Tricks and Tips

Friday, January 31, 2014

విష బీజాలకు సాక్షిగా....!

నా మది ఓ పచ్చని ప్రకృతిగా ,
నా తలపులు రమ్యమైన పూరేకులుగా ,
నా నవ్వులు భ్రమర నాదాలుగా ,
నా మాటలు చిలకల పలుకులుగా ,
నా గీతం కుహు కుహు రాగంగా ,
నే నానంద పారవశ్యంలో నర్తిస్తుండగా ....
వివాహబంధంతో నా వనంలోనికి అడుగిడిన నీవు
ప్రేమ మాటున ప్రశ్నలు వేస్తూ ...
అనుమాన బీజం నాటావు .
 

రమ్యమైన తలపుల తలుపులు
తెరచినదెవ్వరికో అంటూ ,
గలగల పారే నవ్వుల అలలు
ఎవ్వరివరుకో అంటూ ,
చిలకల పలుకుల కిలకిలలు
తీపెవ్వరికో అంటూ ,
కూనిరాగం కొసరి కొసరి
తీసేదెవ్వరికో అంటూ ,
నవరస నాట్య భంగిమలు
నేర్చినదెవ్వరికో అంటూ ఉంటే ,
 

వలపుల తలపులు చెరిపేసా ,
తలపుల తలుపులు మూసేసా .
తళతళలాడే పలువరుస ,
పెదవుల మాటున దాచేసా .
చిలకలనన్నీ వదిలేసా ,
పలుకులనన్నీ అణిచేసా .
సరిగమ పదనిస రాగాలు ,
స్వరపేటికలోనే ఆపేసా .
ధిధితై ధిధితై నాట్యాలు ,
కాళ్ళకు గజ్జెలు తీసేసా .
మిలమిలలాడే కనుదోయి ,
రెప్పల మాటున దాచేసా .
కళలకు దూరం అయ్యాను ,
కలలకు పరిమితమయ్యాను .
 

నా మది పచ్చని ప్రకృతిలో ,
విషవాయువులు వదిలావు .
నా హృది అంతయు నిలువునా ,
మాడి మసై పోయింది .
నీ విష బీజాలకు సాక్షిగా ...
బీడు వారిన భూమిలా ,
మోడువారిన తరువులా ,
నిలిచా నేను నిలువెత్తున ,
నీ నికృష్ట చేష్టలకు ప్రతీకగా .

*******

Thursday, January 30, 2014

అక్షరమాల _/\_

  అక్షరమాల
    అక్షరమాల అదే , 
   అక్షరములు అవే ,

అక్షరములను కుదించినను , మధించినను , 
మనం నేర్చుకున్న అక్షరములు అవే ,

మన మస్తిష్కములో ముద్రింపబడిన అక్షరములూ అవే ,
మనం ఆశ్రయించిన అక్షరములూ అవే ,

పదములూ అవే ,
పదముల అర్ధములూ అవే ,

వాక్యములూ అవే ,
వాక్య పరమార్ధములూ అవియే ,

వేళ్ళ మధ్య నిలచిన కలములూ అవే ,
చేతుల్లోని శ్వేత పత్రములూ అవియే ,

శర్మ గారు ఆశ్రయించిన అక్షరములు ....
శతకోటి భ్రమలనే తొలగిస్తుంటే ,
 

రావుగారి హస్తాక్షరములు....
భాగవత తేనె సోనలైతే ,


చంద్ర గారి వర్ణమాలాక్షరాలు...
ఆ పాత మధురాలను సాక్షాత్కరింప చేస్తుంటే ,

మీరజ్ చేతిలోని అక్షరాలు...
హృద్యంగా సాగే వాస్తవాలయితే ,

పద్మార్పితను చేరిన అక్షరాలు...
పడతి ప్రేమ వేదనావస్థకు వర్ణనలైతే ,

సతీష్ గారు అక్షరాలను...
అస్త్రాలుగా సమాజ అకృత్యాలపై సంధించితే ,

ఫణీంద్రగారిని చేరుకున్న అక్షరాలు...
సహజ వ్యక్తుల ఆత్మ సౌందర్య కుసుమాలైతే  , 

వర్మగారి అక్షర మాలలు...
వ్యక్తిలో ఆలోచనలను రేకెత్తించితే ,

రమేష్ గారిని చేరిన అక్షరాలు...
రమ్యమైన ప్రకృతిలో పరవశిస్తే ,

ఆ అక్షరమాల సంతసించదా ,
అక్షరమాలను ఆశ్రయించిన వారి జన్మ ధన్యమవదా...?
 

*******





 

Wednesday, January 29, 2014

భామనే.........!


 భామనే...సత్యభామనే ,
భామనే...సత్యభామనే ,

సుందరవదనం నాదేనే ,
సుందరి అంటే నేనేనే ,

 
పంతం అంటే నాదేనే ,
 పౌరుషమంటే నేనేనే ,

చిలకల పలుకులు నావేనే ,
అలకల మొలకను నేనేనే ,

శ్రీకృష్ణుని కిష్టం నేనేనే ,
శ్రీకృష్ణసత్యను నే...నే...నే ,

భామనే...సత్యభామనే ,
భామనే...సత్యభామనే .

******






Tuesday, January 28, 2014

మౌనంగా ఉంటూనే ......

 మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఆశ
మనసులోని భావాలన్నీ వివరించాలని ఆశ
విలువలతో కూడిన జీవితాన్ని చూపించాలని ఆశ
మనసులోని వ్యధలన్నీ మాయంచేయాలని ఆశ
మనసున్న మనిషిగా బ్రతకాలని ఆశ
మనిషిగా ఈ బ్రతుకును బ్రతికించాలని ఆశ
చీకటిలో చిరుదివ్వెను నేనవ్వాలని ఆశ
 మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఆశ 

********

Monday, January 27, 2014

ఈ ప్రశ్నలకు బదులేది ??????

