులు .

********

తేనె చినుకులు......


ఉత్తమ సంస్కారం  నమస్కారం ,
విశ్వాసమే  విజయ రహస్యం ,
 
స్పష్టతే  సమర్ధత ,
కల్మష మెరుగని
ప్రేమే ఇగిరిపోని గంధం ,
 
సోదర ప్రేమే సంఘ శక్తి ,
అశాశ్వతమే శాశ్వత సత్యం .
 

******

Saturday, February 22, 2014

కన్నులలో నా మామా......

వెన్నెలలో నా మామా ,
వదలకురా నా మామా ,
మబ్బుల్లో నా మామా ,
దాగొనక రా మామా ,

కాటుక కనులు నా మామా ,
కాంచెను నిన్ను నా మామా ,
కన్నులలో నా మామా ,
నీ కనులుంచు నా మామా ,

చేతి గాజులు నా మామా ,
చేర పిలిచే నిన్నేమామా ,
చేతులలో నా మామా ,
నీ చేతులుంచు నా మామా ,

కాలి అందెలు నా మామా ,
కాపు కాసే నీకై మామా ,
అందెలలో నా మామా ,
నీ అడుగులుంచు నా మామా ,

జడలో జాజులు నా మామా ,
జాలిగ చూచే
నిన్నేమామా ,
జాజులలో నా మామా ,
నీ మోజులుంచు నా మామా ,

మనసంతా నా మామా ,
మరులేరా నా మామా ,
మనస్సులో నా మామా ,
నీ మనసుంచు నా మామా ,

అందాల నా మామా ,
అందమైన నా మామా ,
అందంతో నా మామా ,
అలరించు చందమామ .

******

Thursday, February 20, 2014

రాష్ట్రాలు విడిపోతే పోనియ్....నాకెందుకు ?


  (నిజామాబాద్ లో జరిగిన సంఘటన వార్తల్లో చూసి స్పందించకుండా ఉండలేక ఇలా)

రాష్ట్రాలు విడిపోతే  పోనియ్ - ప్రభుత్వాలు కూలిపోతే పోనియ్
మానవత్వమే మంట కలిసాక - ఎవడేమైపోతే నాకెందుకు ?

బాబాయిలు , మేనమామలు - ఎవడైతేనేం ?
కడుపులో పెట్టుకుని కాచుకోవలసిన వారే .....
పెట్రోలు పోసి ఒకడు , నిప్పుల కొలిమిలో వేసి ఒకడు
 ప్రాధేయపడుతూ , బలవంతంగా పెనుగులాడుతున్నా
పసిపిల్లలను అమానుషంగా కాల్చి చంపేస్తుంటే....

విభజన రభసల వివరాలేమైతే నాకెందుకు ?
నాటక బూటక వాగ్వివాదాలు నాకెందుకు ?

అన్న వరుసవాడు , కొడుకు వరుస వాడు
ఊరిలోని వాడు , ఊరి బయట వాడు
నీచ నికృష్ట పనులకు చేదోడువాదోడుగా
అపరిచయస్తులైనా తోడు నీడగా ఒకరికొకరు
విశృంఖలత్వానికి వికార సహాయ సహకారాలు
అందించడంలో అందె వేసిన చేతులు ,
ఆదర్శప్రాయాలై  విలయతాండవం చేస్తుంటే.....

ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేస్తే నాకెందుకు ?
ఎవరు రాజకీయ సన్యాసం తీసుకుంటే నాకెందుకు ?

నూరుగురు నేరస్తులు తప్పించుకున్నా ఫర్వాలేదు
ఒక నిర్దోషి దండనకు గురికాకూడదన్న శాసనం
అక్షరాలా , నూరుగురు నేరస్తులను తప్పించి
ఒక నిర్దోషిని శిక్షిస్తుంటే.......

లోక్ సభలో తన్నుకు చస్తే నాకెందుకు ?
రాజ్య సభలో కొట్టుకు చస్తే నాకెందుకు ?

తమ బిడ్డను కోల్పోయి , తమ బిడ్డలాంటి
మరెందరో ఆడపిల్లల భవిష్యత్తుకై
ఎదురు తిరిగి పోరాడిన తల్లిదండ్రులు
ఏళ్ళ తరబడి ఆవేదనను ఏకరువు పెట్టినా ....
ఆ నేరస్తులను ఏ కోర్టులు శిక్షించాయి ?
ఏ ఆడపిల్లలకు భరోసా ఇచ్చాయి ?
వేదనతోటి ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే....

