Tricks and Tips

Sunday, March 30, 2014

ప్రకృతిమాతకు శుభాకాంక్షలు .....


ప్రకృతిమాతకు శుభాకాంక్షలు
నీకివే జన్మదిన శుభాకాంక్షలు........

తల్లీ ! ప్రకృతిమాత నీపై ఆధార పడని
జీవి కలదె తరచి తరచి వెదకి వెదకి చూడ
నీవే సత్యం , నీవే నిత్యం , నీవే సమస్తం ,
  నీవే జీవనాధారం , నీవే మా ప్రాణాధారం ,

కుల , మత , జాతి , లింగ , పేద , ధనిక విభేదాలు లేని
నీవంటి సహజ సుందర సువిశాల హృదయ
కరుణామృతమూర్తీ ! నీకు బిడ్డలం , మేమంతా నీ బిడ్డలం

నీ బిడ్డల శుశ్రూషలో అలసి సొలసి
షడ్రుచుల సమ్మేళన సమయంలో
సమతుల్యాన్ని గమనించక గతించిన కాలంలో
ఆదమరచి రెప్పపాటు కాలం కనురెప్పలార్పినావా ?

అమ్మా ! ఆ క్షణం చాలునన్నట్లు

వికృతిమాత కురులు విదిల్చి , ఒడలు విరిచి
వేంచేసి వికట్టాట్టహాసం చేస్తూ షడ్రుచులలో
చేదు పాళ్ళు పెంచి , ఇనుప గజ్జె కట్టి
విలయతాండవం చేసిన పర్యవసానమే...


ఈ రాష్ట్ర విభజనలు , రైతన్నల రోదనలు ,
నేత కార్మికుల వెతలు , నిరుద్యోగుల నిస్పృహలు ,
కన్నవారి కడుపు కోతలు , ప్రజలపై "పన్ను" పోటులు ,
సామాన్య ప్రజల లబ్ధి పథకాలపై నేతల కోతల వాతలు ,
వరకట్న పిశాచాలు , నింగికెగసిన ధరలు ,
పేదవాని పెడబొబ్బలు , సారాసురుని వీరంగాలు ,
నేతల నాలుగు స్థంభాలాటలు , అన్నార్తుల ఆర్తనాదాలు ,
ఆడపిల్లలపై అత్యాచారాలు , అఘాయిత్యాలు , హత్యలు ,
పగలు , ప్రతీకారాలు , బంద్ లు , ఘెరావ్ లు , రాస్తారోకోలు
ఇలా.....ఎన్నెన్నో ఆకాశంలో చుక్కలన్ని ,
సముద్రంలో నీటి బిందువులన్ని...................

తల్లీ ! నీ రెప్పపాటు కునికిపాటుతో
వికృతి ఎగురవేసిన విజయ కేతనాన్ని
నీ బిడ్డలం నిస్సహాయంగా ,నిర్వేదంగా ,నిశ్చేష్టులమై
చూస్తూ........... వెదుకుతున్నాం నీ ఒడిలో సేదతీరడానికి

నవనవోన్మేషమైన నీ ప్రకృతి శోభలతో తిరిగి
ఈ చైత్రారంభమున కొసరి కొసరి గున్నమామి
అథిది కోయిలమ్మలకు చిగురులందించగా
ఆస్వాదించిన కోయిలమ్మ తన తీయని రాగాలాపనతో
ప్రకృతి మాతను పరవశింప జేయగా
చిరుమువ్వల మరుసవ్వడితో విచ్చేసిన
జయనామ నవయుగ ఆద్యంతం
జయజయ ధ్వానాలతో జయము కలిగించుచూ
ప్రజల జీవితాలు ఆనంద నందన వనముగ
సుమసౌరభాలతో విరాజిల్లుతూ ,షడ్రుచుల సమ్మేళనలో
ఏమరపాటుకు తావీయక అనిమేషంతో
సమతుల్యం చేసి నీ బిడ్డల ఆనందమునే
నీ జీవితానందముగా భావిస్తావని ఆశిస్తూ
ఈ జయ నామ సంవత్సరం అజేయముగా నిలవాలని
ఆనందంగా స్వాగతిస్తున్నాం....
జయములిచ్చు జయ నామ సంవత్సరమా !
స్వాగతం , సుస్వాగతం .


************

Friday, March 28, 2014

డబ్బిస్తే ఎవరైనా ఒకటే...............

