Tricks and Tips

Monday, September 21, 2015

అమ్మ _/\_

 
నన్ను పసివాడిలా భావిస్తూ
చిరునవ్వుతో నా చేతిలో కనుమూసిన
నా తల్లి చితికి నిప్పంటించా....

ఆ చితిమంటల వెలుగులో
చూడసాగాను నా అజ్ఞానాంధకారాన్ని.....

అమ్మ విలువ తెలియని
అవివేకిని నేను ,
అన్నీ నాకు తెలుసనుకునే
అజ్ఞానిని నేను ...

కనిపెంచిన తల్లికి
కన్నీరును కానుకిచ్చా ,
కష్టాలు నాదరికి చేరనివ్వని నా తల్లిని
కష్టాలకంకితమిచ్చా...

వేలు పట్టి నడిపించిన తల్లికి
వేలు చూపే వాడినయ్యా ,
నను వేడుకగా భావించిన తల్లికి
తీరని వేదనయ్యా....

గోరుముద్దలతో నా కడుపునింపిన తల్లికి
పిడికెడన్నం కరువు చేసా ,
జోలపాడి నను నిదురపుచ్చిన తల్లికి
కంటి మీద కునుకు లేకుండా చేసేసా....

నాకు జ్వరమొస్తే నిదురకాచి బెదరిపోయే తల్లికి
కృంగికృశించిపోయేటంత బాధనిచ్చా ,
నా రాకకై ఆతృతగ ఎదురుచూసే తల్లికి
ఎదురుపడడమే మానివేసా ...

వీపుపై జోలె కట్టినన్నాడించిన నా తల్లి
ఉనికే నాకు భారమయ్యే ,
నా ఆలనా పాలనలో తనను మరచిన నా తల్లిని 
నేడు నేను మరచిపోయా....

ఊడిగాలు చేసి నన్నింతవాడిగ నిలబెట్టిన నా తల్లికి
నిలువ నీడను కరువు చేసా ,
అలుపు మరచి నాతో వేలవేల ఊసులాడిన నా తల్లిని
అమ్మా ! అని పిలవడమే మానివేసా....

అయినా

నన్ను పసివాడిలా భావిస్తూ ,
చిరునవ్వుతో నా చేతిలో కనుమూసిన
నా తల్లి చితికి నిప్పంటించా....

ఆ చితిమంటల వెలుగులు పారద్రోలాయి
నా అజ్ఞానాంధకారాన్ని...
సుడులు తిరిగి జాలువారిన కన్నీటిధారలతో
వెనుతిరిగి చూసాను ...
అమ్మ పిడికెడంత బూడిదయ్యి
పేలవంగా పడి ఉంది ...

అంతే !

ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా
అమ్మా ! అని పిలి(అరి)చాను...

ఆ పిలుపు కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన అమ్మ
తేలికైన మనసుతో ౠణం తీరిపోయిందనుకుంటూ
గాలిలో కలిసి ఉవ్వెత్తుగ లేచి
నింగికెగిరి పోయింది........

*******

Sunday, March 8, 2015

మన గమ్యం ?

ఏమవుతున్నది ఈ లోకం...
ఎటుపోతున్నది మన గమ్యం ?

పొత్తిళ్ళలోని పాప నుండి
పండుటాకు బామ్మ వరకు....

లోకాన రక్షణే
లేదన్నది సత్యం......

తల్లి వద్ద ,
తండ్రి వద్ద ,
అన్న వద్ద ,
చిన తండ్రి వద్ద ,
పెద తండ్రి వద్ద ,
సవతి తండ్రి వద్ద ,
మేనమామ వద్ద ,
మేనబావ వద్ద ,
పొరిగింటివారి వద్ద ,
ముసలివాని వద్ద ,
పడచువాని వద్ద ,

ఓ ఆడపిల్లకు
ఓ అరక్షణమైనా
రక్షణ ఉందా?

వావి వరుసలు మరచి
విషపుకోరలు గుచ్చి
ప్రకృతి భావాలను
వికృత చేష్టలతో
చిధ్రం చేసే అసురులున్నారనేది
అపర సత్యం.....

శిశువిహార్ లోన ,
వసతి గృహంలోన ,
అనాధ బాలికా సదనాలలోన ,
బస్టాపులోన ,
బస్సులోన ,
రైల్లోన ,
ష్టేషన్ లోన ,
ఇరుగుపొరుగు వాడలోన ,
విద్యాలయాల్లోన ,
విహారయాత్రలోన ..

ఎక్కడ..ఎక్కడ..ఎక్కడ..
 
