Tricks and Tips

Friday, March 28, 2014

డబ్బిస్తే ఎవరైనా ఒకటే...............

ఓ విషయం చెబుదామనుకుని మరచిపోయాను . మొన్న గురువారం నాడు ఒంటిపూట బడులు కదా ,ఇంటికి వస్తుంటే ఇంకా అయిదు నిమిషాల్లో నా స్టాపు వస్తుందనగా ట్రాఫిక్ జామయ్యింది .పొద్దున్న ఎఫ్ఫుడో హడావుడిగా తిన్న రెండు ఇడ్లీలు , ఆకలి మాడిపోతోంది ఒకవైపు, మరో వైపు ఎండ మాడి పోతోంది. చిరాగ్గా కిటికీ నుండి బయటకు చూశాను ఏమిటా అని . ఎలక్షన్ల పుణ్యమా అని ఒక రాజకీయ నాయకురాలు మా ఊరు దర్శించి వెళ్ళింది , ఇంతకు ముందే . దాని పర్యవసానమే ఈ జనం . బస్సు నిదానంగా కదిలి  రెండడుగులు ముందుకు వెళ్ళి ఆగిపోయింది . డ్రైవరు ఇంజన్ ఆఫ్ చేసి రిలాక్స్డ్ గా చూస్తున్నాడు జనాన్ని . కరక్ట్ గా నా కిటికీ తిన్నగా బార్ ఉంది . బార్ నిండా జనం . వారంతా ఒక వ్యక్తి మీద పడి గలాటా చేస్తున్నారు . ఏం జరుగుతోందా , అని చూద్దును కదా ....ఆ మనిషి వాళ్ళందరినీ మాట్లాడి ఆ సభకు తీసుకుని వచ్చిన మనిషి . అతని వద్ద నుండి అందరూ డబ్బులు తీసుకుంటున్నారు ఆత్రంగా . తీసుకున్న వారు తీసుకున్నట్లు మరో వ్యక్తి చేతిలో పెడుతున్నారు ఆ డబ్బును . ఆ వ్యక్తి ఆ బార్ కు చెందిన వాదు అనుకుంటా . లిక్కరు సీసాను బయటకు తెచ్చి డిస్పోజల్ గ్లాసుల్లో లిక్కరు నింపి వారికందిస్తున్నాడు. అంతే ఒక్కొక్కరూ కక్కుర్తిగా తాగేస్తూ ....ఏమిటీ రేపూ , ఎల్లుండూ కూడా రమ్మంటావా , సర్లే వస్తాంలే .ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారు ? అని అడుగుతూ మరో గ్లాసు మందు కోసం ఎగబడి పోతున్నారు .అది రోడ్డనీ , వారు బహిరంగ ప్రదేశంలో తాగుతున్నారన్న సంగతే మరచి పోయారు ,అవును మరి వారు ఈ లోకంలో ఉంటేగా..... డబ్బిస్తే వాళ్ళకు ఎవరైనా ఒకటే .బార్ వాడికీ అంతే ,ఏ పార్టీ వాళ్ళు వచ్చినా తన బార్ కళకళలాడిపోతుంది , గల్లా గలగలలాడిపోతుంది మరి . ఆహా ! వాళ్ళు మన రాజకీయ నాయకులు ,వీళ్ళు మన యువ కార్యకర్తలు. వీళ్ళు రేపు గెలిచి మనను ఏలబోయే వాళ్ళు , ఈ సమాజం ఎటు కొట్టుకు పోతుందో ? ఆలోచిస్తున్న నేను బస్సు ఒక్కసారిగా స్టార్టయ్యేసరికి ఉలిక్కి పడ్డాను , అవును మరి నేను కూడా వాళ్ళలానే ఈ లోకంలో లేను కదా మరి . ఒక్కదెబ్బకి ఆకలి మంట , ఎండ మంట మరచిపోయి మనసు మండిపోతుంటే అసహాయంగా ఇల్లు చేరాను .
(ఇప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీకి బయల్దేరుతున్నాను . అక్కడ ఏమైనా విశేషాలు ఉంటే తిరిగి వచ్చాక చెప్పుకుందాం . మీరు కూడా మీ ఓటును సద్వినియోగపరచుకోగలరు. మీ ఎలక్షన్ సిబ్బందితో సహకరించగలరు.)

*************************

2 comments:

  1. ఆ మనిషి వాళ్ళందరినీ మాట్లాడి ఆ సభకు తీసుకుని వచ్చిన మనిషి . అతని వద్ద నుండి అందరూ డబ్బులు తీసుకుంటున్నారు ఆత్రంగా . తీసుకున్న వారు తీసుకున్నట్లు మరో వ్యక్తి చేతిలో పెడుతున్నారు ఆ డబ్బును . ఆ వ్యక్తి ఆ బార్ కు చెందిన వాడు అనుకుంటా . లిక్కరు సీసాను బయటకు తెచ్చి డిస్పోజబుల్ గ్లాసుల్లో లిక్కరు నింపి వారికందిస్తున్నాడు. అంతే ఒక్కొక్కరూ కక్కుర్తిగా తాగేస్తూ ....ఏమిటీ రేపూ , ఎల్లుండూ కూడా రమ్మంటావా , సర్లే వస్తాంలే .ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారు ? అని అడుగుతూ మరో గ్లాసు మందు కోసం ఎగబడి పోతున్నారు .

    కొన్ని నిజాలు జీర్ణం చేసుకోవడం చాలా కష్టం
    మనలాంటి మనిషి తాత్కాలిక ఆనందం మత్తు కోసం జీవితాన్ని హక్కుల్ని పణం గా పెట్టడం
    బాధ కలిగిస్తుంది ....
    అశక్తులం అయినందుకు
    మీ వివరణ చాలా బాగుంది అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. ఎదుటి వ్యక్తి బలహీనతను వాడుకోవడం కన్నా హేయమైనది,నీచమైనది మరొకటి లేదు. చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete