Tricks and Tips

Saturday, November 30, 2013

ఏమిటి అమ్మా మాకీ బాధ ....?


ఎందుకు నాన్నా ఇలా చేస్తారు ,
మా మనసును ఎందుకు తెలుసుకోరు .. ?
ఏమిటి అమ్మా మాకీ బాధ ,
మా ఇష్టాలెందుకు తెలుసుకోరు  ?

అందరు డాక్టర్లు అయిపోతారా  ,
అందరు ఇంజనీర్లు అయిపోతారా  ,
చదువు , చదువు అంటూ మీరు 
ఎందుకు నాన్నా విసిగిస్తారు ?

సచిన్ అంటే సంబరపడతావ్ ,
సానియాని చూస్తే శభాష్ అంటావ్ ,
రెహమాన్ పాటకు రెపరెపలాడతావ్ ,
చిరును చూస్తే చిందులు వేస్తావ్ . 

మేం బ్యాట్ తో వస్తే బ్యాడ్ బాయ్ అంటావ్ ,
ఆటలు అంటే అమ్మో అంటావ్ ,
పాటలు పాడితే పాడౌతావంటావ్ ,
డాన్సు వేస్తే ధుమధుమలాడతావ్ . 

వారమ్మా ,నాన్నా మీలానే 
అడ్డం చెప్పి ఉండుంటే ,
అనే ఊహ మీకెపుడైనా 
కలిగిందా అమ్మా ,నాన్నా ?

టీచర్ ,లాయర్ ,పోలీస్ ,నర్సు 
సమాజానికి పనికి రారా ?
అందరు పల్లకి ఎక్కితే ,
మోసేవారు ఎవరమ్మా ?

మా మనసును మీరు తెలుసుకొని ,
మాకిష్టమైనా రంగంలో రాణించేలా చూస్తారా ,
మా సంతోషంలో ఎల్లపుడు ,
తోడుగా మాతో ఉంటారా ...?

********

Thursday, November 28, 2013

నాకై పాడిన నీ పాటలో ( నీ నవ్వు చెప్పింది నాతో )


  ( కొన్ని  పాటలు వింటుంటే ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది . 
అలా అనిపించిన పాటల్లో  "  అంతం   "  సినిమాలోని 
"  నీ నవ్వు చెప్పింది నాతో  " ఒకటి . 
అందుకే మరికొన్ని చరణాలు . )

నాకై పాడిన నీ పాటలో -  చదివాను నీ మనసుని
నాతో పలికిన నీ మాటలో - విన్నాను నీ ప్రేమని 
పలికేందుకే ఒకరు లేని -బతుకెంత బరువోఅని
      పిలిచేందుకే వీలులేని - స్థితి ఎంత జాలో అని  ll నీ ll

   చల్లని నీ కరకమలాలలో - నా తనువు కరిగించనీ 
   వెన్నెల తోడై పులకించనీ - నడిరేయి పొడిగించనీ        నామనసులోని భావం - నీకర్ధమవుతుందనీ 
నీ ముద్దు నా జీవితాన - తొలి పొద్దు అవుతుందనీ  ll నీ  ll

 చల్లని గాలే నను తాకనీ - హృదయాన్ని కదిలించనీ 
నల్లని నీ కనుపాపలలో - నా నీడ కనుపించనీ 
ఏ నాటికీ మరువలేని - మమకారమౌతావనీ
   నీ భావ కుసుమాలతో - నను బందీని చేస్తావని   ll నీ  ll

నాలో నిండిన నీ తలపులే - గంధాలు వెదజల్లని 
మల్లెల వానే కురిపించని - ప్రణయాన్ని పండించని 
ఏ వేళకి మరచిపోని - అల్లర్లు చేస్తావని 
నీ అలక నా జీవితాన్ని - పులకింపచేస్తుందని  llనీ ll 

నన్నే పిలిచే అధరాలనే - ప్రియమార ముద్దాడనీ 
తీయని నీ తొలివలపులలో - నను మరచిపోవాలని 
గువ్వల్లె నీ గుండెలోన - నను చేరి నిదురించని   
నీ గుండె చప్పుళ్ళు వింటూ- ప్రతి రేయి గడపాలని  llనీ ll

నాలో నిండిన ఈ మౌనమే - ఎద వీడి పోవాలని 
నీతో గడిపిన ఆ రోజులే - కలకాలముండాలని 
ఏడేడు జన్మాలలోను - కలనైన విడిపోవని 
     నీ రాక నా జీవితాన - నవజీవ మిస్తుందని  ll నీ  ll

ఏనాడైతే ఈ జీవితం - నీ కొరకు తపియించెనో 
నీవు ,నేను చెరి సగమనే - బంధాన్ని ముడివేయునో 
చిరుగాలి సన్నాయి పాడి - శుభవేళ   సూచించని 
మనువే మన జీవితాన - మధుమాసమౌతుందనీ  ll నీ ll

 *********


Wednesday, November 27, 2013

వరుడు


పువ్వులోని సుకుమారము ,
పుట్టతేనెలోని తియ్యదనము ,
పున్నమి వెన్నెల చల్లదనము ,
తొలకరి జల్లుల పరవశత్వము ,
నెరింగి 
నా జీవితవనంలో సుగంధ పరిమళభరితమైన 
గాలులు వీయించగల ,
నా జీవనమురళితో ఆనంద భైరవి రాగం 
ఆలపించగల ,
నా హృదయవీణతో మోహనరాగం 
పలికించగల ,
మనో సౌందర్య , సుకుమార భావాల ,
సుమధుర , చిరుదరహాసాలు గల
మహోన్నత వ్యక్తి నాకు 
 వరునిగా తారసపడ గలడా ...?

********

Tuesday, November 26, 2013

పిల్లవాడు జన్మించాడా ...... !
పిల్లవాడు జన్మించాడా ...... ! అంతే 
సంస్కృతిని తోసుకుంటూ ,
విష సంస్కృతి ఒక్క ఉదుటున 
జటలు విప్పి విజ్రుంభించి... 
అమ్మ జోలపాట కన్నా 
సెల్ పాట మంచిదంది ,
పెరటి తోట షికారు కన్నా 
బైక్ షికారు మంచిదంది ,
కొండపల్లి బొమ్మ కన్నా 
ప్లాస్టిక్ బొమ్మ మంచిదంది ,
రామనామ జపం కన్నా 
కెవ్వుకేక మంచిదంది ,
రంగు బొమ్మల పుస్తకం కన్నా 
టి . వి బొమ్మలు మంచివంది ,
మట్టి కుండ నీరు కన్నా 
ఫ్రిజ్ నీరు మంచిదంది . 
సంస్కృతి చేరుకుని చూసేసరికి ...
తల్లిదండ్రులు మురిసిపోతూ ,
తప్పెట్లు కొడుతుంటే ,
విష సంస్కృతి అది చూసి 
వికటాట్టహాసం చేసింది . 
*****

Monday, November 25, 2013

అమ్మాయికి సంబంధం కుదిరిందా ... ఎవరబ్బాయి ?

