Tricks and Tips

Wednesday, June 25, 2014

నిన్నేలు భాగ్యమీయరాదే ..........


ఇంతలోనే ఇంతై ఇంతింతై ఇష్టం మనసంతైన  ఓ ఇంతీ.....
ముద్దబంతిలా ముద్దుముద్దుగ మనసును దోచే  ఓ ముదితా....
లావణ్య లతలా భావాలను అల్లుకుపోయే  ఓ లతాంగీ....

వలపుతలపులను అలల్లా తట్టి లేపే  ఓ వనితా....
రంగుల కలలను రంగరించి రూపం గీసే  ఓ రమణీ....
వేకువ కిరణం వెలుగులా నులివెచ్చని భావన  ఓ వెలదీ....

కొత్త ఆశలు చివురులు వేసి పూమొగ్గలా విరిసిన  ఓ కొమ్మా....
పరవశించే ప్రణయ రాగమాలికా  ఓ పడతీ....
చెంత చేరి చల్లగ తాకే మలయమారుతమా  ఓ చెలీ....

నెలవంక నగవులతో నెయ్యము పంచే  ఓ నారీ....
తరతరాలుగా తరగని సుగుణాలరాశివి  ఓ తరుణీ....
కాలచక్రంలో కరిగిన రాజులు నీ పాదాక్రాంతులు  ఓ కాంతా....

మునిమాపువేళలో ముకుళిత కలువల సోయగమా  ఓ ముగ్ధా....
కోమల పుష్పజాతుల రాణివా  ఓ కోమలీ....
లలిత లాలన లాలిత్య లాహిరివా  ఓ లలనా....

మంచు వేళల విరిసిన మల్లెల సొగసువా  ఓ మగువా....
మానసవీణ మృదు మంజుల నాదమా  ఓ మనోహరీ....
మానవతకు మహిమాన్విత రూపమా  ఓ మహిళా....

కవనమును కనక కవ్వముతో చిలకగా వచ్చిన  ఓ కలికి....
అల్లిబిల్లి అల్లరి అలకల అల్లికవా  ఓ అతివా....
మనసు పాడే మధుర మోహనరాగమా  ఓ మానినీ....

కనులతో మనసును కలవరపెట్టే  ఓ కన్యా....
స్నిగ్ధ మనోహర సామరస్యమా  ఓ సఖీ....
తరువుల గురువుగ తనువును చీల్చే  ఓ తలోదరీ....

యుగయుగాలుగా యువకుల మదిలో అక్షయ కావ్య నాయికవే  ఓ యువతీ....

నడిరేయిలో సడిచేసే హృదయ మధురోహ స్పందనవా  ఓ నెలతా....
ప్రేమకు ప్రేరణ పల్లవి పాడే  ఓ ప్రేయసీ....
 

జీవితభాగస్వామిగ నిన్నేలు భాగ్యమీయరాదే  ఓ భామా....
*******


No comments:

Post a Comment