ఓ విషయం చెబుదామనుకుని మరచిపోయాను . మొన్న గురువారం నాడు ఒంటిపూట బడులు కదా ,ఇంటికి వస్తుంటే ఇంకా అయిదు నిమిషాల్లో నా స్టాపు వస్తుందనగా ట్రాఫిక్ జామయ్యింది .పొద్దున్న ఎఫ్ఫుడో హడావుడిగా తిన్న రెండు ఇడ్లీలు , ఆకలి మాడిపోతోంది ఒకవైపు, మరో వైపు ఎండ మాడి పోతోంది. చిరాగ్గా కిటికీ నుండి బయటకు చూశాను ఏమిటా అని . ఎలక్షన్ల పుణ్యమా అని ఒక రాజకీయ నాయకురాలు మా ఊరు దర్శించి వెళ్ళింది , ఇంతకు ముందే . దాని పర్యవసానమే ఈ జనం . బస్సు నిదానంగా కదిలి  రెండడుగులు ముందుకు వెళ్ళి ఆగిపోయింది . డ్రైవరు ఇంజన్ ఆఫ్ చేసి రిలాక్స్డ్ గా చూస్తున్నాడు జనాన్ని . కరక్ట్ గా నా కిటికీ తిన్నగా బార్ ఉంది . బార్ నిండా జనం . వారంతా ఒక వ్యక్తి మీద పడి గలాటా చేస్తున్నారు . ఏం జరుగుతోందా , అని చూద్దును కదా ....ఆ మనిషి వాళ్ళందరినీ మాట్లాడి ఆ సభకు తీసుకుని వచ్చిన మనిషి . అతని వద్ద నుండి అందరూ డబ్బులు తీసుకుంటున్నారు ఆత్రంగా . తీసుకున్న వారు తీసుకున్నట్లు మరో వ్యక్తి చేతిలో పెడుతున్నారు ఆ డబ్బును . ఆ వ్యక్తి ఆ బార్ కు చెందిన వాదు అనుకుంటా . లిక్కరు సీసాను బయటకు తెచ్చి డిస్పోజల్ గ్లాసుల్లో లిక్కరు నింపి వారికందిస్తున్నాడు. అంతే ఒక్కొక్కరూ కక్కుర్తిగా తాగేస్తూ ....ఏమిటీ రేపూ , ఎల్లుండూ కూడా రమ్మంటావా , సర్లే వస్తాంలే .ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారు ? అని అడుగుతూ మరో గ్లాసు మందు కోసం ఎగబడి పోతున్నారు .అది రోడ్డనీ , వారు బహిరంగ ప్రదేశంలో తాగుతున్నారన్న సంగతే మరచి పోయారు ,అవును మరి వారు ఈ లోకంలో ఉంటేగా..... డబ్బిస్తే వాళ్ళకు ఎవరైనా ఒకటే .బార్ వాడికీ అంతే ,ఏ పార్టీ వాళ్ళు వచ్చినా తన బార్ కళకళలాడిపోతుంది , గల్లా గలగలలాడిపోతుంది మరి . ఆహా ! వాళ్ళు మన రాజకీయ నాయకులు ,వీళ్ళు మన యువ కార్యకర్తలు. వీళ్ళు రేపు గెలిచి మనను ఏలబోయే వాళ్ళు , ఈ సమాజం ఎటు కొట్టుకు పోతుందో ? ఆలోచిస్తున్న నేను బస్సు ఒక్కసారిగా స్టార్టయ్యేసరికి ఉలిక్కి పడ్డాను , అవును మరి నేను కూడా వాళ్ళలానే ఈ లోకంలో లేను కదా మరి . ఒక్కదెబ్బకి ఆకలి మంట , ఎండ మంట మరచిపోయి మనసు మండిపోతుంటే అసహాయంగా ఇల్లు చేరాను .
(ఇప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీకి బయల్దేరుతున్నాను . అక్కడ ఏమైనా విశేషాలు ఉంటే తిరిగి వచ్చాక చెప్పుకుందాం . మీరు కూడా మీ ఓటును సద్వినియోగపరచుకోగలరు. మీ ఎలక్షన్ సిబ్బందితో సహకరించగలరు.)

*************************

ఎక్కడ నాకు రక్షణ దేవా ?


ఎక్కడ నాకు రక్షణ దేవా ?
ఒకపరి నాకు వివరించు ....

కడుపున ఉన్నది ఆడ పిండమని తెలిపిన నాడు
అబార్షన్ పేరిట భ్రూణ హత్యను చేసేసారు...

జన్మించగానే ఆడపిల్లనని చెత్తకుప్పలో వేసేస్తే
కుక్కలకు నే ఆహారమై పోయాను......

పెరిగిన నన్ను బడికి పంపితే
బడిలో టీచర్ కీచకుడై వేటాడేసాడు.......

కాలేజీలోని ఉన్మాదిని నే ప్రేమించలేదని
కత్తిని గుండెలో దించేసాడు ...............

బస్టాపులోని పోకిరీని నే నిర్లక్ష్యం చేసానని
యాసిడ్ ముఖంపై పోసేసాడు..........

ఇచ్చిన కట్నం చాల్లేదని
అత్తింటివారు నను అగ్నికి ఆహుతి చేసేసారు....

కట్టుకున్నవాడు అనుమానంతో
కత్తితో నరికి వే
సేసాడు.....

బస్సులో ప్రయాణం చేస్తుంటే
కామాంధులు వాడుకు తోసేసారు.......

ప్రేమించిన వాడిని నమ్మినందుకు
మరొకడికి వాడు అమ్మేసాడు......

ప్రేమించిన వాడిని చేసుకున్నందుకు
పరువు కోసం అమ్మానాన్నలే ఉరి వేసేసారు........  

తాగిన మైకంలో వావివరుస మరచి
కన్నకూతురి పైనే అత్యాచారం చేసేసాడు....

దేవుని నామం చాటున ఆశ్రమాల్లో
కామాంధులు మాకాం వేసేసారు.....

నన్ను పుట్టించే ముందర నా రక్షణ
ఒకపరి నాకు చూపించు ....

నా పై నీవు దయ ఉంచి ఒంటరిగా
ఈ సమాజంలో నన్ను వదలొద్దు........

***************

Thursday, March 27, 2014

ఇంక ఈ వయసులో వారు.............

ఇంక ఈ వయసులో వారు
ఇక దేనికి ఎదురు చూస్తారు ?


వారి వంక చూసి ఎవరైనా
చిన్న చిరునవ్వు నవ్వక పోతారా అని....

వారి చేతి మీద చేయి వేసి
ప్రేమగా స్పర్శించక పోతారా అని.....

పనులు చేసుకుంటూ వారి ముందు నుండి వెళ్ళినప్పుడు
ఓ క్షణం వారి చూపులో చూపు క
లుపక పోతారా అని.....

ఇంటికి వచ్చిన వారెవరైనా
తమను చూసి పలుకరించక పోతారా అని.....

మనవళ్ళు,మనుమరాళ్ళు ఆప్యాయంగా
తమ దగ్గర కూర్చోక పోతారా అని.....

కుటుంబంలో ఏ ఒక్కరైనా తమ కోసం
కొన్ని నిముషాలైనా కేటాయించక పోతారా అని.....

తమ చిన్ననాటి ముచ్చట్లు అడిగి
తమతో ముచ్చటించక పోతారా అని.....

తమ జీవితానుభవాలను తెలుసుకుని
తమ భావి జీవితాన్నిమలచుకోక పోతారా అని.....

ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు
పరిష్కారం తమను అడుగక పోతారా అని.....

తమ పిల్లల మీద ప్రేమతో
తాము ఆ ఇంట్లో ఓ వస్తువులా మారిపోయామని గుర్తించలేక ,
తమ అనుభవాలు వారికి పనికిరానివని వారనుకుంటున్నారని తెలుసుకోలేక ,
తమతో మాట్లాడే సమయం పిల్లలు పోటీపరీక్షకు
చదివే సమయాన్ని తగ్గించేస్తుందన్న వారి భావనను అర్ధం చేసుకోలేక .....