రాజకీయ భజనలు నాకెందుకు ?
రాష్ట్రాల విభజనలు  నాకెందుకు ?

 యాసిడ్ , పెట్రోల్ , కిరోసిన్ , అగ్గిపెట్టె
వెంట బెట్టుకుని నడుస్తున్నవాడు ఒక మనిషా ?
మనుష్యులను నిలువునా కాల్చేసినవాడు ఒక మనిషా ?
వాడి చేష్టలను  ప్రోత్సాహించిన
వాడు ఒక మనిషా ?
వాడి తప్పును కాయడానికి వాదించేవాడు ఒక మనిషా ?
వాడి రక్షణకు ప్రయత్నించే కుటుంబ సభ్యుడు ఒక మనిషా ?
ఆ విధంగా బయటపడిన వానికి పిల్లనిచ్చేవా
డు ఒక మనిషా ?
వాడి సంతోషాలు పంచుకునేవాడు ఒక మనిషా ?
వాడిని గౌరవించేవాడు ఒక మనిషా ?
వాడిని పలుకరించేవాడు ఒక మనిషా ?

మానవత్వమే చచ్చిపోయాక , ఎవరేమైతే నాకెందుకు ?
 
ఎవడు ఎవడిని సస్పెండ్ చేస్తే నాకెందుకు ?
ఎవడు ఎవడిని అరెస్ట్ చేస్తే నాకెందుకు ?
వారంతా అప్రయోజకులైతే నాకెందుకు ?
అక్కడంతా అప్రజాస్వామికంగా ఉంటే నాకెందుకు ?
 
సామాన్య ప్రజల కన్నీరు తుడవలేని
ఇంతోటి ప్రభుత్వం ఉంటే నాకెందుకు ?
ఊడితే నాకెందుకు ?
 
*******





Wednesday, February 19, 2014

నేతల మొసలి కన్నీళ్ళు.......

మొన్నటి వకు నేతలకు......

చెవులకు పడ్డాయి దిబ్బళ్ళు ,
మూసుకు పోయాయి
కళ్ళు ,
మూతలు పడ్డాయి నోళ్ళు .

మూసుకు పోయాక వాకిళ్ళు.....

తొలగిపోయాయి
దిబ్బళ్ళు , 
తెరచుకున్నాయి కళ్ళు ,
అరుస్తున్నాయి నోళ్ళు .

రహదారికి అడ్డంగా రాళ్ళు ,
వాహనాలనడ్డుకోను తాళ్ళు ,
మూయబడ్డ స్కూళ్ళు .

పదవీ వ్యామోహ ఆకళ్ళు ,
నిరాశా నిస్పృహల లోగిళ్ళు ,
పోలీసు బలగాలతో కూడళ్ళు .
 
కార్చిన మొసలి కన్నీళ్ళు , 
రాజీనామాల గీకుళ్ళు ,
 చిత్తశుద్ధికి సంకెళ్ళు .
 
 

*******

Tuesday, February 18, 2014

చరిత్ర హీనులం కాకేమవుతాం.....?

మనమేం చేశాం ?
భరతజాతి దాస్య శృంఖలాలు తెంచిన
గాంధీజీని గాడ్సే గుళ్ళకు బలి చేశాం.......

పరదేశ పాలన నుండి విముక్తి పొంది
పరదేశ వనితకు దేశమిచ్చాం....

పనికిరాని వారికి ఓట్లు వేసి 
పదవులు ఇచ్చి అందలమెక్కించాం.....

అనైతిక నేతల చేతలలో
నైతిక విలువలు వెతుకుతున్నాం.....

అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలకు
అంతిమ సంస్కారం చేసేశాం........

ఇంతటి ఘనకార్యాలు సాధించిన
మనం చరిత్ర హీనులం కాకేమవుతాం ?

*******

Sunday, February 16, 2014

గాజుల శ్రీదేవి గాజులు.......

