Tricks and Tips

Monday, June 30, 2014

నా ఇంటి దారిలోన............


నా వంక సూడరాదటే ఓ పిల్లా
నా తోటీ పలకరాదటే ఓ పిల్లా
సేయి సేయి కలపరాదటే ఓ పిల్లా
               నా జీవితాన తోడు రావదే ఓ పిల్లా      ll నా వంక ll         

ఆ సూరీణ్ణి తెచ్చినానే ఓ పిల్లా
నీ సింధూరం
చేసినానే ఓ పిల్లా
ఆ కరిమబ్బుల్ని  తెచ్చినానే ఓ పిల్లా
               నీ  కాటుక చేసినానే   ఓ పిల్లా     ll నా వంక ll   

ఆ నెలవంకనీ  తెచ్చినానే ఓ పిల్లా
నీ నవ్వుకు అద్దినానే ఓ పిల్లా
ఆ తారల్ని  తెచ్చినానే ఓ పిల్లా
               నీ కొప్పులో తురిమినానే ఓ పిల్లా     ll నా వంక ll                         

ఆ ఇంద్రధనస్సు  తెచ్చినానే ఓ పిల్లా
నీ చీరగా మలచినానే ఓ పిల్లా
ఆ మెరుపుతీగల్ని  తెచ్చినానే ఓ పిల్లా
            నీ మేని వంపుల్లో ఉంచినానే ఓ పిల్లా      ll నా వంక ll        

నా మనసు  తెచ్చినానే ఓ పిల్లా
నీ మనసుకిచ్చినానే ఓ పిల్లా
నా ఇంటి దారిలోన ఓ పిల్లా
               నీకై మల్లెల్ని పరచినానే ఓ పిల్లా      ll నా వంక ll      
 
           *********** 

Wednesday, June 25, 2014

నిన్నేలు భాగ్యమీయరాదే ..........


ఇంతలోనే ఇంతై ఇంతింతై ఇష్టం మనసంతైన  ఓ ఇంతీ.....
ముద్దబంతిలా ముద్దుముద్దుగ మనసును దోచే  ఓ ముదితా....
లావణ్య లతలా భావాలను అల్లుకుపోయే  ఓ లతాంగీ....

వలపుతలపులను అలల్లా తట్టి లేపే  ఓ వనితా....
రంగుల కలలను రంగరించి రూపం గీసే  ఓ రమణీ....
వేకువ కిరణం వెలుగులా నులివెచ్చని భావన  ఓ వెలదీ....

కొత్త ఆశలు చివురులు వేసి పూమొగ్గలా విరిసిన  ఓ కొమ్మా....
పరవశించే ప్రణయ రాగమాలికా  ఓ పడతీ....
చెంత చేరి చల్లగ తాకే మలయమారుతమా  ఓ చెలీ....

నెలవంక నగవులతో నెయ్యము పంచే  ఓ నారీ....
తరతరాలుగా తరగని సుగుణాలరాశివి  ఓ తరుణీ....
కాలచక్రంలో కరిగిన రాజులు నీ పాదాక్రాంతులు  ఓ కాంతా....

మునిమాపువేళలో ముకుళిత కలువల సోయగమా  ఓ ముగ్ధా....
కోమల పుష్పజాతుల రాణివా  ఓ కోమలీ....
లలిత లాలన లాలిత్య లాహిరివా  ఓ లలనా....

మంచు వేళల విరిసిన మల్లెల సొగసువా  ఓ మగువా....
మానసవీణ మృదు మంజుల నాదమా  ఓ మనోహరీ....
మానవతకు మహిమాన్విత రూపమా  ఓ మహిళా....

కవనమును కనక కవ్వముతో చిలకగా వచ్చిన  ఓ కలికి....
అల్లిబిల్లి అల్లరి అలకల అల్లికవా  ఓ అతివా....
మనసు పాడే మధుర మోహనరాగమా  ఓ మానినీ....

కనులతో మనసును కలవరపెట్టే  ఓ కన్యా....
స్నిగ్ధ మనోహర సామరస్యమా  ఓ సఖీ....
తరువుల గురువుగ తనువును చీల్చే  ఓ తలోదరీ....

యుగయుగాలుగా యువకుల మదిలో అక్షయ కావ్య నాయికవే  ఓ యువతీ....

నడిరేయిలో సడిచేసే హృదయ మధురోహ స్పందనవా  ఓ నెలతా....
ప్రేమకు ప్రేరణ పల్లవి పాడే  ఓ ప్రేయసీ....
 

జీవితభాగస్వామిగ నిన్నేలు భాగ్యమీయరాదే  ఓ భామా....
*******


Saturday, June 21, 2014

నా తరమా సఖీ !

 సఖీ !
ఆ అదిరే చిరు
అరుణాధరాలపైని
మృదు మధుర
చిరుదరహాసాల
సుధా ధారలను
తులాభారం సేయగ
నా తరమా సఖీ !

***

Tuesday, June 17, 2014

నిస్వార్ధ నిరీక్షణ..........

నిరీక్షణ..........
నిరంతర నిరీక్షణ..........
అనంతమైన నిరీక్షణ..........
రైతన్న నిరీక్షణ..........

కంటిలోని తడి ఆరినా ,
ఆశల జడి ఆగక నిరీక్షణ..........

సూటిగ సూర్యకిరణాలు ధాటిగా గుచ్చుతున్నా ,
చేతిమాటుగా నింగికేసి నిరీక్షణ..........

బీటలు వారిన భూమిపై చతికిలబడి ,
తొలకరిజల్లులకై నిరీక్షణ..........

మృగశిరకార్తెలో వడగాడ్పులలో ,
వడలిన వదనాలతో నిరీక్షణ..........

రైతన్నా నీ నిరీక్షణ ,
నిస్వార్ధ నిరీక్షణ..........

కావలె నీ నిరీక్షణ సఫలం ,
మా జీవం ఫలించిన నీ నిరీక్షణా ఫలితం .


 **********

Sunday, June 1, 2014

నిష్ప్రయోజన రోదన............

 అమ్మ ......
నిను కనిపెంచిన అమ్మ ,
నీ అవసరాల్ని తీర్చిన అమ్మ ,
నిను కంటికి రెప్పలా చూసిన అమ్మ ,
నీకై నిదురను కాచిన అమ్మ ,
నీకై చేతులు చాచి యాచించిన అమ్మ ,
నీ ఆకలి తీర్చి , పస్తులున్న అమ్మ ,
నీకై పుస్తెలు అమ్మిన అమ్మ ,
నిను గుండెగూటిలో దాచిన అమ్మ .
 

ప్రతి రోజు నా బిడ్డ  పది కాలాల పాటు
చల్లగా వుండాలని , నిర్విరామంగా కోరుకునే 

నీచే గెంటివేయబడిన అమ్మ....
చెట్టు నీడన కూర్చుని ఆకాశం కేసి ఆశగా చూస్తూ ,
తన బిడ్డకు దీవెనలిమ్మని ఆ దేవుడిని
 వేడుకుంటోంది వేసారిపోక ....
 
ఆ గుండెగూటి కన్నా నీవు కట్టుకున్న ఏ భవనాలూ
ఏమంత గొప్పవి కాదని తెలుసుకున్న రోజున ,
తిరిగిరాని లోకాలకెళ్ళిన తల్లిని తలచుకుని ,
బరువెక్కిన హృదయంతో మౌనంగా రోదిస్తావు ,
కానీ సమయం మించిపోతుంది ,
నీ రోదన నిష్ప్రయోజనం . 

******