ఆహాస్యవాణి ... వార్తలు చదువుతున్నది
మీ హాస్యానందం
* కోతులు ఎక్కువగా సంచరిస్తున్నందున
" నూజివీడు " పేరును " కోతివీడు " గా
మార్చడం పై చర్చలు సాగుతున్నాయి .
* జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ
హనుమంతుల గూడెం M.P.U.P
స్కూలులో సెలవులు ప్రకటించిన
నాలుగవ రోజున జంట హత్యలు
జరిగాయి . సెలవుల అనంతరం
తరగతి గదులను తెరచిన ఉపాధ్యాయులు
దుర్గంధంతో భయపడి ఫిర్యాదు చేయగా ,
అతి కష్టం మీద ఈ కేసును చేధించి
వారం రోజుల్లో నేరస్తుణ్ణి పట్టుకుని ప్రశ్నించగా
" మ్యావ్ ... మ్యావ్ "" అంటూ
సమాధానం ఇచ్చాడు .
* బంగాళాఖాతంలో వాయుగుండం
పడినందున గంటకు 700 కి . మీ
వేగంగా గాలులు వీయవచ్చు , ఉతికిన
బట్టలు ఆరకపోనూ వచ్చు ,
ఎగిరిపోనూ వచ్చు కాబట్టి ..
అందువల్ల బట్టలు ఉతకవద్దని
ఆడవారికి 6 వ ప్రమాద హెచ్చరిక
ప్రసారం చేయడమైనది .
* దిగవల్లి ప్రభుత్వ బడి విద్యార్ధులు ఉదార
హృదయంతో ప్రతిరోజూ భోజనం
ముగిసిన వెంటనే " అన్నదాన "
కార్యక్రమం చేపట్టారు . దీని వల్ల ఆయా
గ్రామాల్లోని కోళ్ళు ,కాకులు , కోతులు ,
కుక్కలు ఆకలి మంటలు
చల్లార్చుకుంటున్నాయి .
* నిన్న పోలసానపల్లిలో సంభవించిన
ముంపునకు వీధులన్నీ జలమయం
అయ్యాయి . ప్రజలు పాదంలోతు నీళ్ళలో
మునిగి ఇబ్బందులకు గురయ్యారు .
రెవెన్యూ అధికారి విచారించగా శీలలు
లేని పంపులే ముంపునకు కారణమని
తెలియ వచ్చింది .
* తెల్లవారినప్పటి నుండి సాయం సమయం
వరకు టీ స్టాల్ యజమాని వెంటే
తిరుగుతున్నప్పటికీ ,ఆ యజమాని
చీత్కరించడంతో జీవితం పై విరక్తి చెంది
మరుగుతున్న టీ లో దూకి పది
ఈగలు ఆత్మహత్య చేసుకున్నాయి .
* దోమల రహితమైన HIV/ ఫౌల్ట్రీ ఫామ్స్
వివరాల్లోకి వెళితే
HIV బాధితులకు నిర్మించిన ఆశ్రమం
చుట్టూ పారిశుధ్యం లోపించినా ఒక్క
దోమ కూడా కనపడదు ఎందువల్ల ? అని
W.H.O వారు పరిశోధన జరుపగా ,
అక్కడి దోమలకు HIV సోకి
మరణించాయని తెలిసింది .
* తేనెటీగల ధర్నా .... స్తంభించిన ట్రాఫిక్
ఉద్యోగం లేకపోయినా స్వయం సమృద్ధిని
సాధిస్తూ ఇతరులకు ఆదర్శంగా
నిలుస్తున్న తమ యొక్క కుటీర
పరిశ్రమను కూలదోస్తున్న ప్రభుత్వ
వైఖరిని ఖండిస్తూ ధర్నాకు
పిలుపునిచ్చాయి ... వివరాల్లోకి ..
తేనె పరిశ్రమ స్థాపించి అత్యున్నత
స్థాయికి ఎదుగుతున్న తమకు
మహానగరాల్లో మొక్కలూ ,పూదోట
పెంపకాలకు జానెడు చోటు కూడా
ఈయక అపార్ట్ మెంట్ సంస్కృతి
ఉధృతి చేస్తున్నందున తేనెటీగలు
ధర్నాకు పిలుపు నిచ్చి అందిన వారిని ,
అందినట్లు ,అందిన చోటల్లా కుట్టి
ట్రాఫిక్ ను అస్తవ్యస్తం చేశాయి .
* పుట్టింటికి చేరిన ఆటోలు
అత్తింటి వారయిన R.T.C వారితో
వేగలేక ఆటోలన్నీ వాటి పుట్టిల్లయిన
ఆటోనగర్ చేరుకున్నాయి .
* ఇప్పుడే అందిన వార్త
పిడుగు రాళ్ళలో పిడుగు పాటుకు
ముగ్గురి ఉలికిపాటు .
ఆహాస్యవాణి ఈ హాస్య వార్తలు
ఇంతటితో సమాప్తం .
సెలవు మీ హాస్యానందం .
*******