ఎందుకు ? 
ఎందుకిలా జరుగుతోంది ? 
సమాజం ఎటువైపు పోతోంది ?
మగవాడి నైచ్యానికి అంతే లేదా ?
వయసుకు తగినట్లు మనసు పెరగదా? 
కామప్రకోపాలకు హద్దులేదా ? 
అతనిలోని మానవత్వం చచ్చిపోయిందా ?
లేక అసలు మానవత్వమే లేదా ? 
ఎంచుకున్న వృత్తి ఏమిటి ? 
చేస్తున్న పని ఏమిటి ? 
ఇంక ఇటువంటి ఉపాధ్యాయులు....
ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించగలడు ? 
పిల్లల్లో నైతిక విలువలు ఎలా పెంపొందింప చేయగలడు ? 
ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఎలా చేపట్టగలడు ? 
వాడి పిల్లల వయసున్న పిల్లలను కామంతో ఎలా చూస్తున్నాడు ?
ఆ పసిపిల్లలను చూస్తుంటే మనోవికార చేష్టలు 
ఎలా ఉత్పన్నమవుతున్నాయి ? 
తరగతిగదిలోని ఆడపిల్లలు కామప్రతీకలా వాడికి ? 
వాడి శరీరానికి ఆటవస్తువులా ? 
ఆ కామాంధుని చేతికి చిక్కిన చేపపిల్లలా ?
పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు ?
వయసుకు తగిన ప్రవర్తన సాధ్యం కాదా ? 
ఇటువంటి ఉపాధ్యాయుడుంటే తల్లిదండ్రులు తమ 
ఆడపిల్లల్ని చదివించడానికి పాఠశాలకు పంపిస్తారా ? 
ఆడపిల్లల భవిష్యత్తు ఏమైపోతోంది ? 
అసలు వారికి భవిష్యత్తు ఉంటుందా ? 
ఆడపిల్లల్ని చదివించుకోవాలనే కోరిక కూడా అత్యాశేనా ?
ముందు ముందు ఆడపిల్లలు గడప దాటే అవకాశాలు 
కూడా ఈ సంఘటనలవల్ల మృగ్యమైపోతాయేమో ? 
తల్లి,తండ్రి,అన్న,తాతయ్య,మామయ్య,బాబాయి.....
ఇలా ఎవరు వెంట ఉన్న ఆడపిల్లలను 
కాపాడుకోలేక పోతున్నారు ఎందుకు? 
కౄరమృగాల మధ్య సంచరిస్తున్నామా ?
లేక సమాజంలోనే ఉన్నామా ?
వాడి పిల్లల్నైతే పసిపిల్లల్లా భావిస్తాడే ?
వాడి పిల్లలైతే చల్లగా ఉండాలే ? 
వాడి పిల్లల వంక ఎవరైనా చూస్తే కళ్ళెర్ర బడతాయే ?
వారిపై వువ్వెత్తునలేచి మండిపడతాడే ?
వాడి అక్క,చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలే ? 
వాడి భార్య పవిత్రంగా ఉండాలే ?
మరి ఇతరులు ?
వాడి నీచ ఉద్ధేశ్యానికి ప్రత్యక్ష సాక్షి 
వాడి అంతరాత్మే కదా?
ఏం సాధించడానికి ఈ నికృష్టపు చేష్టలు ?  
ఇటువంటి వాడి చొక్కా చింపి,
చెప్పులతో కొడితే సరిపోతుందా ?
చెరసాలలో పెడితే సరిపోతుందా?
సస్పెండ్ చేస్తే సరిపోతుందా ?
తమ సహచర ఉపాధ్యాయుడు ఇటువంటివాడా ?
అని తోటి ఉపాధ్యాయినులు అసహ్యించుకోరా ?
వాడి భార్య ఆ ఆడపిల్లల స్థానంలో 
తన పిల్లలను ఊహిస్తే ఎలా స్పందిస్తుంది ?
తన భర్త అని చెప్పుకోవడానికి సిగ్గు పడదా ?
మా అన్న అని చెప్పుకోవడానికి 
ఆ అక్కచెల్లెళ్ళు సిగ్గుపడరా ? 
అతని కుటుంబ సభ్యులు నిజాయితీగా 
ఆలోచిస్తే వారి ముందు నిలబడగలడా ?
 నా కొడుకే అని చెప్పుకోవడానికి 
ఆ తల్లి మనసు ఎంత క్షోభిస్తుందో కదా ?
వాడి నికృష్ట చేష్టలకు వాడిపోయిన ఆ ఆడపిల్లల్ని 
చూసి వాడి తల్లి నిష్పక్షపాతంగా  ఓ తల్లిలా నిలబడితే , 
 వాడి కుత్తుక నరికే మొదటి వ్యక్తి వాడి తల్లి కాక మరెవరు ? 
ఆ తల్లే  " మదరిండియ"   కాదా ? 
తల్లీ !ఈ భూమి మీది బిడ్డలందరూ నీ బిడ్డలనే భావిస్తావు కదూ ?
 *********
దొరికితే దొంగలు -దొరకకుండా 
దొరల్లా మిగిలిన వారెంతమందో కదా ?
బయటకు చెప్పుకోకుండా ఉన్న 

ఆడపిల్లల్లెంత మందో కదా ? 
******

Saturday, January 25, 2014

నే స్వాగతించనా ?

 రాళ్ళు , ముళ్ళు సైతం లెక్కచేయక
తన వంతు కర్తవ్యంగా,బాధ్యతగా
తన ఆకలిని , అలసటను మరచి
దేశభక్తి చాటుతున్న ఆ చిన్నారిని
చూసి నే గర్వపడనా ?
అటువంటి జాతిరత్నాలను అలక్ష్యం
చేస్తున్న ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను
చూసి నే సిగ్గు పడనా ?
అరవై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని
నే స్వాగతించనా ?
 
******

వద్దు మావ వద్దు ,

వద్దు మావ వద్దు , నన్నిడిసి పెట్ట వద్దు
వద్దు మావ వద్దు , నన్నిడిసి పెట్ట వద్దు

ఏఏటి కాఏడు ఆడ పిల్లను కంటుంటే
నిన్నెలా ఏలుకోనూ , నా వల్ల కాదు పిల్ల

రంగన్నకు సూడు ఇద్దరు కొడుకులుండె
రాజయ్యకు సూడు ఇద్దరు కొడుకులుండె
రవణత్తకు సూడు ఇద్దరు కొడుకులుండె 
నిన్నెలా ఏలుకోనూ , నా వల్ల కాదు పిల్ల

ఎంత మంది కొడుకులుంటే సుఖమేటి సెప్పు మావ
సెట్టుకొకడు , పుట్టకొకడు తిరుగుతుంటె సూడలేద
తాగి వాగి గొడవ సేయడం మన కళ్ళార సూడలేద
సేతి కందివచ్చినోన్ని మన కళ్ళార సూశామా  
అమ్మ నాన్న బాధను ఒక్కడైన తీసాడా
వద్దు మావ వద్దు , నన్నిడిసి పెట్ట వద్దు

సూరమ్మకు సూడు ఇద్దరు కూతుళ్ళే
మారెమ్మకు సూడు ఇద్దరు కూతుళ్ళే
మల్లన్నకు సూడు ఇద్దరు కూతుళ్ళే
ఆడపిల్లలైతెనేమి సక్కంగ  పెరగలేద
ఇస్కూలికి పోయి సక్కంగ సదవలేద
ఆల్లమ్మకీ నాన్నకీ మంచి పేరు తేలేదా

సెప్పు మావా సెప్పు , అట్టా సూతావేటి సెప్పు
సెప్పు మావా సెప్పు , అట్టా సూతావేటి సెప్పు  

 
అవును నిజము పిల్లో , నువ్వు సెప్పినాది నిజము
నా తప్పు తెలుసుకున్నా , నిన్నిడిసి పెట్టను పిల్ల
ఆడపిల్లలొద్దని ఇంకెప్పుడనను పిల్లో 
మన ఆడపిల్లలిద్దరిని సక్కంగ సదివిద్దాం
నా తప్పు తెలుసుకున్నా , నిన్నిడిసి పెట్టను పిల్ల
అవును నిజము పిల్లో , నువ్వు సెప్పినాది నిజము 

నా రాణి నువ్వు పిల్లో , నా రాజు నువ్వు మావా
నా రాణి నువ్వు పిల్లో , నా రాజు నువ్వు మావా
********




 







 

Friday, January 24, 2014

జోజో.....జోజో.....

నిదురించు నా బాబు నిదురించరా ....
నిదురించు నా బాబు నిదురించరా ....
జోజో.....జోజో.....జోజో.....జోజో....
జోజో.....జోజో.....జోజో.....జోజో....

అందాల చంద్రుడే అరుదెంచెరా ...
తళతళ తారలే వెల్లివిరిసెరా.....
వెండివెన్నెలే నిను చూడ వచ్చెరా ...
చల్లగాలే నిను స్పృశియించెరా...