పిల్లల్లంతా ఈ రోజు తమ పనుల్లో మునిగిపోయారు
రేపు మాట్లాడించక పోతారా అనే
రేపటి మీద ఆశతో జీవిస్తున్న వారెందరో..... 

***********








Wednesday, March 26, 2014

డాలర్లు కాదని తెలియదా నీకు ?


బంధాలు బలహీనమై ,
తరాల మధ్య అంతరాలు పెరిగి....

ఆత్మీయతలు ఆవిరై ,
ఆంతర్యాలు అంతు చిక్కక....

అనుబంధాలు అణగారిపోయి ,
ఆర్ధిక బంధం ఆకాశాన్నంటగ....

పుట్టిన ఊరిని విడచి పెట్టి ,
వేరొక ఖండాన్ని వెతుకుతు పోయి....

అమ్మనాన్నను వదిలి వేసి ,
మమతాను బంధం మరచిపోయి....

చేసిన తప్పును కప్పిపుచ్చుటకు ,
నలుగురి దారిలో నడిచానంటూ....

నాగరికతకు రూపం చూపుతు ,
పేరెంట్స్ డేకి మెయిల్స్ పెడుతు....

చేతిలో ఊతం అవ్వాల్సినవాడు ,
 మాటాడలేనంత ఎదిగిననాడు....

అమ్మానాన్నలు ఆశ్రయించేది ,
వృద్ధాశ్రమం కాక ఏముంది ?

మనసు బిడ్డల చుట్టూ తిరుగగ ,
కట్టెలు మాత్రం ఆశ్రమం చేరి ....

తమబోటి వారి చెంత చేరి ,
వారి బిడ్డల ఆరా అడిగి....

తమ కడుపున పుట్టిన సంతానమంతా ,
కలకాలం కళకళలాడాలంటూ....

తోటి వారితో ముచ్చటిస్తూ ,
భగవంతుని అదే కోరుకుంటూ....

ఖండాంతరాలలో ఉన్న బిడ్డలు ,
ఆఖరి చూపుకు రాకపోయినా....

అంత్యేష్టికి హాజరు కాకపోయినా ,
అయ్యో ! నా బిడ్డకు ఏమి కష్టమొచ్చెనో కదా ,

అక్కడే నిలచి పోయాడంటూ ,
వాడికి మాత్రం సద్గతి నీయాలంటూ....

పిల్లల కోసం తుది శ్వాస వరకు ,
ఆరాటపడే అమ్మానాన్నలకు ....

మనం ఇవ్వగలిగేది ఏముందని
ఆలోచిస్తే , డాలర్లు కాదని తెలియదా నీకు ?

అమ్మా ! అనే కమ్మని పిలుపు
ఆప్యాయతలు మాయని పిలుపు .

*********
 
(ఇది కేవలం స్వార్ధపరులైన పిల్లల గూర్చి మాత్రమే రాశాను , తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకునే బిడ్డలకు నా అభినందనలు)



Tuesday, March 25, 2014

ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన.......


ఉద్భవించదా మరి, ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన.......
ఆ పిన్న వయసులో పెద్ద ఆవేదనా ,
ఇన్ని అసమానతలు కళ్ళ ముందు కనపడుతుంటే ?
గుప్పెడు మెతుకులు అందనినాడు ,
జానెడు వసతి లేని నాడు ,
మూరెడు బట్ట దొరకనినాడు ,
అమ్మానాన్న తెలియనినాడు ,
గుక్కెడు నీరు పుట్టని నాడు ,
తోబుట్టువు ఆకలి తీర్చని నాడు ,
ప్రశ్నకు జవాబు దొరకని నాడు ,
బతుకు బండి కదలని నాడు ,
ఛస్తూ బతుకును ఈడ్చిన నాడు ,
తోటి మానవ హృదయం స్పందించని నాడు ,

ఉద్భవించదా మరి, ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన.......

***********





 

Sunday, March 23, 2014

శుభోదయం _/\_

ఆ భానుని లేత కిరణములు
మా ముంగిలి చేరగ స్వాగతమిస్తూ....
మా తరులు కురిపించిన విరివానల జల్లులతో
వేసిన సుతిమెత్తని పూదారి మెచ్చి విచ్చేయుచున్నాడా...
మా గృహము పావనము చేయదలచి లోలోనికి
ఆ బాలభానుడు మా ఆతిథ్యము స్వీకరించగా !

***************
 

Saturday, March 22, 2014

భగత్ సింగ్ కు నివాళులర్పిస్తూ.....

 (చిన్నపిల్లల కోసం రాసినది, ముఖ్యంగా "భ"అక్షరం గుర్తించడానికి రాసినది )
 
లే లే బొమ్మ ఇది
గత్ సింగ్ బొమ్మ ఇది
యం లేని వీరుడు

రతమాత ముద్దు బిడ్డ
క్తి తోడ పూజించు
రతభూమిని ప్రేమించు

 
 (గత్ సింగ్ కు నివాళులర్పిస్తూ......)
 
*****

చూసే కళ్ళకు మనసుంటే................

చూసే కళ్ళకు మనసుంటే ,
ప్రతి విషయంలోనూ హృదయం కనిపించదా.....

సునిశిత మనసు స్పందించదా ,
అనంతసాగర భావాలను అందించదా........

నిరంతరం అలల రూపంలో ,
నిర్మలమైన నీ మనసును చేరగా........

నిశ్చలమైన సంకల్పంతో ,
నీ వైపే తన పయనం సాగించదా.......

***********

Friday, March 21, 2014

ఒకరికి ఒకరం ఏమీ కాము......

(ఈ చిత్రం జానీపాషా గారిది )

ఒకరికి ఒకరం ఏమీ కాము ,
అయినా మేము అన్నాదమ్ములం....

అమ్మానాన్నకు మేం బరువే అయినా ,
ఒకరికి ఒకరు తోడయ్యాము....

కూడూగుడ్డా కరువే అయినా ,
దొరికిన నాడు పంచుకు తిన్నాం....

గుండె బాధతో చెరువే అయినా ,
ఒకరిని ఒకరు ఓదార్చుకున్నాం......

మురికివాడలో నివశిస్తున్నా,
మనసులు మల్లెలా ఉంచుకున్నాం....

కడుపుకు ఆదరువు దొరకని నాడు ,
గుక్కెడు నీళ్ళు తాగి ఉన్నాం....

