Tricks and Tips

Sunday, November 3, 2013

భయం...... భయం .....భయం


నా పేరు చిన్నారి . పేరు చూసి చిన్నదాన్ని అనుకోకండి . నాకు వివాహమై 8వ తరగతి చదివే కొడుకు కూడా ఉన్నాడు . నా అసలు పేరుకన్నా ఈ ముద్దు పేరే మా బంధువర్గంలో అందరికి సుపరిచితం . చిన్నతనంలో నాకు భయం ఎక్కువగా ఉండేది . చీకటంటే  భయం . గండుచీమ ,కుక్క ,పిల్లి ,బల్లి , బొద్దింక .....అంటే భయం . వేగంగా ప్రవహించే నీరంటే , బ్యారేజి అంటే , కొండ అంటే భయం .మెరుపులు, ఉరుములు , పిడుగులు అంటే భయం . నాన్నంటే ,టీచర్ అంటే , పరీక్షలు అంటే భయం , పోలీస్ అంటే ,దొంగ అంటే , సినిమాలో ఫైటింగులు అంటే భయం .................. ఇలా అంతులేనన్ని భయాలతో  భయం ,భయంగా బాల్యం గడచిపోయింది .                     
నాలుగు రోజుల క్రితం పెళ్ళికని ఊరెళ్ళాను . తిరిగి వచ్చేటపుడు ఆఖరి బస్సెక్కాను . దారిలో దాని టైరుపంక్చరయింది . దాన్ని సరిచేసుకొని ఊరు చేరుకునే సరికి రాత్రి పన్నెండయింది . నాలుగడుగులు వేస్తే ఇల్లు    వస్తుంది. మావారికి ఫోన్ చేశాను ,కానీ అది కట్టయింది .    సరిగ్గా అప్పుడే కరంటు పోయింది . అంతే నా గుండెఆగినంత పనయింది .  నా నీడకు   కూడా అందనేమో  అన్నంత వేగంగా ,భయంగా ఇంటికి వెళ్తూ ఎదురుగా వచ్చే ఆయన్ని చూసి హమ్మయ్య అనుకున్నాను . 
మర్నాడు ఆఫీసుకి బయల్దేరాను . దారిలో నా కొలీగ్ వసుధ స్కూటి ఆపింది ,ఎక్కాను . ఎదురొచ్చే ఏ వాహనం చూసినా ఎంతో భయం . కొంత దూరం వెళ్ళేసరికి సమైక్యాంధ్ర గూర్చి రాస్తారోకో చేయడంతో ఆగిపోయాం . మాటిమాటికి టైం చూసుకొంటున్నాను . బాస్ ఏమైనా అంటాడేమో అనే భయంతో . మొత్తానికి గంట ఆలస్యంగా వెళ్ళాను . భయం ,భయంగా బాస్ రూం వైపు చూశా  .... బాస్ ఇంకా రాలేదు . ఓహో !ఎక్కడో రాస్తారోకోలో చిక్కుకుపోయి ఉంటాడు ... మంచిదయింది అనుకుంటూ పనిలో మునిగిపోయాను . ఫోన్ మోగింది .ఎవరా ! అనుకుంటూ చూస్తే తమ్ముడు . ఒక్కసారిగా కాళ్ళు, చేతులు చల్లబడ్డాయి భయంతో . ఈ మధ్య నాన్నగారికి బాగుండడం లేదు . పేలవంగా తమ్ముడూ ......అన్నాను. ఏంటి చిన్నారీ !ఒంట్లో బాలేదా ?అలా ఉన్నావ్ అన్నాడు. ఏం లేదు కానీ ,ఏంటి విషయం ?అన్నాను భయం 
 వి(క)నపడనీయకుండా . ఏం లేదు ఊరికే చేశాను అనే సరికి నాలుగు మాటలు మాట్లాడి ఫోన్  పెట్టేశాను . అలా సాయంత్రం అయింది . యదావిధిగా భయపడుతూ    బండి మీద ఇంటికి చేరాను .                   
సమయం ఐదయింది . బాబు వచ్చే టైమయింది అనుకుంటూనే పొయ్యి మీద టీ పెడదామని లైటర్ని నాలుగైదుసార్లు నొక్కినా పొయ్యి వెలగలేదు . ఇంకోసారి నొక్కగానే ఒక్కసారిగా పెద్ద మంట వచ్చేసరికి భయపడి పోయాను.టీ పెట్టి తాగాను .ఐదున్నర అయింది .బాబు రాలేదేమిటా అనుకుంటూ భయంగా వీధిలోకి ,ఇంట్లోకి తిరిగాను.మొక్కలకు నీళ్ళు పోద్దామని పంపు తిప్పేసరికి నీళ్ళు రాలేదు . మోటరు వేద్దామని స్విచ్ వేయగానే కరంటు స్పార్క్స్ వచ్చేసరికి ఒక్కసారిగా భయంతో    చేతిని వెనక్కు లాక్కున్నాను .                               
ఆరిన బట్టలు మడత వేస్తూ మావారి ఆఫీసుకి ఫోన్ చేశాను.ఆయన ఎంతకీ ఫోన్ తీయలేదు.ఏమయిందీ ? అనుకుంటూ పదే పదే చేశాను.ఆఖరికి ఫోన్ తీసి          "అర్జెంటు పని మీద ఉన్నాను. ఏమిటో చెప్పు"   అన్నారు     ప్రశాంతంగా.  బాబు ఇంకా రాలేదండి ఆరవుతోంది అన్నాను భయంగా . వస్తాడులే నీవనవసరంగా భయపడకు .. ప్రశాంతంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేశారు . ఆరున్నర అవుతూండగా వచ్చాడు బాబు . వాడి స్నేహితుడు  అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే అందరితో కలిసి వెళ్లి చూసి వచ్చానని చెప్పి ,ఎందుకమ్మా!భయం ... ప్రశాంతంగా ఉండు అన్నాడు తండ్రిలానే . గబగబా రడీ అయ్యి ట్యూషన్ కెళ్ళిపోయాడు .                            