ఏటి అలలే నీకు పాట పాడెరా ...
అమ్మ కౌగిలే నీకు ఊయలాయెరా ...
అమ్మ మనసు మాట ఆలకించరా...
మురిపాల నా బాబు నిదురించరా...

నీదు అలకలే నాకు ముచ్చటాయెరా ...
నీ ఊకిళ్ళతో పొద్దు పోయెరా....
నీ ముద్దుముచ్చట్లకు అలుపు వచ్చెరా ...
నీలాల కన్నుల్లో నిదరుంచరా ......

నిదురించు నా బాబు నిదురించరా ....
నిదురించు నా బాబు నిదురించరా ....
జోజో.....జోజో.....జోజో.....జోజో....
జోజో.....జోజో.....జోజో.....జోజో....

 ********

Thursday, January 23, 2014

నేను ఒంటరైపోనా ?




 పొరుగువారి బిడ్డ కంటే నా బిడ్డ
చక్కగా చదివినందుకు సంతసించనా ?
తోటివారిని మించి అన్నిటిలో నా బిడ్డ
ముందంజ వేసినందుకు మురిసిపోనా ?
వేరెవ్వరూ పొందనంత గొప్ప ర్యాంకు
సాధించినందుకు సంబరపడనా ?
నూటికో , కోటికో ఒక్కరికి దక్కే స్థానం
దక్కించుకుందని హర్షించనా ?
ఊరందరు ఏకమై నా బిడ్డను
మెచ్చినందుకు ఉత్సాహపడనా ?
ఎర్ర బస్సు తప్ప ఎరుగని నా బిడ్డ
ఏరోప్లేన్ ఎక్కినందుకు ఆనందించనా ?
అమ్మా ఈ ఉద్యోగంతో మన కష్టాలు గట్టెక్కినట్లే అని
నా కళ్ళు తుడిచిన బిడ్డను చూసి పొంగిపోనా ?
త్వరలోనే తిరిగి వస్తానన్న నా బిడ్డ
ఆచూకి తెలియలేదంటే నే కుప్పకూలిపోనా  ?
అందనంత ఎత్తుకెదిగిన నా బిడ్డ అనాధ శవమైపోతే
ఎందరున్న నేను ఒంటరైపోనా ?
ఊరకుక్కలు చింపి విస్తరైన నా బిడ్డను
ఒక్కసారి నా వంక చూసి అమ్మా అని పిలువమననా ?
తిరిగిరాని లోకాలకెళ్ళిన నా బిడ్డకు తోడుగా
నే వెళ్ళలేక పోయినందుకు కుమిలికుమిలిపోనా ?
నే చావలేక బ్రతకనా ? బ్రతికి చచ్చిపోనా ?  
 

 *********

మధురాలాపనతో....


 మధుమాసపు మధురోహలు
తీవెలై తనూలతనల్లి  ,
మనసంత పాకే  
 మరుమల్లెలే పూచే ,

నిలువనీయదే మనసు
నను నిముషమైనా ,
మరువనీయదే మది
నిను నిదురనైనా ,

అలలాంటి కలలే
అరుదెంచి అలరించెనే ,
శిలలాంటి బ్రతుకును
కదిలించి కరిగించెనే ,

పలవరింతలే నిను  
పరవశించి పలుకరించగా ,
కలవరించి నే నిను 
వలచి తలచుకోనా ,

మదిలోన ఆశలు 
మిన్నంటి మెరిసే ,
నా హృదిలోని భావం 
నీ కొరకు విరిసి ,

మధురాలాపనతో ,
మధుర రాగాలాపనతో ,
మధుర భావలాహిరితో ,
మధుర క్షణాలకై వేచి చూస్తున్నా .

 ********

Tuesday, January 21, 2014

జత్తాబెత్తా జానెడు పెట్టె


హవ్వ .....!!!!!
మాయదారి పెట్టె వచ్చే - మమతలన్ని మాసిపోయే
అమ్మ , నాన్నకు గొడవ తెచ్చే - అన్నం , కూర మాడిపోయే
సున్నితమైన బంధాలన్నీ - సుడిగుండంలో చిక్కుకు పోయే
మంచి , చెడ్డ పలకరింపులు - మనకందనంత దూరమాయే
తాతా , బామ్మల ముద్దు మురిపెం - మచ్చుకైన కనబడదాయే
వెన్నెల్లోని కథలు , కబుర్లు - వెదకి చూడ కానరావే
నీతి కథలు , సూక్తులన్నీ - నిలువున నీరు గారిపోయే
ఒప్పులకుప్ప , వామనగుంటలు - ఒంటరిగాను మిగిలిపోయే
రామాయణం , భగవద్గీత - రాళ్ళ మీద మిగిలిపోయే
వేమన పద్యం , సుమతీ శతకం - నామరూపాల్లేకపోయే
ఆటపాటలు తరిగిపోయే - ఊబకాయాలెక్కువాయే  
చదువు ఉండి జ్ఞానం లేక - జానెడు పెట్టెకు దాసోహమాయే
గుప్పెడు మనసు జారిపోయే - పంకిలములోన కూరుకుపోయే
జత్తాబెత్తా జానెడు పెట్టెతో - జగమంతా మారిపోయే  
సునిశిత భావాలిగిరిపోయి - జనమంతా యంత్రాలాయే
సిరి అంటదు కాని - చీడపీడలంటుతాయి
పోయే కాలం దాపురిస్తే - పొరపాట్లన్నీ అలవాట్లేలే  

**********

Saturday, January 18, 2014

బడికి పోతనే అమ్మ....

బడికి పోతనే అమ్మ నేను
బడికి పోతనే ,
సక్కగాను సదువుకుంటనే అమ్మ
నీ కన్నీల్లు తుడిసేత్తనే ,
అల్లరేమి సేయకుండా అమ్మ నేను
                         అందరిలో ముందుంటనే ,     ll బ ll

పెందలాడే లేసేత్తానే అమ్మ
వాకిలంత సిమ్మేత్తానే ,
అంటులన్ని తోమేత్తానే అమ్మ
బట్టలన్ని వుతికేత్తానే ,
గాబులన్ని నింపేత్తానే అమ్మ
                           వంట కూడ సేసేత్తానే ,      ll బ ll

సదువు లేదు , ఏమిలేదు ,
సెప్పు తీసి కొడతాను ,
నువ్వు లోనికెల్లి తొంగోవే ,
మీ అయ్యొత్తే సంపుతాడు ,
పిల్లగాన్ని ఎత్తుకెల్లి ,
                        సక్కగాను ఆడించు         ll బ ll

సదువుకున్న వారినెంతో  అమ్మ ,
సక్కగాను మెచ్చుకుంటవు ,
సదువుకుంట నేనంటే ,
సెప్పు తీసి కొడతనంటవు ,
నీకులానే నే కూడా ...
                     నాలుగిల్లు సూసుకోన      ll బ ll

వద్దు , వద్దు సిట్టీ ,
అంత మాట అనవద్దు ,
నాకులానె నీవు ,
అంత బాధ పడవద్దు ,
పలక , బలపం తీసికుని ,
బడికెల్లు సిట్టి తల్లి ....