గుర్రం వారి మనుమడు ,
పిల్లి వారి పినతండ్రి ,
బర్రెల వారి బావమరిది ,
మేకా వారి మేనల్లుడు ,
గేదెల వారి అన్నయ్య ,
నక్కా వారి తమ్ముడు ,
కుక్కల వారి కొడుకు . 
 ******

Sunday, November 24, 2013

మనసారా నవ్వు ....... హాయిగా నవ్వు ......నవ్వరా నాన్నా ! నవ్వు
నవ్వరా కన్నా ! నవ్వు 
నవ్వరా చిట్టీ ! నవ్వు 
నవ్వరా బుజ్జీ ! నవ్వు 
మనసారా నవ్వు , 
ఎంతసేపైనా నవ్వు ,
ఏ సమయంలోనైనా నవ్వు ,
అలసిపోయేవరకూ నవ్వు ,
హాయిగా నవ్వు ,
ఆనందంగా నవ్వు . 
ఉష్ !నీకో రహస్యం చెప్పనా ?
నిను కవ్వించి , నవ్వించిన 
నీ తల్లిదండ్రులే నీ నవ్వును 
నీకు  చేస్తారు....  దూరం !
నీ నవ్వులను ఇక రెండేళ్ళలో 
పంపించేస్తారు...సుదూరం !
K.G  నుండి  P.G  వరకూ 
గ్రేడులు , ర్యాంకులు ఏవేవంటూ 
రుసరుసలాడుతూ ఉంటారు ,
బుసలు కొడుతూ చూస్తారు . 
సినిమా , సరదాలన్నావో!
సాధించిందేమిటి ? అంటారు .
 ఆదివారం అన్నావో !
అందరూ .. చూడు .. అంటారు . 
జ్వరమో , జలుబో వస్తేను 
టాబ్లెట్ వేసి ,స్వెట్టర్ వేసి ,
చేతికి పుస్తకం ఇస్తారు . 
నిద్దరపోతే తట్టి లేపి ,
గత మార్కులను  చూపెడతారు .
టి . వి  , నెట్ అన్నావో !
నివ్వెరపోతూ...చూస్తారు . 
ఆటలు ,పాటలు అన్నావో !
హవ్వ ... హవ్వ ... అంటారు .
విందులు ,వినోదాలు అన్నావో !
విస్తుపోతూ...చూస్తారు .
సమయం పోతే రాదంటూ ,
చెవిలో రొదలే పెడతారు . 
కాలం విలువ తెలిపేస్తూ ,
కటువుగా ప్రవర్తిస్తారు . 
ఎందుకిలా ? అన్నావో !
అంతా...నీకొరకంటారు . 
ఇంక అప్పుడేం నవ్వుతావ్ ?
ఎలా నవ్వగలుగుతావ్ ?

అందుకే...అందుకే  ...
 అందుకే నాన్నా ! ఇప్పుడే 
మనసారా నవ్వు ...హాయిగా నవ్వు ... 

*******

Saturday, November 23, 2013

ఆమె ...... ఎవరూ .... ?


గాజుల వారి ఆడపడచు ,
అందెల వారి అక్కయ్య ,
పగడాల వారి చెల్లెలు ,
గంధం వారి మేనకోడలు ,
ముత్యాల వారి మనుమరాలు ,
మువ్వల వారి మరదలు ,
 ఉంగరాల వారి కాబోయే కోడలు .

********

Friday, November 22, 2013

నవవిధభక్తితో నందనవనం


నవవిధ భక్తితో జీవితం 
ఆనంద నందనవనం
  
మీ శ్రద్ధాసక్తుల శ్రవణములే 
నా ఈ చిరునవ్వులు 
మీ అనంత కోటి కీర్తనలే 
నా ఈ చిన్ముద్రలు 
మీ మనఃపూర్వక స్మరణలే 
నా ఈ ఆశీస్సులు 
మీ పరవశ పాదసేవనమే
నా ఈ ఆశ్వాసం 
మీ ముకుళిత హస్త నమస్కారములే 
నా ఈ అనుసరణ 
మీ అకుంఠిత దీక్షా దాస్యములే 
నా ఈ ప్రేమామృతము 
మీ నిష్కల్మష సఖ్యతయే 
నా ఈ సందేశాలు 
మీ నిష్కామ ఆత్మ నివేదనయే
నా ఈ ఆస్వాదన 
మీ భక్తితో కూడిన అర్చనలే 
నా ఈ పునః దర్శనము

మీ త్రికరణశుద్ధి నిలయమే 
మీలో నా ఆస్థానం 

*******

Wednesday, November 20, 2013

చెలియా ! నా చెలిమికి కాకే దూరం .......చెలియ నవ్వు చూసి..... 
చెదరిపోయె మనసే,
కలువ కళ్ళు చూసి ..... 
కరిగిపోయె వయసే ,
నా కనులకు వేసెనే గాలం - నా నిదురకు చెల్లెనే  కాలం
చెలియ కురులు చూసి .... 
విరులు తురుమ తోచె ,
పెదవి విరుపు చూసి .... 
పలుకరించ తోచె ,
నా మనసే చేసెనె మారాం  - నా వయసే వదలదే గారాం

చెక్కిలి నొక్కులు చూసి... 
మెత్తగ నిమర తోచె ,
మేని వంపులు చూసి ... 
వీణలా మీటగ తోచె ,
నా వలపుకు నీవే మూలం - నా తలపుకు వేయకె తాళం 
చెలియ పలుకు వింటే .... 
పలవరించె పెదవే ,
చేయి చాచి పిలువ .... 
పులకరించె తనువే ,
నా కలలకు నీవే తీరం - నా చెలిమికి కాకే దూరం 
*********

Tuesday, November 19, 2013

ప్రకృతి వర " రత్నాలు "


మంచి గంధం  - మరు మల్లెలు
సన్న జాజులు  - విర జాజులు 
ముద్ద బంతులు  - చేమంతులు 
గులాబీలు  - పారిజాతాలు 
తొలకరి జల్లుల తరుణాన -  భూమాత పులకరింతలతో 
విరిసే మృత్తికా పరిమళాల గుబాళింపులు 
ఆప మనతరమా ? ఆపతరమా ?