గాజులండీ , గాజులు - అందమైన గాజులు ,
 రంగురంగుల గాజులు - రండీ ,కొనండి గాజులు ,
వేసుకొనండీ గాజులు - వేయి రకాల  గాజులు ,

ఎర్రఎర్రని  గాజులు - పండు ముత్తైదు గాజులు ,
చిలకపచ్చని గాజులు - చిన్నపిల్లల గాజులు ,
 చిలిపిగ మోగే గాజులు - ఎందరో మెచ్చే గాజులు ,

నీలి నీలి  గాజులు  - మరదలు మెచ్చే గాజులు ,
పసుపు పచ్చని  గాజులు - పిన్నికి నచ్చే గాజులు ,
పలకరించే గాజులు -నిండుగ నవ్వే గాజులు
 
ఆకుపచ్చని గాజులు - ఆడబిడ్డ గాజులు ,
తొలివెలుగంటి గాజులు - తోడికోడలి  గాజులు ,
అందం పెంచే  గాజులు  - అందరికిష్టం  గాజులు ,

అరుణ కాంతి గాజులు - అత్తగారి గాజులు ,
మువ్వన్నెల గాజులు - ముద్దుల కూతురి గాజులు ,
ముచ్చట గొలిపే గాజులు - ముద్దుగ మోగే గాజులు ,

పంచవన్నెల గాజులు - పడతి మెచ్చే గాజులు ,
గంధం రంగు గాజులు - గడసరి పిల్లల  గాజులు ,
గలగల మోగే  గాజులు -  మోజులు పెంచే గాజులు ,

మేఘ  వర్ణం గాజులు - మేనత్త గాజులు ,
బంగరు రంగు గాజులు - భర్త మెచ్చే గాజులు ,
పిలచి వలచే గాజులు - పెంచే అందం గాజులు ,

అలరించే గాజులు - అతివకు అందం గాజులు ,
అలలా కదిలే గాజులు - అందరు మెచ్చే గాజులు ,
అందరికిష్టం గాజులు - గాజుల శ్రీదేవి గాజులు

********















Friday, February 14, 2014

దొరుకుతుందేమో అన్న ఆశతో....

అనుభవించని క్షోభ లేదు ,
అమ్మనాన్నలెవరో తెలియనందుకు...
 
ఆక్రోశించని క్షణంలేదు ,
మానసిక వేదన పంచుకోను మా కెవ్వరూ లేనందుకు ...


 బాధ పడలేదు మేమెన్నడూ ,
ఏడంతస్తుల మేడ మాకివ్వనందుకు...
 
చింతించలేదు మేమెన్నడూ ,
పంచభక్ష్యాలు మాకు అందనందుకు...

కలత చెందలేదు  మేమెన్నడూ ,
కంచి వస్త్రాలు కట్టుకోలేనందుకు...
 
ఆవేదన చెందలేదు మేమెన్నడూ ,
ఓ తరువు నీడయినా మాకు దక్కనందుకు...
 
నిరాశ చెందలేదు మేమెన్నడూ ,
అక్షరాస్యతను మాకు పంచనందుకు...

గుండె గూడు వేదనతో నిండగా ,
కన్నులు కడివెడు నీటితో నిండగా ,
చావని ఆశలు మనసులో నిండగా ,
 

కనులకు , మనసుకు పనులను చెబుతూ ...
కాళ్ళు , చేతులతో అసంకల్పితంగా...
 

వేదనతోటి వేసారిపోక వెదుకుతూనే ఉన్నాం...
నిర్జన , నిర్జీవ ప్రాంతంలో .....
 

మాకై పంపినదేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో....

****************

Thursday, February 13, 2014

చిలిపి చేష్టలింక మాను ......

చిలిపి చేష్టలింక మాను చిన్ని కృష్ణయ్య
అల్లరింక కట్టిపెట్టు అలకలేలయా.......

వెన్నముంత దొంగిలించి - వెన్ననంత తోడి తిని
చల్లముంత దాచిదాచి - చల్లనంత తాగి తాగి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

కొమ్మ పైన ఎక్కి నక్కి - పైటలన్ని దోచి దాచి
గోపికలు అడిగినంత - చిలిపిగాను నవ్వు రువ్వి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

 
యసోదమ్మ చాటు నక్కి - పైట కొంగులోన దాగి
అమ్మ నిన్నుఅడిగినంత -  బుంగమూతి పెట్టి చూసి
అదేమని అడుగుటయే పాపమేమయా
మా పాపమేమయా..........

చిలిపి చేష్టలింక మాను చిన్ని కృష్ణయ్య
అల్లరింక కట్టిపెట్టు అలకలేలయా.......

*******

Tuesday, February 11, 2014

నా మనసు విపంచిలా....


