తరంగాలవలె నాలో చెలరేగుతున్న అలజడిని
నీకు తెలియజేయాలని ,
తీరం చేరే కెరటంలా చాచిన నీ చేతుల్లో
వాలిపోవాలని ,
చల్లని వెన్నెల్లో మెత్తని నీ ఒడిలో చేరి
అల్లరి చేయాలని ,
సదా సుమధుర చిరు దరహాసాలతో అలరారే
నీ ముఖారవిందాన్ని నా దోయిలిలో తీసుకుని
తదేకంగా చూస్తూ ఉండాలని ,
నాతో ప్రియ సంభాషణ చేసి , నన్ను ముద్దాడే
ఆ పెదవుల్ని తనివితీరా ముద్దాడాలని ,
తటిల్లతలా నిన్నల్లుకుపోవాలని ,
గువ్వలా నీ గుండె గుసగుసలు వింటూ
ఆదమరచి నిదుర పోవాలని ,
అక్కున చేర్చుకుని ప్రేమతో నన్ను బంధించగా
నీ వశమైపోవాలని ,
ఒంటరితనాన్ని వీడి నీ బాహుబంధంలో
బందీనై కరిగిపోవాలని ,
నీ గుండెలపై కొడుతూ , నా ముఖాన్నిసేదతీరా
రుద్దుకుంటూ నీతో ప్రణయ కలహానికి తలపడాలని ,
నీ హృదయ స్పందనను నేనే అవ్వాలని ,
నా గుండె చప్పుళ్ళు నీ గుండెకు చేర్చాలని ,
నీ ఊహతో నా మేను పులకరించాలని ,
నీ సాహచర్యంలో రేయింబగళ్ళు మరచిపోవాలని ,
నీ హృదయాంతరాళలో నాకే ప్రీతి పాత్రమైన
స్థానము ఉండాలని ,
నీ మృదువైన గుసగుసలు నా చెవిలో
మారుమ్రోగుతుండాలని ,
మధురమైన నీ పాటను వింటూ
మైమరచిపోవాలని ,
నా పెదవులు ఎల్లవేళలా నిన్నే పలవరించాలని ,
నాతో కలహించే నీ పెదవుల్ని నా పెదవులతో
మూసివేయాలని ,
నా దుడుకు , దురుసు అల్లర్లు
నీ గడసరితనంతో ఓడిపోవాలని ,
నా మెడ వంపులో నీ ముఖం దాచేయాలని ,
నా బాహువల్లరిని మనసారా నీ మెడలోవేయాలని ,
నీ రాకతో నా జీవితవనం ఎల్లప్పుడూ
వసంతకాలంలా విరాజిల్లుతుండాలని ,
నీ కొనగోటితో నా హృదయవీణను
మీటించుకోవాలని ,
నీ ముసిముసి నవ్వులు చూస్తూ నేను
జీవితాంతం మురిసి పోతుండాలని ,
నీ చేత్తో నా ముంగురులను సవరించుకోవాలని ,
ప్రేమగా తలపై నిమిరించుకోవాలని ,
నీ ఎద లోయలో హాయిగా ,ప్రశాంతంగా
నిదురిస్తూ ,నీవు ప్రియాతిప్రియంగా
ముద్దిడుతుండగా , నీ బాహుబంధం లోనే
నా తుది శ్వాస విడవాలని ఉంది .
*******
( ఉత్తరం -----ఓ మధుర జ్ఞాపకం )
( ఉత్తరం -----ఓ మధుర జ్ఞాపకం )
నీ హృదయ స్పందనను నేనే అవ్వాలని, నీ సాహచర్యంలో రేయింబగళ్ళు మరచిపోవాలని, నీ ముసిముసి నవ్వులు చూస్తూ నేను జీవితాంతం మురిసి పోతుండాలని, నీ ఎద లో హాయిగా, ప్రశాంతంగా నిదురిస్తూ .... నీ బాహుబంధం లోనే నా తుది శ్వాస విడవాలని ....
ReplyDeleteప్రేమోద్వేగం, స్వగతం లా బాగుంది కవిత. చాలా డెప్త్ గా .....
అభినందనలు శ్రీదేవి!
పైకి తన భావాన్ని వ్యక్తం చేసినా ,చేయకపోయినా , చేయలేక పోయినా దినచర్యలో భాగంగా స్త్రీ సున్నితంగా వివరిస్తూ , మందలిస్తూ ,కోపగిస్తూ ,అలుగుతూ ,నిరసిస్తూ అనేకమైన సున్నిత భావాల్ని చెప్పకనే చెప్తుంది . ఆ భావాల్ని తెలిసుకోవాలంటే ఆ భర్తకి భార్య మనసును చదివే మనసుంటే చాలు .... చంద్రగారు .
Deleteఓ...మదురమైన భావనను ఆర్తిగా, ఆవిష్కరించిన తీరు బాగుంది.
ReplyDeleteమానసిక సంత్రుప్తి కొసం , చిరుస్పర్శ కై తపించే తీయని నివేదన కనిపిస్తుందీ కవితలో..
దేవీ,బాగుంది, మీశైలి.
స్త్రీ భావాలు నిజంగా ఎంతో మధురంగా , మనసును కదిలించేవిగా , వర్ణించలేనంత సున్నితంగా ఉంటాయి కదా మీరజ్ ... మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని ఆశిస్తా .
Deleteఊహల ఉయ్యాల లూగెనే :)
ReplyDeleteభావాలు దోబూచులాడితే ఊహలలూయలలూగును . నా బ్లాగ్ కు స్వాగతం . మీ అభినందనలకు ధన్యవాదములు .
Delete