రవిరాజు తీక్షణ కిరణాలు 
రేరాజు చల్లని కిరణాలు
వానజల్లుల వాలుతనము 
వెండిమబ్బుల తెల్లదనము 
సెలయేరుల గలగలలు 
ఆప మనతరమా ? ఆపతరమా ?

చిరుతలోని చురుకుదనము 
లేడికూన బేలతనము 
చిన్ని కుందేలు చిలిపిదనము 
మృగరాజు గాంభీర్యము 
హయములోని సామర్ధ్యము 
ఆప మనతరమా ? ఆపతరమా ?

చిలుకమ్మల ముద్దు పలుకులు 
కోయిలమ్మల కుహుకుహులు 
నెమలి నాట్య భంగిమలు 
పరిగి పిట్ట పరుగులు 
పిచుకమ్మల కిచకిచలు 
ఆప మనతరమా ? ఆపతరమా ?
 
వర్ష ఋతువున కురియు వానలు 
గ్రీష్మాన మండుటెండలు 
శీతలాన చలి గాలులు 
శిశిరాన ఆకు రాలుట 
వసంతాన చిగురులేయుట 
ఆప మనతరమా ? ఆపతరమా ?
చింతలోని పులుపు 
వేపలోని చేదు  
మిరపలోని ఘాటు 
పుచ్చకాయలోని తీయదనం 
మకరందంలోని మాధుర్యం 
ఆప మనతరమా ? ఆపతరమా ?
ప్రకృతి తల్లి పిల్లలు పల్లెలు 
పల్లెపడచుల వన్నెల చిన్నెలు
పంటచేనుల వయ్యారాలు 
తాతామనుమల అనురాగాలు 
బామ్మ మాటలో మమకారాలు 
ఆప మనతరమా ? ఆపతరమా ?
ప్రకృతి ఇచ్చిన సహజ శక్తిని అనుసరించినవి 
గాన వీటి జన్మ చరితార్ధమాయె కదా ! 
                                     అట్లే 
ప్రకృతి వ్యక్తికిచ్చిన సహజ శక్తిని అనుసరించిన 
వారి జన్మ చరితార్ధం కాదా ?
నేడు భారతీయులందరి మనసులో  
సుస్థిర స్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి 
   " సచిన్  "  ప్రకృతి ఇచ్చిన సహజ శక్తిని 
అనుసరించినాడు కనుకనే అతనిలోని ప్రతిభ 
ఆప మనతరమా ? ఆపతరమా ?
ఎంత ప్రయత్నించినా సుమసుగంధాల 
పరిమళాల వలే దాగనిది ,దాచలేనిది . 
ఎందువల్లనంటే అది ప్రకృతి సిద్ధమైనది . 
ప్రకృతి వరం ,అతనో ప్రకృతి వర రత్నం . 
 మన భారత రత్నం ! 

" సచిన్  " ఆలోచనలు సుమసుగంధాలు 
            ఆశయాలు తొలకరి జల్లులు
           లక్ష్య సాధన సాగరమధనం
          పలుకులు తేనె చినుకులు
        ఆచరణలో చురుకుదనం
    వల్ల కదా ! " సచిన్  "
జన్మ చరితార్ధం ,
భారతరత్నంలోని   ప్రతిభకు శిరస్సు వంచి 
నమస్కరిస్తూ ,నా ఈ చిరుకవితకు 
ప్రేరణ అతనిలోని ప్రతిభే అని 
నిర్ధ్వందంగా తెలియపరచుకుంటూ ..... 
జైహోసచిన్ 

********

Saturday, November 16, 2013

ఎందుకో ........ ! ( 3 ) 
 
స్విస్ బ్యాంకుల్లో సొత్తు దాచి 
పేదవారి సేవ కొరకు 
 చెంగు చాచుతారు ఎందుకో ...... !

********

పోయేటప్పుడు తీసుకు పోయేది 
ఏమీ లేదని తెలిసి కూడా
అన్యాక్రాంతం మూట కడతారు ఎందుకో ....!

********

భూమి ఫై కడకు 
బూడిదై పోతామని తెలిసి కూడా 
భూకబ్జాలకు పాల్పడతారు ఎందుకో .... !

*********

Friday, November 15, 2013

ప్రకృతి ...... ఓ అద్భుత సృష్టి !


కార్య నిమగ్నుడైన విధాత 
వాగ్దేవి వీణానాదానికి పరవశించిపోతూ ,
ఆ రాగానికి మైమరచిపోయి వేసిన తాళానికి 
అనుగుణంగా ఆయన కుంచె నుండి 
జాలువారిన రంగు బిందువుల నుంచి 
ఆవిర్భవించిన అద్భుత సృష్టి లీలల్లో 
ఒకటి ,ఈ అందాల నెమలి ఏమో !


ఆ అద్భుత సృష్టికి అచ్చెరువొంది 
సగర్వంగా వీణావాణికి చూపుదామని 
అలవోకగా చూపు తిప్పిన విధాత  ,
ప్రసన్నవదన సరస్వతిని గాంచి 
ప్రశాంత ప్రసన్న చిత్తముతో కూడి 
ఏక వర్ణముతో కుంచె నుండి 
జాలు వార్చిన అత్యద్భుత సృష్టియా!
ఈ.......ఏక వర్ణ అందాల నెమలి...ఓ విధాతా !నీవు సృష్టించలేని 
అందమన్నది లేదు ,
నీ చేతిలోని కుంచెకు 
అలుపన్నది లేదు ,
ఈ ప్రకృతిలో అందాలకు 
కొదవన్నది లేదు . 

 *******

Tuesday, November 12, 2013

తీరిన అలక

నీ పై అలిగిన నేను 
చల్లగాలిలో పరవశించాలనీ   ,
చందమామతో ముచ్చటించాలనీ ,
దరహిస్తున్న అరవిరిసిన 
విరికన్నెలను పలకరించాలని ,
పున్నమి వెన్నెల 
పానుపుపై పరుండాలనీ ,
సుగంధ పరిమళభరితమైన 
పారిజాత విరివానలో సేదతీరాలనీ ,
నే చేసిన ప్రయత్నమంతా వృధా 
ఏదో వెలితి ........  ,
నా మనసు నా దగ్గర లేకపోవడమే 
ఏదీ ? ఏమైపోయింది ?
నీ జతలో తీయదనాన్ని అనుభవిస్తూ ,
నీ వెచ్చని ఒడిలో మైమరచిపోతూ ,
చల్లని నీ చేతి స్పర్శతో పులకించిపోతూ ,
నను మురిపించి , మరపించే 
ముచ్చటైన నీ ముద్దులలో మునిగి తేలుతూ ,
మృదుమధురమైన నీ ప్రియ సంభాషణను ఆలకిస్తూ ,
నీ గుండె చప్పుళ్ళు వింటూ పరవశిస్తూ ,
నీ గుండె గూటిలో గువ్వలా ఒదిగి 
సేదతీరడానికి నీ చుట్టూ పరిభ్రమిస్తోంది ..........
చేసేదేముంది ?
నేనూ నీ దరి చేరుతున్నా 
జీవనమాధురి చవి చూసేందుకు 
నీ పై తీరిన అలకతో .*****************

Sunday, November 10, 2013

కన్నతల్లి మనసునేనొక మహా నగరంలో పుట్టి పెరిగాను .అక్కడే చదువుకున్నాను . 
మాకుటుంబమే నా ప్రపంచం.అందువల్ల ఇతర ప్రాంతాలను నేను 
చూడ్డం కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు . అటువంటి నాకు 
ఒక కుగ్రామంలో టీచర్ జాబ్ వచ్చింది .జాయిన్ అయ్యాను .
అంతా కొత్తగా,వింతగా ఉంది .ఒక రకంగా బాగుంది ,మరో
 రకంగా బాలేదు. నేనో ఇల్లు అద్దెకు తీసుకున్నాను .దాని 
చుట్టుప్రక్కల అంతా ఖాళీ .మా ప్రక్క వీధిలో పందులను పెంచే 
వాళ్ళున్నారు .అవి మా వీధిలోకి తరచుగా  వస్తుండేవి .నాకు
 పందులంటే పరమ అసహ్యం . కానీ ఏం చేస్తాం ?ఆ ఇల్లు
 సౌకర్యంగా అన్ని విధాలా చాలా బాగుంది . అందుకే అక్కడే 
ఉన్నాను . 

వేసవి మొదలై ఒంటిపూట బడికి వెళ్లి వస్తున్నా. ఓ రోజున 
నిప్పులు చెరిగే ఎండలో మధ్యాహ్నం ఇంటికి వచ్చాను . మొహం 
కడుక్కుని తుడుచుకుంటుంటే ,మా గోడవతల బుసలు కొడుతున్న 
శబ్ధం వచ్చేసరికి మెల్లగా చిన్న స్టూల్ ఎక్కి గోడవతల చూస్తే ఒక 
పెద్ద పంది .గోడ ప్రక్కనున్న పిచ్చిమొక్కల్ని పీకేస్తోంది గబగబా .  
నే ఎండను మరచి అలానే చూస్తున్నాను .లేత మొక్కల్ని ఏరిమరీ
వేళ్ళతో పీకి ,మట్టి రాల్చి ఒత్తుగా పక్కలాగా ఒక వరుస క్రమంలో 
సర్దుతూ మెత్తని పరుపులాగా చేసేసి ,నొక్కి చూసి మరలా కొన్ని 
మొక్కలు తెచ్చి ఇంకా ఒత్తుగా పేర్చింది . ఈ పనంతా ఎంతో 
వేగంగా ,అలుపులేకుండా బుసలు కొడుతూ చేసుకు పోతోంది . 
అప్పుడు నాకనుమానం వచ్చింది . అది పిల్లల్ని కనబోతుందేమో
అని . పంది వంక చూశాను .అది చాలా భారంగా ఉంది . అయినా 
ఎంతో వేగంగా పనులు చేస్తోంది .మొత్తానికి గోడ వైపు వదిలి 
అర్ధచంద్రాకారంలో చుట్టూ పెద్ద మొక్కలు ఉంచి లోపల స్థావరం
సౌకర్యంగా ఏర్పాటు చేసుకుంది .కేవలం ఒక పంది అంత ఆరాటంగా
ఆ ప్రాంతం అంతా మనుషులు శుభ్రం చేసినట్లు శుభ్రం చేయడం ,
మొక్కలు పీకేటప్పుడు కూడా లేతవి ఎంచుకోవడం, పరుపులా 
చేయడం నన్ను ఎంతో సంభ్రమాశ్చర్యాలకులోను చేసింది . తాను 
చేసింది బాగుందా ,లేదా ..అన్నట్లు కొంచెం అటూ ,ఇటూ ఇంకా 
సర్దుతోంది .మామూలుగా అయితే దాన్ని నేను తోలేసేదాన్ని.కానీ 
ఇప్పుడు అది చేసే పనిని కన్నార్పకుండా చూస్తున్నాను . 
అసహ్యం మరచి పోయాను . ఎండ బాగా మండడమే కాక ,ఆకలి
 కూడా మండే సరికి నిదానంగా స్టూలు దిగి లోనికెళ్ళి భోంచేసి, 
ఆలోచిస్తూ నిద్ర పోయాను .

సాయంత్రం లేచిన తర్వాత గబగబా వెళ్లి గోడెక్కి చూశాను.పంది 
ఇంకా అలా ఆరాటపడుతూనే ఉంది .రాత్రి పడుకునే ముందు 
కూడా చూశాను .ఆ మెత్తటి పక్కపై పడుకుని తెగ బాధ 
పడుతోంది.తీవ్రంగా బుసలు కొడుతోంది . దానికి నొప్పులు వస్తున్నాయనుకుంట ,అంతే నా మనసంతా ఎంతో బాధగా 
అనిపించింది .ఇటువంటి దృశ్యం నేను ఎన్నడూ చూడనందున
 నా కళ్ళల్లోఅదే దృశ్యం,అదే ఆలోచన .అది జంతువైనా దానికి 
పిల్లలు కలిగే సమయం ఆసన్నమైందని తెలిసి ,పుట్టబోయే తన 
పిల్లలకు ఒంటరిగా ఎంత సౌకర్యం కలుగచేసింది .దానికి ఎంత 
జ్ఞానం ఉందీ ... అనిపించింది . 

ఒక్కసారిగా నాకు అమ్మ గుర్తొచ్చి ఫోన్ చేసి అంతా చెబితే
ఆడ జన్మ అంటే అంతేనమ్మా !అంది .అమ్మ ప్రేమ కళ్ల ముందు
 కనిపించింది .అంతే కదా ! ఏ జీవిలో అయినా ఒక తల్లి 
మనసు ఉంటుంది కదా !అనిపించింది . కన్నతల్లి మనసును 
 మించినది ఏముంది ....అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను . 

తెల్లవారింది .తలుపు తీయగానే ఒక రకమైన వాసన . గోడెక్కి 
చూశా,పంది అలసిపోయి పడుకుని ఉంది .దాని ప్రక్కన                              
 ఎనిమిది ఎర్రని చిన్నపిల్ల లున్నాయి . అవన్నీ పాలు                                  
తాగుతుంటే అది నెమ్మదిగా కదులుతోంది .                                              
అంతే నాకు పందంటే అసహ్యం పోయింది .అది కూడా మన            
వలే ఒక జీవి అనిపించి ముఖం చిట్లించకుండామామూలుగా                        
  చూస్తున్నా .మరో పదిరోజుల పాటు దాని పిల్లల్ని ఇతర                              
 జంతువుల బారి నుండి ఎలా రక్షిస్తుందో చూడడం, అవన్నీ                         ఆటలాడుకోవడం, తల్లిమీదకెక్కి ఆడడం ,చూస్తూ ఉంటే                                                                                                                                            
      ప్రకృతిలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నప్పటికీ  
         " కన్న తల్లి  మనసు " మించి ఏదీ గొప్పది 
కాదనిపించింది . మరి మీరేమంటారు  . ........
 
*********


Friday, November 8, 2013

ఎందుకో ........... ! ( 2 )

 
 ప్రసార మాధ్యమాల్లో అతి సున్నిత భావాలను కుదిస్తూ
 వికృత సన్నివేశాల అతి సాగతీత ......ఎందుకో !

********

సమైక్యత ,సమైక్యత అంటూ కుగ్రామంలో సైతం 
నాలుగు చోట్ల టెంట్లు వేస్తారు ......ఎందుకో  !

********

కుటుంబ కలహాలకు వేదికగా 
మీడియాను వాడతారు ..... ఎందుకో  !

********


 Thursday, November 7, 2013

అహం ఆవిరైతే ........నా వయసు 20 ఏళ్ళు . నాకు టీచింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం .
 అందుకే నేను D.Ed చదివాను . నాకు ఈ మధ్య గవర్నమెంట్ 
స్కూల్లో టీచర్ పోస్ట్ వచ్చింది . నా ఆనందానికి అలవి లేదు .
 అలానే మా చుట్టుప్రక్కలగానీ ,బంధువుల్లో గానీ ,గవర్నమెంట్
 ఉద్యోగస్తులు ఎవరూ లేనందున నా అహంకారానికి అంతే 
లేకుండా     పోయింది . పెద్దవాళ్ళు ,స్నేహితులు ఎంత మంది
 ఎన్ని విధాల చెప్పినా నా అహంకారం అణువంతైనా తగ్గలేదు . 

ఇలా ఐదేళ్ళు గడిచాయి . నాలో కష్టపడి పనిచేసే లక్షణం
 అణువంతైనా తగ్గలేదు సరికదా పెరిగింది . అలానే అహంకారం
 కూడా మరింత పెరిగింది . అమ్మ,నాన్న చెప్పిన సూక్తులు
 చెవికెక్కలేదు . నేనేమైనా తప్పు చేశానా ...... అంటూ...... 
 నే చేసే వితండవాదాన్ని వినలేక ,చెప్పటం మానేశారు . 
ఇలా అనే కన్నా నా మూర్ఖత్వానికి నన్ను వదిలేశారంటే 
బాగుంటుందేమో . 

మా స్కూలికి ఒక కొత్త H.M వచ్చారు . ఆయన వయస్సు
 యాభై ఏళ్ళు . P.hd చేశారు . చాలా సౌమ్యంగా ఉన్నారు . 
విసుగు ,విరామం లేకుండా బాగా పనిచేస్తారు . ఆయనకు P.hd
 ఈ మధ్య వచ్చింది కాదని ,ఇరవైరెండేళ్ళ క్రితమే వచ్చిందని
 తెలిసి ఆశ్చర్యపోయాను . ఖాళీ సమయంలో అడిగితే చిరునవ్వు
 నవ్వి ఊరుకున్నారు . అబ్బ !అదే నే P.hd చేస్తేనా ..... 
నాలో అహం ఆలోచించింది ...... 

కొన్నాళ్ళు గడిచింది . నేనొకరోజు తీవ్ర అస్వస్టతకు
 గురయ్యాను .ఎంతలా అంటే డాక్టర్ దగ్గరకు వెళ్లక
తప్పనంత . అమ్మ నన్నుహాస్పిటలుకు తీసుకెళ్లింది .
 డాక్టరమ్మ గారికి 65 ఏళ్ళు ఉంటాయి . అచ్చం
 అమ్మలానే సాధారణ గృహిణిలా ఉంది. ఆమె
 చిరునవ్వుతో కావలసిన ప్రశ్నలు వేసి మందులు
 రాసిచ్చి జాగ్రత్తలు చెప్పింది . ఆటోలో ఇంటికి
 వస్తూ ఆలోచించాను . నా కంటే 40ఏళ్ళు ముందు
  పుట్టి ఆ కాలంలోనే డాక్టర్ చదివి అంత  జ్ఞానం కలిగిన
 ఆమె ఎంత సీదాసాదాగా ఉంది . అదే నే డాక్టర్
 చదివితేనా ....నాలో అహం ఆలోచించింది ....... 

ఈ మధ్య టి.వి. లో జేసుదాసుకు జీవితసాఫల్య
 అవార్డును అందించే కార్యక్రమం చూసాను . 
అనేక భాషలలోయాభై వేలకు పైగామధురమైన 
పాటలు పాడిన వ్యక్తి ఎంత సీదాసాదాగా 
ఉన్నారు,పైగా ఆయన్ని ఉపన్యసించమంటే 
 " నేనింకాఈరోజుకీ సంగీతం నేర్చుకుంటూనే 
ఉన్నాను .నేర్చుకోవడం అనేది 
అనంతమైనది .మీరుకూడా మీ 
 కిష్టమైనవిషయం ఎంచుకోండి , 
 నిరంతరం నేర్చుకుంటూనే  ఉండండి "  
అని చెప్పిముగించారు .అదే నేనైతేనా ..
 నాలో అహం ఆలోచించింది ... 

రెండ్రోజుల క్రితం ఇస్రో సంస్థ వారు అంగారక
 గ్రహంమీదకు పంపించిన "  మంగళ్యాన్ " 
ఉపగ్రహంగూర్చి చూశాను . ఇస్రో ఛైర్మన్
 రాధాకృష్ణన్ ,ఇతర శాస్త్రవేత్తలూ ఉపగ్రహం 
గూర్చి వివరించినవిధం ,వారు చేసిన
 కృషి ,వారి విజ్ఞానం ఎంత గొప్పవి .
వారి వల్ల కదా ! భారతదేశం అమెరికా ,
రష్యా ,యూరోప్ వంటి  వాటి ప్రక్కన స్థానం
 దక్కించుకుంది .దీనికంతటికి  కారణమయిన
 వారు ఎంత సీదాసాదాగా ఉన్నారు .అదే 
నేను శాస్త్రవేత్త ఐతేనా.....నాలో
 అహం ఆలోచించింది ... 

 అతి చిన్న వయసులో క్రికెట్ బ్యాట్  పట్టి

 100సెంచరీలు చేసి ,200 టెస్ట్ మ్యాచ్ లు ,
463వన్డేమ్యాచ్ లు ఆడి భారతజట్టు 
విజయానికిఎన్నిమారులో కారణమైన
 భారతజాతి గర్వించ దగిన సచిన్ ఎంత
 ఒదిగి మాట్లాడాడు ఇంటర్యూలో .
అదే  నేనైతేనా ..నాలో అహం 
ఆలోచించింది ... 

ఇలా నా అహం ఆలోచిస్తూండగా ....
 హాయ్ ! అనివినపడింది . చూస్తే నా 
స్నేహితురాలు సుష్మ .ఆమెను
 ఆహ్వానించాను లోపలికి . ఆ కబుర్లు ,
ఈ కబుర్లు చెప్పుకుంటుంటే రాత్రి 
8 గంటలైంది , అమ్మ ఇద్దరికీ
 భోజనం వడ్డించింది . భోజనం 
అయ్యాక డాబా పై చల్లని వెన్నెల్లో 
కూర్చుని కబుర్లాడుకున్నాం .
 టైం తొమ్మిదయింది .సుష్మ వాళ్ళ
 తమ్ముడు వచ్చేసరికి లేచి నా 
దగ్గరకు వచ్చి నన్ను చూసి ..
 ఎదుటివారిలో గొప్పతనాన్ని కూడా 
చూడడానికిప్రయత్నించు ,ఇంకా 
గొప్పదానివి అవుతావు ,అంతా 
సంతోషిస్తారుఅంది . అలాగేలే అంటూ
 నవ్వి సుష్మను పంపించి లోపలికి 
వచ్చి అమ్మా!నాకు నిద్ర వస్తోంది
 అంటూ లోపలి వెళ్లాను . 

పడుకున్నానుకానీ నిద్ర పట్టడం 
లేదు. మనస్సుఅశాంతిగా ,అస్థిమితంగా 
ఉంది .అటూ ,ఇటూకదులుతూనే
 ఉన్నాను . టైం పన్నెండయింది .
 లేచి కూర్చున్నాను . నిదానంగా
ఆలోచిస్తే నాకోవిషయం తట్టింది . 
యింతటికి కారణం నాలోని " అహం  " 
ఆలోచనలు పూర్తికాకపోవడమే . 

అవును !పదే పదే  నాకు మా H.M, 
డాక్టరమ్మగారు ,ఇస్రో చైర్మన్రాధాకృష్ణన్ 
గారు ,సచిన్ అందరూ బాగా 
గుర్తుకొస్తున్నారు . వీరందరి తర్వాత 
అంటే  2-3 దశాబ్ధాల తర్వాత పుట్టి
 నేను కేవలం D.Ed చదివి టీచర్ 
అయ్యాను ,మరి వారు 2-3 దశాబ్దాల
 ముందు పుట్టి నా కంటే ఎంత గొప్ప 
స్థాయికి చేరుకున్నారు , ఎంత
సంస్కారవంతంగా ప్రవర్తిస్తున్నారు ,
ఎంత ఒదిగి ఉన్నారు . మరి 
నేనూ ..... అంతే ....
 నాలోని అహం ఆవిరైపోయింది .
మరింకెప్పుడూమేల్కోదు . 
ఎందుకంటే ఎవరి బలవంతం మీదో
 వచ్చిన జ్ఞానం కాదు ,నేను స్వయంగా 
చూసిగ్రహించిన జ్ఞానం.  కాబట్టి అది 
శాశ్వతం .ఎవడు చెప్పిన మాటో నేను
 వినడం ఏమిటి అనుకోవడం అహంకారం .
 ఎవరు చెప్పిన మంచైనా వినడం 
పరమధర్మం అని తెలుసుకున్నాను .
అంతే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టింది . 

మర్నాడు నేను నిద్ర లేచాను . నా
 అహంమాత్రం లేవలేదు .అందువల్ల నా
 ప్రవర్తనలోవచ్చిన మార్పు చూసి 
అమ్మా ,నాన్నతో సహా అందరూ 
ఆశ్చర్యపోయారు . ఎవరు కారణం
 అడిగినా చిరునవ్వు నవ్వాను . 
ఏదో ఒకటిలే మంచి మార్పు
 వచ్చింది .అది చాలు అనుకున్నారు 
అంతా . అంతే కదా !అహం 
ఆవిరైతే ఎంతో మందికి చేరువవుతాం .