వేసవికాలం బోరుపంపును ,
డొక్కలు ఎగిరేలా కొడుతూ ఉన్నా....

పంపులో చుక్కా నీరూ రాదూ ,
మాకు చుక్కా చెమటా రాదు...

ఏడ్చిఏడ్చి కన్నీరంతా ఏరులైతే ,
మా ఒంట్లో ఇంకా నీరెక్కడిదీ....

పాప భారం మోసీ మోసీ ,
భూమాత నీరూ ఆవిరి అయితే ....

మాకింకా దిక్కెవరంటే ,
మేం ఒకరికి ఒకరు మేమే దిక్కు....

ఒకరికి ఒకరం ఏమీ కాము ,
అయినా మేము అన్నాదమ్ములం....


**********

Thursday, March 20, 2014

నాకూ పెళ్ళి కావాలమ్మా........


( అక్క పెళ్ళి చూసిన ఓ బుజ్జితల్లి )
 
అమ్మా ! అక్కలా నాకూ పెళ్ళి కావాలమ్మా........
 
పచ్చని పట్టుచీర కట్టు ,
బొట్టు , కాటుక చక్కగ పెట్టు ,
జడకు మల్లెలు బాగా కుట్టు ,
కాళ్ళకు ఎర్రగ పారాణి పెట్టు ,
చేతుల నిండా గోరింట పెట్టు ,
గాజులు , గొలుసులు ఎక్కువ పెట్టు ,
బుగ్గన నల్లని చుక్కను పెట్టు ,
పీపీ ,ఢుంఢుం బాజా పెట్టు ,
 
అమ్మా ! అక్కలా నాకూ పెళ్ళి కావాలమ్మా..........

బుజ్జితల్లీ ! మరి అక్కలా నీవు కూడా మీ ఇంటికి వెళ్ళిపోతావా ?

అమ్మో ! అమ్మా ,అక్కలా వెళ్ళిపోవాలా..........
ఊ....ఊ....వద్దు...వద్దు....నే వెళ్ళనమ్మా........
నాకు నువ్వే కావాలమ్మా........ 

యూనీఫాం చకచక వే
సెయ్  ...
రెండు జడలు చక్కగ దువ్వెయ్ ...
బ్యాగ్ లో బుక్స్ సర్దేసేసెయ్ ....
లంచ్ , వాటర్ ఇచ్చేసేసెయ్ .....
గబగబ బడికి పంపించేసెయ్....
చక్కగ నన్ను చదివించేసెయ్....
చందమామను చూపించేసెయ్....
పాలబువ్వను తినిపించేసెయ్....
నీ ఒడిలో ఊయల ఊగించేసెయ్....
జోలపాటను పాడేసేసెయ్......
హాయిగ నన్ను బొజ్జోపెట్టెయ్.......


నాకు నువ్వే కావాలమ్మా........ 
 

**********

Wednesday, March 19, 2014

ఆశల తీవెలు....

 
ఆకాశంలో చుక్కలు తెచ్చి 
ఆశల తీవెలు అలవోకగ అల్లి 
తలవాకిటను ఉంచిరా ,ఆ తరుణీమణులు ...

**********

Tuesday, March 18, 2014

ఈ గుండె పగిలిపోదు కదా....


                         పూలమొక్కల నడుమ వనకన్యలా, సంగీతపరికరాల మధ్య సరస్వతి తనయలా, గాత్రంలో గానకోకిలలా....ఇంటిని దిద్దుకోవడంలో సగటు మధ్యతరగతి ఆడపిల్ల మధులత.

                       ఆమెకు వివాహం కుదిరింది. బంగారు బొమ్మైనా బంగారం పెట్టకపోతే కుదరదుగా, అందుకే ఆమెకు పాతిక కాసుల బంగారం,కట్నకానుకలతోపాటు ఆడపడచులాంఛనాలతో సహా మగపెళ్ళివారికి అందించి ఆమె వివాహం జరిపించారు.మధులత అత్తవారింటికి వెళ్ళే ముందు ఆమెతో ఆమె తల్లి ఒక మాట చెప్పింది "అమ్మా! మధు అత్తవారింటి గౌరవం తరతరాలు నిలబెట్టే బాధ్యత నీదే,నీ బాధ్యతాయుతమైన ప్రవర్తన మీదే నీ పుట్టింటి గౌరవం కూడా ఆధారపడి ఉంటుంది" అంతే మధులతకు ఆ క్షణం నుండి తన బాధ్యత రెట్టింపయ్యిందనిపించింది.


                   మెట్టినింట అడుగు పెట్టింది.కొత్తకొత్తగా అనిపించింది. ఎవరూ తనతో మాట్లాడడం లేదు.తనకేమో మొహమాటంగా ఉంది,అయినా వారిలో కలవడానికి ప్రయత్నించింది.చిత్రవిచిత్రమైన వ్యక్తులు.పిలిచినా పలుకరు,అడిగితే సమధానమివ్వరు,వారంతా ఒకరితో ఒకరు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా..మామగారు పలుకరిస్తే అత్తగారు రుసరుసలు,ధుమధుమలు....పోనీ భర్త మాట్లాడతాడా ,అంటే అతనూ అంతే .మౌనంగా మునిలా ఉంటాడు.అదే భర్త,స్నేహితులు వచ్చేసరికి గలగలా మాట్లాడుతూ అహ్హహ్హ అని నవ్వుతూ జోకులేస్తూ హుషారుగా ఉండి,వారెళ్ళిన తర్వాత మౌనంగా మారిపోయేసరికి మధులతకు మతిపోయినంత పనైంది.ఇంట్లో ఉన్న భార్య అనే మనిషి కేవలం తన పనులకు తప్ప కనబడదు,ఆమె మాటలు అసలు వినబడనే వినబడవు ఆ భర్తకు.

                      
         స్వతహాగా నలుగిరిని కలుపుకుపోతూ, గలగల కబుర్లు చెబుతూ,కిలకిలానవ్వుతూ,చకచకా పనులు చేసుకుంటూ పోయే మధులత ఒక్కసారిగా మూగదైపోయింది .ఒంటరిదైపోయింది .ఇంట్లో పనితో పాటు పశువుల పని కూడా చేయాలి అనేసరికి అలవాటు లేకపోయినా చేయసాగింది.పూలు కోసే చేతులు పేడలు ఎత్తడం,వీణను మీటిన చేతులు పిడకలు చేయడంతో ఆమె కాళ్ళుచేతులు నానిపోయి పుళ్ళు పడి నానా బాధ మౌనంగా అనుభవించిందే కానీ...ఎవరికీ చెప్పుకోలేదు, మూగగా రోదించిందే గానీ...ఎవరికీ వినిపించలేదు.

                          కాలం ఆగక సాగుతూనే ఉంది.మూడేళ్ళు గడచిపోయాయి.మధులత ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చింది.ఆ యింటి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు.పిల్లల ఆరోగ్య రక్షణకు దేవురించినా ప్రయోజనం లేదు. జ్వరం వచ్చినా...ఏం వచ్చినా దేవుడే చూస్తాడు అనే వారి వితండ వాదానికి తెరదించలేక మౌనంగా తలదించుకునేది.ఇంటికి వచ్చిన వారిని చూసి చిన్న చిరునవ్వు నవ్వేది.


         అయిదు సంవత్సరాల కాలం గడచిపోయింది. మామగారు గుండెపోటుతోమరణించారు.మామగారి చావు మధులతను కృంగదీసింది.ఆయింట్లో ఆమెతో కొంచెమైనా మాట్లాడేది ఆయనే.అయినా తప్పదు, కాలంతో పాటు వచ్చే మార్పులను మౌనంగానే అంగీకరించక తప్పలేదు. ఆమెకది తీరని లోటయింది.


                          పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో కూడా ఆమెకు మానసిక హింసే.ఆ పసి హృదయాలు దెబ్బతినే విధంగా యాజమాన్యం ప్రతిరోజూ తరగతిలో  క్రింద కూర్చోబెట్టేవాళ్ళు , కొన్ని రోజుల తర్వాత వరండాలో క్రింద, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత మట్టి నేలమీద....అంతే వారి మనసుల్లో వ్యతిరేక భావాలు మొదలయ్యాయి.పదవ తరగతికి,ఇంటెర్మీడియట్ కి వచ్చేసారు పిల్లలు.ఫీజ్ విషయంలో చిన్నవాడు తల్లిలా సరిపెట్టుకున్నా పెద్దవాడు మాత్రం సరిపెట్టుకోలేదు. 
                                             

           ఓరోజు పెద్దవాడు తండ్రిని నిలదీసాడు. "అత్తకైతే అంతంత ఫీజు కడుతున్నావు, మాకు ఎందుకు కట్టవు నాన్నా" అన్నాడు.అంతే తండ్రికి కోపం వచ్చింది. భార్య వంక చూసాడు. మధులత నిదానంగా "పిల్లలు చిన్నవాళ్ళప్పుడు అడుగరు,పెద్దవాళ్ళయ్యాక ఊరుకోరు కదా...మీ అమ్మ చెల్లెళ్ళ మీద ఉన్న ప్రేమలో ఆవగింజంతయినా మన పిల్లల మీద చూపారా మీరు" అనేసరికి, భర్త అగ్రహోదగ్రుడయ్యి "అవును.... అమ్మచెల్లెలు చనిపోతే తిరిగిరారు,అదే భార్యాబిడ్డలైతే చనిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు,పిల్లల్ని కనవచ్చు" అన్నాడు మూర్ఖంగా. అంతే తల్లీపిల్లలు హతాశులయ్యారు, ఆయింట్లో వాళ్ళ స్థానమేమిటో అప్పుడర్ధమయ్యింది వాళ్ళకి.

                    మధులత మనసులో ఆమాటే మారుమ్రోగుతోంది. వారం రోజులయ్యింది.చిన్నవాడు ఆడుకుందామని స్నేహితులతో కృష్ణానదికి వెళ్ళి నీళ్ళలో కొట్టుకొనిపోయాడు. మూడురోజుల తర్వాత దొరికిన బిడ్డను చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది . ఏ ముహూర్తాన అన్నాడో గానీ భర్త ,అలానే జరిగేసరికి ఆమెకు భర్తతో బాధను పంచుకోవాలని అనిపించలేదు.మౌనంగానే రోదించింది.


         పెద్దవాడిలో బాధతో కూడిన కసి పెరిగిపోయింది. ఇంటికి దూరంగా ఉండసాగాడు.  పోయిన వాడితో పోలేక,ఉన్నవాడికి చెప్పలేక,భర్తతో బాధను పంచుకోలేక మౌనంగా....ఆ యింటిలో ఒక కుర్చీలానో ,మంచంలానో, స్తంభంలానో అయిపోయింది మధులత. చేదోడువాదోడుగా ఉండే చిన్నకొడుకు ఫోటోలు ఇంటిలో నలువైపులా అతికించుకుని వాడు తనతోనే ఉన్నట్లుగా భావిస్తూ , వాడిని చూసుకుంటూ యాంత్రికంగా పనులు చేసుకుంటూ పోతోంది. ఎవరైనా వెళితే పేలవంగా చిన్న నవ్వు నవ్వుతోంది.ఆర్నెల్ల వ్యవధిలోనే ఆమె తండ్రి మరణించేసరికి ఆమె వేదన వర్ణనాతీతమే అయింది.అదీ మౌనంగానే భరించింది.

                సంవత్సర కాలం గడిచింది.భర్తకు బైపాస్ సర్జరీ చేయవలసి వచ్చింది.ఉన్న బాధలకు ఇదొకటి కూడికయింది.ఉన్న ఆస్తినంతా కూతురికే ఇవ్వాలని ఆశించే అత్తగారు ఆఖరి నిమిషంలో ఆపరేషన్ చేయించింది.మధులత భర్తకు కావలసినవన్నీ సమయానికి అందిస్తూ,అవసరాలకు అత్తగారి ముందు చేయి చాస్తూ,ఆమె మాట్లాడే మాటలకు అవమానపడుతూ మానసికంగా కృశించిపోయింది.


               ఇంటికి వచ్చాక  డాక్టర్ చెప్పిన ఒక్క మాటైనా వినక పోవడం...దానికి అత్తగారు వంత పాడడంతో మౌనంగానే ఉండిపోయింది.తనకు అందుబాటులో ఉన్నంత వరకూ చేయగలిగినంత సేవ చేస్తూ భర్తను జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంది.


