పుట్టక , పుట్టక పుట్టాడు ,
తల్లిదండ్రులను బాధలు పెట్టె
ప్రబుద్ధుడు ఒకడు పుట్టాడు .
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే
సమయమంతా వేదనలే ,
నేర్పినవేవి రాలేదు ,
నేర్పనివెన్నో వచ్చాయి .
అమ్మా ,నాన్నల్ని హింసలు పెట్టి
ఆనందాన్ని పొందాడు .
నేడు కాకుంటే రేపయినా
మారకపోతాడా అన్న ఆశతో ,
తల్లీ , తండ్రీ ఎన్నడూ , ఎవరికీ ...
కన్నీటి చారిక కనపడనీలేదు .
బాధ్యత నెరుగని వానికి
బైక్ ని కొనక తప్పలేదు.
హీరోలా ఫీలవుతూ
హీరో బైక్ ను కొన్నాడు .
ఒక్క ఉదుటున స్టార్ట్ చేసి ,
యాక్సిలేటర్ తిప్పాడు .
తండ్రి ... ఓవర్ టేక్ చేయోద్దంటే ,
ఓవర్ రియాక్షన్ ఒద్దన్నాడు ,
తల్లి జాగ్రత్త చెప్తుంటే ,
వినబడనట్లే ఉన్నాడు .
నేల మీద వెళ్తున్నాడా ?
గాలిలోనా తేల్తున్నాడా ?
అని జనం చూస్తూ ఉండగనే ,
సుడిగాలెల్లే ట్రాఫిక్ లో
చెలరేగుతు దూసుకు పోయాడు .
వాడు , వీడు , ఎవడూ నాకు
ఎక్కువ కాదు , అనుకొంటూ
ఓవర్ టేక్ చేశాడు .
మెలికలు తిరుగుతు అడ్డుగ వెళ్లి ,
రోడ్డున పోయే అందరిని
అతలాకుతలం చేశాడు .
రయ్యి ,రయ్యిన పోనిస్తూ ,
కారు , వ్యాను , ట్రాక్టర్ ,బస్సు ను
ఓవర్ టేక్ చేశాడు .
జోరుజోరుగా పోనిస్తూండగా ,
ఎదురుగ లారీ వస్తోంది .
అంతే ... వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ,
తనదే గెలుపని అనుకుంటూ ...
ఎవరూ పోటీకి రానంత ,
తనకు ఎదురే లేనంత ,
దూరం తరలి రానంత ,
వాయువు కన్నా వేగంగా ,
వెలుతురు నుండి చీకటికి ,
భూమి నుండి ఎక్కడికో ,
దేహం నుండి బయటకు ,
జీవం నుండి నిర్జీవానికి ..
ఒక్కసారిగా ... ఓవర్ టేక్ చేశాడు .
చుట్టూ ఉన్న వారంతా
చెక్క బొమ్మలే అయ్యారు .
కొందరి చేతులు కళ్ళ మీదకు ,
ఇంకొందరి చేతులు చెవుల మీదకు ,
మరి కొందరి చేతులు గుండెల మీదకు ,
మరెందరో చేతులు నోటి మీదకు ,
అసంకల్పితంగా వెళ్ళాయి ,
అక్కడే ఆగి పోయాయి .
బైక్ నుజ్జయిపోయింది ,
మనిషి body అయ్యాడు .
ఓవర్ టేక్ వల్లే ఇంతా ...
అని అందరు అంటూ ఉంటే ,
( తల్లీదండ్రులు మనసులో )
అవునవును ... వాడే కాదు , మమ్ములనూ
బాధల నుండి ఆవేదన వైపుకు ,
నిరాశల నుండి నిస్పృహల వైపుకు ,
ఆక్రోశం నుండి నిర్లిప్తత వైపుకు ,
వ్యధల నుండి మనోవ్యధల వైపుకు ,
దుఖం నుండి శోకం వరకూ ....
ఓవర్ టేక్ చేయించాడు అనుకుంటుంటే ,
ఆ తల్లిదండ్రుల కళ్ళలో
జలపాతాలే చేరాయి ,
కన్నీటి చారికలిప్పుడు
బెరడు కట్టి నిలిచాయి .
నాటికీ , నేటికీ సాక్ష్యంగా
కన్నీళ్ళు ఒక్కటే మిగిలాయి .
*******
లేకలేక పుట్టాడు. నేర్పాలనుకున్నవేవీ నేర్చుకోలేదు. ఎక్సైట్మెంట్లపై మోజు, హీరో బైక్ ను కొని వీలైనంత స్పీడ్లో నడిపేవాడు. ఒక రోజు రయ్యి, రయ్యిన పోనిస్తూ, కారు, వ్యాను, ట్రాక్టర్, బస్సు ను ఓవర్ టేక్ చేసి, ఎదురుగా వస్తున్న లారీ ముందు కట్ కొట్టబోయి జారాడు. అంతే .... ఎవరూ పోటీ రానంత, ఎదురే లేనంత, తరలి రానంత , వాయువు కన్నా వేగంగా, వెలుతురు నుండి చీకటికి, భూమి నుండి ఎక్కడికో, దేహం నుండి బయటకు, జీవం నుండి నిర్జీవానికి .. ఒక్కసారిగా ... అతను.
ReplyDeleteఅతనితో పాటు ఆ తల్లిదండ్రులు .... బాధ నుండి ఆవేదన వైపు, నిరాశ నుండి నిస్పృహ వైపు, ఆక్రోశం నుండి నిర్లిప్తత వైపు, వ్యధ నుండి మనోవ్యధ వైపు, దుఖం నుండి శోకం వరకూ .... ఓవర్ టేక్ చేయించాడు అనుకుంటూ కళ్ళలో జలపాతాలతో, నాటికీ, నేటికీ బెరడు కట్టి నిలిచిన ఆ కన్నీటి చారికలే సాక్ష్యం.
అభినందనలు గాజుల శ్రీదేవి గారు. గారాబం వల్ల జరిగే చెడును క్రమశిక్షణావశ్యకతను అన్యపదేశం గా ఈ పోస్టింగ్ లో చక్కగా రాసారు. అభినందనలు
నేటి యువతలో అధిక శాతం ఏ విషయంలోనూ క్రమశిక్షణ లేదు . వార్తలు చూస్తూ ఉంటే చాలు ,అరాచకాలు ,అకృత్యాలు ,ఆశ్లీలాలు ,అమానుషాలు ఆక్రందనలు ,అకాలమరణాలు ,ఘరానా నేరాలు ....... ఎన్నో.... క్రమశిక్షణను ఓవర్ టేక్ చేసి చరిత్ర హీనులవడం ఎంతో దురదృష్టకరం చంద్రగారు .
Deleteయువతపై మీరు ఝుళిపించిన కొరడా చాలా చురుగ్గా ఉంది, కానీ ా తల్లిదండ్రుల బాద చూస్తే బిడ్డలు కేవలం ఏడిపించటానికే పుట్టారా అనిపిస్తుంది.
ReplyDeleteసిరి అంటదు , చీడ అంటుతుంది అన్న చందంగా నేటి యువతకు మంచికన్నా చెడే ఎక్కువగా ఆకర్షిస్తూంది,అదే తల్లిదండ్రులుకు కన్నీళ్లను మిగులుస్తోంది. మీరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు .
ReplyDelete