 

*************

 

Sunday, November 3, 2013

భయం...... భయం .....భయం


నా పేరు చిన్నారి . పేరు చూసి చిన్నదాన్ని అనుకోకండి . నాకు వివాహమై 8వ తరగతి చదివే కొడుకు కూడా ఉన్నాడు . నా అసలు పేరుకన్నా ఈ ముద్దు పేరే మా బంధువర్గంలో అందరికి సుపరిచితం . చిన్నతనంలో నాకు భయం ఎక్కువగా ఉండేది . చీకటంటే  భయం . గండుచీమ ,కుక్క ,పిల్లి ,బల్లి , బొద్దింక .....అంటే భయం . వేగంగా ప్రవహించే నీరంటే , బ్యారేజి అంటే , కొండ అంటే భయం .మెరుపులు, ఉరుములు , పిడుగులు అంటే భయం . నాన్నంటే ,టీచర్ అంటే , పరీక్షలు అంటే భయం , పోలీస్ అంటే ,దొంగ అంటే , సినిమాలో ఫైటింగులు అంటే భయం .................. ఇలా అంతులేనన్ని భయాలతో  భయం ,భయంగా బాల్యం గడచిపోయింది .                     
నాలుగు రోజుల క్రితం పెళ్ళికని ఊరెళ్ళాను . తిరిగి వచ్చేటపుడు ఆఖరి బస్సెక్కాను . దారిలో దాని టైరుపంక్చరయింది . దాన్ని సరిచేసుకొని ఊరు చేరుకునే సరికి రాత్రి పన్నెండయింది . నాలుగడుగులు వేస్తే ఇల్లు    వస్తుంది. మావారికి ఫోన్ చేశాను ,కానీ అది కట్టయింది .    సరిగ్గా అప్పుడే కరంటు పోయింది . అంతే నా గుండెఆగినంత పనయింది .  నా నీడకు   కూడా అందనేమో  అన్నంత వేగంగా ,భయంగా ఇంటికి వెళ్తూ ఎదురుగా వచ్చే ఆయన్ని చూసి హమ్మయ్య అనుకున్నాను . 
మర్నాడు ఆఫీసుకి బయల్దేరాను . దారిలో నా కొలీగ్ వసుధ స్కూటి ఆపింది ,ఎక్కాను . ఎదురొచ్చే ఏ వాహనం చూసినా ఎంతో భయం . కొంత దూరం వెళ్ళేసరికి సమైక్యాంధ్ర గూర్చి రాస్తారోకో చేయడంతో ఆగిపోయాం . మాటిమాటికి టైం చూసుకొంటున్నాను . బాస్ ఏమైనా అంటాడేమో అనే భయంతో . మొత్తానికి గంట ఆలస్యంగా వెళ్ళాను . భయం ,భయంగా బాస్ రూం వైపు చూశా  .... బాస్ ఇంకా రాలేదు . ఓహో !ఎక్కడో రాస్తారోకోలో చిక్కుకుపోయి ఉంటాడు ... మంచిదయింది అనుకుంటూ పనిలో మునిగిపోయాను . ఫోన్ మోగింది .ఎవరా ! అనుకుంటూ చూస్తే తమ్ముడు . ఒక్కసారిగా కాళ్ళు, చేతులు చల్లబడ్డాయి భయంతో . ఈ మధ్య నాన్నగారికి బాగుండడం లేదు . పేలవంగా తమ్ముడూ ......అన్నాను. ఏంటి చిన్నారీ !ఒంట్లో బాలేదా ?అలా ఉన్నావ్ అన్నాడు. ఏం లేదు కానీ ,ఏంటి విషయం ?అన్నాను భయం 
 వి(క)నపడనీయకుండా . ఏం లేదు ఊరికే చేశాను అనే సరికి నాలుగు మాటలు మాట్లాడి ఫోన్  పెట్టేశాను . అలా సాయంత్రం అయింది . యదావిధిగా భయపడుతూ    బండి మీద ఇంటికి చేరాను .                   
సమయం ఐదయింది . బాబు వచ్చే టైమయింది అనుకుంటూనే పొయ్యి మీద టీ పెడదామని లైటర్ని నాలుగైదుసార్లు నొక్కినా పొయ్యి వెలగలేదు . ఇంకోసారి నొక్కగానే ఒక్కసారిగా పెద్ద మంట వచ్చేసరికి భయపడి పోయాను.టీ పెట్టి తాగాను .ఐదున్నర అయింది .బాబు రాలేదేమిటా అనుకుంటూ భయంగా వీధిలోకి ,ఇంట్లోకి తిరిగాను.మొక్కలకు నీళ్ళు పోద్దామని పంపు తిప్పేసరికి నీళ్ళు రాలేదు . మోటరు వేద్దామని స్విచ్ వేయగానే కరంటు స్పార్క్స్ వచ్చేసరికి ఒక్కసారిగా భయంతో    చేతిని వెనక్కు లాక్కున్నాను .                               
ఆరిన బట్టలు మడత వేస్తూ మావారి ఆఫీసుకి ఫోన్ చేశాను.ఆయన ఎంతకీ ఫోన్ తీయలేదు.ఏమయిందీ ? అనుకుంటూ పదే పదే చేశాను.ఆఖరికి ఫోన్ తీసి          "అర్జెంటు పని మీద ఉన్నాను. ఏమిటో చెప్పు"   అన్నారు     ప్రశాంతంగా.  బాబు ఇంకా రాలేదండి ఆరవుతోంది అన్నాను భయంగా . వస్తాడులే నీవనవసరంగా భయపడకు .. ప్రశాంతంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేశారు . ఆరున్నర అవుతూండగా వచ్చాడు బాబు . వాడి స్నేహితుడు  అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే అందరితో కలిసి వెళ్లి చూసి వచ్చానని చెప్పి ,ఎందుకమ్మా!భయం ... ప్రశాంతంగా ఉండు అన్నాడు తండ్రిలానే . గబగబా రడీ అయ్యి ట్యూషన్ కెళ్ళిపోయాడు .                            
సన్నగా చినుకులు పడుతున్నాయి. మా ఇంటికి మూడువైపులా ఖాళీ స్థలాలే ,వాటిల్లో చెట్లు చీకటి పడ్డాక దయ్యాల్లా ఊగుతున్నట్లు కదలుతాయి . చీకటి పడితే చాలు అడవిలో ఉన్నట్లే . భయంతో బిక్కు బిక్కు మంటూ చుట్టూ  చూడడం . భయాన్ని పోగొట్టుకోవడానికి  టి . వి . ఆన్ చేశాను . ఛానల్స్ అన్నీ పోయి కేబుల్ ఛానల్ మాత్రమే వస్తోంది . అందులో " కాంచన " సినిమా . 
దేవుణ్ణి నమ్మినప్పుడు దయ్యాన్ని కూడా నమ్మాలిగా అనే ఆలోచన వచ్చేసరికి ఒక్కసారిగా భయం వేసింది . చూడనా, వద్దా అనుకుంటూండగా బయట గాలి హోరు పెరిగి కరంటు పోయింది . అంతే ఒక్కసారిగా భయం వేసి గబగబా   లేచాను ఛార్జింగ్ లైట్ వేద్దామని . ఆ గాభరాలో క్రింద పెట్టిన ఖాళీ టీ గ్లాసును ఒక్క తన్నుతన్నాను,పెద్ద శబ్ధం.భయం తో ఏడుపు వచ్చిన్నంత పనయింది.అంతలో టేబులుపై పెట్టిన సెల్ ఫోన్ వైబ్రేషన్ లో ఉండడం వల్ల భయంకరమైన శబ్ధంతో రింగయింది . ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను భయంతో. అది రాంగ్ నెంబర్ .భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క ఐడియా అనుకుంటూ అమ్మకు ఫోన్ చేశాను . అమ్మ మాట్లాడుతూ ఏమ్మా
  చిన్నారీ !ఏమైనా భయం వేసిందా ? అలా మాట్లాడుతున్నావు అంది. లేదమ్మా ,లేదు అంటూ కొద్దిసేపు మాట్లాడానోలేదో ఆయన కారు హరన్ వినిపించింది.అమ్మకు బై చెప్పి గేటుతీసాను ధైర్యంగా.   ఆయన దిగి నావంక చూసి  ఆ ....... ఆ ..... చెప్పేయ్ అన్నారు . నేను వెంటనే ఏంటది ?అన్నాను . అదేనోయ్ నీవు ఈ రోజు ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా భయపడ్డావో చెప్పెయ్ అన్నారు నవ్వుతూ . అంతే ఉక్రోషంతో నాకు
 కోపం ,ఆవేశం వచ్చేశాయి . ఇంకెప్పుడూ  అసలు భయపడకూడదు ... ఒకవేళ భయపడినా ఎవరికీ చెప్పకూడదు ... చెప్పబట్టే కదా !అందరికీ హేళన ....... ఇలా మనసులో నాకు నేనే చెల్లని వాగ్ధానాలు కోకొల్లలుగా చేసేసుకుంటున్నాను . 
ఏంటి ... మనసులో వాగ్ధానాల జాతర జరుగుతోందా అన్నారు నవ్వుతూ .   నే కోపంగా చూసి ఊరుకున్నాను .
 దాంతో ఆయన ,అది కాదు చిన్నారీ ! భయం మనిషిలోని తెలివితేటలను నశింపచేస్తుంది ,సమయస్ఫూర్తిని పోగొడుతుంది,సహనాన్నితగ్గిస్తుంది,సంతోషాన్నిదూరం చేస్తుంది,ధృడవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది ,మానసిక వికాసానికి ఆటంకం కలిగిస్తుంది ,ఆలోచనా శక్తిని నశింపచేస్తుంది ,ఆందోళనను పెంచుతుంది ,ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది ,లేనిపోని ఊహలు కలిగిస్తుంది ,ప్రశాంతతకు దూరం చేస్తుంది,ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది . భయం మహా చెడ్డది సుమా ! మనం మానసికంగా బలహీనంగా ఉన్న సమయాన్ని చూసి మనలో టక్కున చేరి పోతుంది .
మనల్ని పట్టి పీడిస్తూ ,మనల్ని దైవానికి దూరం చేస్తుంది.  అందుకని నీవు భయాన్ని పారద్రోలి ధైర్యంగా ఉండాలి సరేనా ...... ఆ ....... ఇంకో ముఖ్యమైన విషయం ...... ఇంకా చెప్పాలంటే "భయం "నీవు నా గూర్చి ఆలోచించే సమయాన్ని కూడా తగ్గిస్తుంది ...... అనగానే నాకు నవ్వొచ్చి నవ్వేశాను . 
మబ్బులు వీడిన ఆకాశంలా ప్రశాంతంగా ఉంది మనసు . 
తెల్లవారింది .వసుధ బండి ఎక్కి ఆఫీసుకి బయలుదేరాను. భూమి గుండ్రంగా ఉన్నట్లు భయం  మొదలయింది . వెంటనే నిన్న జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారిగా నవ్వేశాను పైకి . ఏంటి అని అడిగిన వసుధకు లంచ్ అవర్లో చెప్తాలే అంటూ నవ్వుకుంటూనే ఉన్నాను ప్రశాంతంగా . అంతేకదా ! భయం లేకపోతేనే కదా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసేది .
******** 

