Tricks and Tips

Wednesday, April 9, 2014

మళ్ళీ కథ మొదలవుతోంది...........

ఓటరు మహాశయులు మీరేనంటూ ,
మా ఓటరు దేవుళ్ళు మీరేనంటూ ,
మీ ఓటెంతో పవిత్రమంటూ ,
మీ నిర్ణయమే విలువైనదంటూ ,


"రాజకీయశక్తి "కి రూపం నేనేనంటూ ,
అరాచకాన్ని అణిచివేయగ వచ్చానంటూ ,
మైకులో హోరుగ చెప్పిస్తూ ,
జోరుగ ఊరిలో తిరిగేస్తూ ,

మా పార్టీకే మీ ఓటంటూ ,
గుమ్మం , గుమ్మం ఎక్కి దిగుతూ ,
చిన్నాపెద్దా తేడా చూపక ,
చేతులెత్తి దణ్ణం పెడుతూ ,

మురికివీధులను దాటుకుంటూ ,
కాలినడకన చకచక వెడుతూ ,
చెమట , సొల్లు ఫర్లేదంటూ ,
చేతులు , తలలు తాకి వెడుతూ ,

నడుమును పూర్తిగ వంచివేస్తూ ,
పూరిగుడెసెలోకి దూరి వెడుతూ ,
మోకాళ్ళు వంచి పీటపై కూర్చుని ,
వృద్ధుని వివరాలన్నీ అడిగి వెడుతూ ,

అంతటి వాడు మన చెంతకు వచ్చాడంటూ ,
సంబరంతో అందరు ఎగురుతు వుంటే ,
వారి బలహీనతను బలముగ పొంది ,
వారి ఓట్లతో గెలుపును పొంది ,

అతివినయంగా అందరికీ చేతులెత్తి దణ్ణం పెట్టి ,
మీకిచ్చిన వాగ్ధానాలన్ని చూడండి ఇదిగో ,
ఇప్పటి నుండే మొదలెడతానంటూ లోనికెళ్ళి ,
మాంత్రికునిలా....... మాయమైపోయాడు ,

రైతుల కన్నీళ్ళు ఆగనేలేదు ,
మగ్గం చావులు తగ్గనేలేదు ,
ఋణాల మాఫీ మాటేలేదు ,
పెన్షన్లు పెంచిన జాడే లేదు ,

వికలాంగుల వినతికి విలువేలేదు ,
ధరలు కిందికి దిగిరాలేదు ,
రోడ్లు , కాల్వలకు దిక్కేలేదు ,
నిరుద్యోగుల నిస్పృహలకు అంతమేలేదు ,

బాధలు ఏకరువెడదామని వెళితే ,
ఏ.సి నుండి బయటకు రాడు ,
వెళ్ళిన వారిని లోనికి పిలవడు ,
అప్పటీ ఇప్పటికీ పోలిక లేదు ,

"అరాచకకుయుక్తి" రూపం చూపి ,
విలాసంగా కుర్చీలో అటుఇటు ఊగుతూ ,
అధిష్టానంతో చర్చిస్తానంటూ తాపీగా ,
అర నిమిషంలో సెలవిచ్చాడు....

అయిదు సంవత్సరాలు గడిచాయి .....
చరిత్ర పునరావృతమే అవుతోంది ,
అయినా ఒక్కడు మేల్కోలేదు ,
మళ్ళీ కథ మొదలవుతోంది...........

******










 

No comments:

Post a Comment