తల్లి నీకు మొక్కుతాను ,
మా టీసెరెల్లే సదువుతాను ,
సిన్న , పెద్దలందరికి ,
సదువు ఇలువ సెబుతాను ,
మన ఊరి బాధలన్నిటినీ ,
                తరిమి , తరిమి కొడతాను    ll బ ll

 *******




ముదితల్ నేర్వగ రాని .......


  భార్యా భర్తలంటే ఒకరు ఎక్కువ కాదు ,ఒకరు తక్కువ కాదు . ఇద్దరూ సరి సమానం ,చెరిసగం .ఒక విషయం తప్పుగా అర్ధం చేసుకుని తగవులాడుకుని ,నేను కరక్టంటే నేను కరెక్టనుకోవడం పూర్తిగా పొరపాటు . కారణం ఇద్దరిలోనూ తప్పు చెరిసగం ఉండడమే .అలాగే ఒక
విషయం మంచిగా , అర్ధవంతంగా లేదా లాభసాటిగా జరిగినా , దానికి నేను కారణమంటే నేను కారణమని అనుకోవడం కూడా
పొరపాటే .కారణం మంచి లోనూ ఇద్దరూ చెరి సగం బాధ్యత కలిగి ఉండడమే .కష్టానికీ , సుఖానికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ,
 కష్టాలకు కృంగిపోక,సుఖాలకు పొంగిపోక ఒడిదుడుకులను ఒడుపుగా దాటుకుంటూ అనుక్షణం ఒకరికొకరుగా జీవిస్తూ
ఆనందతీరం వైపు పయనించడమేజీవితం .జీవితమంటే జీతం కాదు .జీతం జీవితంలో ఒక భాగం మాత్రమే.ఒకరి జీతం ఎక్కువ
కాదు,మరొకరి జీతం తక్కువ కాదు. అదెలా అని ఆశ్చర్యమా?జీవితమే సగం , సగం అయినప్పుడు జీతం విషయం అణువంత .
కాదంటారా ?ఉద్యోగం శాశ్వతమా , అశాశ్వతమా అన్నది కాదు ముఖ్యం. అది చేస్తున్నమనలో ఎంత వరకూ స్థిరత్వం ,
ఖచ్చితత్వం,పనిపట్ల గౌరవభావం బాధ్యత ఉందనేదే ముఖ్యం.భార్యా భర్తలు సంపాదించేదాన్ని బట్టి కాదు గుర్తింపు పొందవలసినది ,
ఒకరి వ్యక్తిత్వాన్నిమరొకరు గుర్తించిన గుర్తింపే శాశ్వతమైనది.ఆలుమగలు ఒకరినొకరు గుర్తింప చేసుకునే ఖ్యాతి వారిలోని
అనురాగానికే వర్తిస్తుంది .భార్యా భర్తల మధ్య మనము , మనది అనే భావనే మమతానురాగాల్నిపెంచుతుంది.  జీవితాన్ని
లక్ష్య సాధన వైపుకు మళ్ళిస్తుంది . నూతన ఆశలనెన్నింటినో చిగురింపచేస్తుంది . ఆశావహ
దృక్పథాన్ని పెంచుతుంది .
బంధాలను పటిష్ట పరుస్తుంది .ఈ జీవితం మనది , మన చేతిలోనే ఉంది , దాన్ని అందంగా తీర్చి దిద్దుకునే కళను నేర్చుకోవాలి .
( ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పింపగాన్ )    

***********************


Friday, January 17, 2014

Mohammed Rafi - Chaudhvin Ka Chand Ho


chaudahavi ka chaand ho ya aafatab ho
jo bhi ho tum khuda ki kasam lajawab ho
chaudahavi ka chaand ho ya aafatab ho
jo bhi ho tum khuda ki kasam lajawab ho
chaudahavi ka chaand ho

zulfe hai jaise kaandho pe baadal jhuke huye
aankhe hai jaise mayke pyale bhare huye
masti hai jis me pyar ki tum wo sharab ho
chaudahavi ka chaand ho

chehara hai jaise jhil me hasta hua kaval
ya zindagi ke saaj pe chhedi hui gazal
jaane bahaar tum kisi shayar ka khwab ho
chaudahavi ka chaand ho

hotho pe khelti hai tabassum ki bijaliya
sajade tumhari raah me karati hai kahkasha
duniya-e-husn-o-ishq ka tum hi shabab ho
chaudahavi ka chaand ho


సిగ్గుతో నే తల వంచుకోనా ?



కలుషితం , కలుషితం , కలుషితం
మాటల్లో కలుషితం ,
మనసుల్లో  కలుషితం ,
చేతల్లో  కలుషితం ,
చేష్టల్లో  కలుషితం ,
స్వతంత్ర భారతాన సర్వత్రా  కలుషితం ,
 కలుషితం ,  కలుషితం ,  కలుషితం ,
సుగంధ పరిమళ ద్రవ్యాల మాటున 
 కలుషితం ,  కలుషితం ,  కలుషితం
 కలుషితమన్నది లేనిదెక్కడ ?
 కలుషితమన్నది తెలియనిదెవ్వరికి ?
అంటూ ఏ . సి రూములో అధికారొకడు
నీతిమంతుడిలా , అందరూ నివ్వెరపోయేలా
అడ్డూ , ఆపూ లేకుండా ఏకరువెడుతూ ,
ఏకబిగిన నిర్వచిస్తుంటే ,
చదువుకున్న నేను ఆ కలుషితమయిన
సభలో నుండి లేచి బయటకు నడిచాను ,
సుదూరంగా వచ్చేసా . సాలోచనగా చూస్తుంటే ,
మాసిపోయిన దుస్తులతో ,తైల సంస్కారం లేని జుట్టుతో ,
ఎండిపోయిన డొక్కలతో , చెదరని చిరునవ్వుతో,

నిర్మలమైన మనసుతో ,
నిశ్శేషంగా , నిర్విరామంగా , నిస్సంకోచంగా ,
కలుషితవగాహన లేకనే , తన చిట్టీ చేతులతో
కాలుష్యాన్ని చక చక ఏరి సంచిలో వేస్తూ ,
కాలుష్యరహిత సమాజాన్ని మనకందిస్తున్నాడు .
గర్వపడనా ? దుఃఖపడనా  ? జాలిపడనా ?
సిగ్గుతో నే తల వంచుకోనా  ?
నా భావి భారత పౌరుని జూసి .....? 

**********

Thursday, January 16, 2014

మేడిపండు తంతు ...........!


లొట్టి పిట్ట , లొట్టి పిట్ట , నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
లోకమంత చూపుతానే నా రాణి

లొట్టి పిట్ట , లొట్టి పిట్ట నా రాజా
లొట్టి పిట్ట మీదకెక్కా నా రాజా
లొట్టి పిట్ట మీదకెక్కా నా రాజా
లోకమంత చూపుతావా నా రాజా

పట్టణం తీసుకెళ్ళు నా రాజా
పట్టపగలే వెన్నెలంట నా రాజా
పట్టరాని ఆనందంతో నా రాజా
పులకరించిపోతా నేను నా రాజా

మేడిపండు తంతు అంతా నా రాణి
మెరిసిపోతూ కనిపిస్తాది నా రాణి
వావి వరుస వాడిపోయె నా రాణి
విలువలన్ని మసకబారే నా రాణి

పట్టణంలో పట్టపగలు నా రాజా
మందు బాబులు చిందులేసె నా రాజా
మంచి చెడు మరచిపోయి నా రాజా
మానవత్వం మంట కలిపే నా రా
జా
 
మోసే నలుగురు లేని చోట నా రాజా
మోపలేను కాలు నేను నా రాజా
ఓపలేని బాధలెన్నో నా రాజా
ఓర్చుకుని చూడలేను నా రాజా

లోకమంత ఇంతేతీరే నా రాణి
లోకం లోతు చూడలేవు నా రాణి
మన పల్లే మనకు స్వర్గమే నా రాణి 
తిరిగి మన పల్లెకు పోదాం నా రాణి

లొట్టి పిట్ట , లొట్టి పిట్ట , నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
లొట్టి పిట్ట మీదకెక్కు నా రాణి
తిరిగి మన పల్లెకు పోదాం నా రాణి 


**********

Wednesday, January 15, 2014

అజ్ఞానాంధకార స్వయంకృతం


నా మనసులో మాటవై ,
నా మాటలో భావమై ,
నా భావంలో రాగమై ,
నా రాగంలో పల్లవై ,
నా పల్లవిలో ఆర్తివై ,
నా ఆర్తిలో ప్రాణమై ,
నా ప్రాణంలో చిరుదివ్వెవై ,
నా చిరుదివ్వెలో ఆశవై ,
నా ఆశలో శ్వాసవై ,
నా శ్వాసలో ఆద్యంతమై ,
నా ఆద్యంతంలో తోడువై ,
నా తోడులో నీడవై ,
నా వెన్నంటి ఉన్న నిన్ను
నాలోని వరకట్న పిశాచి మెచ్చలేదు ,
వేరొకరి చేతిలో చేయి వేసి ,
ఆచేతిలో నీ జీవితముంచి ,
నీ జీవితంలో నను తీసివేసి ,
నీ తీసివేతలో నే మిగిలిపోయి ,
మిగిలిపోయిన నా జీవితంలో ,
జీవితాంతం ఒంటరితనం ,
నాకు నేనే ఇచ్చుకున్న శాపం ,
నా అజ్ఞానాంధకార స్వయంకృతం .
 
********


Monday, January 13, 2014

కళామ తల్లిని ఓదారుస్తూ .......


 కళాకారులం మేమంతా ,
కళలకు కాణాచి మా ఇల్లంతా,
కళా సంపన్నత మా ఇంట ,
కళా వైభవం మా వెంట ,
కాలం కలసి రాదు మాకు ,
కళా తృష్ణ లేదు మీకు .
నాలుగు మెతుకులు దొరకవు ఎపుడూ ,
డొక్కల నిండా తిన్నది ఎపుడో ,
అయినా గాత్రం , నాట్యం ఆగదు ఎపుడూ .
రాబోయే కాలంలో పోబోయే
మంత్రి ఒకడు రాబోతున్నాడని  ,
మమ్ము రమ్మని పిలిచారు .
ఆశావాదం చావక మాకు ..
ఎండిన , వెలసిన ముఖాలకు ,
రంగురంగులు పులుముకుని ,
ఆకలి మంటలు దాచుకుని ,
రాని నవ్వులను పిలుచుకుని ,
ఆడిన ఆట ఆడక , 
పాడిన పాట పాడక ,
అలుపు సొలుపూ లేకుండా ,
ఎగిరి ఎగిరి ఆడుతూ ,
గళం అరిగే వరకూ పాడుతూ ,
లయవిన్యాసాలు చేస్తుంటే  ,
ఆపండాపండంటూ వచ్చి ,
అర్ధాంతరంగా ఆపేసి ,
కళలను హేళన చేసారు ,
కళాకారులను అవమానించారు .
పైసలు ఇమ్మని అడిగితే ,
అంతా అయ్యే వరకూ ఆగమని ,
నాలుగు రూకలు చేతిలో పెట్టి ,
అదేమంటే , అదే ఎక్కువ అన్నారు . 
ఆకలి జ్వాలలు అటుంచి ,
హృదయ జ్వాలలు మిన్నంటీ ,
అస్తమించే సూర్యుని చూస్తూ ,
కళలను అస్తమించనీయమని ,
కళామ తల్లిని ఓదారుస్తూ ,
ప్రకృతి మాతకు కళలను ,
సంతోషంగా అంకితమిచ్చాం .
( కళలను గౌరవించడం మన కర్తవ్యం )

********

Sunday, January 12, 2014

ఎందుకో.......? ( 6 )


 ఆలోచనలు ఆకాశంలో,
ఆశయాలు కన్వేయర్ బెల్ట్ పై ,
మాటలూ ...సమాజానికి ఎంతచేసినా
అభివృద్ది చెందదు ఎందుకో ....?
 
*****

పదవుల కోసం పాకులాట
అక్షర జ్ఞానం లేకున్నా,
పదవి అందుకున్నాక ,
అక్షరం  నేర్చుకోవడానికి సిగ్గు ఎందుకో...? 

*******

పైపై మెరుగులకు ఆరాటాలు ,
అందం కోసం పోరాటాలు ,
మానసిక అందం లేనినాడు ,
శారీరక అందం ఎందుకో ....?

******

ఐకమత్యమే మహా బలం అంటూ ,
కుల సంఘాల అభ్యున్నతి  గూర్చి ,
ఉపన్యాసాలిస్తారు ఎందుకో ....?

********

Saturday, January 11, 2014

సంక్రాంతి శుభాకాంక్షలు...._/\_

మనసు అనే తెల్లని కాగితం పై ,
ఆలోచనలనే అక్షరాలుగా పేర్చి ,
భావాలను పదాలుగా మార్చితే ,

అక్షరాలతో అలంకరించుకుని ,
పదాలను ఏరి కూర్చుకుని ,
వాక్యాలకు ప్రాణం పోసుకుని ,
బ్లాగు ఇంటిలో పుట్టి ...
కళకళలాడుతూ , కళాకోవిదురాలిగా 
మీ ముందు ఉన్న ఈ పాప పేరు కవిత .

పేరుకు తగ్గట్టే మీ కనులకు విందుగా ,
 వీనులకు విందుగా , మనసుకు విందుగా
 అనేకానేక సందేశాలను మోసుకుని వచ్చింది .
అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ తెచ్చిన
శుభా కాంక్షలను అందుకోండి బ్లాగు మిత్రులారా..

 
సంక్రాంతి శుభాకాంక్షలు .
 
********

స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా ....
వివేకానందుడంత గొప్పవాళ్ళమా ? ఆయనంత గొప్పవారం కాలేము ,అనుకుంటూ .....కాలాన్ని తోసుకుంటూ పోతున్నాము .
అలా కాకుండా ఆయన చేసిన పనులు కొన్ని మనమూ చేయాలి ,  ఆయన మార్గాన్ని అనుసరించాలి , మనం మన తరవాతి తరాలకు జీవకళతో నిండిన ఇటువంటి వారి జీవితాశయాలను అందించగలగాలి . పిల్లలకు ఆరోగ్యకరమైన మానసిక వికాసానికి దోహదం చేసే అలవాట్లు అందించగలగాలి . మనతోనే ఈ మార్పు మొదలవ్వాలి అనే దృక్పథంతో ముందుకు కదలాలి .యువత ముఖ్యంగా ఆరోగ్యకరమైన
ఆలోచనలతో  సమాజశ్రేయస్సుకై కృషి చేయాలి . మన జాతి గౌరవం  పెంపొందించాలి . ఇది ఏ ఒక్కరిదో కాదు...సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత .   
*************

గుండెగూటిలో ......

