Tricks and Tips

Tuesday, January 21, 2014

జత్తాబెత్తా జానెడు పెట్టె


హవ్వ .....!!!!!
మాయదారి పెట్టె వచ్చే - మమతలన్ని మాసిపోయే
అమ్మ , నాన్నకు గొడవ తెచ్చే - అన్నం , కూర మాడిపోయే
సున్నితమైన బంధాలన్నీ - సుడిగుండంలో చిక్కుకు పోయే
మంచి , చెడ్డ పలకరింపులు - మనకందనంత దూరమాయే
తాతా , బామ్మల ముద్దు మురిపెం - మచ్చుకైన కనబడదాయే
వెన్నెల్లోని కథలు , కబుర్లు - వెదకి చూడ కానరావే
నీతి కథలు , సూక్తులన్నీ - నిలువున నీరు గారిపోయే
ఒప్పులకుప్ప , వామనగుంటలు - ఒంటరిగాను మిగిలిపోయే
రామాయణం , భగవద్గీత - రాళ్ళ మీద మిగిలిపోయే
వేమన పద్యం , సుమతీ శతకం - నామరూపాల్లేకపోయే
ఆటపాటలు తరిగిపోయే - ఊబకాయాలెక్కువాయే  
చదువు ఉండి జ్ఞానం లేక - జానెడు పెట్టెకు దాసోహమాయే
గుప్పెడు మనసు జారిపోయే - పంకిలములోన కూరుకుపోయే
జత్తాబెత్తా జానెడు పెట్టెతో - జగమంతా మారిపోయే  
సునిశిత భావాలిగిరిపోయి - జనమంతా యంత్రాలాయే
సిరి అంటదు కాని - చీడపీడలంటుతాయి
పోయే కాలం దాపురిస్తే - పొరపాట్లన్నీ అలవాట్లేలే  

**********

8 comments:

  1. నట్ట్టింట చుట్టమాయె....:-))

    ReplyDelete
    Replies
    1. చుట్టమైతే .....సామెత ప్రకారం మూడవ రోజుకు మురికి చుట్టం అంటారు కదా .....ఇది హృదయ స్పందన ,శ్వాస , ధ్యాస......జీవితం అయిపోయిందని నా సంపూర్ణ విశ్వాసం మీరజ్ .

      Delete
  2. ఒక మనిషిని ఎలా చంపవచ్చో చెప్పడానికి క్రైమ్ ప్రోగ్రాం, ఆడవారిని క్రూరులు గా చూపే డైలీ సాగతీత సీరియల్స్ , పిల్లలని ఆటలకు దూరం చేసే కార్టూన్ ఛానెల్ ఇలా ఎన్నిరకాలుగా మనుషులను నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేస్తున్న ఆ టీవీ లేకుంటే మనిషి బ్రతక లేనట్లుగా తయారైంది పరిస్థితి బహుశా అన్నం లేకుండా కూడా మనిషి బ్రతక గలడు గానీ టీవీ లేకుండా మాత్రం బ్రతకలేడు
    చాలా మంచి పోస్ట్

    ReplyDelete
    Replies
    1. ప్రతి విషయంలోనూ ఒక మంచి ,ఒక చెడు ఉంటాయి .ఇదే టీ.వీ మనను ఎన్నో ప్రకృతి వైపరీత్యాల నుండీ కాపాడుతోంది,విద్య/ఉపాధి అవకాశాలు ,ఆధ్యాత్మిక అంశాలు,క్విజ్ కార్యక్రమములు,దూర విద్య /ఆరోగ్య సంబందితమైనవి,వార్తలు,భారత..రామాయణాలు /పిల్లలకు క్రియేటివ్ కార్యక్రమాలు/వయసు మళ్ళిన వారికి పాత చిత్రాలు ప్రసారం చేస్తోంది.....కానీ దురదృష్తమేమిటంటే మంచికంటే చెడే ఎక్కువ ప్రబలిపోతోంది హరిత .

      Delete
  3. టీవీ కంటే కూడా సెల్ ఫోన్ చేస్తున్న విధ్వంసమే ఎక్కువ కనిపిస్తోంది శ్రీదేవి గారు. ఉత్తరం పోయింది.. అప్పుడే అంతా పోయిందండి. విజ్ఞానం మనిషిని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్తుంది. అగాధం అంత లోతులోనూ పడేస్తుంది. కదండీ.. చాలా బాగుందండి పోస్ట్...

    ReplyDelete
    Replies
    1. ఒకప్పుడు ఈ కమ్యునికేషన్స్ లేక పోబట్టే 1977 లో నవంబర్ 19 న దివిసీమ తుఫాను వచ్చి జరిగిన నష్టం ఇప్పటికీ మన పెద్దవాళ్ళను వణికిస్తూనే ఉంటుంది ,కానీ ఇప్పుడు అన్ని విధాలా ఎదిగి మనల్ని మనం ఎన్నో ఘోర విపత్కర పరిస్థితుల నుండి కాపాడుకునేంతగా ఎదిగాము . మన ఇన్వెన్షన్స్ సెల్ ఫోన్ , ఇంటెర్నెట్ ,టి.వి ఇలా ఏవైనా కావచ్చు మన అభివృద్దిని ఎంత ఎత్తుకు చేరుస్తాయో ..మన నాశనాన్ని అంత ప్రోత్సాహిస్తాయి ....విషయం ఏదైనా మనం దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆధార పడివుంటుంది , సతీష్ గారు మీ స్పందనలకు ధన్యవాదములు .

      Delete
  4. "మంచి, చెడు పరామర్శలు, తాత, బామ్మల ముద్దు మురిపాలు, వెన్నెల కథలు, రచ్చబండ కబుర్లు, నీతి కథలు, నీతి సూక్తులు, ఒప్పులకుప్ప, వామనగుంటల ఆటలు గుర్తుకొస్తున్నాయి"
    ఈ కవిత చదువుతుంటే గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి అనుభవాలు. యబై యేళ్ళు వెనక్కెళ్ళినట్లుంది.. అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. రచ్చబండ కబుర్లు తప్ప నాకు మిగిలినవన్నీ తెలుసు చంద్రగారు . ఏదేమైనా మీకు మీ చిన్ననాటి రోజులు ఈ కవిత వల్ల గుర్తువచ్చినందుకు ధన్యవాదములు .

      Delete