          కొంచెం బాగుంటే చాలు, స్నేహితులతో కలిసి బిర్యానీలు...పలావులు తినడం,ఇంటికి వచ్చిన దగ్గర నుండి తను బాధ పడుతూ భార్యను బాధ పెట్టడం. ముదిరిపోయే వరకు ఇంటిలో ఉండి ఇక ప్రాణాలు పోతాయనగా హాస్పిటలుకు తీసికెళ్ళడం,డాక్టర్లు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారమ్మా!అంటూ ఛీత్కరించడం....ఈ ఇరవై ఏడేళ్ళ వైవాహిక జీవితంలో బాగా అలవాటై పోయింది.

                ఎన్నిసార్లు సిగరెట్టు కాల్చవద్దని చెప్పినా, వినక కాల్చీకాల్చీ మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళేసరికి .....ఈ సారి డాక్టరుగారు చూసి,ఇక నీవు ఏవైనా తినవచ్చు,ఎన్ని సిగరెట్లైనా కాల్చవచ్చు,ఎందుకంటే నీకు చాలా ధైర్యం ఉందిగా,ఈ రోజు కాకపోతే రేపు చనిపోతామని ఎప్పుడూ నీ భార్యతో అంటావుకదా,కాబట్టి నీకే చెప్పేస్తున్నాను...ఇక నీ జీవితకాలం కేవలం నెలలు మాత్రమే అనే సరికి...అది విని మధులత కుప్పకూలి పోయింది.

         భర్త వంక చూడలేదు.బయటకు వచ్చింది. అమ్మ దగ్గర కూర్చుని "అమ్మా!నీవు చెప్పిన ప్రతి మాటా విన్నానమ్మా ,నా బంగారం,నా కట్నం,నా స్వేచ్ఛ,నా సంతోషం....అన్నీ ఈ కుటుంబానికే ఇచ్చాను కదమ్మా,అయినా నన్నెవరూ ఇంత వరకూ వారితో కలుపుకోలేదే అమ్మా" అనే సరికి తల్లి కూతురిని దగ్గరగా తీసుకుని మౌనంగా ఓదార్చడం తప్ప, ఏమీ చేయలేక పోయింది. కన్నీళ్ళు తుడుచుకుని తనను చూడడానికి వచ్చిన అక్కచెల్లెళ్ళను చూసి పేలవంగా నవ్వుతూ.....

సమయం త్వరగా గడచిపోతున్నట్లుంది కదా......
సమయాన్ని మనం ఆపలేము కదా....
సమయం ఆగిపోతే బాగుండు కదా....
బావగారు ఇప్పుడు ఎన్ని సిగిరెట్లు కాల్చినా  ఫర్వాలేదు కదా...
మందులు వాడక పోయినా  ఫర్వాలేదు కదా...
చిన్నోడు చనిపోతే నే చనిపోయానా ఏమిటి....
ఎవరు లేకపోయినా ఈ గుండె పగిలిపోదు కదా....
అందరూ ఉన్నప్పుడే నాకా ఇంటిలో స్థానం లేదు కదా...
మీ అందరినీ చాలా టెన్షన్ పెడుతున్నా కదా...
అంటుంటే అక్కచెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.
మధులత మాత్రం ఎందుకు ఏడవడం ఊరుకోండి,అని పేలవంగా నవ్వుతో.............. 


*********************



Monday, March 17, 2014

నా ప్రియసఖిని ...తీసుకు రావా ?

ఓ శ్వేతవర్ణ కపోతమా !
 
ఒక్కసారిగా నీ రెక్కలను అల్లల్లార్చి
 ఆ పచ్చని వర్ణం భూమాతకిచ్చి ,
ఆ కరిమబ్బుల నీడలో నిలిచిన మాకు...
నీలోని రంగులన్నీ హోళీకేళీ వినోదానికి అంకితమిచ్చావా ?

ఓ శ్వేత ప్రేమపావురమా !

ఆ సింధూర వర్ణం నుదుటికి ఇచ్చి ,
ఆ నీలి వర్ణం కనులకు ఇచ్చి ,
ఆ గులాబి వర్ణం చెక్కిళ్ళకిచ్చి ,
ఆ పగడపు వర్ణం పెదవులకిచ్చి ,
ఆ ముత్యపు వర్ణం పలువరుసకిచ్చి ,
ఆ మెరుపు వర్ణం చిరునగవులకిచ్చి ,
ఆ బంగరు వర్ణం మేనికిచ్చి ,
ఆ పసుపు వర్ణం పాదాలకిచ్చి ,
నీ శ్వేత వర్ణం మనసుకిచ్చి ,
నాతో హోళీకేళీ ఆడి మురియగ ,


నా ప్రియసఖిని నీతో తీసుకు రావా ?

*******

Sunday, March 16, 2014

ఆదర్శం కాదా......

స్థిర నిర్ణయానికి ,
దృఢ నిశ్చయానికి 
ఆదర్శం కాదా ,ఆ చిన్ని విత్తనం . 

*******


Saturday, March 15, 2014

వయ్యారి వసంతం...


తల్లి ఒడిలో చేరిన శిశిరం 
గలగలలాడుతూ ఆహ్వానించగ ,
సుతి మెత్తగా రాదా ,వయ్యారి వసంతం... 

*******

Friday, March 14, 2014

ఆ గళ్ళ చీర...


శ్రమజీవులు తరిగిపోయి ,
భూమిలో నీరు ఇంకిపోయి ,
భూదేవి కట్టెనా ఆవేదనతో ,ఆ గళ్ళ చీర... 

********


Thursday, March 13, 2014

తల్లి గర్భం -భూగర్భం

శివము వీడిన శరీరము 
శవమై ,శవపేటిక నాశ్రయించగా 
తన కడుపులో దాచుకోదా ఆ శ్మశానవాటిక .
 
*******

Wednesday, March 12, 2014

"అమ్మ"


నేలపై చిందిన అమృతపు చుక్కలు
"అమ్మ" భావనకు
అక్షయ రూపమేమో......

*******

 

Tuesday, March 11, 2014

హరివిల్లయిందా ... ?


సీతమ్మవారు ఆరకట్టిన 
నార చీర గాలికెగిరి 
ఆ ఆకాశంలో హరివిల్లయిందా ... 