నీ ఆగమనంతో.....
నా ఒంటరితనమే విరిసిన పూల వనమయ్యింది ,
నా కనులు విప్పారి తారకల్లా మెరిశాయి ,
నా పెదవులు సుడివిడి అలల్లా సాగాయి ,
నా భావాలు కూనిరాగాలై పరవశించాయి ,
నా మనసు విపంచిలా విను వీధుల్లో విహరించ సాగింది .

*******


Monday, February 10, 2014

అమ్మ


అమ్మ ముక్కోటి దేవతల ఏక స్వరూపం
"అమ్మా"అనే పిలుపే సకల పుణ్యతీర్ధం
అమ్మను సేవించుటయే సకల దేవతార్చనం

అమ్మ చూపులు అనురాగపు జల్లులు
అమ్మ పిలుపులు తేనెల చినుకులు
అమ్మ పనులు అలయని అలలు

అమ్మ కరుణ అనంత సాగరం
అమ్మ దీవెన అఖండ దీపం
అమ్మ హృదయం అమృత భాండం

అమ్మ జోల సుమధుర నాదం
అమ్మ ప్రేమ మాయని మమత
అమ్మ ఓదార్పు తరగని గని  

అమ్మ మాట పెట్టని కోట
అమ్మ బాట పువ్వుల తోట 
అమ్మ మనసు కట్టని కోవెల

*******

Sunday, February 9, 2014

ఊహల్లో పులకింతలు.....


ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

కునుకుల్లో కలవరింతలు ,
ఊహల్లో పులకింతలు ,
ఊసుల్లో కవ్వింతలు ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

ఏకాంతమే ఏకాంతమై ,
ఆనందమే అనంతమై ,
ఊపిరి నిండా ఊరింతలు ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

చెలికాడే చేరువై ,
చిత్తంతో మాలిమై ,
మనసున నిండే గిలిగింతలే ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?

ఆలోచనలే సాగెలే ,
ఆలాపనలే అల్లెలే ,
చేతల నిండా అల్లరులే ,

ఏల , ఏల ఈ వింతలు ?
ఏల కన్నుల్లో ఈ కాంతులు ?


******

Saturday, February 8, 2014

అమ్మ కంట్లో కన్నీరే.....


నాకు ఊహ తెలిసిన వయసు నుండి
అమ్మ కంట్లో కన్నీరే
నాన్న దుర్వ్యసనాలకు సాక్షిగా....

నే బడికి వెళ్ళే వయసులోనూ
అమ్మ కంట్లో కన్నీరే
నా ఆకలి బాధకు సాక్షిగా...

నే కాలేజికి వెళ్ళే వయసులోనూ
అమ్మ కంట్లో కన్నీరే
పరీక్ష ఫీజు లేనందుకు సాక్షిగా...

నా చదువు ఆగిపోయిన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే 
        వివాహ వయసు దాటిపోతున్నందుకు సాక్షిగా ......

నా వివాహమైన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే
    దుర్వ్యసనాల అల్లుడికి సాక్షిగా....

నే తల్లినయిన తర్వాతా
అమ్మ కంట్లో కన్నీరే
నా ఆడపిల్ల సాక్షిగా....

ఇప్పటికీ మౌనంగానైనా
అమ్మ కంట్లో కన్నీరే
     నా కన్నీరు తుడవలేననే బాధకు సాక్షిగా....

అప్పటికి , ఇప్పటికి , మరెప్పటికీ
అమ్మ కంట్లో కన్నీరే
   ఓ తల్లి బాధ కనలేని సమాజానికి సాక్షిగా .....


********

Friday, February 7, 2014

అల్లరి పనుల కృష్ణయ్యా ......

 అల్లరి పనుల కృష్ణయ్యా , నన్నలరించగ ఇటు రావయ్యా ,
చిలిపినగవుల చూపులతో నా చెంత చేరవయా ....

కోరి నిన్ను తలచేను , చెంత చేరి మొక్కేను ,
చిలిపిగ నన్ను  చేరరావయ్యా....చేరరావయ్యా
నన్ను  చేరరావయ్యా ...

వెన్నముద్దలు తెచ్చేను , గోరుముద్దలు పెట్టేను ,
మరువక నన్ను  చేరరావయ్యా...చేరరావయ్యా
నన్ను  చేరరావయ్యా.....

