Tricks and Tips

Saturday, January 4, 2014

మరి నేనూ ....... ?


మధురమైన  మాటలతో ,
మనసును శృతి చేయగనే ..
ఇంద్రుడు... చంద్రుడు అనుకొని భ్రమసి ,

ఇంట్లో అరగంటలో వస్తానంటూ , 
అతనితో అందని దూరం ఎగిరాను ,
స్వర్గం నాకే తెలుసనుకున్నాను .

వాడిన పువ్వును చేసి నన్ను ,
అరగంటలో వస్తానంటూ ,
అంగడిలో నను అమ్మేసాడు .

కొన్న వాడు కొత్త మోజుతో ,
కొంగును చుట్టూ కప్పగనే ,
కన్నీరుబికి వచ్చాయి .

సుతిమెత్తగ , లాలనగా మేనిని నిమిరి ,
 అనునయ వాక్కులు పలకగనే ,
వాడే దేవుడు అనుకున్నాను . 

నా నిమిత్తం లేకనే ,
చేతులు మారి పోతున్నా , 
చోటులు దాటి వెళుతున్నా . 

నేనే , నాకు చెందనినాడు.. 
నాదన్నది ఏదీ నాది కాదు ,
నాకంటూ నాది ఏదీ మిగలదు ,
విషాదం తప్ప .
 
నా గుండెకు గాయం చేశారు ,
నా మనసును మోడుచేశారు ,
నా కలలను  కాలరాశారు ,
నా తలరాతను తలక్రిందులు చేసారు .

మరి నేనూ .......  ?

సర్వం తెలుసని భ్రమశాను , 
సర్వ నాశనం అయ్యాను .

తల్లిదండ్రుల మనసులను
నమ్మక ద్రోహ అస్త్రంతో ,
తూట్లు , తూట్లుగా పొడిచేసిన నాకు
ఇంతకు మించిన ఫలమొస్తుందా ?

అంగడిలోని వారికి నేను
 ఏమవుతానని ఆదరించడానికి ?
చల్లని చంద్రుని చూద్దామన్నా ,
మాయా చంద్రులు చుట్టూ చేరి ,
మానని గాయం రేపారు .

అమ్మా !  "  నిన్న"   అనేది
తిరిగి వస్తే ,నీ ఒడిని వదలి వెళ్ళను ,
మోసం అసలే చేయను ,
క్షమించమ్మా .

********

14 comments:

  1. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి ...

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగుకు స్వాగతమండి . కన్నీళ్ళు పెట్టుకుని ప్రయోజనం లేదు కదా ...అటువంటివారి కన్నీళ్ళు తుడవడానికీ , సమాజంలో కలుపుకోవడానికీ , వారిని ఆశతో బ్రతకనీయడానికీ ప్రయత్నిద్దాం .

      Delete
  2. వచ్చీ రాని వయసుతో తెలిసీ తెలియని ఆలోచనతో పేకమేడలు కట్టుకుని కన్న వారికి కన్నీరు మిగిల్చి గడప దాటిన ఆడపిల్ల తనువు తనది కాదని మనసు మరెవరిదీ కాలేదని తెలుసుకునే సరికి ఇదిగో ఇలా అధఃపాతాళం లో పడి జీవశ్చవాలు అవుతున్నారు ఇలాటి వారిని ఎందరినో చూస్తూనే ఇంకా ఇంకా ...... గడప దాటుతూనే ఉన్నారు బలౌతూనే ఉన్నారు తెలివైన వారమనుకునే అమాయకులు.
    మీ ఆవేదన అంతా మీ అక్షరాలలో కనబడుతోంది

    ReplyDelete
    Replies
    1. ఊహలకూ , వాస్తవాలకూ తేడా చెప్పుకుంటూ బిడ్డలకు రక్షణ కల్పించవలసిన తల్లులు టి . వి సీరియల్స్ కు అంటుకుపోతే పిల్లలు తప్పులు చేయడానికి అవకాశాలు ఎక్కువవుతాయని నా అభిప్రాయం హరితా . మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  3. తెలిసీ, తెలియని వయస్సుకు ప్రేరణ కలిగించే ఎన్నో అంశాలు .చుట్టూ ఎన్నో ప్రలోభాలు. సినిమాలు, దిక్కుమాలిన టీ.వి.సీరియళ్ళూ, నాగరికతలూ కలసి నాసనం చేస్తున్నాయి.
    స్త్రీ చేతులు మారితే చిరిగిన విస్తరి ఎలా అవుతుందో... మీ అక్షరాలు ఆవేదనని కుమ్మరించాయి.
    దేవీ, మన వంతుగా, కలాన్నీ, గళాన్నీ, కదిలించి ఎక్కడ ఇలాంటి జరుగుతున్నా ఆపగలగాలి. ముఖ్యంగా ఇప్పటి విద్యార్దులలో ఆరవ తరగతి నుండే ప్రేమ వ్యవహారాలు నడిపే పిల్లల మానసిక వికాసానికి పంతుళ్ళగా మన కర్తవ్యం నెరవేరుద్దాం.

