Tricks and Tips

Thursday, January 23, 2014

నేను ఒంటరైపోనా ?




 పొరుగువారి బిడ్డ కంటే నా బిడ్డ
చక్కగా చదివినందుకు సంతసించనా ?
తోటివారిని మించి అన్నిటిలో నా బిడ్డ
ముందంజ వేసినందుకు మురిసిపోనా ?
వేరెవ్వరూ పొందనంత గొప్ప ర్యాంకు
సాధించినందుకు సంబరపడనా ?
నూటికో , కోటికో ఒక్కరికి దక్కే స్థానం
దక్కించుకుందని హర్షించనా ?
ఊరందరు ఏకమై నా బిడ్డను
మెచ్చినందుకు ఉత్సాహపడనా ?
ఎర్ర బస్సు తప్ప ఎరుగని నా బిడ్డ
ఏరోప్లేన్ ఎక్కినందుకు ఆనందించనా ?
అమ్మా ఈ ఉద్యోగంతో మన కష్టాలు గట్టెక్కినట్లే అని
నా కళ్ళు తుడిచిన బిడ్డను చూసి పొంగిపోనా ?
త్వరలోనే తిరిగి వస్తానన్న నా బిడ్డ
ఆచూకి తెలియలేదంటే నే కుప్పకూలిపోనా  ?
అందనంత ఎత్తుకెదిగిన నా బిడ్డ అనాధ శవమైపోతే
ఎందరున్న నేను ఒంటరైపోనా ?
ఊరకుక్కలు చింపి విస్తరైన నా బిడ్డను
ఒక్కసారి నా వంక చూసి అమ్మా అని పిలువమననా ?
తిరిగిరాని లోకాలకెళ్ళిన నా బిడ్డకు తోడుగా
నే వెళ్ళలేక పోయినందుకు కుమిలికుమిలిపోనా ?
నే చావలేక బ్రతకనా ? బ్రతికి చచ్చిపోనా ?  
 

 *********

16 comments:

  1. ఆడబిడ్డని కన్నందుకు మురిసిపోవాలి , కానీ ఆ చిట్టితల్లిని కబళించే బూచిని చూసి దడుసుకోవాలి.
    నిజమే.. తల్లి మనస్సు ఇలాగే తపిస్తుంది, ఎందరో తల్లుల కడుపు మంట ఆరలేదింకా..

    ReplyDelete
    Replies
    1. అవును ,మీరజ్ నిజంగానే ప్రతిరోజూ టి.వి చూస్తున్నా ,
      పేపర్ చూస్తున్నా ఎంతో బాధ ,వేదన , మానవత్వం
      మచ్చుకైనా మిగిలింది అనిపించడం లేదు .ఆడపిల్లల్లున్న
      ఇళ్ళు లక్ష్మీ నిలయంతో సమానం అనేవాళ్ళు ఒకప్పుడు,కానీ
      ఇప్పుడు ఆపదల నిలయాలేమో అనిపిస్తోంది .

      Delete
  2. తమ కన్నుల పంటల్ని కంటి రెప్పల్లా కాపాడి,
    కంటికీ ఇంటికీ వెలుగ వుతుందనీ,
    కన్న కలలన్నీ,
    ఆ కళ్ళతో నిజం చేసుకుని, చూసుకొవాలనుకున్న కన్న వారి కంటికి రోదనా,
    కడుపుకి వేదనా మిగిల్చే సమాజంలో,
    నెనూ ఉన్నాననీ సిగ్గు పడనా.

    ReplyDelete
    Replies
    1. వేదనలూ,రోదనలూ,ఆక్రందనలు,ఆవేదనలూ,ఆక్రోశాలు,అమానుషాలూ,అత్యాచారాలు,కన్నతల్లుల కడుపుకోతలు,నడిరోడ్డుమీద సభ్యసమాజం తలదించుకునేలా జరుగుతున్న సంఘటనలు మన ప్రభుత్వానికి ఈకతో సమానం .ఇది మన దురదృష్టం,దౌర్భాగ్యం జానీగారు.

      Delete
  3. ఇందరు తల్లుల గర్భశోకం తో కూడా దాహార్తి తీరని ఆ ఘోరకలి, మృగత్వం నిండిన ఒక్కో మగవాడిని ఒక్కో నాల్కగా చాచి సమాజం వైపు చూస్తోంది. దాని నాల్కలను ఖండిచే ఖడ్గం ప్రతి ఆడపిల్ల చేత ఉంటే ఎంత బావుణ్ణు

    ReplyDelete
    Replies
    1. ఆడపిల్లలను కాళికల్లా పెంచాలేమో హరితా , మనం మరీ సున్నితంగా పెంచి బలి చేస్తున్నామేమో అనిపిస్తోంది .

      Delete
  4. ఆడపిల్లలకు అత్యంత కఠినమైన రోజులివి. మూడు రోజుల నుంచి చాలా మంది ఇలాంటి ఆవేదనే
    వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘోరాలకు మూల కారణం అన్వేషించి... అత్యంత కఠినమైన చట్టాలు
    తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. వుమెన్ ప్రొటెక్షన్ ఎమెర్జెన్సీ అంటే తప్పేం లేదనిపిస్తోంది. చాలా
    చాలా బాధాకరమైన సంఘటనలు చూడాల్సి వస్తోంది. గుండెల్లోంచి కన్నీరు ఉబుకుతోంది. శ్రీదేవి గారు.

    ReplyDelete
    Replies
    1. ఆ అంతులేని ఆవేదన నుండి వచ్చినదే ఈ కవిత ,రాసాక కనుల వెంట నీరు వచ్చేసింది .....ఈ దౌర్భాగ్య పరిస్తితులు ఎప్పటికి మారతాయో సతీష్ గారు.

      Delete
  5. చాలా వేదనగా ఉంటుంది, ఇలాంటివి ఆలోచిస్తుంటే.

    ReplyDelete
    Replies
    1. పూర్వ కాలంలో ఒక సామెతలా......
      ఆడపిల్లై పుట్టేకంటే అడవిలో మానై పుట్టడం
      మంచిదేమో అనిపిస్తోంది మీరజ్ .

      Delete
  6. ఇలాంటి సంఘటన లు ఆడపిల్లల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి . భయాన్ని కలిగిస్తున్నాయి ..

    ఆడపిల్ల ని అంత నీచం గా చూసే ఈ సంస్కృతి మన సమాజం లోకి ఎలా చొచ్చుకు వచ్చింది ? సబల ని

    కూడా అబల గా మార్చే ఈ దౌర్భాగ్యం ఇంకెన్నాళ్ళు ? ఇలాంటి పరిస్థితులు మళ్ళి ఆడపిల్లల్ని కట్టు

    బాట్ల సంకెళ్ళు బిగించెయ్యవా ? వంటింటి చెరసాల లో మగ్గి పోనీయవా ?

    ReplyDelete
    Replies
    1. రాధికగారు నా బ్లాగుకు స్వాగతం.
      చరిత్ర పునరావృతమవుతుందేమో అని
      నాకూ అనిపిస్తోంది.

      Delete
  7. అమ్మా ఈ ఉద్యోగంతో మన కష్టాలు గట్టెక్కినట్లే అని
    నా కళ్ళు తుడిచిన బిడ్డను చూసి పొంగిపోనా?
    త్వరలోనే తిరిగి వస్తానన్న నా బిడ్డ
    ఆచూకి తెలియలేదంటే నే కుప్పకూలిపోనా?

    మనిషి కష్టపడి కట్టుకున్న ఆశల గూడు నిలువునా కూలిపోయిన భావన ఒక జీవితకాలం పోగు చేసుకున్న మమతల రూపాన్ని రాక్షత్వం, మృగత్వం కన్నెర్రచెసి దూరం చేసిన బాధ వర్ణనాతీతం.

    ReplyDelete
    Replies
    1. ఎంతో మంది తల్లిదండ్రుల ఆశలు నిలువునా
      కుప్పకూలి పోతున్నాయి చంద్రగారు.నేటి
      సమాజంలో ఇటువంటి కేసులన్నీ
      ఈక ప్రాయం అయిపోయాయి........

      Delete
  8. Good reading :)
    Tears rolled down my eyes

    ReplyDelete
    Replies
    1. sravan kumar welcome to my blog and thanks for your comments.
      but what is the use ? you people (youth) should do something.
      if you want to do ,you can do anything.......anyway thank you.

      Delete