Saturday, November 2, 2013

అందాల అమావాస్య


నరకుని వధతో లోకం అంతా 
ఆనంద వందన చందనములతో 
శ్రీకృష్ణ సత్యలకు హారతి పట్టి ,

స్వేచ్ఛా వాయువులనుభవిస్తూ,
ముంగిట రంగుల ముగ్గులు వేసి,
దీపాలెన్నో.....  వరుసలో పెట్టి,

వేల కాంతులతో లోకం మెరవగా ,
అమావాస్యను అందరు మరువగ ,
హాయిగ జనులకు నిద్దుర పట్టే .

*******

బ్లాగ్మిత్రులందరికీ దీపావళి 
శుభాకాంక్షలు

  
*****


Friday, November 1, 2013

అజరామరం అమరజీవి త్యాగంఆంధ్రులకై అశువులు బాసి ,ఆశయాలకు తన ఆయువిచ్చి ,
 ఆంధ్రరాష్ట్రం మనకిచ్చి నిష్క్రమించిన అమరజీవీ .... 
నీ త్యాగానికి తుల్యమైనది గలదా అవనిలో... ?
నేటికైనగలరా ... !నీకుసాటి ఇలలో ...?

పదవులకోసం కాదూ ... కాదూ ... 
ప్రజాసేవయే మా ఆశయం  ,
పారదర్శకతయే మా ఆయుధం
అంటూంటారు ఆశువుగా .... అంటూనే 

అమరజీవి ఆశయాలకు తిలోదకాలిస్తూ ,
ఆంధ్రరాష్ట్ర విచ్చిన్నతను ఆహ్వానిస్తూ ,
మౌనం అర్ధంగీకారం అనిపిస్తూ ,
పారదర్శకతను పాతివేస్తూ ... 

ఆంధ్రుల సంకట కంటకాలను 
పూదండల మాటున దాచిపెట్టి ,
నిన్నలంకరించ వచ్చిన వీరి
  అంతర్వాణికి భరతవాక్యం 
పలికించే భరతుడు రావాలని ఆశిస్తూ ... 

అమరజీవి  పొట్టి శ్రీరాములు 
అమర్ రహే ....... 

********