    ReplyDelete
    Replies
    1. ప్రతి తల్లిదండ్రులు......టీచర్ తమ పిల్లల బాగోగులు కోరుకునే వ్యక్తిగా భావించగలిగితేనే ......మనం ఏమైనా చేయగలం మీరజ్ . కాకపోయినా మన వంతు కర్తవ్యం నెరవేర్చడంలో ఏమాత్రం వెనుకడుగు వేయవద్దు .

      Delete
  4. తెలిసీ తెలియని పసి మాయకపు మనసు ఆశల్ని ఎక్స్ ప్లాయిట్ చేసేవారు ఎందరో ఉన్నారు ఈ సమాజం లో .... వారు మోసపూరిత స్వర్ధాలకు ఎలా బలౌతున్నారో .... అన్నీ కోల్పోయాకే ఏది నిజమో ఏది బ్రమో తెలిసి రావదం ఒక దృశ్య కావ్యం లా వివరించిన విధానం చాలా బాగుంది శ్రీదేవి! పల్లె మనసుల అమాయకపు జీవితాల్ని సున్నితం గా స్పృశిస్తున్న నీ భావావేశం నా లాంటి ఎందరినో ఎదురుచూసేంత బలహీనత గా మార్చేసింది. నీ కవితలు గేయాల ఒరవడికి అభివాదాలు తెలియప్రుస్తున్నాను. శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ వంటి వారు నా కవితల......కోసం ఎదురు చూడడమనేది....ఎంత సంతోషం కలిగిస్తుందో... అంతే భయాన్నీ కలిగిస్తుందీ....తర్వాత రాసేదాన్ని ఇంతకంటే బాగా రాయగలనా అనీ ......శుభోదయం చంద్రగారు .

      Delete
  5. ఆలీగారు నా బ్లాగుకు స్వాగతం .ఈ రోజు వార్త చదివారా ?ముక్కుపచ్చలారని చిన్ని పిల్లలకు నవోదయ కోచింగ్ అంటూ......ప్రతిరోజూ అంతే.....నా కవిత కాదు , సమాజంలోని ప్రతి ఘట్టమూ హృద్యంగానే ఉన్నాయండీ .

    ReplyDelete
  6. మీరన్నట్లు ప్రతిరోజూ
    ఇవే వ్యధాభరిత జీవిత కధలు
    సీరియల్స్ సాగినట్లుగా
    చదివి చదివి
    మనసు మొద్దుబారిపోతోంది
    రోజు రోజుకు...

    ఆటవిక సమాజానికి
    ఆధునిక సమాజానికి
    ఇసుమంతైనా తేడా కనబడట్లేదు...

    ఇప్పటి సామాజిక పరిస్థితి గమనిస్తే
    సొల్యూషన్ గురించి పట్టించుకునే తీరిక, స్పృహ
    ఇటు ప్రభుత్వాలకూ అటు సమాజానికి కూడా
    మృగ్యమై పోయింది...

    ఎవరో వస్తారు
    ఏదో చేస్తారనే
    ఆశ ఎప్పుడో కరిగి పోయింది
    ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా
    తెలియని నిస్సహాయ పరిస్థితి...

    తల్లిదండ్రులిని మోసపుచ్చి
    గడప దాటే ప్రతి ఆడపిల్లా...
    దాటకముందు ఈ రచన
    చదివితే కొన్ని జీవితాలైనా
    వీధిన పడకుండా వుంటాయి...

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగుకు స్వాగతమండి Nmrao garu . ఆ చిన్న పిల్లలకు చేరువగా ఉన్న తల్లే ....మంచి , చెడు విచక్షణను వివరిస్తూ తత్సంబంధమైన పుస్తకాలనో , కథలనో వివరిస్తూ పిల్లల మనసును తన చుట్టూ అల్లుకునేట్లు చేసుకోవాలి, అందుకోసం తల్లి కూడ అటువంటి సత్సాహిత్యాన్ని అనుసరించక తప్పదు .ఎవరో వస్తారని మనమెందుకు ఎదురు చూడాలి ?మన ఆడపిల్ల మన కంటే ఎవరికీ ఎక్కువ కాదు కదా . తల్లి తప్పక ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది ఈ విషయంలో . మీ ఆవేదన మీ ప్రతిస్పందనలో కనిపించింది .

      Delete
    2. thank you ma'm for the invitation...
      చక్కగా వ్రాస్తున్నారు...
      శుభాకాంక్షలు...
      దారి తప్పి బ్లాగుల ప్రపంచంలోనికి వచ్చినవాణ్ణి...
      మీలాంటి కవితామిత్రుల సంపద దొరికినవాణ్ణి...
      hoping to meet you here...
      now and then...

      Delete