సన్నగా చినుకులు పడుతున్నాయి. మా ఇంటికి మూడువైపులా ఖాళీ స్థలాలే ,వాటిల్లో చెట్లు చీకటి పడ్డాక దయ్యాల్లా ఊగుతున్నట్లు కదలుతాయి . చీకటి పడితే చాలు అడవిలో ఉన్నట్లే . భయంతో బిక్కు బిక్కు మంటూ చుట్టూ  చూడడం . భయాన్ని పోగొట్టుకోవడానికి  టి . వి . ఆన్ చేశాను . ఛానల్స్ అన్నీ పోయి కేబుల్ ఛానల్ మాత్రమే వస్తోంది . అందులో " కాంచన " సినిమా . 
దేవుణ్ణి నమ్మినప్పుడు దయ్యాన్ని కూడా నమ్మాలిగా అనే ఆలోచన వచ్చేసరికి ఒక్కసారిగా భయం వేసింది . చూడనా, వద్దా అనుకుంటూండగా బయట గాలి హోరు పెరిగి కరంటు పోయింది . అంతే ఒక్కసారిగా భయం వేసి గబగబా   లేచాను ఛార్జింగ్ లైట్ వేద్దామని . ఆ గాభరాలో క్రింద పెట్టిన ఖాళీ టీ గ్లాసును ఒక్క తన్నుతన్నాను,పెద్ద శబ్ధం.భయం తో ఏడుపు వచ్చిన్నంత పనయింది.అంతలో టేబులుపై పెట్టిన సెల్ ఫోన్ వైబ్రేషన్ లో ఉండడం వల్ల భయంకరమైన శబ్ధంతో రింగయింది . ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను భయంతో. అది రాంగ్ నెంబర్ .భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క ఐడియా అనుకుంటూ అమ్మకు ఫోన్ చేశాను . అమ్మ మాట్లాడుతూ ఏమ్మా
  చిన్నారీ !ఏమైనా భయం వేసిందా ? అలా మాట్లాడుతున్నావు అంది. లేదమ్మా ,లేదు అంటూ కొద్దిసేపు మాట్లాడానోలేదో ఆయన కారు హరన్ వినిపించింది.అమ్మకు బై చెప్పి గేటుతీసాను ధైర్యంగా.   ఆయన దిగి నావంక చూసి  ఆ ....... ఆ ..... చెప్పేయ్ అన్నారు . నేను వెంటనే ఏంటది ?అన్నాను . అదేనోయ్ నీవు ఈ రోజు ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా భయపడ్డావో చెప్పెయ్ అన్నారు నవ్వుతూ . అంతే ఉక్రోషంతో నాకు
 కోపం ,ఆవేశం వచ్చేశాయి . ఇంకెప్పుడూ  అసలు భయపడకూడదు ... ఒకవేళ భయపడినా ఎవరికీ చెప్పకూడదు ... చెప్పబట్టే కదా !అందరికీ హేళన ....... ఇలా మనసులో నాకు నేనే చెల్లని వాగ్ధానాలు కోకొల్లలుగా చేసేసుకుంటున్నాను . 
ఏంటి ... మనసులో వాగ్ధానాల జాతర జరుగుతోందా అన్నారు నవ్వుతూ .   నే కోపంగా చూసి ఊరుకున్నాను .
 దాంతో ఆయన ,అది కాదు చిన్నారీ ! భయం మనిషిలోని తెలివితేటలను నశింపచేస్తుంది ,సమయస్ఫూర్తిని పోగొడుతుంది,సహనాన్నితగ్గిస్తుంది,సంతోషాన్నిదూరం చేస్తుంది,ధృడవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది ,మానసిక వికాసానికి ఆటంకం కలిగిస్తుంది ,ఆలోచనా శక్తిని నశింపచేస్తుంది ,ఆందోళనను పెంచుతుంది ,ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది ,లేనిపోని ఊహలు కలిగిస్తుంది ,ప్రశాంతతకు దూరం చేస్తుంది,ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది . భయం మహా చెడ్డది సుమా ! మనం మానసికంగా బలహీనంగా ఉన్న సమయాన్ని చూసి మనలో టక్కున చేరి పోతుంది .
మనల్ని పట్టి పీడిస్తూ ,మనల్ని దైవానికి దూరం చేస్తుంది.  అందుకని నీవు భయాన్ని పారద్రోలి ధైర్యంగా ఉండాలి సరేనా ...... ఆ ....... ఇంకో ముఖ్యమైన విషయం ...... ఇంకా చెప్పాలంటే "భయం "నీవు నా గూర్చి ఆలోచించే సమయాన్ని కూడా తగ్గిస్తుంది ...... అనగానే నాకు నవ్వొచ్చి నవ్వేశాను . 
మబ్బులు వీడిన ఆకాశంలా ప్రశాంతంగా ఉంది మనసు . 
తెల్లవారింది .వసుధ బండి ఎక్కి ఆఫీసుకి బయలుదేరాను. భూమి గుండ్రంగా ఉన్నట్లు భయం  మొదలయింది . వెంటనే నిన్న జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారిగా నవ్వేశాను పైకి . ఏంటి అని అడిగిన వసుధకు లంచ్ అవర్లో చెప్తాలే అంటూ నవ్వుకుంటూనే ఉన్నాను ప్రశాంతంగా . అంతేకదా ! భయం లేకపోతేనే కదా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసేది .
******** 

2 comments: