ఆమె పైట గాలికి ఈ పైరగాలి పరిమళ భరితమై
నా మనసున కలిగిస్తోంది మధురానుభూతిని ,
ఆమె సిగ్గు దొంతరలు సిరిమల్లెలై నా పానుపు
చేరి నాలో కలిగిస్తున్నాయి వివశత్వాన్ని ,
ఆమె చిరునవ్వులే చిరు దివ్వెలై వెలిగిస్తున్నాయి
నాలో ఆరాధనా జ్యోతిని ,
ఆమె చిలిపి చూపులే నా వలపు తోటలో
కురిపిస్తున్నాయి వసంతాన్ని ,
ఆమె తేనెల పలుకులే తొలకరి జల్లులై
నాలో కలిగిస్తున్నాయి పరవశాన్ని ,
ఆమె తలపులు నా కలల గంగలో అలలై
నను నిలువనీకున్నాయి నిముషమైనా ,
వీటన్నిటినీ నా పిడికెడు గుండె
తన గదిలో పదికాలాలపాటు
పదిలంగా దాయాలని పదే పదే
పడే ఆరాటం నాలో
రగిలిస్తోంది విరహాగ్నిని ,
నా ఈ విరహాగ్నిని చల్లార్చ నా ముందుకు
ఆమె ఎప్పుడేతెంచునో కదా ?
ఆమె ఎవ్వరో కాదు ...
నా సుందరి
నా ఊహా సుందరి .
******
ఆ మధురానుభూతి, వివశత్వం, ఆరాధనా భావం, వలపు తోటలో కురిసిన ఆ వసంతం, తేనెల తొలకరి జల్లుల ఆ పరవశం, నా తలపుల కలల గంగలో ఆ అలలు .... నా పిడికెడు గుండె గదిలో పదే పదే పడే ఆరాటం నాలో విరహాగ్నిలా
ReplyDeleteఆ విరహాగ్నిని చల్లార్చ ఎప్పుడేతెంచునో కదా ? నా ఊహా సుందరి .
అన్ని రసాలు అన్ని మనోగుణాలు మేళవించి అద్భుతంగా ఉంది కవిత. అభినందనలు శ్రీదేవి!
మీ వంటి వారి అభినందనలే నా ఊహాశక్తికి ఊపిరి చంద్రగారు ...ధన్యవాదములు .
Deleteఅలాంటి సుందరీమణులు కేవలం ఊహించుకొనేందుకే... దరిచేరరు,
ReplyDeleteదేవీ ఓ యువకుని ఊహ ఎంత ఉద్రేకంగా ఉంటుందో, తెలుస్తుంది మీ కవిత చదివితే, మంచి భావుకత.
మీరన్నది నిజమే మీరజ్ ...... కానీ ఏ యువకుడికి తన ఊహల్లోని సుందరి నిజజీవితంలో ఎదురుపడదు , ఊహలంత .... ఊహించలేని ...... ఊహలకు అందనంత .... ఊహాలోకంలో విహరిస్తాయి . మీ అభినందనలకు ధన్యవాదాలు మీరజ్ .
ReplyDelete