వలచి నిన్ను పిలిచేను , తలపులన్నీ నీకేను ,
విడువక నాతో ఉండి పోవయ్యా.... ఉండి పోవయ్యా
 నాతో ఉండి పోవయ్యా.... 

 అల్లరి పనుల కృష్ణయ్యా , నన్నలరించగ ఇటు రావయ్యా ,
చిలిపినగవుల చూపులతో నా చెంత చేరవయా .... 

***********

ఆ కళ్ళే .....నా ఆశల పొదరిళ్ళు ...

కళ్ళను కళ్ళు చూసాయి ,
కళ్ళలో కళ్ళు కలిసాయి ,
కళ్ళ
తో కళ్ళు నవ్వాయి ,
కళ్ళతో కళ్ళను వెదికాయి ,
కళ్ళతో కళ్ళను పిలిచాయి ,
కళ్ళను కళ్ళు ప్రశ్నించాయి .
కళ్ళతో కళ్ళు అలిగాయి ,
కళ్ళతో కళ్ళు చెలిగాయి ,

 
నాలుగు కళ్ళు రెండయ్యాయి .....

ఆ కళ్ళే  నాకిళ్ళు ,
ఆ కళ్ళే నా ఆశల పందిళ్ళు ,
ఆ కళ్ళే నా తలపుల చప్పుళ్ళు ,
ఆ కళ్ళే నా కలల పరవళ్ళు ,
ఆ కళ్ళే నా ఆలోచనల పొదరిళ్ళు ,
ఆ కళ్ళే నా భావాల లోగిళ్ళు ,
ఆ కళ్ళే నా ఆనందాల ముంగిళ్ళు ,
ఆ కళ్ళే నా హృదయపు చప్పుళ్ళు ,

ఆ కళ్ళే నిర్లక్ష్యానికి నిచ్చెన వేస్తే....

ఆ కళ్ళే నా గుండెను గుచ్చే ముళ్ళు ,
ఆ కళ్ళే నా కళ్ళలో నిండిన కన్నీళ్ళు ,
ఆ కళ్ళే నా గొంతులో వచ్చే వెక్కిళ్ళు ,
ఆ కళ్ళే నా మదిలో బాధల సుళ్ళు ,
ఆ కళ్ళే నా సంతోషానికి సంకెళ్ళు .

*******

ఓ మంచి పని చేయరా...


 చేయరా ! నీ చేతితో - ఓ మంచి  ని చేయరా...
చిన్నదైన , పెద్దదైన -  మంచిదైతే చాలురా.........
నిలుచురా నీ పేరు - ఓ మంచి పని చేయగా.......
నిలుపురా నీ కీర్తి - నీవున్నను , లేకున్నను ....

నాటరా ! నీ చేతితో - ఓ మంచి విత్తు నాటరా.....
చూడరా ! ఆ చెట్టు - నింగికేసి పెరిగెరా..............
నీడనిచ్చు ఆ చెట్టు - శ్రామికుల సేదతీర్చు .......
పూవులిచ్చు ఆ చెట్టు - పూజలే ప్రోత్సహించు ..
ఫలములిచ్చు ఆ చెట్టు - అన్నార్తులనాదరించు ..
 గింజలిచ్చి ఆ చెట్టు - తన సంతతిని విస్తరించు ..
పచ్చదనాల ఆ చెట్టు - ప్రాణి కోటి కాపాడు ........
అణువణువు ఆ చెట్టు - ఔషధాలు అందించు.....
కడకు కట్టెగాను - తన దేహమందించు ...........
మన కట్టె కాల్చుటకును - తన కట్టెలందించు ...
 మన చితిలో తోడై - కడవరకు నిలుస్తూ .........
మన కట్టెతో పాటుగా - సహగమనమే చేయు తుదకు 

చిన్న విత్తును చూడరా - ఓ మంచి మని చేయరా... 
చిన్నదైన , పెద్దదైన -  మంచిదైతే చాలురా.........
నిలుచురా నీ పేరు - ఓ మంచి పని చేయగా.......
నిలుపురా నీ కీర్తి - నీవున్నను , లేకున్నను ... 

*******

Thursday, February 6, 2014

అమ్మా ! ఆకలి అమ్మా...... !

అమ్మా ! ఆకలి అమ్మా !
అమ్మా ! ఆకలి అమ్మా ! 
నీవెక్కడున్నావు అమ్మా ?
నన్నెందుకు వీధిలోనికి విసిరేశావమ్మా ?
నీవెక్కడున్నావు నాన్నా ?
నన్నెందుకు వదిలేశావు నాన్నా ?