అందమైన ఇంటిని కట్టి ,
రుచికరమైన విందును పెట్టి ,
అతిథులందరికీ హంగులు చూపుతూ ,
భార్యా , బిడ్డలకు ఒక్కొక్కరికీ
ఒక్కొక్క గది అని ,వచ్చినవారికి చూపుతూ ...
పడుకోవడానికీ , ఆడుకోవడానికీ  ,
చదువుకోవడానికీ , హాలు అని చెబుతూ ,
హంగులనన్నీ చూపావు ,
అతిధికి కూడా గది అంటూ ......
అట్టహాసంగా చూపావు , ఆనందాన్నీ పొందావు .
వివేకి ఒకడూ నోరు తెరిచి ...మరి
అమ్మకు ఇచ్చిన గది ఏదని అడగగానే ..
చుట్టూ తెలిసిన వాళ్ళు లేరు కనుక
అమ్మకు కాలక్షేపం జరగదు , పైగా  
అమ్మ ఈ గచ్చుపై జారి పడిపోతుందన్నావు ..!
అయినా ఇప్పుడు అమ్మ సంగతి ఎందుకూ ..?
కాదేది వంకకు అనర్హం
అన్నట్లు రాగాలెన్నో తీస్తుంటే ..
అవునవును , చిన్నప్పుడు నీవసలు పడకనే
చకచక లేచి నడిచావంటూ .. సాలోచనగా
 వివేకి ఆ అవివేకిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు ...

 
అమ్మ ......
నిను కనిపెంచిన అమ్మ ,
నీ అవసరాల్ని తీర్చిన అమ్మ ,
నిను కంటికి రెప్పలా చూసిన అమ్మ ,
నీకై నిదురను కాచిన అమ్మ ,
నీకై చేతులు చాచి యాచించిన అమ్మ ,
నీ ఆకలి తీర్చి , పస్తులున్న అమ్మ ,
నీకై పుస్తెలు అమ్మిన అమ్మ ,

నిను గుండెగూటిలో దాచిన అమ్మ ,
ఈ రోజు నా బిడ్డ గృహప్రవేశం ...
వాడు పది కాలాల పాటు చల్లగా వుండాలని ,
చెట్టు నీడన కూర్చుని ఆకాశం కేసి ఆశగా చూస్తూ ,
తన బిడ్డకు దీవెనలిమ్మని ఆ దేవుడిని
 వేడుకుంటోంది వేసారిపోక ....
ఆ గుండెగూటి కన్నా ఈ భవనం
ఏమంత గొప్పది కాదని అనుకుంటూ 
వివేకి లేచి బయటకు నడిచాడు 
బరువెక్కిన హృదయంతో మౌనంగా . 
 
**********

Friday, January 10, 2014

రెప్పల మాటున .......


తరతరాల మాటున దాగిన
 అంతరాలను తొలగించావు . 

మనసు మాటున దాగిన 
   ఆలోచనలను కదిలించావు . 
 
రెప్పల మాటున దాగిన 
 కనుపాపలను బంధించావు .

హృదయం మాటున దాగిన 
కలలను తట్టి కరిగించావు . 

చేతల మాటున దాగిన
   చిలిపి చేష్టలకు కనిపించావు . 
 
పెదవుల మాటున  దాగిన 
        మాటలను వినకనే వెళ్ళిపోయావు .   
 
 
 
 
తలపుల మాటున దాగిన 
            మనసును విరిచి దూరమై పోయావు .      
 
కాలం మాటున దాగిన 
           స్మృతులను మననం చేసుకుంటున్నాను .   
 
 
 **********
 
 
.



Thursday, January 9, 2014

నా ఊయలూపగా.........


జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా
నా ఊయలూపగా ఓ చందమామా
నా దరి చేరవా అందాలమామా

మల్లెలే నీకై వేచి చూచేనే
జాజులు పూచే జాగు సేయకనే
నీలాల కన్నుల్లో నిదరుంచగా
నా నీలి ముంగురులు సవరించగా

జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా
నా ఊయలూపగా ఓ చందమామా 
నా దరి చేరవా అందాలమామా
 
చందన గంధాలు పరిమళించెనే 
పులకింత తెచ్చి ఊసులాడెనే
హృదిలోని ఆశలు వికసించగా
నా అధరాన చిరునవ్వు దరహించగా

జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా

నా ఊయలూపగా ఓ చందమామా
నా దరి చేరవా అందాలమామా 
 
ఆనందలోకాన విహరించగా 
అందాల నా మామ అరుదెంచవా
మనసు దోచి నను మాయజేతువా
మరులుగొలిపి నన్ను నిలువనీయవా

జో కొట్టి పోవా ఓ చందమామా
ఊహల్లు తేవా అందాలమామా
నా ఊయలూపగా ఓ చందమామా
నా దరి చేరవా అందాలమామా 

*********

Wednesday, January 8, 2014

నీకూ , నాకూ మధ్య .......

వీచే గాలికి , ఊగే ఆకులకు మధ్య స్నేహం వుంది ,
నింగికి , నేలకు మధ్య దూరం వుంది ,
పగటికి , రేయికి మధ్య ఓ ఆశ వుంది ,
నిన్నటికి , నేటికి మధ్య అనుభవం వుంది ,
శబ్ధానికి , నిశ్శబ్ధానికి మధ్య అర్ధం వుంది ,
కథలకి , వ్యధలకి మధ్య జీవితం వుంది ,
నీకూ , నాకూ మధ్య ఎడబాటు వుంది ,
నా మనసులో నిండుగా నీకు తప్ప ....
మరెవరికి చోటుంది ?
*******

Tuesday, January 7, 2014

మిగిలితి నే నిశ్శబ్ధ నిశీధిలా .....

కడలి అంత కరుణ కోరి
ఏరి , కోరి నిన్ను చేరి
హృదయమంత నిన్ను దాచి
నీ రాకకై వేచి చూచి
వేదన తోడి వేసారి పోయి 

ఆలోచనలు ఆవిరయ్యి  
వేయి కళ్ళతో , వెక్కిళ్ళతో
ఇసుక తిన్నెల్లో , మసక వెన్నెల్లో 
ఎదురుతెన్నెల్లో , హృది మంటల్లో
నీపై ఆశలు నివురై పోగా
మిగిలితి నే నిశ్శబ్ధ నిశీధిలా 

*********

నా మనసూ దోసినావె ఓ సిన్నదానా ..



మా ఊరి సంతకొచ్చి  ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె  ఓ సిన్నదానా ..

ఓ సిన్నదాన , సిన్నదాన , సిన్నాదానా
నా మనసూ దోసినావె  ఓ సిన్నదానా ..ll మా ll 
 

సుక్కలా రైక తొడిగి   ఓ సిన్నదానా ..
సున్నాలున్న సీర కట్టి   ఓ సిన్నదానా ..
సూరీని బొట్టు పెట్టి   ఓ సిన్నదానా ..
సూదంటూ సూపుసూశావే   ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె  ఓ సిన్నదానా ..ll మా ll

ముద్దబంతి పూలు పెట్టి  ఓ సిన్నదానా ..
ముద్దుమోము సూపెట్టి  ఓ సిన్నదానా ..
ముక్కుకూ ముక్కెరెట్టి  ఓ సిన్నదానా ..
ముల్లల్లే గీసేశావే  ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె  ఓ సిన్నదానా ..ll మా ll

తువ్వాయిల గెంతుతూ  ఓ సిన్నదానా ..
తుల్లిపడి సూత్తూ  ఓ సిన్నదానా ..
తూనీగల్లె ఎగురుతూ  ఓ సిన్నదానా ..
తూరుపల్లె మెరిసిపోయావే  ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె  ఓ సిన్నదానా ..ll మా ll

కళ్ళలోన కళ్ళు కలిపి   ఓ సిన్నదానా ..
కమ్మనైన కలసూపి   ఓ సిన్నదానా ..
కంకిలాగ తల ఊపావే   ఓ సిన్నదానా ..
కనికరమే సూపినావే   ఓ సిన్నదానా ..
నా మనసూ దోసినావె  ఓ సిన్నదానా ..ll మా ll


************                                                                                           

 

Sunday, January 5, 2014

ఓ యువకుడ ...ఓ కోమలి ...


( ఓ పల్లెలో ఒక చదువుకున్న యువకుడు ఎన్నికలలో
 నిలబడి ఓట్లు అడగడానికి రాగా అదే పల్లెలోని    
    ఓ చదువుకున్న యువతి ఆ పల్లె వారి తరపున ...
ఊరి అభివృద్ది కోసం వేసే ప్రశ్నలు )

మొక్క నాటగలవా ? ఓ యువకుడ మంచి చేయగలవా ?
మొక్క నాటి ఈ కలుషితాలను కాలరాయగలవా ?
 ఓ యువకుడ కాలరాయగలవా ?

మొక్క నాటగలనే ,ఓ కోమలి మొక్క నాటగలనే
మొక్క నాటి ఈ కలుషితాలను కాలరాయగలనే
ఓ కోమలి కాలరాయగలనే    II
మొక్క II

రోడ్లు వేయగలవా ? ఓ యువకుడ మేలు  చేయగలవా ?
రోడ్లు వేసి ఈ ఊరి ప్రజలకు  మేలు  చేయగలవా ?
  ఓ యువకుడ మేలు  చేయగలవా ?



రోడ్లు వేయగలనే , ఓ కోమలి  మేలు  చేయగలనే 
రోడ్లు వేసి ఈ ఊరి ప్రజలకు మేలు  చేయగలనే
ఓ కోమలి  మేలు  చేయగలనే    II మొక్క II 
 
కాల్వ తవ్వగలవా ? ఓ యువకుడ నీరునివ్వగలవా ?
కాల్వ తవ్వి ఈ నారుమళ్ళకు   నీరునివ్వగలవా ?
 ఓ యువకుడ  నీరునివ్వగలవా ?

కాల్వ తవ్వగలనే  ఓ కోమలి  నీరునివ్వగలనే
కాల్వ తవ్వి ఈ నారుమళ్ళకు   నీరునివ్వగలనే
 ఓ కోమలి  నీరునివ్వగలనే   
II మొక్క II
 

చదువు చెప్పగలవా ?ఓ యువకుడ బ్రతుకు దిద్దగలవా ?
చదువు చెప్పి ఈ పిల్లలందరి  బ్రతుకు దిద్దగలవా ?
ఓ యువకుడ బ్రతుకు దిద్దగలవా ?
 

చదువు చెప్ప గలనే  ఓ కోమలి  బతుకు దిద్దగలనే
చదువు చెప్పి ఈ పిల్లలందరి  బ్రతుకు దిద్దగలనే
 ఓ కోమలి  బ్రతుకు దిద్దగలనే  
II మొక్క II 

ప్రగతి చూపగలవా ? ఓ యువకుడ తీర్చిదిద్దగలవా ?
 ప్రగతి చూపి ఈ పల్లెను  తీర్చిదిద్దగలవా ?
 ఓ యువకుడ తీర్చిదిద్దగలవా ?

ప్రగతి చూపగలనే  ఓ కోమలి  తీర్చిదిద్దగలనే
 ప్రగతి చూపి ఈ పల్లెను  తీర్చిదిద్దగలనే
ఓ కోమలి  తీర్చిదిద్దగలనే 
  II మొక్క II


*******************

కదలి రండి , కదలి రండి , కదలి రండీ




కదలి రండి , కదలి రండి , కదలి రండీ
ఊరివాడ ప్రజలారా తరలి రండీ
చేయి , చేయి కలిపి మీరు చేరరండీ
పల్లెసీమ సేవకూ  తరలి రండీ    II కదలి II
               

కొండలోన , కోనలోన -ఎక్కడున్న మనం , మనం
ఒక్క కేక తోడిదే - ఒక్క చోట చేరుదాం

కంటి చూపు మేర చూడు - కలుషితం ,  కలుషితం
మొక్కలెన్నో నాటేసి -పారద్రోలు ప్రతి క్షణం  II కదలి II

జనం , జనం , జనం , జనం - కొదవలేని జనం , జనం
ఒక్క బిడ్డ చాలులే - చింతలే పోవులే

మాయదారి జబ్బులొచ్చె - మందులేమో లేవు ,లేవు
భాగస్వామి ఒక్కరైతే - బాధలే రావులే   II కదలి II

పెద్దవారు , చిన్నవారు - బేధమే లేదు , లేదు     
ఉడత భక్తి సాయమే - ఊరి నుద్దరించులే

వెతలు వేయి ఉన్ననూ - వెరపు నీకు వద్దు , వద్దు
తీర్చగలం తప్పక - గెలుపు మనదే నమ్మరా II కదలి II

***********
  

Saturday, January 4, 2014

మరి నేనూ ....... ?


మధురమైన  మాటలతో ,
మనసును శృతి చేయగనే ..
ఇంద్రుడు... చంద్రుడు అనుకొని భ్రమసి ,

ఇంట్లో అరగంటలో వస్తానంటూ , 
అతనితో అందని దూరం ఎగిరాను ,
స్వర్గం నాకే తెలుసనుకున్నాను .

వాడిన పువ్వును చేసి నన్ను ,
అరగంటలో వస్తానంటూ ,
అంగడిలో నను అమ్మేసాడు .

కొన్న వాడు కొత్త మోజుతో ,
కొంగును చుట్టూ కప్పగనే ,
కన్నీరుబికి వచ్చాయి .

సుతిమెత్తగ , లాలనగా మేనిని నిమిరి ,
 అనునయ వాక్కులు పలకగనే ,
వాడే దేవుడు అనుకున్నాను . 

నా నిమిత్తం లేకనే ,
చేతులు మారి పోతున్నా , 
చోటులు దాటి వెళుతున్నా . 

నేనే , నాకు చెందనినాడు.. 
నాదన్నది ఏదీ నాది కాదు ,
నాకంటూ నాది ఏదీ మిగలదు ,
విషాదం తప్ప .
 
నా గుండెకు గాయం చేశారు ,
నా మనసును మోడుచేశారు ,
నా కలలను  కాలరాశారు ,
నా తలరాతను తలక్రిందులు చేసారు .

మరి నేనూ .......  ?

సర్వం తెలుసని భ్రమశాను , 
సర్వ నాశనం అయ్యాను .

తల్లిదండ్రుల మనసులను
నమ్మక ద్రోహ అస్త్రంతో ,
తూట్లు , తూట్లుగా పొడిచేసిన నాకు
ఇంతకు మించిన ఫలమొస్తుందా ?

అంగడిలోని వారికి నేను
 ఏమవుతానని ఆదరించడానికి ?
చల్లని చంద్రుని చూద్దామన్నా ,
మాయా చంద్రులు చుట్టూ చేరి ,
మానని గాయం రేపారు .