కనుచూపు మేర
పొలిమేరలోపు
ఎక్కడ రక్షణ....?

 అశ్లీలతకు ఆలవాలమీ తెర
అదే వెండితెర...
అరకొర దుస్తులతో ,
అంగాంగ ప్రదర్శనతో ,
వికార నృత్యభంగిమలతో ,
విచ్చలవిడితనంతో ,
కాసుల కోసం క్లాసుగా ,
ఆడతనాన్ని అవహేళన
చేస్తున్నారనేది జగద్విదితమే.....

ఆటస్థలాలు తరిగిపోయి ,
నెట్ సెంటర్లు పెరిగిపోయి ,
మానసిక ఆరోగ్యం తరిగిపోయి ,
మనోరుగ్మతలు పెరిగిపోయి ,
రహదారులు తరిగిపోయి ,
అడ్డదారులు పెరిగిపోయి ,
కామాంధకారంతో ,
కనులుండి అంధులయ్యి ,
ఎందరెందరి జీవితాలనో
చీకటిలో చిదిమి వేసిన
కామాంధులు సభ్యసమాజంలో
కాలరెత్తి తిరుగుతున్నారనేది
జగమెరిగిన సత్యం.....

తల్లిదండ్రులన్న విలువలేదు ,
పెద్దలన్న భయంలేదు ,
చదువు పట్ల శ్రద్ధలేదు ,
గురువులన్న లెక్కలేదు ,
దేవుడన్న భక్తిలేదు...

విలువలన్నీ వెలసిపోయి ,
చిరిగిపోయిన వలువలల్లే ,
విలువ తరగి విలపిస్తున్నాయంటే.....
వినడానికి ఇబ్బ్బందైనా ,
వినక, విని ఒప్పుకోక
తప్పని విషయమిది
వాస్తవం....

సమాజానికి పునాదైన
"సహకారం" పదానికి
నిస్సిగ్గుగ....నిస్సంకోచంగా.....
క్రొత్తర్ధమిచ్చిన కామాంధుడి
ఇంటర్వ్యూ....
యాసిడ్ దాడులు,
 పెట్రోలుతో సజీవదహనాలు,
మారణాయుధాలతో దాడులు..........

నిలదీసి నిందించే వారేరి ?
నిందలు రుజువైనా శిక్షించే వారేరి ?

ఎవరిది ? తప్పెవరిది ?

నలుదిశలా ఇన్ని ఘోరాలు జరుగుతుంటే.....
వార్తలలో వాసికెక్కిన
వనితలకు సన్మానమని చదవగానే ,
 
ఓ మహిళగ నేను
అభాగ్యుల కన్నీరు
తుడవలేనందుకు బాధపడనా ?
నేరచరితుల కొమ్ముకాస్తున్న
పాలనలో ఉన్నందుకు సిగ్గుపడనా ?
 
*******


 

Tuesday, March 3, 2015

జీవిత గమనం .............


నీవొక చోట
నేనొక చోట

నీదొక బాట
నాదొక బాట

నీదొక తీరు
నాదొక తీరు

అయినా ఒకటిగ
కలిపే మనువుతో


నీది నాది
ఒకటే చోటు

నీది నాది
ఒకటే బాట

నీది నాది
ఒకటే తీరు

కాకపోయినా ఒకటిగా
కలిసే యత్నంలో


ఆశలు మరచి
నిరాశలకోర్చి

కలలను చెరిపి
కలతలకు కృంగి

బాధలు మింగి
బాధ్యతలకు వంగి

ఒడిదుడుకుల
సంసార నావను
ఒడుపుగ ఒడ్డుకు
చేర్చే వేళకు

ఒంటరిగ నన్నొదిలి
ఏ దివికేగావు ?

ముళ్ళబాటలో నన్నొదిలి
పూదండలలో మునిగిపోయావు

పెళ్ళినాటి మాట మరచి
మట్టిలో కలిసిపోయావు

నిన్న మొన్నయ్యింది
ఈ రోజు నిన్నయ్యింది
రేపు ఈ రోజయ్యింది

ఆగలేని కాలం
తిరుగుతూ పోతోంది
ఆపలేని కన్నీరు
అలసి ఇంకిపోతోంది
నీవు లేని 
నడి సంద్రం లోని 
నావను ఒంటరిగా 
   నే ఒడ్డు చేర్చగలనా ?

తిరిగి మొదలయ్యింది....

నీవొక చోట
నేనొక చోట

నీదొక బాట
నాదొక బాట

నీదొక తీరు
నాదొక తీరు

 
********