Tricks and Tips

Friday, January 31, 2014

విష బీజాలకు సాక్షిగా....!

నా మది ఓ పచ్చని ప్రకృతిగా ,
నా తలపులు రమ్యమైన పూరేకులుగా ,
నా నవ్వులు భ్రమర నాదాలుగా ,
నా మాటలు చిలకల పలుకులుగా ,
నా గీతం కుహు కుహు రాగంగా ,
నే నానంద పారవశ్యంలో నర్తిస్తుండగా ....
వివాహబంధంతో నా వనంలోనికి అడుగిడిన నీవు
ప్రేమ మాటున ప్రశ్నలు వేస్తూ ...
అనుమాన బీజం నాటావు .
 

రమ్యమైన తలపుల తలుపులు
తెరచినదెవ్వరికో అంటూ ,
గలగల పారే నవ్వుల అలలు
ఎవ్వరివరుకో అంటూ ,
చిలకల పలుకుల కిలకిలలు
తీపెవ్వరికో అంటూ ,
కూనిరాగం కొసరి కొసరి
తీసేదెవ్వరికో అంటూ ,
నవరస నాట్య భంగిమలు
నేర్చినదెవ్వరికో అంటూ ఉంటే ,
 

వలపుల తలపులు చెరిపేసా ,
తలపుల తలుపులు మూసేసా .
తళతళలాడే పలువరుస ,
పెదవుల మాటున దాచేసా .
చిలకలనన్నీ వదిలేసా ,
పలుకులనన్నీ అణిచేసా .
సరిగమ పదనిస రాగాలు ,
స్వరపేటికలోనే ఆపేసా .
ధిధితై ధిధితై నాట్యాలు ,
కాళ్ళకు గజ్జెలు తీసేసా .
మిలమిలలాడే కనుదోయి ,
రెప్పల మాటున దాచేసా .
కళలకు దూరం అయ్యాను ,
కలలకు పరిమితమయ్యాను .
 

నా మది పచ్చని ప్రకృతిలో ,
విషవాయువులు వదిలావు .
నా హృది అంతయు నిలువునా ,
మాడి మసై పోయింది .
నీ విష బీజాలకు సాక్షిగా ...
బీడు వారిన భూమిలా ,
మోడువారిన తరువులా ,
నిలిచా నేను నిలువెత్తున ,
నీ నికృష్ట చేష్టలకు ప్రతీకగా .

*******

10 comments:

  1. అతివ మది ఓ పచ్చని ప్రకృతి, ఆమె తలపులు రమ్యమైన పూరేకులు .... వివాహబంధం, ప్రేమ మాటున ప్రశ్నలు ఉదయిస్తే .... పరిణామం .... వలపుల తలపులు చెరిగి తలపుల తలుపులు మూతపడటమే .... కళలకు దూరం అయ్యి కలలకు పరిమితమవ్వడమే .... ఆ విష బీజాలే అందుకు సాక్షిగా .... ఆ బీడు వారిన భూమి, మోడువారిన తరువు ఆమె జీవితం గా సర్దుబాటు చేసుకుంటూ ....???

    ఒక చక్కని కావ్యరూపం లా జీవితావిష్కరణ
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణాత్మకమైన అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete
  2. శ్రీదేవి గారు.... హాట్సాఫ్. మీ భావన బాగుంది. కానీ నేను హాట్సాఫ్ చెప్పింది మీ భావనకు కాదు.. మీకు. ఎందుకంటే.. ఒక స్త్రీ పంటిబిగువున సంసారం ముసుగులో జరిగే అకృత్యాల బాధలు భరిస్తూ.. భరిస్తూ.. బయటకు చెప్పుకోలేక.. చివరికి గుండె లయ ఆగిపోయే వరకు ఆ గుండెలోనే దాచుకుంటోంది. ఇది నూటికి 90 మంది బాధిత మహిళల్లో జరుగుతోంది. కానీ... బయటకు వెల్లడించే
    తత్వం మొదలై.. నిలదీసే ధైర్యం పోగై... తన ఆశలను కలలకు పరిమితం చేయకుండా.. జీవితాన్ని సార్ధకం చేసుకునే రోజు రావాలి. చాలా బాగా చెప్పారు శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. మీ ఆశాజనకమైన,స్ఫూర్తిదాయకమైన అభినందనలకు ధన్యవాదములు సతీష్ గారు.

      Delete
  3. అనుమానం పెనుభూతం

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు ధన్యవాదములు శర్మగారు.అనుమానం పెనుభూతం,ఒక జీవితకాల నరకం.

      Delete
  4. కొన్ని వేల జీవితాల "నగ్నచిత్రం "
    ఎన్నో ఆడమనస్సుల "మూగగానం"
    ఇంకా సాగుతూనే ఉన్న "ధారావాహికం"
    తిరగు బాటును ఆశించే "ప్రయత్నం"
    మా దేవి కలానికి " అభినందనం "

    ReplyDelete
    Replies
    1. మీరజ్ ఇచ్చే అవిరామ స్ఫూర్తికిది " నిదర్శనం "

      Delete
  5. అత్యంత ప్రశంసనీయమైన కవిత

    ReplyDelete
    Replies
    1. మీ ప్రేరణాత్మకమైన ప్రశంసకు ధన్యవాదములు రాణీగారు .

      Delete