Tricks and Tips

Wednesday, March 26, 2014

డాలర్లు కాదని తెలియదా నీకు ?


బంధాలు బలహీనమై ,
తరాల మధ్య అంతరాలు పెరిగి....

ఆత్మీయతలు ఆవిరై ,
ఆంతర్యాలు అంతు చిక్కక....

అనుబంధాలు అణగారిపోయి ,
ఆర్ధిక బంధం ఆకాశాన్నంటగ....

పుట్టిన ఊరిని విడచి పెట్టి ,
వేరొక ఖండాన్ని వెతుకుతు పోయి....

అమ్మనాన్నను వదిలి వేసి ,
మమతాను బంధం మరచిపోయి....

చేసిన తప్పును కప్పిపుచ్చుటకు ,
నలుగురి దారిలో నడిచానంటూ....

నాగరికతకు రూపం చూపుతు ,
పేరెంట్స్ డేకి మెయిల్స్ పెడుతు....

చేతిలో ఊతం అవ్వాల్సినవాడు ,
 మాటాడలేనంత ఎదిగిననాడు....

అమ్మానాన్నలు ఆశ్రయించేది ,
వృద్ధాశ్రమం కాక ఏముంది ?

మనసు బిడ్డల చుట్టూ తిరుగగ ,
కట్టెలు మాత్రం ఆశ్రమం చేరి ....

తమబోటి వారి చెంత చేరి ,
వారి బిడ్డల ఆరా అడిగి....

తమ కడుపున పుట్టిన సంతానమంతా ,
కలకాలం కళకళలాడాలంటూ....

తోటి వారితో ముచ్చటిస్తూ ,
భగవంతుని అదే కోరుకుంటూ....

ఖండాంతరాలలో ఉన్న బిడ్డలు ,
ఆఖరి చూపుకు రాకపోయినా....

అంత్యేష్టికి హాజరు కాకపోయినా ,
అయ్యో ! నా బిడ్డకు ఏమి కష్టమొచ్చెనో కదా ,

అక్కడే నిలచి పోయాడంటూ ,
వాడికి మాత్రం సద్గతి నీయాలంటూ....

పిల్లల కోసం తుది శ్వాస వరకు ,
ఆరాటపడే అమ్మానాన్నలకు ....

మనం ఇవ్వగలిగేది ఏముందని
ఆలోచిస్తే , డాలర్లు కాదని తెలియదా నీకు ?

అమ్మా ! అనే కమ్మని పిలుపు
ఆప్యాయతలు మాయని పిలుపు .

*********
 
(ఇది కేవలం స్వార్ధపరులైన పిల్లల గూర్చి మాత్రమే రాశాను , తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకునే బిడ్డలకు నా అభినందనలు)



12 comments:

  1. చాలా బాగా రాసారు శ్రీదేవి గారూ .. నవ్య సమాజం రీతిని కడిగి పారేశారు ... నేను ఓ నవల లో ఈ అంశం కోసం రాసాను . రుధిర సౌధం పూర్తీ కాగానే ఆ నవలని ప్రచురిస్తాను

    ReplyDelete
    Replies
    1. రాధికా ధన్యవాదములు.వారిని కడగడం కోసమని కాదు,కానీ ఇప్పటికైన తమ తల్లిదండ్రుల ఆవేదనను అటువంటి బిడ్డలు తెలుసుకోవాలని,మీరజ్ అన్నట్లు ఒక్కరైనా మారాలని ఆశిద్దాం.

      Delete
  2. వాడు తెలుసుకునే సరికి పిలిచే అదృష్టానికి దూరం అయిపోతాడు

    ReplyDelete
    Replies
    1. హరితా,వివరం వచ్చేసరికి ......అయిపోతుంది.అంతే వారి తలరాత.

      Delete
  3. డాలర్ల జాలర్లకు తెలీదు
    తాము తెలిసి తెలిసి డబ్బు వలలో పడిపోయి
    అయినవారినీ మాత్రుభూమినీ
    అమ్మవడినీ ఇంటిగుమ్మాన్నీ
    మమతానురాగాల్నీ తాకట్టు పెట్టి
    కాగితాల రెపరెపల్లొ
    తాత్కాలికానందాల్ని చూస్తూ
    అమూల్యమైన అమ్మ చేతి గోరుముద్దను కోల్పోయి
    అతి బీదవారవు తున్నారని గ్రహించలేని అల్పసంతోశులే

    ReplyDelete
    Replies
    1. దూరపు కొండలు నున్నగా ఉంటాయన్న సామెత ఉండనే ఉందిగా జానీగారు,ఎవరైనా ఏదైనా చెప్పారో, ఇక వాళ్ళను పీతల్లా,బావిలో కప్పల్లా.............చూస్తారు.

      Delete
  4. అమ్మ,నాన్న, ఈ రెండు బంధాల కంటే ఇంకెక్కడుంటుంది సంపద,
    చక్కని మీ కవిత అంతే చక్కటి హితబోదగా తీసుకొని ఒక్క బిడ్డయినా మారితే అంతేచాలు.

    ReplyDelete
    Replies
    1. ఏదో లేదనే భ్రమలో పడి,ఉన్నదాన్ని గుర్తించలేని పరిస్థితిలో సమాజం కొట్టుమిట్టాడుతోంది మీరజ్.

      Delete

  5. బాగా చదువు అమెరికా వెళ్ళా లని చదువు చెప్పించారె మరి !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బాగా చదువు అమెరికా వెళ్ళాలని చదువు చెప్పించారు,
      అంతే కానీ అమ్మా నాన్నల్ని మరచిపోమని చెప్పలేదే.......
      మీ స్పందనలకు ధన్యవాదములు జిలేబీగారు.

      Delete
  6. సంపాదన సాటి ప్రవాసులతో పోటీ వ్యామోహాల్లో పడి ఎందరో తాము ఏమి కోల్పోతున్నారో కోల్పోయారో ఆలోచించేంత సమయం కూడా లేక యాంత్రికంగా డాలర్ల లాలసకు లోనౌతున్నారిఉ
    ఎంతో శోచనియమైన విషయం
    బాగా రాసావు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. యంత్రాలతో పని చేసీ చేసీ యంత్రాల్లానే అయిపోతున్నారు చంద్రగారు.

      Delete