అమ్మా !  "  నిన్న"   అనేది
తిరిగి వస్తే ,నీ ఒడిని వదలి వెళ్ళను ,
మోసం అసలే చేయను ,
క్షమించమ్మా .

********

Thursday, January 2, 2014

ఆశ.........



నీ చూపులలోని కవ్వింతనవ్వాలనీ ,
నీ అధరాలపై ధరహాసరేఖనవ్వాలనీ ,
నీ భావాల్లో మాధుర్యానవ్వాలనీ ,
నీ చేతలలో చిలిపితనానవ్వాలనీ ,
నీ ఆలోచనల్లో ఆద్యంతమవ్వాలనీ ,
నీ హృదయంలో వలపుల రాణిని 
నేనే అవ్వాలని ఆశ ,
నా ఈ ఆశల తీవెలకు నీవు 
పందిరివై నన్ను అల్లుకుపోనిస్తావా ?

*********
 

Wednesday, January 1, 2014

కొత్తొక వింత కదా........!



కాలగర్భంలో కలసి పోయింది ఒక ఏడాది
నవ వధువులా నడచి వచ్చింది మరో ఏడాది
కొత్త కదా వింత.....అదో గొప్ప అనుభూతిలా .....
ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా .......!

ఆకాశంలో ఏమైనా రెండు చందమామలు ఒచ్చాయా ?
సూర్యుడు ఏమైనా పడమట ఉదయించాడా ?
లేక నిన్నటి సైకోను సైతానొదిలి ,గీతా బోధ చేస్తున్నాడా ?

రాజకీయ నాయకుడు రెండు నాల్కల ధోరణినాపేస్తాడా ?
గోముఖ వ్యాఘ్రాలు తొడుగు తీసివేస్తాయా ?
కృర మానవ జాతి అకౄరుని జపిస్తారా ?

నాగవైష్ణవిని చంపిన వానిని కొలిమిలో వేస్తారా ?
అత్యాచారాలు చేసినవారిని అడ్డంగా నరుకుతారా ?
పసి పిల్లల హంతకుల్ని పీక నులిమి చంపుతారా ?

వరకట్న పిశాచాలకు జన్మఖైదు వేస్తారా ?
అత్తిటి ఆరళ్ళను అణచి వేయగలుగుతారా ?
భార్యుండగానే మరో పెళ్ళి అన్నోణ్ణి చెప్పు తీసి కొడతారా ?

గొప్పవాళ్ళ తప్పుకు కొమ్ముకాయక వదలుతారా ?
జలగల్లాంటి డాక్టర్లు శవాలకు చికిత్సనాపుతారా ?
లంచగొండి నాయకులు నైతికంగ మారతారా ?

మందులేని ఎలక్షన్లకై  G.O లు  ఇస్తారా ?
మంత్రులంత కలసి స్విస్ ఖాతాలను మూస్తారా ?
విద్యార్ధుల ఆవేశాన్ని పావులాగ వాడుకోరా ?

రాజకీయ రంగు లేకనే ప్రాజెక్టులు కడతారా ?
రామరాజ్యమంటూ రాగాలాప నాపుతారా ?
ఓటు ఉన్న వాడికెల్ల నోటు చూపటమాపుతారా ?


పేదరికం వేళ్ళతో  పెకలించి వేస్తారా ?
నిరుద్యోగాన్ని నిర్మూలించేస్తారా ?
దారిద్ర్యం దాపుల్లో లేకుండా చేస్తారా ?


అంతెందుకూ ..........

దాలిగుంట చూస్తే కుక్క వదులుతుందా ?
కర్ర వేసి కట్టినా కుక్క తోక రూపు మారుతుందా ?
నిన్నలాగ కాక మనం నేడు వేరుగుంటామా ?

అలాగే .....

నిన్నటి ఏడాది మాదిరే , ఈ ఏడాది కూడా
అదే విధంగా కాలగర్భంలో  కలసి పోతుంది .
కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తే సరిపోదు ..

ఆశతో ప్రయత్నిస్తేనే మార్పు వస్తుందీ ,
చరిత్రలో చెప్పుకో దగిన స్థానం పొందుతుంది ,
ప్రగతి పథంలో పయనిస్తుంది .


***********
( విలువలకు విలువనిచ్చే వారికి వర్తించదు )   

పల్లెసీమ పిలిసిందీ


తలపాగా సుట్టుకొని - అయ్యలార , అన్నలార
నడుం సుట్టూ కొంగు సుట్టి -అమ్మలార , అక్కలార 
పల్లెసీమ పిలిసిందీ  - కదలుదాం 
తల్లి సేవ సేయగాను - తరలుదాం 

పల్లెసీమ పిలిసిందీ - అయ్యలార , అన్నలార
జనం కదలి రారండీ -అమ్మలార , అక్కలార
పట్టుబట్టి మనమంతా -తమ్ముడా 
సుబ్బరం సేద్దాము -సెల్లెలా 

పలుగు , పార తీసుకుని -అయ్యలార , అన్నలార
మొక్క సేత బట్టుకొని -అమ్మలార , అక్కలార
సక్కగాను నాటుదాము -తమ్ముడా
పచ్చదనం పెంచుదాం -సెల్లెలా

సేట , సీపురట్టుకొని -అయ్యలార , అన్నలార
ఊరినంత ఊడుద్దాం -అమ్మలార , అక్కలార
ఎగరేసిన సెత్తంతా -తమ్ముడా
ఎత్తబోను సిగ్గేలా -సెల్లెలా

పలక , బలపం సేతబూని -అయ్యలార , అన్నలార
సదువుకోను బడికెలదాం -అమ్మలార , అక్కలార
వయసుతోటి పనియేటి -తమ్ముడా
బతుకుదిద్దుకుందుకూ -సెల్లెలా

బడి ఈడు   పిల్లల్నీ -అయ్యలార , అన్నలార
సదువుకోను పంపుదాం -అమ్మలార , అక్కలార
పుత్తకాలు , అన్నమూ -తమ్ముడా
బట్టలూ కరుసు లేదు -సెల్లెలా

ఆడపిల్లలంటు మనం -అయ్యలార , అన్నలార
అలుసుసేయవద్దూ -అమ్మలార , అక్కలార
అందనంత ఎత్తుకూ -తమ్ముడా
ఆడపిల్లలెదిగె సూడు -సెల్లెలా

సిన్న పిల్లలప్పుడే -అయ్యలార , అన్నలార
పెల్లిసేసి పంపొద్దు -అమ్మలార , అక్కలార
బంగారు జీవితాన్ని -తమ్ముడా
బలిసేయవద్దు మనం -సెల్లెలా

సేయి సేయి కలిపితేను -అయ్యలార , అన్నలార
సేయలేనిదేముందీ -అమ్మలార , అక్కలార
సోగతం పలుకుదాం -తమ్ముడా
సక్కనీ పల్లెకూ -సెల్లెలా

మన పల్లె సూసినోల్లు -అయ్యలార , అన్నలార
తమ పల్లె మార్సాలి -అమ్మలార , అక్కలార
పల్లెసీమ సేవయే -తమ్ముడా
కన్నతల్లి సేవలే -సెల్లెలా


పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా
పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా 
పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా  
పల్లెసీమ సేవే -కన్నతల్లి సేవరా 

***********************