Tricks and Tips

Thursday, February 20, 2014

రాష్ట్రాలు విడిపోతే పోనియ్....నాకెందుకు ?


  (నిజామాబాద్ లో జరిగిన సంఘటన వార్తల్లో చూసి స్పందించకుండా ఉండలేక ఇలా)

రాష్ట్రాలు విడిపోతే  పోనియ్ - ప్రభుత్వాలు కూలిపోతే పోనియ్
మానవత్వమే మంట కలిసాక - ఎవడేమైపోతే నాకెందుకు ?

బాబాయిలు , మేనమామలు - ఎవడైతేనేం ?
కడుపులో పెట్టుకుని కాచుకోవలసిన వారే .....
పెట్రోలు పోసి ఒకడు , నిప్పుల కొలిమిలో వేసి ఒకడు
 ప్రాధేయపడుతూ , బలవంతంగా పెనుగులాడుతున్నా
పసిపిల్లలను అమానుషంగా కాల్చి చంపేస్తుంటే....

విభజన రభసల వివరాలేమైతే నాకెందుకు ?
నాటక బూటక వాగ్వివాదాలు నాకెందుకు ?

అన్న వరుసవాడు , కొడుకు వరుస వాడు
ఊరిలోని వాడు , ఊరి బయట వాడు
నీచ నికృష్ట పనులకు చేదోడువాదోడుగా
అపరిచయస్తులైనా తోడు నీడగా ఒకరికొకరు
విశృంఖలత్వానికి వికార సహాయ సహకారాలు
అందించడంలో అందె వేసిన చేతులు ,
ఆదర్శప్రాయాలై  విలయతాండవం చేస్తుంటే.....

ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేస్తే నాకెందుకు ?
ఎవరు రాజకీయ సన్యాసం తీసుకుంటే నాకెందుకు ?

నూరుగురు నేరస్తులు తప్పించుకున్నా ఫర్వాలేదు
ఒక నిర్దోషి దండనకు గురికాకూడదన్న శాసనం
అక్షరాలా , నూరుగురు నేరస్తులను తప్పించి
ఒక నిర్దోషిని శిక్షిస్తుంటే.......

లోక్ సభలో తన్నుకు చస్తే నాకెందుకు ?
రాజ్య సభలో కొట్టుకు చస్తే నాకెందుకు ?

తమ బిడ్డను కోల్పోయి , తమ బిడ్డలాంటి
మరెందరో ఆడపిల్లల భవిష్యత్తుకై
ఎదురు తిరిగి పోరాడిన తల్లిదండ్రులు
ఏళ్ళ తరబడి ఆవేదనను ఏకరువు పెట్టినా ....
ఆ నేరస్తులను ఏ కోర్టులు శిక్షించాయి ?
ఏ ఆడపిల్లలకు భరోసా ఇచ్చాయి ?
వేదనతోటి ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే....

రాజకీయ భజనలు నాకెందుకు ?
రాష్ట్రాల విభజనలు  నాకెందుకు ?

 యాసిడ్ , పెట్రోల్ , కిరోసిన్ , అగ్గిపెట్టె
వెంట బెట్టుకుని నడుస్తున్నవాడు ఒక మనిషా ?
మనుష్యులను నిలువునా కాల్చేసినవాడు ఒక మనిషా ?
వాడి చేష్టలను  ప్రోత్సాహించిన
వాడు ఒక మనిషా ?
వాడి తప్పును కాయడానికి వాదించేవాడు ఒక మనిషా ?
వాడి రక్షణకు ప్రయత్నించే కుటుంబ సభ్యుడు ఒక మనిషా ?
ఆ విధంగా బయటపడిన వానికి పిల్లనిచ్చేవా
డు ఒక మనిషా ?
వాడి సంతోషాలు పంచుకునేవాడు ఒక మనిషా ?
వాడిని గౌరవించేవాడు ఒక మనిషా ?
వాడిని పలుకరించేవాడు ఒక మనిషా ?

మానవత్వమే చచ్చిపోయాక , ఎవరేమైతే నాకెందుకు ?
 
ఎవడు ఎవడిని సస్పెండ్ చేస్తే నాకెందుకు ?
ఎవడు ఎవడిని అరెస్ట్ చేస్తే నాకెందుకు ?
వారంతా అప్రయోజకులైతే నాకెందుకు ?
అక్కడంతా అప్రజాస్వామికంగా ఉంటే నాకెందుకు ?
 
సామాన్య ప్రజల కన్నీరు తుడవలేని
ఇంతోటి ప్రభుత్వం ఉంటే నాకెందుకు ?
ఊడితే నాకెందుకు ?
 
*******





18 comments:

  1. చాలా కొద్ది మంది మనుషుల మద్య జీవిస్తున్నాం మనమిప్పుడు,
    సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతులకూ, సమస్యలకూ, ఆకలికీ, స్పందించని వ్యవస్తలో ఉన్నామిప్పుడు,
    కలం పట్టితే ఇలాంటి వేదనాశ్రువులే రాలుతాయని మూగగా మారి, వెక్కిరించే తెల్ల్లకాగితాన్ని ఎలాంటి పదాలతో నింపాలో తెలీక అసమర్దతతో.... అలమటిస్తున్నాను.
    దేవీ...మీ కవితలో కదంతొ్క్కే..సవాళ్ళకు జవాబు మనతరం లో దొరకదేమో..
    మానవతం మంటగలిసింది, వావివరుసలు మేకవన్నెలైనాయి,విలువలు వలువలిప్పేశాయి.
    కబోదులమై మిగతా జీవితాన్ని ఇలా అక్షరాలను తడుముకుంటూ బ్రతికేయాలేమో..