అమ్మా , అమ్మా.....అని ఎవరు
వాళ్ళమ్మని పిలిచినా.....
నా మనసు మూగగా రోదిస్తూ
మౌనంగానే ఎలుగెత్తి అరుస్తోంది అమ్మా అని ,
ఎప్పటికైనా నా మూగ పిలుపు
నీ మనసును చేరుతుందేమో అనే ఆశతో
నీ కోసం ఎదురు చూస్తున్నానమ్మా ....

నాన్నా , నాన్నా అని ఏ పిల్లలు
వాళ్ళ నాన్నని పిలిచినా.....
నా గొంతు బాధతో మూసుకుపోతోంది మూగగా ,
నాలోని వేదనా కంపనాలు
నీ హృదయాన్ని చేరి స్పందింప చేయక పోతాయా అనే ఆశతో
నీ కోసం ఎదురు చూస్తున్నానాన్నా ....

హృదయానికి హత్తుకుని నను ముద్దాడేవారే లేరే ,
నను ఒడి చేర్చుకుని నా బుగ్గలు నిమిరేవారే లేరే ,
నా వేదనలు , రోదనలూ విని సముదాయించేవారే లేరే ,
కొంగును చుట్టూ కప్పి నను నిదురపుచ్చే వారెవరమ్మా ?
నా చేయి పుచ్చుకు నడిపిస్తూ బొమ్మలు కొనేదెవరమ్మా ?

ఆకలిగొన్న నా జానెడు పొట్టకు పిడికెడు అన్నం పెట్టేవారే లేరే ....
నా ఆకలి ఆర్తనాదాలు , నా నిస్సహాయ దీన ముఖమూ
కాంచిన వారెవ్వరికీ జాలి కలగదే .......

నా ముందునుండి రకరకాల
తినుబండారాలు తీసుకుపోయేవారే కానీ ,
తీసి చిన్ని నాచేతిలో పెట్టేవారే లేరే ,
అసలు నేనున్నానని గుర్తించేవారే లేరే ...

అవునవును , అమ్మా నాన్నా నా పై మీకే లేని ప్రేమానురాగం
వేరెవ్వరిలోనో నే వెదకుట నేరం .
నే చేసిన తప్పు ఏమిటి అమ్మా ?
నే చేసిన నేరం ఏమిటి నాన్నా ?


దేవుడా ! భూమిపై నా వంటి వారిని
పొరపాటుగనైనా పుట్టించకు ......
అన్నపూర్ణ దేశంలో నా ఆకలి చావుకు
నీవు కారణమెప్పుడు అవ్వద్దు .
******





Tuesday, February 4, 2014

ప్రేమవు నీవైతే ......

మేఘం నీవైతే - వర్షం నేనవుతా
చంద్రుడు నీవైతే - వెన్నెల నేనవుతా

సుమము నీవైతే - సువాసన నేనవుతా
ఫలము నీవైతే - మాధుర్యం నేనవుతా

వేణువు నీవైతే - నాదం నేనవుతా
వీణవు నీవైతే - తీగను నేనవుతా

గాయని నీవైతే - గానం నేనవుతా
కవివి నీవైతే - కలమును నేనవుతా

నర్తకి నీవైతే - నాట్యం నేనవుతా
అందెలు నీవైతే - మువ్వను నేనవుతా

శిల్పివి నీవైతే - ఉలిని నేనవుతా
శిల్పం నీవైతే - జీవకళను నేనవుతా

శ్వాసవు నీవైతే - ప్రాణం నేనవుతా
వక్తవు నీవైతే - శ్రోతను నేనవుతా

మాటవు నీవైతే - భావం నేనవుతా
పాటవు నీవైతే - పల్లవి నేనవుతా

ప్రేమవు నీవైతే - పెళ్ళిని నేనవుతా
పెళ్ళికూతురు నీవైతే - పెళ్ళికొడుకును నేనవుతా


********


Monday, February 3, 2014

అందరూ చదవాలి .....

టీచరు జాబ్ వచ్చిందని
సంతసిస్తే సరిపోదు ,
పట్టుబట్టి టీచర్లంత
చదువు విలువ తెలపుదాం .

బడి ఈడు పిల్లల్ని
బడికి తీసుకొద్దాము ,
తీసుకొస్తే సరికాదు
నిలుపుదల చేద్దాము .

చిన్ని చిన్ని పిల్లల్లో
అంతులేని సామర్ధ్యం ,
సద్దు చేయకుంటుంది
తట్టి మనం లేపుదాం .

చేత బెత్తం పట్టవద్దు
విసుగుదల చూపవద్దు .
ఆటపాటలతోటి మనం
చదువు సంధ్య నేర్పిద్దాం .

మారుమూల పల్లె సైతం
చదువులోన ముందంజ ,
వేసేలా మనమంతా
చేయాలి శ్రమ ఎంతో .

వయసుతోటి పనిలేదు
మీరు కూడ చదువుకోండి ,
అంటు ఊరివారి కందరికి
అక్షరాలు నేర్పుదాము .

పేదలంటు,ధనికులంటు
భేదాలు విడిచి మనం ,
చదువులోన అందరిని
ధనికుల్ని చేద్దాము .

ఆ పిల్లలు వేరు కాదు
మన పిల్లలు వేరు కాదు ,
అందరూ మనవాళ్ళే
అనుకుంటే నేర్పగలం .

అందరికి చదువొస్తే
అనుకున్నది సాధిస్తాం ,
ప్రగతి బాటలోన మనం
పయనమే చేస్తాము .

ఏ ఒక్కరిదో కాదు ఇది
అందరిదీ బాధ్యతే ,
అందరూ చదవాలి
అందరూ ఎదగాలి .

******

Sunday, February 2, 2014

అల్లరి పిల్ల......!


గెంతుతు నా చెంతకు వచ్చిన అల్లరి పిల్లను చూచితిరా
మీరల్లరి పిల్లను చూచితిరా
నాపై అలకను పూని ఏ వల్లరి మాటున దాగున్నదో....

తెల్లని బొండు మల్లెలతో - విరిసీ విరియని జాజులతో
ఎర్రని ముద్ద మందారంతో - ఝుము ఝుమ్మనె తుమ్మెద నాదంతో
పచ్చని పావడ రెపరెపతో - పల్లెకు తెచ్చే అందాలే

బంగరు రంగు పైరులతో - జలజల పారే ఏరులతో
చల్లని పిల్ల తెమ్మెరతో - కుహుకుహు కోకిల గానంతో
ఘలుఘల్లనె కాలి అందెలతో -పల్లెకు తెచ్చే కళకళలే

భానుని లేత కిరణంతో -
నులివెచ్చని సాయం సంధ్యతో
 పున్నమి వెన్నెల రాతిరితో  - మిలమిలలాడే మిణుగురుతో
గలగల చేతి గాజులతో - పల్లెకు తెచ్చే మిలమిలలే

అల్లన మెల్లన వస్తోంది - నవవధువల్లే నడిచింది
అందాన్నెంతో తెచ్చింది - ఆనందాన్ని ఇస్తోంది
విరితావులనే తాకింది - విరిసీ విరియక  నవ్వింది
ఆ కోల కన్నుల భావాలు -  కొలవగ నెవరికి సాధ్యము .

***********

Saturday, February 1, 2014

శుభముహూర్తమే ......


  శుభముహూర్తమే చేరువ కాగా ,
మంగళవాద్యం వినబడినంతనే మదిలో
అలల అలజడి మొదలవగా ....


నిన్నటి దినమున మీరు రెండుగా ,
నేటి బంధం చేయును ఒకటిగా .

ఆద్యంతము శ్రద్ధను వీడక ,
ఆరంభానికి పునాది వేయిక .

కలలను ఇలలో చూపే వేదిక ,
ఆశల సౌధం కాదా మీదిక .

కళకళలాడే పచ్చని పందిట ,
కల్యాణఘడియలు ఎంతో వేడుక .

హద్దుల కంచెను వేసుకుని ,
మీ చిగురాకు బంధాలకు 
అచిరకాలం కావలిగా ,
జీవితవనమున మాలిలుగా ,

చల్లని సాయంసంధ్యలలో ,
పూయించాలి సుమములు కోకొల్లలు .

సుగంధ పరిమళ పవనాలు ,
మీ భావాలతో బందీలయితే ,

సంతసమన్నది మీ దోసిట ఉన్నది ,
ఆస్వాదించుటే ఆలస్యమన్నది ,

నిత్య వసంతంతో మీ జీవితవనము ,
కావాలి ఆనంద నందన వనము .

*******