Tricks and Tips

Friday, January 17, 2014

సిగ్గుతో నే తల వంచుకోనా ?



కలుషితం , కలుషితం , కలుషితం
మాటల్లో కలుషితం ,
మనసుల్లో  కలుషితం ,
చేతల్లో  కలుషితం ,
చేష్టల్లో  కలుషితం ,
స్వతంత్ర భారతాన సర్వత్రా  కలుషితం ,
 కలుషితం ,  కలుషితం ,  కలుషితం ,
సుగంధ పరిమళ ద్రవ్యాల మాటున 
 కలుషితం ,  కలుషితం ,  కలుషితం
 కలుషితమన్నది లేనిదెక్కడ ?
 కలుషితమన్నది తెలియనిదెవ్వరికి ?
అంటూ ఏ . సి రూములో అధికారొకడు
నీతిమంతుడిలా , అందరూ నివ్వెరపోయేలా
అడ్డూ , ఆపూ లేకుండా ఏకరువెడుతూ ,
ఏకబిగిన నిర్వచిస్తుంటే ,
చదువుకున్న నేను ఆ కలుషితమయిన
సభలో నుండి లేచి బయటకు నడిచాను ,
సుదూరంగా వచ్చేసా . సాలోచనగా చూస్తుంటే ,
మాసిపోయిన దుస్తులతో ,తైల సంస్కారం లేని జుట్టుతో ,
ఎండిపోయిన డొక్కలతో , చెదరని చిరునవ్వుతో,

నిర్మలమైన మనసుతో ,
నిశ్శేషంగా , నిర్విరామంగా , నిస్సంకోచంగా ,
కలుషితవగాహన లేకనే , తన చిట్టీ చేతులతో
కాలుష్యాన్ని చక చక ఏరి సంచిలో వేస్తూ ,
కాలుష్యరహిత సమాజాన్ని మనకందిస్తున్నాడు .
గర్వపడనా ? దుఃఖపడనా  ? జాలిపడనా ?
సిగ్గుతో నే తల వంచుకోనా  ?
నా భావి భారత పౌరుని జూసి .....? 

**********

10 comments:

  1. పొట్టకూటి కోసం మనం చేసిన మలినాన్ని తొలగిస్తున్నందుకు ఏంచేద్దామో చెప్పండి...మనమ్కు మాటలెక్కువ చేతలు తక్కువ.

    ReplyDelete
    Replies
    1. ప్రభుత్వ విధానంలో చిత్తశుద్ది లోపించడమే దీనికంతటికీ కారణం , ప్రణాళికలు ప్రజలను చేరుకోక ముందే ఖజానాలు ఖాళీ అవడం దురదృష్టకరం . నిరక్షరాస్యతను నిర్మూలించిన నాడే , యువత చైతన్యవంతం అయిననాడే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం లభిస్తుందని నా అభిప్రాయం .ఈ లోపుగా మన వంతు కర్తవ్యంగా ప్రజలకు ప్రణాళికల పట్ల అవగాహన కలిగించాలి . భావి భారత పౌరులను రక్షించుకోవాలి . మీ స్పందనలకు ధన్యవాదములు శర్మగారు .

      Delete
  2. ఏ. సి రూములో అధికారి మైకులో అరుస్తున్నాడు. అంతా కలుషితం, కలుషితం, కలుషితం .... మాటల్లో, మనసుల్లో, చేతల్లో, చేష్టల్లో .... అంటూ నీతిమంతుడిలా, అందరూ నివ్వెరపోయేలా ఏకరువెడుతూ, నిర్వచిస్తూ,
    ఆ ఏ, సి రూము కు సుదూరంలో. సాలోచనగా చూస్తే అక్కడ ....
    మాసిపోయిన దుస్తులలో, తైల సంస్కారం లేని జుట్టు, ఎండిపోయిన డొక్కల, చెదరని చిరునవ్వు, నిర్మలమైన మనసు, కలుషితావగాహన లేని, చిట్టీ చేతులు కాలుష్యాన్ని చక చక ఏరి సంచిలో వేస్తూ, కాలుష్యరహిత సమాజానికి పునాది రాయౌతూ .... గర్వపడనా? దుఃఖపడనా? జాలిపడనా? సిగ్గుతో తల వంచుకోనా?

    ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకని ప్రశ్నలు నాలుగు రోడ్ల కూడలి లో దుమ్మూ దూళి మయమై వెక్కిరిస్తున్న జాతీయ జెండా లా ....

    కవిత చాలా బాగుంది. అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. జవాబు సంపూర్ణంగా దొరకని స్థితిలో , నాలో ఉదయించిన ప్రశ్నలను మీ ముందు పెడుతున్నాను ...ఎవరో వచ్చి ఏదో చేసే లోపుగా మన వంతు బాధ్యతను నిర్వర్తించడానికి వెనుకాడకూడదు ....మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు .

      Delete
  3. శ్రీదేవి గారు... అలా కాలుష్యాన్ని ఏరుతున్న బాలబాలికల ఆత్మకథలు విషాదఅఅవశేషాలు. ఏసీ రూముల్లో పీహెచ్డీలు చేసిన, ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులు తెగ వాగుతుంటాలు. గణాంకాలు తప్ప
    వాస్తవ పరిస్థితుల్లో ఏనాడు వాళ్లు గల్లీల్లో తిరిగినవారు కాదు. మరో విషయం తెలుసా.. ఇలాంటి చాలా
    ఉపన్యాసాలు ఖరీదైన ఫైవ్ స్టార్ హోటళ్లలో జరుగుతుంటాయి. ఎన్నిటికో ప్రెస్ కవరేజ్ కి ఎటెండ్ అయ్యాను నేను. పనికిమాలిన ప్రసంగాలు చేసి.. మధ్యహ్నం కనీసం ఐదువందల రూపాయల భోజనం చేస్తారు. అరిగేవరకు అరుచుకుని వెళ్లిపోతారు. ప్రాక్టికల్ గా ఏదీ అమలు కాదు. సమావేశం ఖర్చు మాత్రం లక్షల్లో ఉంటుంది. అలా ఏడాదికి కేవలం ఇలాంటి చచ్చు సమావేశాల కోసం ప్రభుత్వం పెట్టే
    ఖర్చెంతో తెల్సా... మనరాష్ట్రంలోనే ఏటా సరాసరిన పదిహేను కోట్ల పైమాటే. అన్ని కోట్లతో ఎన్ని విద్యాలయాలు కట్టొచ్చు. మీరు చూపించి ఇలాంటి పిల్లలకు ఉచితంగా డిగ్రీ వరకు చదువు చెప్పొచ్చు.
    ఇలాంటి బాల కార్మికలు తలరాతలే మార్చొచ్చు. కానీ చెయ్యరు. చేస్తే సమస్యులు ఉండవు. ఊకదంచడానికి నేతలకు టాపిక్ దొరకదు. మీరు రాసిన ఈ పోస్ట్ చూసి.. ఎందుకో ఎమోషనల్గా
    స్పందించాలని ఇంత రాయాల్సి వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలను చూశాను కాబట్టి.

    ReplyDelete
    Replies
    1. కేవలం పిల్లల్ని చూస్తేనే ఇలా ఉంటే , ప్రత్యక్షంగా వింటుంటే ఇంకెంత బాధ కలుగుతుందో కదా సతీష్ గారు మీ ఆవేదనంతా అక్షర రూపంలో వివరించినందుకు ధన్యవాదములు .

      Delete
  4. మనవంతుగా వారిని బడివైపుకు నడిపించటమే (నేను చేస్తున్నది అదే..)
    వారు ఏరుకొచ్చే చెత్తా చెదారానికొచ్చిన పైసల్తో..కల్లు తాగి వారినే తంతున్న తండ్రులను చూశాను నేను.
    దేవీ నీ బుజ్జిపిట్ట నా కామెంట్ పబ్లిష్ కాకుండా అడ్డం కూర్చుంది.

    ReplyDelete
    Replies
    1. మెరజ్ మీ అనుభవాలే మేము ప్రతి రోజు మా పాఠశాల పరిసరాలలో చూస్తూ , వారికి నచ్చ చెప్పే ప్రయత్నంలో వారిచే తిట్టించుకోవడం కూడా జరుగుతోంది . నా బుజ్జి పిట్ట వల్లేనా కామెంట్ పెట్టడం ఆలస్యమయింది .

      Delete
  5. సిగ్గుతో తల దించుకోవడమా??
    ఎందుకు??
    నిగ్గు తేల్చి కల్మషాన్ని నిలదీయలేమా!!
    మగ్గుతున్న నీతినీ
    మరుగు పడ్డ జాతినీ
    మెరుగు దిద్ది మురుగు కడిగి
    ముక్తి చేయలేమా!
    సమాజమంటే మనమే
    సరిదిద్దే క్షమతా మనదే
    పరువూ బరువూ మనదే
    బాధ్యతా మనదే..
    కలం కడిగి
    కళంకపు కల్మషాన్ని
    కడ తెర్చలేమా?
    చిదిమి దీపం పెట్టుకునే
    చిట్టి చేతులు
    చీకట్లో మగ్గుతుంటే
    ఏ సి గదుల
    మిణుగురు వెలుగుల్లో
    ఆత్మల్నీ ఆశువుగా తాకట్టు పెట్టే
    అసాంఘిక శక్తుల్నీ
    భరించే మనమూ
    పరోక్ష శత్రువులం కామా??
    దించిన తలల్ని ఎత్తి ప్రశ్నిద్దాం!!
    ఎండిన పిడికిళ్ళను మండిద్దాం!! 

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే జానీగారు ,మనమూ కారణమే.............దించిన తలల్ని ఎత్తి ప్రశ్నిద్దాం!!
      మీ కవితాభినందనలనన్నింటికీ మరల ధన్యవాదములు.

      Delete