    ReplyDelete
    Replies
    1. శ్రీదేవి గారు రాసింది చదివాక మాటలు రాకపోతే, మీ స్పందన చదివాక నిజంగా కళ్ళలోనీళ్ళు తిరిగాయి! మీలాగా కనీసం నా ఆలోచనలను అక్షరాలలో కూడా ఉంచలేను! అక్షర సత్యాలు రాస్తున్నారు! అభినందనలు!

      Delete
    2. మీకు నా ధన్యవాదాలు Kln గారు.

      Delete
    3. ఇటువంటి వారి మధ్య ఉన్న అతి కొద్ది మంది మంచివారు ఆఖరి వరుకు మానవత్వంతో జీవించగలరా?అనే సందేహం మనసును తొలిచేస్తోంది మీరజ్.ఏదేమైనా నా భావాలకు వెంటనే స్పందించే మీకు ధన్యవాదములు.

      Delete
  2. అవునవును, నిజం.
    ఆట్టే మంది మనుషులు లేరు.
    ఐనదానికీ కానిదానికీ కొట్టుకుచచ్చే మనుషులే హెచ్చుగా ఉన్నారు.
    యాంత్రికజీవనంతో డీసెన్సిటైజ్ ఐపోయిన మానవమృగాలే హెచ్చుగా ఉన్నాయి.
    అసలుసిసలు మానవజీవాలు ఈ‌ అమానవీయమృగాలమధ్య నలిగినశిస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. కలికాలం కళ్ళకు కట్టినట్లుంది .
      శ్యామలీయంగారు మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete
  3. మానవత్వమే చచ్చిపోయాక, ఎవరేమైతే నాకెందుకు ?

    ఎవడు ఎవడిని సస్పెండ్ చేస్తే నాకెందుకు? ఎవడు ఎవడిని అరెస్ట్ చేస్తే నాకెందుకు? ఎవరు అప్రయోజకులైతే నాకెందుకు?
    కుటుంబాలు విడిపోతే పోనియ్....నాకెందుకు?

    మీ ప్రతి అక్షరంలోనూ ఆవేదనను చదవగలుగుతున్నాను శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. వార్తలు చూడాలంటే భయమేస్తోంది,మృగాల్లాంటి మనుష్యుల వికృత చేష్టలకు..నోట మాట రావడంలేదు చంద్రగారు.

      Delete
  4. నేటి సమాజాన మనుషులు దుర్యోధన, దుశ్శాసన, కీచక, రావణ వంశోధ్ధారకులు కదా అలానే ఉంటారు
    ఇలాటి వారిని చూస్తూ సామాన్యుడు నాకెందుకులే అనుకుంటున్నాడు. అలా కాక వీరిని అంతమొందించే రామబాణమో సుదర్శన చక్రమో సామాన్యుడు ధరించ గలిగితే తిరిగి రామ రాజ్యాన్ని స్థాపించుకోగలమేమో

    ReplyDelete
    Replies
    1. కలియుగంలో ఇవన్నీ సాధ్యమా హరితా ?

      Delete
  5. Replies
    1. ఏమీ చేయలేని స్థితిలో నిట్టూర్పులు కాక ఏం వస్తాయి ఫణిగారు ....

      Delete
  6. ఒకప్పుడు ఈ బతుకుమీద ఈ సమాజం మీద ఈ ప్రపంచపు కుళ్ళు మీద తిరగబడాలని కడిగేయాలని, తగలేయాలని ఉంటుంది. సహజం కూడా. చీకటిని తిట్టుకుంటూ కూచుంటే ఉపయోగం లేదు. ప్రయత్నం మీదనయినా చిన్న దీపం వెలిగించాలి. నిర్వేదం, కోపం క్షణికం కావాలి. అస్తు.

    ReplyDelete
    Replies
    1. తల్లిదండ్రులు చనిపోయారు కదా అని చేరదీసినందుకు
      కనీసం మానవత్వం లేకుండా చేసాడు కదా....వాడి
      చీకటి బ్రతుకులో చిరుదీపం వెలిగించినవారి కుటుంబంలో
      అకాలంగా చితిమంటలు రేపాడుగా శర్మగారూ....మంచి
      పనులకు ఇంక ప్రోత్సాహమెలా ఉంటుంది చెప్పండి.

      Delete
  7. మీ ప్రశ్న, ఆవేదన చాలా లోతుగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. Green Star గారు నా బ్లాగుకు స్వాగతం.నేటి సామాజిక సమస్యలు అంత వికృతంగా ఉన్నాయండి...అందుకే ఇంత లోతుగా,ఆవేదనగా,ఆక్రోశం.

      Delete
  8. ఎవరేమైతే నాకెందుకు? అని అనుకునే సగటు మనుషుల మధ్య మనందరం అనుకుంటున్నది అదేకదా!

    ReplyDelete
    Replies
    1. అలా అనుకోలేకేగా పద్మ గారు,మొన్నటివరకు డైరీలో ,ఇప్పుడు బ్లాగులో ఇలా ఆక్రోశం.

      Delete