******


(మా అమ్మ )
హనుమ స్వేద సింధూరమే 
 తరుణీమణుల
 నుదుటన  చిందెనా ..... 

*******

Monday, March 10, 2014

మంచు కురిసే వేళలో .......

మంచు ముద్దలకు 
పరిమళ మద్దినట్లు లేవూ 
ఆ అరవిరిసిన మల్లెమొగ్గలు 

****

 నడిరేయిలోన తారలు వచ్చి 
మా తావిపై సేదతీరాయా 
విరజాజుల రూపంలో 

*******

Saturday, March 8, 2014

వ్యాపార ప్రకటనలు ఇలానా.....?



ఈ వ్యాపార ప్రకటన......చూశారా  ?
ఈ వ్యాపార ప్రకటన  చిన్నపిల్లల మనస్తత్వంపై ఎటువంటి ముద్ర వేస్తుంది ?
 పసిపిల్లల మనసులో విష బీజాలు నాటడం లేదా ఈ ప్రకటన ?
వ్యాపారాభివృద్ధికి చిన్నపిల్లల ఆలోచనలను కలుషితం చేయాలా ?
ఈ ప్రకటనను ఏ విధంగా ఆమోదించారు ?
తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళు ఎంత ఆందోళన చెందుతారు ?
అన్నదమ్ముల మధ్యన బంధాన్ని బలహీన పరచడం లేదా ?
తండ్రికొడుకుల మధ్యన బంధాన్ని బలహీన పరచడం లేదా ?
కొన్ని గ్రాముల బరువు తేడాకి ఇల్లు వదిలివెళ్ళి పోవడాన్ని చూపెడతారా ?
ఆ వయసు పిల్లలకు ఉత్తరం రాసి పెట్టి పెద్దలను క్షోభ పెట్టడం ఎలానో నేర్పిస్తున్నారా ?
దీన్ని ఎవరైనా బలపరుస్తారా ?
నాకైతే ఈ ప్రకటనలో ఇన్ని నెగెటివ్ విషయాలు కనిపిస్తున్నాయి ,
మరి మీ స్పందన ?

******************** 
 

Friday, March 7, 2014

ఢాం...ఢాం...ఢాం...



హీరోవచ్చి పార్టీ పెట్టే  ఢాం...ఢాం...ఢాం...
అందరికెన్నో ఆశలు పెట్టే   ఢాం...ఢాం...ఢాం...
ఆవేశంతోన స్పీచ్ లిచ్చే   ఢాం...ఢాం...ఢాం...
పార్టీ జెండా ఊపి చూపే   ఢాం...ఢాం...ఢాం...
ఎన్నికల గుర్తు ఎత్తి చూపే   ఢాం...ఢాం...ఢాం...
ఎన్నికల్లో గెలిచి చూపే   ఢాం...ఢాం...ఢాం...

వేలెత్తి చూపిన పార్టీలోనే   ఢాం...ఢాం...ఢాం...
విలీనం చేసి చూపినాడే  ఢాం...ఢాం...ఢాం...
ఆ పార్టీ తప్పులన్ని ఒప్పులయ్యే   ఢాం...ఢాం...ఢాం...
ఆవేశమంతా ఆవిరయ్యే   ఢాం...ఢాం...ఢాం...
ఎన్నిక గుర్తు ఎత్తివేసే   ఢాం...ఢాం...ఢాం...
పార్టీ జెండా ఊపిరి పోయే   ఢాం...ఢాం...ఢాం...

విలీనమెంతో ఈజీ చేసే  ఢాం...ఢాం...ఢాం...
నాలుగు స్తంభాలాట ఆడే   ఢాం...ఢాం...ఢాం...
పదవి నాకు ముఖ్యం కాదని   ఢాం...ఢాం...ఢాం...
ప్రజలే తనకు అండదండని  ఢాం...ఢాం...ఢాం...
పదవి మాత్రం వదలడాయే   ఢాం...ఢాం...ఢాం...
మళ్ళీ ఎన్నికలొచ్చేశాయి   ఢాం...ఢాం...ఢాం...

తమ్ముడు కొత్త పార్టీ అంటే   ఢాం...ఢాం...ఢాం...
చక్రం బాగా తిప్పేస్తాడంటూ   ఢాం...ఢాం...ఢాం...
పిచ్చి జనం ఎగురుతుంటే   ఢాం...ఢాం...ఢాం...
అన్నీ నేను చూస్తూ ఉన్నా   ఢాం...ఢాం...ఢాం...
కొత్తొక వింతే ఎప్పుడు కదా   ఢాం...ఢాం...ఢాం...
చరిత్ర పునరావృతమే కదా   ఢాం...ఢాం...ఢాం...

ఇంతకు మించి ఏమైన ఉంటే   ఢాం...ఢాం...ఢాం...
ఎన్నికలయ్యాక కలుసుకుందాం   ఢాం...ఢాం...ఢాం...
తప్పులు నావి ఏమైనుంటే   ఢాం...ఢాం...ఢాం...
తప్పక నేను ఒప్పేసుకుంటా   ఢాం...ఢాం...ఢాం...
నా మాట ఎపుడూ తప్పు కాదు   ఢాం...ఢాం...ఢాం...
నాకా బాధ రాదు తెలుసూ   ఢాం...ఢాం...ఢాం...

**************


 

Thursday, March 6, 2014

ప్రకృతిలోన గూడులా......

అదిగదిగో మా ఇల్లు ,
అందాల మా ఇల్లు ,

ప్రకృతిలోన గూడులా ,
మొక్కల నడుమ మొగ్గలా ,

నిశ్చల ప్రశాంత వనంలో ,
నిర్మలమైన రూపంలో ,

ఆకుపచ్చని వనంలో ,
ఆ వనకన్యల నడుమన ,
  
భ్రమరనాదములతో ,
ఆమని కోయిల కూతలతో ,

చల్లని మంచు బిందువులతో ,
 భానుని లేత కిరణములతో ,

చల్లని పిల్లతెమ్మెరలతో ,
విరిసిన పూమొగ్గలతో ,

చిరు వెచ్చని సాయంసంధ్యలతో ,
తారాచంద్రుల లీలలతో,

ఆకాశం క్రింద సంతోషంగా ,
ఆనందంగా విహరించనా ,
 
ఆదమరచి నే నిదురించనా ,
అందమైన కలలు కననా . 

*******


Wednesday, March 5, 2014

తోడు దొంగలం ఇద్దరమూ......

అమ్మా ! 
నీ గాజుల సవ్వడి నాకెరుకే ,
నీ అందెల స
వ్వడి నాకెరుకే ,
 
నీ పిలుపులో ప్రేమ నాకెరుకే ,
నీ ముద్దులో భావం నాకెరుకే ,
 
నీ ఒడిలో ఒంపులు నాకెరుకే ,
నీ గుండెలో స్పందన నాకెరుకే ,
 
నీ చేతుల స్పర్శ నాకెరుకే ,
నీ చూపులో కరుణ నాకెరుకే ,
 
నీ జోల ఊపులో వేగం నాకెరుకే ,
నీ జోలాలి మధురం నాకెరుకే ,
 
నీ అనురాగమంతా నాకెరుకే , 
నీ అనుబంధమంతా నాకెరుకే ,
 
నా ఆకలి సంగతి నీకెరుకే , 
నా అల్లరులన్నీ నీకెరుకే ,
 
నీ మదిలో చోటు నా కొరకే ,
నా మదిలో చోటు నీ కొరకే ,
 
ఒకరికి ఒకరం దొరికాము ,
తోడు దొంగలం ఇద్దరమూ......

 
********

ఆడపిల్లల ఆత్మల తీర్పు .........

దైవమును నమ్మిన వారు ,
దయ్యమును నమ్మక తప్పదు .

దేవుని వెనుక రాక్షసులున్నట్లే
దైవం వెనుక దయ్యం ఉంటుంది కదా .....

అవును , ఈ మధ్య మనసు దయ్యంపై మళ్ళుతోంది ,
ఆలోచనలను సుళ్ళు తిప్పుతోంది .

దయ్యం ఉన్నది వాస్తవమైతే ,
ఆత్మలు అన్నవి నిజమే అయితే ,
ప్రేతాత్మలు , పిశాచాలు కూడా నిజమే...

బలవన్మరణం పొందిన వారు ,
ఆశలు తీరక చనిపోయిన వారు ,
ఆత్మలై తిరుగుతారంటుంటారు...

అదే నిజం అయితే కనుక ,
ఇందరి ఆడపిల్లలను రొష్టుపెట్టి ,
నడి వీధిలో నరకం చూపిన వాడికి...

ఆ ఆడపిల్లల ఆత్మలు ప్రేతాత్మలై ,
రక్కసి గోళ్ళతో పీక్కుతినవే.....

కంకాళ నృత్యం చేసి వాడి ,
ఆయువు తోడి తోడి పీడన చేయవే...

అడుగడుగన వారిని హింసించి ,
ఉన్మాదుల ఊపిరి మూసి ,  తీసి ఊయలలూపవే...

శాఖినీ , డాఖినీలు వారి నికృష్ట చేష్టలకు ,
కారణమైన భాగం నరకవే....

రక్తపిశాచాల రక్తం మరిగి ,
పళ్ళతో కొరికి రక్తం పీల్చి పీల్చి పిప్పి చేయవే...

కాష్మోరాలు కళ్ళు తెరిచి ,
కాళ్ళు , కీళ్ళు లాగేయవే...

కొరివి దయ్యాలు తరిమి , తరిమి
కొరివిని అంటిస్తూ తీస్తూ వినోదం చూడవే....

నిరతము వాడిని కాపాడే వారికి ,
కాళరాత్రులు చూపించవే .....

దైవమా నీవు రాక తప్పదు ,
ఈ దైత్యులను దునుమాడక తప్పదు....

లేని పక్షాన ప్రేతాత్మలకు శక్తులనీయక తప్పదు ,
అదే నరకం వారికీ చూపక తప్పదు....

ఆ నీచుల ప్రాణం తీయవద్దు ,
జీవించినంత కాలం నిర్భాగ్యులుగా , దౌర్భాగ్యులుగా ,
వికలాంగునిగా వీధులలోన నికృష్ట జీవనం గడపాలి ,
వారి తప్పులే నిరంతరం నిలువునా వారిని దహించి వేస్తూ ఉండాలి . 

( అప్పుడు కాదా, ఆ ఆడపిల్లల తల్లులకు కొంత శాంతి లభించేది ) 
 

*********




Sunday, March 2, 2014

అనురాగంతో ఆజన్మాంతం .....

చెంతన నీవు నిలబడగ
ఆనందం అనిర్వచనీయమెగ ,

నీ ఉనికే ప్రశాంత చిత్తమని
నా మనసే గుసగుసలాడగ ,

జీవన సమస్య తో"రణాలే"
దూది పింజెలై తేలిపోవగ ,

ఒకరికై ఒకరు నిలిచిన మనలో
భేదాభిప్రాయం మొలకెత్తగ ,

మనమిరువురం వేదనగా
 వేదనతోటి వేరవగ ,

మన మనసులకైన గాయం
ముల్లులా గుచ్చి బాధించగ ,

మన హృదయావేదన కొలిమిలా
నిప్పుల సెగనే రగిలించగ ,

మన అంతరంగాల అంతర్మధనం
అనంత సాగర ఘోషవగ ,

ఆవేశం వీడిన మన ఆలోచనలు
మననొకటైపొమ్మని ఆదేశించగ ,

గుండెలో భారం దిగిపోయి
చేతులు ముందుకు చాచి సాగగ ,

కాళ్ళు తడబడుతు ఎదురెదురుగ
నడక వడివడిగా సాగగ ,

చేతులు చేతులు కలిసిపోగ
ఆనందాశ్రువులు వర్షించగ ,

మనసులు ఒకటిగ చేరగ
బాసలనెన్నో చేసుకొనగ ,

ఒకరికొకరు లేని జీవితం 
మనం ఊహగనైనా ఊహించొద్దు ,

  అనురాగంతో
ఆజన్మాంతం  
జన్మజన్మలకు పునాదులు వేద్దాం ,
 
 మనం ఒకరినొకరు కలవక పూర్వం
జీవిత విషయం మనకొద్దు ,

మనం ఒకరికొకరు ఉన్నంతవరకు
జీవిత విలువలు మరవద్దు .

*******